Sunday 3 June 2012

ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది

'ప్రేమ  పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది!' ఒక తీవ్రమైన భగ్నప్రేమికుడు తప్ప, ప్రేమని ఇంత దారుణంగా ఎవరూ తిట్టకపోవచ్చు. నేనీ పేరుతో ఒక కథ రాశాను. ఆ కథలో ముగ్గురు హీరోలు తమ ప్రేమ సఫలమైనందుకు, తమ  ప్రేమని తిట్టుకుంటారు. ప్రేమ విఫలమవడం సుఖాంతం, సఫలమవడం దారుణమైన విషాదం! భలే వెరైటీగా వుంది కదూ!

ముగ్గురు యువకులు ముగ్గురు యువతుల్ని ప్రేమిస్తారు. ఇంతటితో ఊరుకోకుండా తగుదునమ్మా అని పెళ్ళి చేసుకుంటారు. కొంతకాలానికి - ఈ పాడులోకంలో ప్రేమ అనేదే లేదనే వాస్తవాన్ని గ్రహించిన ఆ యువకులు , తమ దుస్థితికి తీరిగా దుఃఖిస్తూ ఇలా అనుకుంటారు - 'ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది'. అదే ఈ కథ పేరు. మగవాళ్ళు ఆడవారి అందచందాలకి ప్రాముఖ్యతనిస్తారు, ఆడవాళ్ళు మగవారిలోని బానిస మనస్తత్వానికి ప్రాధాన్యతనిస్తారనే 'గొప్ప'కాన్సెప్ట్‌లోంచి పుట్టిన ఒక సరదాకథ.

ముప్పైయ్యేళ్ళ క్రితం గుంటూరు మెడికల్ కాలేజ్ మేగజైన్ కోసం ఈ కథ రాశాను. అచ్చులో పడ్డ నా కథని నేను ఇంతవరకూ చదవలేదు. వున్నట్లుండి ఇప్పుడా కథపై అంత ప్రేమ ఏలనోయి? పాత ఫొటోల్లో మన మొహాలు చూసుకుని ముచ్చట పడతాం, ఇదీ అట్లాంటిదే. ఇప్పుడీ కథ గూర్చి నాలుగు కబుర్లు. 

అదొక దుర్దినం. లైబ్రరీ ఎదుటనున్న గార్డెన్లో సిమెంటు బల్లపై కూర్చుని యే సినిమాకి వెళ్ళాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఎదురుగా కాలేజి మేగజైన్ ఎడిటర్.

"నా మేగజైన్లో ఆర్టికల్స్ సీరియస్‌గా వున్నయ్, వాటిని కొంత హ్యూమర్తో బేలన్స్ చెయ్యాలి. ఇలా ఖాళీగా కూర్చునే బదులు ఒక సరదా కథ రాయరాదా?" అడిగాడు.

ఒక్కక్షణం ఆలోచించాను.

"నేన్నీకంటికి కమెడియన్లా కనబడ్డం నీ దురదృష్టం. ప్రస్తుతం రావిశాస్త్రి సాహిత్యాన్ని చీల్చి చెండాడుతున్నా! నీక్కావాలంటే శ్రమజీవుల చెమట చుక్కలపై చక్కటి కథొకటి రాసిస్తాను, తీసుకో." అన్నాను.

"నాకు చెమట చుక్కలు వద్దు, సరదా కథొకటి చాలు!" అన్నాడు మా మేగజైన్‌గాడు.

'సరే! సినిమా ఎప్పుడూ వుండేదేగా, ఇవ్వాళో గొప్పకథ రాద్దాం' అనుకుంటూ లైబ్రరీలోకి వెళ్ళాను. కథావస్తువుగా దేన్ని తీసుకోవాలి? ఎంత ఆలోచించినా యే ఆలోచనా రావట్ళేదు. డాక్టర్, పేషంట్ల మధ్య బొచ్చెడన్ని జోక్స్ వున్నాయి. యేదోక జోక్ తీసుకుని కథ అల్లేస్తే యెలా వుంటుంది? భేషుగ్గా వుంటుంది, ప్రొసీడ్.

ఇంతలో పక్క టేబుల్ దగ్గర చదువుకుంటున్న నా క్లాస్‌మేట్ దగ్గరకి బాయ్‌ఫ్రెండ్ వచ్చాడు. ఆ అమ్మాయి చెవిలో అతనేదో చెప్పాడు. ఈ అమ్మాయి పుస్తకం మూసేసి నవ్వుకుంటూ అతన్తో బయటకి వెళ్ళింది. నాకు మండిపోయింది. ఈ అమ్మాయిలు ఎంత నిర్దయులు! నాలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్‌ని వదిలేసి యూజ్‌లెస్ ఫెలోస్‌ని ప్రేమిస్తుంటారు! 

పక్క టేబుల్ ప్రేమికురాలిపై నాక్కొంత పాతకక్షలు కూడా వున్నయ్. ఆ అమ్మాయి ఇంగ్లీషు స్పీడుగా మాట్లాడుతుంది. నేను ఇంగ్లీషు మాట్లాడాలంటే ముందు తెలుగులో ఆలోచించాలి, తదుపరి ఆ ఆలోచనని ఇంగ్లీషులోకి తర్జుమా చేసుకోవాలి, గ్రామర్ చెక్ చేసుకోవాలి. మనసులో ఇన్ని స్టెప్పులేసుకుని నాలుగు ముక్కలు మాట్లాడేలోపు ఆ అమ్మాయి నలభై ఇంగ్లీషు మాటల్తో ఎడాపెడా బాదిపడేసేది. ఈ విధంగా నేను అనేకమార్లు అవమానం పాలయ్యి, గుడ్ల నీరు కుక్కుకుంటూ, పక్కకి తప్పుకున్న సందర్భాలున్నయ్.

వాళ్ళమీదా వీళ్ళమీదా రాసేసేకన్నా ఈ అమ్మాయి మీద కథ రాసిపడేస్తే ఎలా వుంటుంది? ఎస్, నా కథకి వస్తువు దొరికేసింది. అసలీ ఐడియా ఇందాకే రావాల్సింది, ఇంకానయం ఇంకేదో అంశంపై రాశాను కాదు. కథకి ప్రయోజనం వుండాలంటారు విజ్ఞలు, ఇంతకుమించి ప్రయోజనం యేముంటుంది? ఈ ఇంగ్లీషు సుందరికి శిక్ష పడాల్సిందే! మూడ్ కోసం రాజనాల స్టైల్లో ఒక విషపునవ్వు నవ్వుకున్నాను, ఆపై చకచకా కథ రాసి పడేశాను. 

ఆ అమ్మాయిది భీభత్సమైన నెగటివ్ పాత్ర అని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆ స్వార్ధపరురాలు తియ్యని కబుర్లతో ఒక బకరాగాణ్ణి ప్రేమలోకి దించుతుంది, పెళ్ళి చేసుకుంటుంది. పాపం! ఆ అబ్బాయి జీవితం భయానకంగా, నికృష్టంగా, నిస్సారంగా మారిపోయింది. కథ పేరు 'ప్రేమ పిచ్చిది!'.

ఎడిటర్‌గాడు క్యాంటీన్లో యేవో కాయితాల బొత్తిలోకి తీక్షణంగా చూస్తున్నాడు, బహుశా ప్రింటుకి పంపాల్సిన మెటీరియల్ అయ్యుంటుంది. నా కథ చిత్తుప్రతిని వాడిచేతిలో పెట్టాను, నా గజిబిజి రాతని కష్టపడి కూడబలుక్కుంటూ చదివాడు.

"ఇది మన క్లాసమ్మాయి లవ్ స్టోరీ గదా? కథ చదివితే ఈజీగా తెలిసిపోతుంది. ఇలా రాయకూదదు, డిఫెమేటరీ అవుతుంది. ఒక పంజెయ్యి, అనుమానం రాకుండా ఇంకో జంటని కలుపు." అని ఉచిత సలహా ఇచ్చాడు.

"ఇదన్యాయం, నాచేత కూలిపని చేయిస్తున్నావు. అసలు నీ మేగజైన్ కనీసం నువ్వైనా చదువుతావా? యేదో ఆంధ్రప్రభ ఎడిటర్లా సజషన్లు!" అంటూ విసుక్కున్నాను.

ఆలోచించగా - మా ఎడిటర్‌గాడు చెప్పింది కరెక్టేనని తోస్తుంది. రచన ఎవర్నీ నొప్పించరాదు, తప్పు. రచయితకి స్వేచ్చ ఉండాలి కానీ దాన్నా రచయిత దుర్వినియోగపరచరాదు (అసలు సంగతి - ఆ ప్రేమజంటకి వాళ్ళమీద నేను కథ రాసిన విషయం తెలుస్తుందేమోనని భయం).

కేంటీన్లో నాయర్ చేత్తో మాంఛి కాఫీ తాగి, మళ్ళీ లైబ్రరీలోకి వచ్చి పడ్డాను. కథని రిపైర్ చేసి, రిఫైన్ చేసే పనిలో చేపట్టాను. ఇంకో రెండుజంటల్ని కలిపి మూడుజంటల కథ వండాను. ఇప్పుడు మగవాళ్ళు ముగ్గురయ్యారు. ఒకడికి అయోమయం ఆపాదించాను. ఇంకోడికి అమాయకత్వపు అజ్ఞానం పూశాను. మూడో కేరెక్టరుకి నా తెలివిని, మేధస్సుని దానంగా ఇచ్చేశాను! ఇప్పుడు మూడుజంటలయ్యారు, కాబట్టి 'ప్రేమ పిచ్చిది' అనే టైటిల్ని మార్చేసి - 'ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది'గా పొడిగించాల్సి వచ్చింది..

ఎడిటర్‌గాడు కథని పైపైన చదివాడు, కాయితాలు చంకలోనున్న ఫైల్లో పెట్టుకున్నాడు.

"చేతిరాత ఘోరంగా వుంది, ఫెయిర్ చేయించాలి." అంటూ వెళ్ళిపొయ్యాడు.

ఔరా మిత్రద్రోహి! ఈ ముక్క నాచేత కథ రాయించక ముందు చెప్పలేదే!

నా కథ కాలేజ్ మేగజైన్లో పబ్లిషయ్యింది, నేనైతే చదవలేదు. నా స్నేహితులు ఆ కథ చదివేప్పుడు ఏ రైలు ప్రమాదం వార్తనో, పాకిస్తాన్ యుద్ధవార్తనో చదువుతున్నట్లుగా మొహం పెట్టార్ట. ఎలా చదివినా - చదివిన వారెవ్వరూ పొరబాటున కూడా నవ్వలేదుట. అలా నా హాస్యకథ ఉదంతం విషాదాంతమైంది. అదీ - నా కథ! 

26 comments:

  1. mee tholi kadha kosam mee blog choosthune undalsinde sir.

    ReplyDelete
  2. రమణగారు... బాగుంది. మీ కథ ..చౌర్యానికి గురి అయినది అన్నమాట.
    పొతే పోనీయండి లెండి. మీకు కథలేమన్నా కొత్తా!? తొర తొరగా అల్లేయండి.పనిలేక ఖాళీగా ఉన్నాను. బాగా చదువుకోవాలి.
    భావ చౌర్యం పై మీ టపా బాగా పేలిన్దండీ.

    ReplyDelete
  3. @the tree,

    అమ్మయ్య! ఇవ్వాళ్టి నుండి మీరు నా బ్లాగ్ కి రెగ్యులర్ రీడర్ అయిపోతున్నారన్న మాట! థాంక్యూ!

    ReplyDelete
  4. కథ వెనుక కథ, యాజ్ యూజువల్, బాగుంది... చాదస్తంగా చంపుతున్నాననుకోకపోతే కక్ష్య రెండోసారి దాటేశారు సార్...! కక్ష్య అంటే ఇంగ్లీషులో ఆర్బిట్ మాస్టారూ... వెంజెన్స్ కాదు. (మీకు తెలీదని కాదు, టైపో సరి చూసుకోలేదేమోనని)

    ReplyDelete
  5. ఈ కధ బాగుంది రమణ గారూ అంటే మీరెలా నవ్వుతారో?
    భయంగా ఉంది....... దహా.

    ReplyDelete
  6. వనజవనమాలి గారు,

    నా కథ చౌర్యానికి గురి కాలేదండి. కనుమరుగై 'పోయింది'.

    ఎండాకాలం. పేషంట్లు రాక OP లు వెల వెల బోతున్నాయ్. కాబట్టి 'పని లేక.. ' పోస్టులు వరసగా రాస్తున్నాను.

    ReplyDelete
  7. డాట్రారండి ఈ టపా ఏమీ బాగోలేదు. చాలా చెత్తగా ఉంది.

    (మనలో మన మాట. ఈ మధ్య ఓ అఙ్ఞాత, మీ టపాలు బాగున్నాయని కామెంటితే, ఆళ్ళందరూ నమ్మకద్రోహులు అని మీకు నూరి పోస్తున్నాడుగా. అందుకే చెత్తగా ఉందని కామెంటా! నిజానికి - నాకయితే తేలికగా ఉండి నచ్చిందీ టపా)

    ReplyDelete
  8. puranapandaphani గారు,

    కక్షయినా, కక్ష్యయినా.. మీకు నచ్చింది. సంతోషం!

    ReplyDelete
  9. బులుసు సబ్రహ్మణ్యం గారు,

    హాయిగా, తృప్తిగా, మనసారా నవ్వుతున్నానండి. థాంక్యూ!

    ReplyDelete
  10. @తెలుగు భావాలు,

    థాంక్యూ! సరదాగా తీసుకోండి. ఎవరి 'భావాలు' వారివి.

    ReplyDelete
  11. రమణ నీవు వ్రాసిన ఆ కధ నేను చదివాను.
    నిజంగ ప్రేమ పిచ్చిది, గుడ్డిది, కుంటిదే.
    వాస్తవానికి ఆ కధ కన్నా, అది వ్రాయడానికి గల కారణమును వర్ణించిన తీరు చాలా బాగున్నది.

    ReplyDelete
  12. @DSR Murthy,

    ముందుగా.. కాలగర్భంలో కలిసిపోయిన నా కథ చదివినందుకు ధన్యవాదాలు.

    నీ కామెంట్ బట్టి నా కథ దరిద్రంగా ఉంటుందని అర్ధమయ్యింది.

    అయినా సరే! తప్పిపోయిన నా కథ కోసం వెదుకులాట మానను. మానను గాక మానను!

    ReplyDelete
  13. డాటేరు రమణ గారికి ఆ కథ పుస్తకం దొరక కుండు పోగు గాక!

    హమ్మయ్య, ప్రేమ గుడ్డిది, పిచ్చిది, కుంటిది మాత్రమె కాదు, మరి, శపించేది కూడాను !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి మిరపకాయ బజ్జీగా మారిన కారణమేమి? ప్రేమ జెరంతో బాధ పడుతున్న లక్షలాది యువతీయువకులు మీ మీద డేమేజ్ సూటు వేసే ప్రమాదముంది. జాగ్రత్త!

      Delete
  14. గుడ్డిది, పిచ్చిది, కుంటిది అయినది ఏదైనాగాని శపిస్తే ఎంత? ఆశీర్వదిస్తే ఎంత?!

    ReplyDelete
    Replies
    1. శపిస్తే శూర్పణఖ
      ఆశీర్వదిస్తే ఆంబోధీ!


      చీర్స్
      జిలేబి.

      Delete
  15. "నా అభిమాన నటి శ్రీదేవి, నేనూ ఆనంద భవన్లో ఓ మూలనున్న టేబుల్ (అది మా ఆనంద భవన్ కి ఏకైక ఫ్యామిలీ టేబుల్) వద్ద కూర్చుని మసాలా దోశ తింటూ"

    సావిత్రి గారిని వదిలేసి శ్రీదేవి మోజులో పడ్డందుకే మీ కథకు ఈ గతి పట్టింది.

    ReplyDelete
    Replies
    1. నా కాలేజ్ రోజులకి సావిత్రి కెరీర్ అయిపోయింది. అందుకే శ్రీదేవి!

      Delete
    2. శ్రీదేవి కెరీర్ అయిపోయి 20ఏళ్ళయ్యింది. ఈ మధ్యలో తమరు మసాలాదోశెలు, బజ్జీలు, చాట్లు తిన్న ఆనందభవన్ డైరీ విశేషాలేవి?

      Delete
  16. మొదట్లో మీ బ్లాగ్ బావున్నట్టనిపించి, నెమ్మది గా పని ఉండి రాస్తున్నట్టనిపిస్తోంది.. ఇదేమీ పేషెంట్లని పెంచుకునే కుట్ర కాదు కదా? ఆఖరి రెండు పోస్టుల్లో నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.. దానికి తోడు జ్ఞాతల, అజ్ఞాతల కామెంట్లు.. బహుశా వాళ్ళు మీ కంపౌండర్లు అయి ఉంటారు... జిలేబీ గారేమంటారు? బ్లాగుల నించి విరమించుకోడానికి వెనక ఏదైనా వైరాగ్య కారణము ఉందా?

    భవదీయుడు
    సీతారామం

    ReplyDelete
    Replies
    1. మొదట్లో నా బ్లాగ్ బావున్నట్లు అనిపించినందుకు ధన్యవాదాలు.

      ఏ రాతల్లోనయినా మొదట్లో ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ తరవాత ఉండదు. ఏదో ఒక లుక్కేద్దాం అని చదివి.. బాగుందే! అనిపిస్తుంది. అటు తరవాత.. బాగానే రాస్తాడు అనుకుంటూ చదివితే నచ్చకపోవచ్చు.

      నా దృష్టిలో ఈ "బాగా రాస్తాడు" అనేది ఒక ముళ్ళ కిరీటం. రాయడంలో "నా స్థాయి" గూర్చి నాకు పూర్తి అవగాహన ఉంది. నా బ్లాగులో నా ఆలోచనలు రికార్డ్ చేస్తున్నాను. వీటిల్లో అతి చెత్త రాతల దగ్గర్నుండి ఒక మాదిరి రాతలు దాకా ఉన్నాయి.

      నాకు బ్లాగ్ రాతలు కేవలం సరదా కోసం. బాగుందా లేదా అనేది పెద్ద పట్టించుకోను. పట్టించుకున్నట్లయితే నేను బ్లాగులు రాయలేను.

      Delete
    2. రమణ గారూ, మీరు నొచ్చుకున్నట్టనిపించి ఈ షరా ఇప్పుడు వ్రాస్తున్నాను. నేను చాలా యథాలాపము గా, కొంత చమత్కారము కలిపి నా వ్యాఖ్య వ్రాసాను అంతే... మిమ్మల్ని నొప్పించాలని కాదు.. మీరు చెప్పినట్టు వేరే వాళ్ళకి నచ్చేలా వ్రాయాలి అనుకుంటే మన సహజత్వము దెబ్బ తింటుంది.. మీరు ఇలాగే కానీండి, మేమూ ఇలాగే కానిస్తాం :)

      సీతారామం

      Delete
    3. అవును కదూ! ఇప్పుడు మీ కామెంట్ మళ్ళీ చదివాను. చాలా సరదాగా ఉంది. మరి నిన్న రాత్రి (ఒక పోస్ట్ రాస్తూ మీ కామెంట్ చదివాను) ఇంకోలా అనిపించిందేమిటి! ఏది ఏమయినప్పటికీ.. చమత్కారాన్ని సీరియస్ గా తీసుకోవడం నేరం! అయాం సారీ!

      Delete
  17. రమణ గారు మీరు మన గుంటూరు స్టైల్ లో రాస్తూ ఉండండి. మీ ఆలోచనాలుకు హాస్యం జోడించి మీరు రాస్తున్న పోస్ట్స్ చాల బావునాయి. మీ కామెడీ టైమింగ్ సూపర్.ఎవరికీ నచ్చినా నచకపొఇన మీరు పట్టించుకోవద్దు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలచుకున్నాను..నేను మీ బ్లాగ్ ఫస్ట్ లో చుస్తునప్పుడు బాలగోపాల్ గారి గురించి ఒక పోస్ట్ చూసాను..ఆయన ప్రొఫైల్ చాల ఆశక్తి గా అనిపించింది. అప్పటినున్హ్చి అయన గురించి చాల చదివాను అండ్ తెలుసుకున్నాను ..క్రమంగా నేను ఆయన అభిమాని గా మారిపోయాను. ఈ రోజుల్లో కూడా నిస్స్వర్ధంగా ఒక మనిషి తన కోసం కాకుండా ఒక cause కోసం తనకున్న అపారమైన మేధస్సును ఉపయోగించాడు అని తెలుసుకొని నేను చాల ప్రభావితుడిని అయ్యాను..అయన జీవించి ఉన్నప్పుడు అయన గురించి తెలుసుకోలేక పోయాను అని అప్పుడప్పుడు ఫీల్ అవ్వుతూ ఉంటాను. అయన జీవించి ఉంటె కచ్చితం గా కలిసి ఉండేవాడిని..anyway మీ ద్వార అయన గురించి తెలుసుకున్నందుకు థాంక్స్..ఆయన గురించి మీకున్న అభిప్రాయాలూ మాకు తెలుపువలసింది గా మనవి.

    ReplyDelete
    Replies
    1. >> మీరు మన గుంటూరు స్టైల్ లో రాస్తూ ఉండండి.<<

      మనకి వేరే స్టైల్ రాదులేండి.

      నా పోస్ట్ ద్వారా మీకు బాలగోపాల్ అంటే ఆసక్తి కలగడం నాకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

      Delete
  18. I second @hareen's comment. I like your blog. All the time spent so far reading your blog is worth it to me because of your one post about Bala Gopal. After reading your blog, I went ahead and read his articles on balagopal.org. He is truly extraordinary. To me, part of the extra ordinariness lies in the fact that he was able to see the holes in Marxism and able to evolve his thinking to human rights. Please write more about your personal experiences/thoughts with/about him

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.