"గురజాడ అప్పారావు!? ఎవరీ గురజాడ? స్వాతంత్ర సమరయోధుడా? రాజకీయ నాయకుడా? నాటకాలేస్తాడా? పాటలు పాడతాడా? సినిమాలు తీస్తాడా? వున్నాడా? పొయ్యాడా? పేరు గంభీరంగానే వుంది, గాంధీగారికి శిష్యుడా? గురజాడా! మై డియర్ గురజాడా! హూవార్యూ?" నన్నునేనీ ప్రశ్నలడుక్కోవడం ఇది డెబ్భైనాలుగోసారి, బట్ నో సమాధానం!
అది మా హైస్కూల్. ఇంకొంతసేపట్లో వ్యాసరచన పోటీ జరగబోతుంది. టాపిక్ - 'గురజాడ అప్పారావు' అని మొన్ననే తెలుసు. రెండ్రోజుల క్రితం క్లాసులోకి ఈ వ్యాసరచన తాలూకా నోటీసు వచ్చింది. మా క్లాస్ టీచర్ 'పాల్గొనువారు' అంటూ ఏకపక్షంగా కొందరిపేర్లు రాసేశారు. పిమ్మట 'మీకు ప్రైజ్ ముఖ్యం కాదు, ఆ మహానుభావుడి గూర్చి నాలుగు ముక్కలు రాయడం ముఖ్యం!' అంటూ వాక్రుచ్చారు. ఆవిధంగా నా ప్రమేయం లేకుండానే వ్యాసరచన పోటీదారుణ్ని అయిపొయ్యాను. ఆరోజు స్కూల్ అయిపోంగాన్లే గురజాడ గూర్చి వివరాలు సేకరించే పనిలో పడ్డా.
శాస్త్రిగాడి నమ్మకద్రోహం నా కొంప ముంచింది. ఇప్పుడు శాస్త్రిగాడి గూర్చి నాలుగు ముక్కలు. శాస్త్రిగాడు నా క్లాస్మేట్. గత రెండేళ్ళుగా నాపక్కనే కూచుంటాడు, వాడికి నా పక్కన ప్లేసు చాలా ఇష్తం! ఎందుకని? పరీక్షల్లో వాడు నా ఆన్సర్ షీటుని జిరాక్స్ మిషన్ కన్నా వేగంగా కాపీ కొడతాడు. అదీ సంగతి! అందుకు కృతజ్ఞతగా కొన్ని సందర్భాల్లో వాడు నాకు అసిస్టెంటుగా వ్యవహరించేవాడు.
'ఉరేయ్! గురజాడ అప్పారావు గూర్చి నువ్వస్సలు వర్రీ అవ్వకు. మా బాబాయ్ దగ్గర ఇట్లాంటి విషయాల మీద మోపులకొద్దీ మెటీరియల్ ఉంటుంది. రేపు తెచ్చిస్తాను.' అని హామీ ఇచ్చాడు శాస్త్రి. విషయం చిన్నదే కాబట్టి శాస్త్రిగాణ్ణి నమ్మి, ఇంక నేనావిషయం పట్టించుకోలేదు.
మెటీరియల్ అదిగో, ఇదిగో అంటూ చివరి నిమిషందాకా లాగాడు శాస్త్రి. ఇప్పుడు మొహం చాటేశాడు. మిత్రద్రోహి! మొన్న క్వార్టర్లీ పరీక్షల్లో ఇన్విజిలేటర్ కఠినంగా ఉన్నందున, శాస్త్రిగాడికి చూసి రాసుకునేందుకు ఎప్పట్లా పూర్తిస్థాయిలో 'సహకరించ'లేకపొయ్యాను. అదిమనసులో పెట్టుకున్నాడు, దుర్మార్గుడు! కుట్ర పన్నాడు. ఆ విషయం గ్రహించలేక కష్టంలో పడిపొయ్యాను.
ఇంక లాభం లేదు, ఈ గరజాడ ఎవరో అడిగి తెలుకోవాల్సిందే.
"ఒరే నడింపల్లిగా! గురజాడ గూర్చి తెలిస్తే కాస్త చెప్పరా!"
"గురజాడా! ఎవరాయన? నాకు తెలీదు." అంటూ జారుకున్నాడు నడింపల్లిగాడు.
'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అంటూ బట్టీవేస్తున్న పంగులూరిగాడు, నన్ను చూడంగాన్లే హడావుడిగా కాయితం జేబులో పెట్టుకుని క్లాస్ రూములోకి పారిపొయ్యాడు.
"ఒరేయ్! నువ్వు ఇవ్వాళ మాక్కూడా చూపించు! ఎంతసేపూ ఆ శాస్త్రిగాడికే చూపిస్తావేం? ఊరికినే చూపించమనట్లేదు! సాయంకాలం మామిడి కాయలు తెచ్చిస్తాంలే!" అంటూ బేరంపెట్టారు జంటకవులైన భాస్కరాయ్, సత్తాయ్ ద్వయం.
భాస్కరాయ్, సత్తాయ్ ప్రాణస్నేహితులు. మా బ్రాడీపేట ఇళ్ళల్లో మామిడిచెట్లకి రక్షణ లేదు. కాయలు ఉన్నట్టుండి మాయమైపొయ్యేవి. అది వీరి చేతిచలవే! ఇలా కొట్టేసిన కాయల్తో వీరు వాణిజ్యం చేసేవాళ్ళు. పరీక్షల్లో కాపీకి సహకరించే స్నేహితుల, ఇన్విజిలేటర్ల ఋణం మామిడికాయల్తోనే తీర్చుకునేవాళ్ళు. పరీక్షలయ్యాక టీచర్ల ఇళ్ళకి వెళ్ళి 'మా పెరట్లో చెట్టుకాయలండి' అంటూ భక్తిప్రవృత్తులతో గురుపత్నులకి సాష్టాంగప్రణామం చేసి బుట్టెడు కాయలు సమర్పించుకునేవాళ్ళు. వీరీ మంత్రాంగంతో విజయవంతంగా అనేక పరీక్షల్లో పాసు మార్కులు సంపాదించారు.
"ఏంటి మీకు నేను చూపించేది! శాస్త్రిగాడు నన్ను మోసం చేశాడు. నాకే ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు." అన్నాను దీనంగా.
"నీకేం తెలీదు, శాస్త్రిగాడు నిన్ను మోసం చేశాడు, ఇదంతా మేం నమ్మాలి! బయటకొస్తావుగా, అప్పుడు తేలుస్తాం నీ సంగతి." అంటూ గుడ్లురిమారు జంటకవులు.
క్లాసురూములోకి అడుగుబెట్టాక అక్కడి వాతావరణం చూసి నీరుగారిపొయ్యాను. పబ్లిక్ పరీక్ష రాయిస్తున్నట్లు అందర్నీ దూరందూరంగా కూర్చోబెట్టారు, పక్కనున్నవాడిని అడిగే అవకాశం లేదు. నా మిత్రశత్రువులు, శత్రుమిత్రులు అందరూ వారివారి స్థానాల్లో ఆశీనులై ఉన్నారు. ఇప్పటిక్కూడా గురజాడ ఎవరో కనీసం ఒక చిన్న హింట్ కూడా నాదగ్గర లేదు!
నా వెన్నుపోటుదారుడైన శాస్త్రిగాడు కొత్త పెళ్ళికొడుకులా ముసిముసిగా నవ్వుకుంటూ చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. నేను శాస్త్రిగాడి దగ్గరకెళ్ళాను. కసిగా, కర్కశంగా, కోపంగా ఒక్కోఅక్షరం వత్తిపలుకుతూ నిదానంగా, నెమ్మదిగా వాడిచెవిలో అన్నాను.
"ఒరే శాస్త్రిగా! దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నికృష్టుడా! పంది, ఎద్దు, దున్న! నీలాంటి నీచుణ్ణి నేనింతమటుకూ చూళ్ళేదు. నువ్వు గురజాడ గూర్చి చాలా విషయాలు బట్టీ కొట్టావని నాకు తెలుసురా. కనీసం ఇప్పుడయినా రెండు పాయింట్లు చెప్పిచావు, నిన్ను క్షమించేస్తాను." అంటూ వాడి పాపపరిహారానికి చివరి అవకాశం ఇచ్చాను. శాస్త్రిగాడు నామాట వినబడనట్లు మొహం పక్కకి తిప్పుకున్నాడు.
నేను కోపంగా నా స్థానంలోకొచ్చి కూర్చున్నాను. నాకు గురజాడ గూర్చి తెలీకపోవడం కన్నా.. నా స్నేహితులు నాకు ఇంతలా సహాయ నిరాకరణ చెయ్యడం చాలా అవమానకరంగా అనిపిస్తుంది. బాధగా ఉంది, ఏడుపొస్తుంది. బహుశా బ్రిటీషోడిక్కూడా గాంధీగారు ఇంత ఘోర సహాయ నిరాకరణ చేసుండరు!
వ్యాసరచన సమయం మొదలైంది. మిత్రులంతా కళ్ళు మూసుకుని, శబ్దం బయటకి రాకుండా పెదాలు కదుపుతూ సరస్వతీ ప్రార్ధన చేసుకున్నారు. అయోమయంగా వాళ్ళని చూస్తుండిపొయ్యాను. నా జీవితంలో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం లేదు.
కొద్దిసేపటికి నిదానంగా ఆలోచించడం మొదలెట్టాను. 'ఎలాగూ గంటదాకా బయటకెళ్ళనివ్వరు. ఏదోకటి రాస్తే నష్టమేముంది? అయినా గురజాడ అప్పారావు గూర్చి తెలుసుకుని రాస్తే గొప్పేముంది? తెలీకుండా రాయడమే గొప్ప!' అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాను. కొద్దిగా ఉత్సాహం వచ్చింది.
నా తెలుగు, సోషల్ పాఠాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాను. శ్రీకృష్ణదేవరాయలు, ఝాన్సీ లక్ష్మీబాయి, టంగుటూరి ప్రకాశం, గాంధీ మహాత్ముడు, సర్దార్ పటేల్.. ఇట్లా గుర్తున్నవారందర్నీ బయటకి లాగాను. అందర్నీ కలిపి రోట్లో వేసి మెత్తగా రుబ్బి, ఇంకుగా మార్చి పెన్నులో పోశాను. ఇంక రాయడం మొదలెట్టాను.
'అమృతమూర్తులైన గురజాడ అప్పారావు గారు కారణజన్ముడు. వీరు భరతమాత ముద్దుబిడ్డ. అసమాన ప్రజ్ఞాసంపన్నుడు, మహోన్నత వ్యక్తి. వీరి ప్రతిభ అపూర్వం, పట్టుదల అనితరసాధ్యం! ఈ పేరు వినంగాన్లే తెలుగువారి హృదయం ఆనందంతో పులకిస్తుంది, గర్వంతో గుండెలు ఉప్పొంగుతాయి. ఇంతటి మహానుభావుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆయన నడయాడిన ఈ పుణ్యభూమికి శతకోటి వందనాలు. మన తెలుగువారి ఉన్నతి గురజాడవారి త్యాగఫలం! సూర్యచంద్రులున్నంత కాలం గురజాడవారి కీర్తి ధగధగలాడుతూనే ఉంటుంది. గురజాడవంటి మహానుభావుని గూర్చి రాయడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితం ధన్యం..... ' ఈ విధంగా రాసుకుంటూ పోయాను. నా చేతిరాత అక్షరాలు పెద్దవిగా వుంటాయి. ఒక పేజికి పదిలైన్లు మించి రాసే అలవాటు లేదు. తదేక దీక్షతో అనేక ఎడిషనల్ షీట్లు రాసేశాను.
ఎక్కడా పొరబాటున కూడా గురజాడ గూర్చి చిన్న వివరం ఉండదు! కానీ చాలా రాశాను, చాలాచాలా రాశాను. శాస్త్రిగాడు చేసిన ద్రోహానికి కోపంతో రాశాను, ఆవేశంగా రాశాను. అది ఒక రాత సునామి, ఒక రాతా తాలిబానిజం, ఒక రాతా రాక్షసత్వం. కోపం మనలోని భాషాప్రావిణ్యాన్ని బయటకి తెస్తుందేమో!
వ్యాసం రాయడానికి ముందు 'శ్రీరామ' అని పెద్దక్షరాలతో హెడింగ్ పెట్టుకుని ఏంరాయాలో తెలీక పక్కచూపులు చూస్తున్న సత్తాయ్, భాస్కరాయ్ గాళ్ళు నా రాతోన్మాదాన్ని చూసి కోపంతో పళ్ళు నూరుతున్నారు. నిక్కర్ లోపల్నించి చిన్నస్లిప్ తీసి మేటర్ మూణ్ణిమిషాల్లో రాసేసిన నడింపల్లిగాడు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. బట్టీకొట్టిన పదిపాయింట్లు పదినిమిషాల్లో రాసేసిన శాస్త్రిగాడు నన్ను ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. ఆమాత్రం కూడా గుర్తురాని పంగులూరి గాడు బిత్తరచూపులు చూస్తున్నాడు. ఆరోజు ఆ వ్యాసరచన పోటీలో అందరికన్నా ఎక్కువ పేజీలు ఖరాబు చేసింది నేనేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా!
ఓ పదిరోజుల తరవాత వ్యాసరచనా పోటీ ఫలితాల్ని ప్రకటించారు. దాదాపు యాభైమంది రాసిన ఆ పోటీలో నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ప్రధమ, తృతీయ స్థానాలు ఎవరివో గుర్తు లేదు. స్నేహద్రోహి శాస్త్రిగాడికి ఏ బహుమతీ రాలేదు. అది మాత్రం గుర్తుంది. నాక్కావల్సిందీ అదే. మనసులోనే వికటాట్టహాసం చేసుకున్నాను.
ఆ రోజు స్కూల్ ఎసెంబ్లీలో ఫలితాల్ని ప్రకటిస్తూ హెడ్ మేస్టరుగారు అన్నమాటలు కూడా గుర్తున్నాయి. "అద్భుతంగా రాశావు బాబు. కానీ గురజాడ ఎవరో రాయడం మర్చిపొయ్యావు. కనీసం గురజాడ 'రచయిత' అన్న ఒక్కపదం రాసినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకే ఇంత బాగా రాసినా ఆ ఒక్కకారణంగా నీకు సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సొచ్చింది." అని మెచ్చుకుంటూ తెగ బాధపడ్డారు.
నాకు గురజాడ 'రచయిత' అన్న పదం తెలీదని ఆయనకి తెలీదు. పాపం హెడ్ మేస్టరుగారు! విద్యార్ధుల్లో నాలాంటి మోసకారులుంటారని ఆయనకి తెలిసినట్లు లేదు!