Monday, 18 June 2012

సైకోఎనాలిసిస్ ఆఫ్ గుండమ్మ

'గుండమ్మకథ' సినిమా యాభయ్యేళ్ళ క్రితం విడుదలైంది. అయినా ఇప్పటికీ తెలుగువాళ్ళ హృదయాల్లో గుండమ్మ స్థానం పదిలం. ఒకప్పటి సామాజిక స్థితిగతులు అంచనా వెయ్యడానికి ఆనాడు వచ్చిన సాహిత్యం ఒక కొలమానం. ఇందుకు మంచి ఉదాహరణ గురజాడ 'కన్యాశుల్కం'. ఒక సినిమాకి సాహిత్యం స్థాయి లేకపోయినా, ఆనాటి సమాజాన్ని అర్ధం చేసుకోడానికి యెంతోకొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.    

ఒక సినిమా యెలా పుడుతుంది? రచయిత తన ఆలోచనలతో ఒక పాత్ర సృష్టిస్తాడు. ఆ పాత్రకి దర్శకుడు - టెక్నీషియన్లు, నటీనటుల సహకారంతో ప్రాణం పోస్తాడు. ఇక్కడ అందరూ కలిసి చేసేది ఒకటే వంటయినా, ఎవరి వాటా వారికి ఉంటుంది. ఏ పాత్రనైనా ఒక సాధారణ ప్రేక్షకుడు identify చేసుకోకపోతే.. ఎవరూ చెయ్యగలిదేమీ ఉండదు. ఇప్పుడు గుండమ్మ పాపులారిటీకి కారణాలు ఆలోచిద్దాం. 

ఈ సమాజం అనేక వ్యక్తుల, విభిన్న వ్యక్తిత్వాల సమాహారం. భిన్నఆలోచనల సంక్లిష్ట కలయిక. ప్రతి వ్యక్తి తన ప్రవర్తనని (అది ఎంత అసంబద్దమయినప్పటికీ) conscious mind తో సమర్ధించుకుంటాడు. కానీ అతని అసలు ఆలోచనల మూలాలు unconscious mind లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఈ unconscious mind ని బయటకి రానీకుండా అనేక defense mechanisms తొక్కిపెట్టి ఉంచుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని 'సైకోఎనాలిసిస్'గా ప్రాచుర్యం కల్పించాడు.

మానవ మేధస్సు సంక్లిష్టంగా ఉంటుంది. మన ఆలోచనాధోరణి నలుపు తెలుపుల్లో (flat గా) ఉండదు. పరిస్థితులు, సందర్భాలు, వ్యక్తుల మధ్యగల సంబంధాలు.. ఇలాంటి అనేక variables ఒకవ్యక్తి యొక్క ఆలోచనలని నిర్ణయిస్తాయి. ఆ ఆలోచనే మన ప్రవర్తననీ శాసిస్తుంది. ఈ నేపధ్యంలో గుండమ్మని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.

గుండమ్మకి కూతురంటే చాలా అభిమానం, ఒకరకంగా గుడ్డిప్రేమ. ఎందుకు? మధ్యతరగతి కుటుంబాల్లో భర్త చనిపోయిన తరవాత ఒక స్త్రీ పడే social and emotional trauma దారుణంగా ఉంటుంది. ఆ తరవాత వాళ్ళు చాలా insecurity కి కూడా గురవుతారు. తమని ప్రేమించే తోడులేక, మనసులోని భావాల్ని వ్యక్తీకరించుకునే అవకాశంలేక, మానసికంగా ఒంటరిగా మిగిలిపోతారు.

'ప్రేమ' అనేది ప్రతివ్యక్తికీ ఒక మానసిక అవసరం. దేన్నీ ప్రేమించనివారికి బ్రతకాలనే ఆశ చచ్చిపోతుంది. మానసికంగా ఏకాకిగా మిగిలిపోయినవారు.. తమ ప్రేమకి ఒక symbol గా ఒక వ్యక్తినో, జంతువునో, వస్తువునో ఎన్నుకుని తమ శక్తియుక్తులు ధారబోస్తూ అమితంగా ప్రేమిస్తారు. ఆ symbol పట్ల చాలా possessive గా కూడా ఉంటారు. ఆ సింబల్ని వదులుకోడానికి అస్సలు ఒప్పుకోరు. ఆ symbol చేజారితే depression లోకి వెళ్ళిపోతారు.

ఈ నేపధ్యంలో కూతురంటే గుండమ్మకి ఎందుకంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. అందుకనే తనకి ఇల్లరికపుటల్లుడు కావాలనుకుంటుంది గుండమ్మ. కూతురు భర్తని ఇంట్లోనే ఉంచుకోటంలో జమున సుఖం కన్నా, గుండమ్మ అవసరమే ఎక్కువన్నది మనం గుర్తించాలి. 

గుండమ్మని గయ్యాళి అంటారు. అసలు ఈ 'గయ్యాళి' అన్న పదమే అభ్యంతరకరం. ఇది నోరున్న ఆడవారిని defame చెయ్యడానికి సృష్టించిన పదం అయ్యుండొచ్చు. గుండమ్మకి సంపద విలువ తెలుసు. సంపద ఎవరి దగ్గరుంటే వారిదే అధారిటీ అన్న కేపిటలిస్టు ఫిలాసఫీ కూడా తెలుసు! అందుకే తాళంచెవుల గుత్తి బొడ్లో దోపుకుని పెత్తనం చలాయిస్తుంటుంది. 

గుండమ్మ సవతి కూతురి పట్ల కఠినంగా ఎందుకు ప్రవర్తించింది? ఈ సమాజం తనకి చేసిన అన్యాయానికి ప్రతిగా సవతి కూతుర్ని రాచిరంపాన పెట్టడం ద్వారా కసి తీర్చుకుని sadistic pleasure పొందిందా? ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటే ఇందుకు సమాధానం దొరుకుతుంది. 

ఆరోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు. స్త్రీలు ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు. చాలాసార్లు కాన్పు కష్టమై తల్లి చనిపోవడం (maternal deaths) జరుగుతుండేది, అందుకే పిల్లల్ని కనడం స్త్రీకి పునర్జన్మ అనేవారు. వితంతువైన భర్త (నాకు ఇంతకన్నా సరైన పదం తోచట్లేదు) మరణించిన భార్య కన్న పిల్లల్ని సాకడనికి (బయటకి ఇలా చెప్పేవాళ్ళు గానీ, కుర్రపిల్లతో సెక్సు దురదే అసలు కారణం అని నా అనుమానం) రెండోపెళ్ళి చేసుకునేవాడు. ముసలి వెధవలు చిన్నపిల్లల్ని రెండోభార్యగా చేసుకోవటం ఆరోజుల్లో నిరాటంకంగా సాగిన ఒక సామాజిక అన్యాయం.

రెండోపెళ్ళివాడిని చేసుకునే అమ్మాయిలకి వేరే చాయిస్ లేదు, గతిలేని పరిస్థితుల్లో compromise అయ్యి  ముసలాణ్ని చేసుకునేవాళ్ళు. ఈ అసంతృప్త అభాగినుల గూర్చి సాహిత్యంలో బోల్డన్ని ఆధారాలు ఉన్నయ్. (అయితే 'దేవదాసు'లో పార్వతి గంపెడు పిల్లల్ని 'చక్కగా' చూసుకుంటుంది. శరత్ కథల్లో మనలా నేలమీద నడిచే మనుషులకి తావులేదు. అందరూ ఆదర్శమూర్తులు, త్యాగధనులే).

తీవ్రమైన అసంతృప్తితో కాపురానికొచ్చిన యువతికి దిష్టిపిడతల్లాగా మొదటిభార్య సంతానం కనబడతారు, ఇంక తన కోపాన్ని పిల్లల మీదకి మళ్ళిస్తుంది. దీన్నే సైకాలజీ పరిభాషలో frustration - aggression - displacement  theory అంటారు. అంటే మనలోని నిస్పృహ, నిస్సహాయత క్రోధంగా మారుతుంది. ఆ aggression ని ఎదుటి మనిషిపై చూపే అవకాశం లేనప్పుడు.. అమాయకుల వైపు, అర్భకుల వైపు మళ్ళించబడుతుంది.

ఈ థియరీ ప్రకారం మనం గుండమ్మని అంచనా వేస్తే ఆమె సవతి కూతురు పట్ల యెందుకంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో అర్ధమవుతుంది. ఇక్కడ victim సవతి కూతురు. గుండమ్మని పుట్టింటివారు, భర్త కలిసి చేసిన అన్యాయానికి సవతి కూతురు బలయ్యింది. గుండమ్మని ఆపడానికి భర్త లేడు, సవతి కూతురు నిస్సహాయురాలు. ఇంతకన్నా soft target గుండమ్మకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే తన aggression కి ventilation కోసం సవతి కూతురు అనే soft target ని ఎంచుకుంది.

aggression theory లో ventilation కోసం soft targets ఎంచుకోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం. భార్య తాగుబోతు భర్తపై కోపంతో, ఏంచెయ్యాలో తోచక - పిల్లల్ని చావగొడుతుంది. 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు' అనే సామెత ఉండనే ఉందిగదా!

సరే! గుండమ్మ ముసలి మొగుడు ఇద్దరు పిల్లల్ని పుట్టించి వెళ్ళిపోయాడు. మరప్పుడు భర్తమీద కోపం తన కూతురు, కొడుకుల మీద కూడా వుండాలి గదా? కానీ అలా ఉండదు. ఎందుకని? గుండమ్మది narcissistic personality. తాను, తన పిల్లలు మాత్రమే మనుషులు. 'తనది' అన్నదేదైనా అత్యంత ప్రీతిపాత్రం. 

అసలు గుండమ్మ ఎందుకలా నోరు పారేసుకుంటుంది? ఇక్కడ మనం ఫ్రాయిడ్ చెప్పిన reaction formation అనే defense mechanism ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో 'మగదిక్కు' లేని సంసారం అంటే అందరికీ అలుసు. గుండమ్మ తన ఆస్తిపాస్తులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అభద్రతా భావంలోంచి పుట్టుకొచ్చిన ప్రవర్తనే 'గయ్యాళితనం'. తన అశక్తతని, అమాయకత్వాన్ని బయటి ప్రపంచానికి తెలీకుండా ఉండటం కోసం.. పరిస్థితుల్ని తట్టుకుని నిలబడటానికి గుండమ్మ 'గయ్యాళితనం' అనే ఆభరణం ధరించింది! 

ఆ రోజుల్లో సమాజంలో గల సవతి లేక మారుతల్లి అనే stereotyping కూడా గుండమ్మ 'గయ్యాళి'తనానికి కారణం కావచ్చు. తెలిసోతెలీకో మనంకూడా ఒక్కోసారి ఈ సమాజంలో stereotypes గా మారతాం. మతం, కులం పట్ల కొందరి భావాలు ఒకే మూసలో ఉండటం ఈ stereotype కి ఒక ఉదాహరణ. గుండమ్మ కూడా చక్కగా ఈ stereotype లోకి దూరిపోయింది.

గుండమ్మలో మనకి projection కూడా కనిపిస్తుంది. 'సవతితల్లి రాచిరంపాన పెడుతుందంటారు గానీ.. నేను ఈ పిల్ల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నానో!' అని గంటన్నతో అంటుంది. అంటే తన కఠినత్వానికి కూడా కారణం సావిత్రేననేది గుండమ్మ థియరీ! ఈ రకంగా తనకున్న అవలక్షణాలని, వికృత ఆలోచనలని ఎదుటివారికి ఆపాదించి సంతృప్తి చెందడాన్ని projection అంటారు. 

సవతి కూతుర్ని ఆర్ధికంగా తక్కువ స్థాయిలో వున్న పనివాడికిచ్చి పెళ్ళి చేస్తూ కూడా.. తనేదో ఆ తల్లిలేని పిల్లని ఉద్దరిస్తున్నట్లు పోజు కొడుతుంది. వాస్తవానికి గుండమ్మ సవతి కూతురికి చేసింది అన్యాయం. తాము చేసే తప్పుడు పనుల్ని అసంబద్ధ వాదనలతో సమర్ధించుకోవడాన్ని ఫ్రాయిడ్ భాషలో rationalization అంటారు. మన రాజకీయ నాయకులు ఈ కోవకి చెందినవారే!

గొప్ప సంబంధం అనుకుని నాగేశ్వరరావుని అల్లుడుగా చేసుకుంటుంది. అతనొట్టి తాగుబోతని, తాను మోసపోయ్యానని తెలుసుకుని హతాశురాలవుతుంది. మోసపోయిన కూతురి బాధ చూసి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు గుండమ్మ చాలా conflict కి గురవుతుంది. మామూలుగానయితే గుండమ్మ నాగేశ్వరరావుని ఉతికి ఆరేసేది, కానీ అతనంటే కూతురికి ఇష్టం.

ఇందాక చెప్పిన projection గుర్తుందికదూ? అల్లుడిని తిడితే కూతురు బాధ పడుతుంది. అది గుండమ్మకి ఇష్టం లేదు, కాబట్టి ఏమీ అనలేకపోతుంది. అల్లుడి పట్ల కఠినంగా ఉండాలా? కూతురు భర్త కాబట్టి, కూతురు బాధపడుతుంది కాబట్టి, సహించి ఊరుకోవాలా? ఈ ద్వైదీభావాన్ని ambivalence అంటారు. ఈ ambivalent state లో ఉండి, నాగేశ్వరరావుని మందలిస్తున్న రామారావుని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. వాస్తవానికి గుండమ్మ కోపం రామారావుపై కాదు, నాగేశ్వరరావు మీద. మళ్ళీ displacement!

కూతురు దూరమై సగం చచ్చిన గుండమ్మని చాయాదేవి కొట్టి గదిలో బంధిస్తుంది. అప్పుడు గుండమ్మలో realization వస్తుంది. సావిత్రి పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు guilt complex తో బాధ పడుతుంది. సావిత్రిని చూడంగాన్లే ఎటువంటి భేషజాలకి పోకుండా క్షమించమని అడుగుతుంది. 'నీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు శిక్ష విధించాడు.' అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

గుండమ్మ వంటి egocentric personality ని catharsis స్థాయికి తీసుకెళ్ళడానికి దర్శకుడు మంచి ఎత్తుగడలతో సన్నివేశాల్ని సృష్టించాడు. అందుకోసం చాయాదేవిని (నాకు ఈపాత్ర కూడా చాలా ఇష్టం) చక్కగా వాడుకున్నాడు. అందుకే గుండమ్మతో కూతుర్ని క్షమాపణ అడిగించిన మరుక్షణం ప్రేక్షకులంతా గుండమ్మ పక్షం వహిస్తారు. ఇది గుండమ్మ పాత్రపోషణలో నటిగా సూర్యకాంతం సాధించిన విజయం.

ఇంతకీ గుండమ్మ నెగటివ్ క్యారెక్టరా? పాజిటివ్ క్యారెక్టరా? ఏదీ కాదు. మన మధ్యన తిరుగుతూ, మనతో పాటు జీవించిన ఒక సజీవ క్యారెక్టర్. మనలో, మన సమాజంలో ఉన్న అవలక్షణాలన్నీ గుండమ్మకి కూడా ఉన్నాయి, అందుకే ఈపాత్ర అంతలా పాపులర్ అయింది.

ఈ సినిమా సమయానికి సూర్యకాంతం గయ్యాళి అత్తగా career peak లో ఉంది, కోడళ్ళని పీడించే అత్తగార్లూ వీధివీధికీ ఉండేవారు. అంచేతనే - మనం సూర్యకాంతంతో identify చేసుకోగలిగాం, అత్తగా సూర్యకాంతానికి ఒక stardom ఇచ్చేశాం.

అయితే మనకిప్పుడు గుండమ్మలు కనిపిస్తారా? కనిపించరు. కారణం - ఇప్పుడు  వైద్యం, వైద్య సదుపాయాలు మెరుగయ్యాయి. మధ్యతరగతి వాళ్లకి అందుబాటులోకొచ్చాయి. అందువల్ల స్త్రీలు కాన్పు సమయంలో చనిపోవడం లేదు. 

ఆ రోజుల్లో ఆడామగా మధ్య భారీవయసు తేడాతో పెళ్ళి జరిగేది, ఇప్పుడలా జరగట్లేదు. ఒకప్పుడు మగవారి సగటు జీవితం ఆడవారి సగటు జీవితం కన్నా తక్కువ. ఇప్పుడు జీవితకాలాన్ని పెంచేసుకుని మగవారు కూడా ఆడవారితో సమానత్వం సాధించారు! అందువల్ల కూడా క్రమేణా గుండమ్మలు కనుమరుగయ్యారు.

'కన్యాశుల్కం' మొదటిసారి చదివినప్పుడు కన్యాశుల్కం అంటే ఏమిటో అర్ధం కాదు. అట్లాగే - వేగంగా మారుతున్న మన సమాజ పరిణామంలో కొంతకాలానికి మన ఉమ్మడి కుటుంబాలకి ట్రేడ్మార్క్ అయిన గయ్యాళి అత్తలు కనుమరుగై.. అస్తిత్వాన్ని కోల్పోవచ్చు. ఇది సమాజానికి మంచిది కూడా!

73 comments:

  1. Hi, excellent work, you qualify for P.hD :).

    ReplyDelete
  2. విశ్లేష ణాత్మక పాత్రా పరిచయం "గుండమ్మ" చాలా బాగుందండీ! ఇక ముందు ఇలాటి పాత్రలు ఉండవు. ఎలాటి స్త్రీ పాత్రలు ఉంటాయో..!? సమకాలీన స్త్రీ పాత్ర తో ఒక పోస్ట్ వ్రాయండి.తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. క్షమించాలి. నేను సినిమా చూసి చాలా యేళ్ళయ్యింది. టీవీ సీరియల్స్ ఎప్పుడూ చూళ్ళేదు. కాబట్టి 'సమాకాలీన స్త్రీ పాత్రలు' గూర్చి అవగాహన లేదు. మీవంటివారు రాస్తే చదవాలనే ఆసక్తి మాత్రం ఉంది.

      Delete
  3. ఏంటో గుండమ్మ లాగే ఒక్క ముక్క అర్ధమైచావలేదు. హహహ.. :):):)

    ReplyDelete
    Replies
    1. నేను మాత్రం టాపిక్ ని బాగా సింప్లిఫై చెయ్యడానికి ప్రయత్నించాను. ఇంతకన్నా సింప్లిఫై చెయ్యడం నా వల్ల కాదు. మన తెలుగువారి గుండమ్మని ఇంగ్లీషువారి ఫ్రాయిడ్ సూత్రాలతో విశ్లేషిస్తే ఇట్లాగే అవుతుందేమో!

      Delete
  4. అయ్యో అయ్యో... బంగారం లాంటి మా గుండమ్మత్తకు ఇన్ని నోరుతిరగని ఇంగ్లీషురోగాలున్నాయంటారా, డాక్టారూ?! మా అత్తే బ్రతికి వుంటే ఈ మాట మాటవరసకైనా చెప్పే సాహసం చేసేవారా? :( ... :(( ఈపాటికి ఫ్రాయిడ్ గారికి స్వర్గంలో కూడా కునుకు పట్టకుండా చేసివుంటుందేమో. :)

    ReplyDelete
    Replies
    1. ఆ ఇంగ్లీషు రోగాలన్నీ మనక్కూడా ఉంటాయిలేండి! అయినా ఫ్రాయిడ్ భానుమతికి బెస్ట్ ఫ్రెండ్. సూర్యాకాంతమ్మ నుండి రక్షణ కోసం భానుమతి శరణు కోరతాడేమో!

      http://yaramana.blogspot.in/2011/12/blog-post_07.html చదవండి.

      Delete
  5. "వితంతువైన భర్త" కాదండి.
    భార్య చనిపోయిన మగవాడిని "విధురుడు" అంటారట.
    "మేజర్ చంద్రకాంత్" సినిమాలో NTR చెప్పినట్టు గుర్తు.

    "మామూలుగానయితే గుండమ్మ నాగేశ్వరరావుని ఉతికి ఆరేసేది."
    ఇది చాలా బాగుంది.

    ఒక ధర్మ సందేహం!
    మీకు "గుండమ్మత్త" ఎందుకయ్యింది? పెద్దమ్మ ఎందుకవ్వలేదు?

    మరికొంత తరువాత.

    ReplyDelete
    Replies
    1. నాకయితే 'వితంతు భర్త' అన్నదే సౌకర్యంగా ఉందిలేండి!

      సినిమాలో రామరావుకి గుండమ్మత్త. అప్పుడు నాకూ గుండమ్మత్తే!

      సరీగ్గా ఏడాది క్రితం నేను రాసిన నా మొదటి పోస్ట్ చదవండి. మీకు అర్ధమౌతుంది.

      http://yaramana.blogspot.in/2011/06/blog-post.html

      Delete
    2. రామారావ్ గుండక్కా అని పిలుస్తాడు....

      అయినా ఇద్దరు కూతుళ్ళున్న గుండమ్మని అత్తా అనికాక , పెద్దమ్మా అని ఏవెధవ పిలుస్తాడు.


      కాముధ

      Delete
    3. అవును. 'గుండక్కా!' అనే పిలుస్తాడు. చాలా యేళ్ళ క్రితం చూసిన సినిమా. అందుకే పొరబడ్డాను. ధన్యవాదాలు.

      Delete
    4. కాముధ గారు.

      2 మచ్...

      Delete
  6. చాలా బాగా రాసారు. కానీ ప్రస్తుతం భాష తో సంబంధం లేకుండా ప్రతీ టీ.వీ సీరియల్ లోనూ కనిపించే ఆడ విలన్ పాత్రలకీ, వాటి సృష్టికీ కారణం ఎమిటో మరి?ఇలాంతివే కొన్ని అతి ప్రవర్తనలు కల పాత్రలు కొన్ని సినిమాలలోనూ కనిపిస్తున్నాయి.. వీరితో పోల్చి చూస్తే గుండమ్మ చాలా సాత్వికురాలు అనుకోవచ్చేమో.. ఈ పాత్రలని విష్లేస్తూ మీరొక టపా రాస్తే బావుంటుంది. కేవలం హిట్ అవ్వడం, టీ. ఆర్. పీ రేటింగులేనా? పాత్ర సృష్టికర్తల లేదా ప్రెక్షకుల మనస్థితా? అన్నట్టు భార్య పోయిన భర్తని విధురుడు అంటారు అని గుర్తు..

    ReplyDelete
    Replies
    1. గోదావరి, ఆవకాయ, గుండమ్మ.. ఇవన్నీ మన కళ్ళకి కనపడేవి. కాబట్టి వాటి గూర్చి ఎంతైనా మాట్లాడుకోవచ్చు.

      >>ప్రతీ టీ.వీ సీరియల్ లోనూ కనిపించే ఆడ విలన్ పాత్ర<<

      నేనయితే నా జీవిత కాలంలో ఏనాడు 'ఆడ విలన్' ని చూళ్ళేదు. చూడనివారిని విశ్లేషించలేం గదా!

      Delete
    2. ఇలా మామూలుగా చెప్పే విషయాలనే కదా మనవాళ్ళు స్త్రీ వాదం అంటున్నది.

      Delete
    3. స్త్రీవాదం అంటే స్త్రీలు మాత్రమే చేస్తారనుకుంటా!

      Delete
  7. చాల చక్కటి విశ్లేషణ. కాకపొతే ఓక పాత్రతోనే ఇంత మానసిక విశ్లేషణ జరిగితే సమజాములోవున్న గొముఖవ్యాఘ్రాలవల్ల ఎంతొ తెలుసుకొవచ్చు, వీలయితే సమకాలీన విశ్లేషణ జరపగలరు.
    భార్య చనిపొయిన మగవారిని విధుడు అంటారు. పైన కామెంట్లో బోనగిరి గారు తప్పు తెలిపినారు.

    ReplyDelete
    Replies
    1. 'విధుడు' కన్నా 'మగ వితంతువు' బాగుంది కదూ!

      నేనీ టపా కోసం శంకరనారాయణ డిక్షనరీ రిఫర్ చేశాను. కొన్ని తెలుగు పదాలు అస్సలు అర్ధం కాలేదు!

      Delete
  8. (ఎప్పుడో డిగ్రీలో చదివిన సైకాలజీ అది గుర్తొచ్చి)
    టపా గంభోళ ఝంభ
    ఫోటోలు మాత్రం సూపర్

    ReplyDelete
    Replies
    1. నేను చాలా సింపుల్ పదాలతో అత్యంత సరళంగా రాశాననుకున్నానే!

      Delete
  9. రమణ గారు చాలా బాగుందండి మీ విశ్లేషణ .. 1960 -70 మధ్యలో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి . అందులో కొన్ని సినిమాలు ఎంపిక చేసుకొని .. అవకాశం ఉంటే ఇలా విశ్లేషణ చేస్తారని ఆశిస్తున్నాను

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! ప్రయత్నిస్తాను.

      Delete
  10. గుండమ్మ పాత్ర విశ్లేషణ చాలా బాగుందండి .

    ReplyDelete
  11. డాక్టర్ గారు,

    ఫెద్దగా అర్ధం కాకపోయినా బాగానే వుంది సార్,
    ఆయితే చివర్లో చెప్పిన ఈ రోజుల్లో గుండమ్మలు ఎందుకులేరనే విశ్లేషణ బాగానచ్చింది.

    రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
    Replies
    1. మీకు అర్ధం కాలేదంటే నా టపా ఎవార్డ్ స్థాయిలో ఉందని అర్ధం! చేతులకి కొద్దిగా సైకాలజీ దురద పుట్టింది (ఇన్ని రోజులూ నిగ్రహించుకున్నాను). ఏదో రాసేశాను. ఈ సారికి వదిలెయ్యండి!

      Delete
  12. నిజంగా చాలా బాగా రాసారండి. మీ టపా లన్ని నా ఆలోచనలకి, అభిప్రాయాలకి ఒక కుదుపు.
    అయితే మన గుండమ్మ లో ఇన్ని కోణాలు ఉన్నాయన్నమాట. ఈ పాత్ర స్ప్రుష్టించిన వాళ్ళు ఎలా అలోచించి ఈ పాత్ర సృష్టించారంటారు ?. మీరు చుసిన కోణాలు లో (కనీసం కొన్నైనా ) వాళ్ళు అలోచిన్చారంటారా ?
    లేక మీరు చెప్పినట్టు అప్పటి పరిస్థితులు ను బట్టి , వీదికొక గుండమ్మ ఉండేవాళ్ళు కాబట్టి , వాళ్లకి automatic గా ఈ ఆలోచన వచ్చిందంటారా ?. నా ప్రశ్నలు అసందర్భం కాదు కదా ?.
    :venkat

    ReplyDelete
    Replies
    1. నేను ఫ్రాయిడ్ సూత్రాలతో సరదా కోసం మాత్రమే రాశాను. సీరియస్ గా తీసుకోకండి. ఆలోచనలు లేనిదే మనిషి లేడు. మన ప్రతి ఆలోచననీ అనేక కోణాల్లో విశ్లేషించుకోవచ్చు. ఇవన్నీ సరదాగా చేసే కాలక్షేపం కార్యక్రమాలు!

      Delete
  13. బుల్లబ్బాయ్18 June 2012 at 17:50

    డాట్రు గారూ, ఈ మొత్తాన్నీ విక్టిమాలజీ లో విశ్లేషిస్తే ఇంకేం కనిపిస్తవో గదా?
    అట్టనే మన గుండమ్మకి మున్సాషే సిండ్రోం ఉందని నా డవుటు... ఏటంటారు?

    ReplyDelete
    Replies
    1. మీరు చెబుతున్నది munchausen syndrome గూర్చేనా? అయినట్లయితే.. గుండమ్మకి సంబంధం లేదనుకుంటున్నాను.

      Delete
    2. బుల్లబ్బాయ్18 June 2012 at 20:28

      బలేవారండి..... MSP (by proxy) లో పక్కోల్లని గిల్లి/గిచ్చి వాల్లు ఏడుత్తంటే వీల్లకి సింపతీ తెచ్చుకోటం ఒక టైపు కదా?

      Delete
  14. >>> ఎగ్రెషన్ థియరీలో వెంటిలేషన్ కోసం సాఫ్ట్ టార్గెట్స్ ఎంచుకోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం.

    ఈ వేళ మీరు మమ్మల్ని ఎంచుకున్నారన్నమాట................దహా.

    మీ అనాలిసిస్ చాలా బాగుంది. సూర్యాకాంతం ఎన్నో దుష్టపాత్రలు (ఈ మాట సాధారణంగా నేను ఉపయోగించను)వేసింది. కానీ సూర్యాకాంతం అంటే గుండమ్మ మాత్రమే గుర్తుకు వస్తుంది. మీ విశ్లేషణ బహుశా సినిమాలలో అన్ని అత్త దుష్ట పాత్రలకి కూడా అన్వయిస్తుంది అనుకుంటాను.

    అన్నట్టు, నా బుర్ర పుచ్చిపోయినా మీ దగ్గరకు రాను. ఏమో, ఏ చీకటి కోణాలు బయట పెట్టేస్తారేమో నని భయం వేస్తోంది.................. ఇంకో దహా.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి!

      మీరు నా దగ్గరకి వస్తే మీ చీకటి కోణాల సంగతేమో గానీ.. 'నవ్వితే నవ్వండి' అంటూ నామీద ఏం రాస్తారోననే భయంగా ఉంది!

      Delete
  15. మగవితంతువు అన్నమాట సరికాదు.సరదాకోసము అయితే సరి. పదనిర్మాణశాస్త్రం ప్రకారము అది చెల్లదు. అది ఎందుకో చెప్పాలంటే ఒక పెద్ద పొస్ట్ అవుతుంది.

    ReplyDelete
    Replies
    1. సరికాకపోయినా కొంపలు మునిగేదేముందండి! భాష అనేది ఒక communication. అంతే! ఐనా.. భాషాశాస్త్రాన్ని కాదనడానికి నేనెవర్ని? నేనేది రాసినా సరదా కోసమే!

      Delete
    2. అదేంకుదరదు, భాష/పదనిర్మాణ శాస్త్రోల్లంఘన సుంకము కింద 10వేలు చెల్లించి రశీదును పొంది, మీ సరదా తీర్చుకొండి. అంతే! :P :)

      Snkr

      Delete
  16. రమణ గారు election రిజల్ట్స్ గురించి అనాలిసిస్ చెయ్యడానికి సుబ్బు ని ఒకసారి ఇంటికి రమ్మనోచుగా..మాంచి ఫిల్టర్ కాఫీ లాంటి అనాలిసిస్ ఇస్తాడు.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా రమ్మనొచ్చు. ప్రయత్నిస్తాను కూడా. కానీ.. రమ్మన్నప్పుడు రాడు. హడావుడిగా వచ్చేసి పోతుంటాడు మా సుబ్బు!

      Delete
  17. మా గయ్యాళి గుండమ్మత్త వెనక ఇంతకథాకమామిషు ఉందా అని అబ్బురపడేలా రాశారండీ... మీ విశ్లేషణ చాలా నచ్చేసింది. ఓపికగా ఇంత పెద్ద పోస్ట్ వివరంగా రాసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. ఇరవయ్యేళ్ళ క్రితం గ్రెగరి సామ్సా (ఫ్రాంజ్ కాఫ్కా రాసిన 'మెటామార్ఫసిస్' మెయిన్ కేరక్టర్), రస్కల్నికోవ్ (దోస్తవస్కీ రాసిన 'క్రైం అండ్ పనిష్మెంట్' మెయిన్ కేరక్టర్) ల సైకోఎనాలసిస్ చదివాను. నాకు బాగా నచ్చింది. కొన్నేళ్ళ క్రితం దేవదాసుని ఆశిష్ నంది (క్లినికల్ సైకాలజిస్ట్) విశ్లేషించాడు. ఐతే.. తెలుగులో ఎవరన్నా ఇలా రాశారా అన్నది నాకు తెలీదు. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.

      Delete
  18. అవినీతి ఉప ఎన్నికలలో గెలిచింది అని మన బ్లాగు వీరులు భారతీయ జెండా పట్టుకొని సిరివెన్నెల సాంగులు పాడుకొంటూ నుదుట మువ్వన్నెల జెండా స్టిక్కర్ ధరించి నిప్పులు కక్కుతున్నారు. వీరి ఉగ్ర రూపం చూడలేక మా బోటి చిన్న ప్రాణాలు విల విల లాడుతున్నాయి. ఒక్కసారి మీ సుబ్బుని ఉప ఎన్నికల మీద ఒక టపా రాయమని చెప్పండి .

    ReplyDelete
  19. సుబ్బు ఎలక్షన్ ముందోమాటా తరువాతో మాటా చెబుతాడటోయ్, అమాయకత్వం తో అడగడం గాపోతే.

    ReplyDelete
  20. చాలా బాగుంది మీ విశ్లేషణ. ఆన్నట్టు, ఆస్తి మన గుండక్కదే ననీ, భర్త ఇల్లరికం వచ్చాడని సిద్ధాంతి గారు రామభద్రయ్య గారితో చెప్పారు కదా.

    ReplyDelete
    Replies
    1. అట్లాగా! గుర్తు లేదండి. థాంక్యూ!

      Delete
    2. భర్త ఇల్లరికం వస్తే ముందే సవతి కూతురు ఉండటం కాస్త విస్మయాన్ని కలిగించేదే, కధ చెప్పడం లో ఇది ఒక చిన్న లోపం అయ్యుండొచ్చు .

      గుండక్క ఇపుడు కూడా అందరిలో ఎంతోకొంత ఉన్నారండీ అందుకేనేమో సినిమా ని ఈ మధ్య చూసినపుడు సూర్యకాంతం గయ్యాళి లా కాక, ఇప్పటి మధ్య తరగతి స్త్రీ లకి ప్రతినిధి లా కనిపించింది.

      Delete
    3. >>ఆస్తి మన గుండక్కదే ననీ, భర్త ఇల్లరికం వచ్చాడని సిద్ధాంతి గారు రామభద్రయ్య గారితో చెప్పారు కదా.<<

      గుండమ్మ కథని ఇంత మైక్రో డిటైల్స్ తో గుర్తుంచుకున్న అనగనగా ఓ కుర్రాడు గారికి అభినందనలు.

      ఇవ్వాళ గుండమ్మ కథ DVD రిఫర్ చేశాను.

      1.రామభద్రయ్య (ఎస్వీరంగారావు) పెళ్ళికి వెంకట్రామయ్య (గుండమ్మ భర్త) తండ్రి మాట సాయం చేశాట్ట. ఈ సంగతి మన హీరోలకి ఎస్వీరంగారావు చెబుతాడు. కాబట్టి మిస్టర్ గుండయ్య (గుండమ్మ భర్త) ది కలిగిన కుటుంబమే అయ్యుండాలి. మరి ఇల్లరికం ఎందుకెళ్ళాడు?!

      2.సిద్ధాంతి (బోడపాటి) సంబంధం గూర్చి రామభద్రయ్యతో చెబుతూ.. గుండమ్మ భర్త తన కూతురితో సహా సొంత ఊరైన దుర్గాపురం వదిలేసి.. గుండమ్మని పెళ్ళి చేసుకుని.. ఇల్లరికం వచ్చేశాడని అంటాడు. అంటే ఆస్థిపాస్తులన్నీ గుండమ్మవే. మనిషి అందంగా కూడా ఉంటుంది. మరప్పుడు రెండో పెళ్ళివాడిని.. అందునా ఒక కూతురున్న తండ్రిని పెళ్ళి చేసుకోవలసిన ఖర్మ గుండమ్మకెందుకు పట్టింది?!

      3.కంచు గంటయ్య (రమణారెడ్డి) రామభద్రయ్యతో గుండమ్మ వివరాలు చెబుతూ.. పెళ్ళయిన తరవాత గుండమ్మ తల్లిని వదిలి కాపురానికి వెళ్ళనని మొండికెయ్యడంతో.. చేసేది లేక గుండమ్మ భర్తే గుండమ్మ పుట్టింటికి చేరాడని అంటాడు.

      నా సైకోఎనాలిసిస్ లో కొన్ని ఫాక్చువల్ ఎర్రర్స్ దొర్లాయి. అందుకు చింతిస్తున్నాను.

      గుండమ్మ గూర్చి వివరాల్లో కొంత కన్సిస్టెన్సీ లోపించిన మాట కూడా వాస్తవం. బహుశా మనం యాభై యేళ్ళ తరవాత ఇలా ఒక పాత్రని డిసెక్ట్ చేస్తూ పోస్ట్ మార్టం చేస్తామని దర్శకుడు ఊహించి ఉండడు!

      Delete
    4. మీ మూడో పాయింట్ , కంచు గంటయ్య పని పుకార్లు పుట్టించడం కాబట్టి సినిమా లోని ఆయన మాట లెక్క చెయ్యక్కర లేదు .తెలుగు లో ఆయనని ఫోటో కి పరిమితం చేసినా గుండమ్మ ఆయన ఫోటో కి నమస్కరించుకోవడాలు , ఫోటో తో మాట్లాడడం ఆయనపై ఉన్న గౌరవాన్ని సూచిస్తున్నాయి.

      మన భాషకు తగ్గట్టు గా కధను మలచడం లో ఇటువంటి తికమకలు కొన్ని ఉన్నా అవి ఎవరికి అభ్యంతరం కాలేదు. సిద్దాంతి చెప్పిన మాట సినిమా చూసిన జనం పట్టించుకోలేదు.

      @బహుశా మనం యాభై యేళ్ళ తరవాత ఇలా ఒక పాత్రని డిసెక్ట్ చేస్తూ పోస్ట్ మార్టం చేస్తామని దర్శకుడు ఊహించి ఉండడు!

      హ హ , ఇంతకూ మునుపు వ్యాఖ్య వ్రాస్తూ ఇదేమాట అనుకొన్నాను.

      Delete
    5. వ్యాఖ్య ని ఎడిట్ చెయ్యడంలో చిన్న పొరబాటు, రెండవ వాక్యం లో 'ఆయన' అని గుండమ్మ భర్తను ఉద్దేశించినది

      Delete
  21. రమణ గారూ, మన సినిమాలలో left handers ఎవరున్నారని ఆలోచిస్తే వెంటనే అమితాభ్ బచ్చన్, సూర్యకాంతం మాత్రమె గుర్తొస్తారు. దీనికేమయినా కారణం చెప్పగలరా?

    ReplyDelete
    Replies
    1. ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదనుకుంటా. వీళ్ళిద్దరూ ప్రసిద్ధులు కావున చప్పున గుర్తొస్తారు.

      Delete
    2. Actually I have two questions:

      - "Why do we remember only these two?" Answered
      - "Are left handers under-represented in Indian cinema? If yes, why?" Your comment please

      Delete
    3. జై , సినిమాల్లో కూడా ఎడం చెయ్యి వాటం అలవాటయ్యి పెత్తేకంగా అనిపిచ్చడం పొయ్యి శానాల్లయ్యింది. అదో ఫ్యాషనూ

      Delete
  22. సినీమా చూసినప్పుడు ఇంత శల్య పరీక్ష చెయ్యొచ్చని నా బుర్రకి తట్టలేదు. సినిమా చూసేసిన తరువాత నెక్స్ట్ విజయా సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడటమే. అయినా మీరు ఈ సినీమా ఎన్నిసార్లు చూసారు? సైకియాట్రీ బుర్రకి చివరికి సినీమా పాత్రలు కూడా బలి అవుతాయల్లె ఉంది. ఎనాటమీ లాబ్ లో శవాన్ని కోసినట్లు.
    గుండమ్మని తిడితే కోపమొచ్చింది అంతే. సావిత్రీ యంటీవోడికి పెళ్ళి చేసింది గుండమ్మే.

    ReplyDelete
    Replies
    1. హ.. హ.. హా!! కాదేది డిసెక్షనుకి అనర్హము!

      'గుండమ్మ కథ' ని సుమారు ఓ పది సార్లు చూసి ఉంటాను. నా జీవితంలో ఎక్కువ సార్లు చూసిన సినిమా కూడా ఇదే. నేను మొదటిసారి చూసేప్పటికే ఈ సినిమాకి పదేళ్ళు వయసు!

      కొన్నేళ్ళ క్రితం psychodynamics of miss Mary అంటూ మిస్సమ్మని విశ్లేషించాను. అది ఈ - మెయిల్ రూపంలో స్నేహితుల మధ్య తిరిగింది. చాలామంది అర్ధం కాలేదన్నారు. ఇక అంతటితో ఊరుకున్నాను.

      నాకు గుండమ్మలో అమ్మ కనిపిస్తుంది. అమ్మమ్మ కనిపిస్తుంది. అందుకే గుండమ్మంటే ఇష్టం. నిజ జీవితంలోంచి నడిచి వచ్చినట్లుండే ఇట్లాంటి పాత్రలు మన సినిమాల్లో అరుదుగా కనిపిస్తాయి.

      నా దగ్గరకి వచ్చే వృద్ధులైన పేషంట్లని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ పోస్ట్ రాశాను. 'మా నాన్న ఎప్పుడో పొయ్యాడు. తింటానికి, ఉంటానికి లోటు లేదు. అయినా అన్ని విషయాల్లో నోరేస్తుంది.' అంటూ విసుక్కునే సంతానాన్ని చూస్తుంటాను. ఇది వారి అవగాహనా లోపం. నాటకాల్లో పాత్రల్లా, భార్య రాంగాన్లే తల్లి పాత్ర నిష్క్రమించదు. వృద్ధాప్యం శరీరానికే గానీ.. మనసుకి కాదు. కొడుకేదే మాటన్నాడని తిండి మానేసిన తలిదండ్రులు నాకు తెలుసు. నా వృత్తి రీత్యా వీళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను. నాక్కూడా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి.

      నాక్కూడా చాలా మందికిలా గుండమ్మ కథ సినిమాలో అంజి అంటేనే ఇష్టం. కానీ ఆ క్యారెక్టర్ చాలా కృత్రిమమైనది. తండ్రి చెప్పాడని పెళ్ళి కోసం ఎవరూ పాలేరుగా మారరు. అయితే.. దర్శకుడు రామారావుతో నిక్కర్లు వేయించి.. పిండి రుబ్బించి.. మనని మెస్మరైజ్ చేస్తూ మోసం చేశాడు!

      Delete
    2. psychodynamics of miss Mary ని మాకు ఎప్పుడు చూపిస్తారు?

      Delete
  23. రమణ గారు ,

    మీరు సందర్భం లేకుండా ఊరికే టపా వ్రాయరు, కొన్ని సబ్జెక్ట్స్ పై వ్రాసే ఆసక్తి కూడా ఉండకపోవచ్చు, కాబటి ఒక చిన్న సందేహాన్ని ఇక్కడే అడగదలిచాను. ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చెయ్యడానికి కారణం వారి మనసులో వున్నా విపరీతమైన ఒంటరి తనమే కారణం అని నేను అనుకొంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటి ?

    ఎక్కడో ఉంటారు ప్రేమ కోసం అని మరణించే వారు. కాని అన్ని జంటలు ఆ కోవలోకి కాక ఎవరికీ వారు ఒంటరితనం వల్లే ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నారని నా అవగాహన .ఈ మధ్య లోనే దగ్గరివారు అయిదు మంది ఇలా దూరం అయ్యారు, ఎక్కడ నిజమైన ఆలోచన జరుగడం లేదు వాళ్ళెందుకు అలా చేసుకొన్నారు అన్నదానిపై .

    మీరు ఈ వ్యాఖ్యను తీసివేయవచ్చును అభ్యంతరం ఏదయినా ఉంటే.

    ReplyDelete
    Replies
    1. ఆయ్యో! నాకెందుకండి అభ్యంతరం! మీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను.

      నా బ్లాగు జీవితానికి ఒక సంవత్సరం నిండింది. ఇన్నాళ్ళూ నా వృత్తికి సంబంధించిన విషయాలు రాయలేదు. గత నాల్రోజులుగా.. గుండమ్మ పుణ్యమాని సైకియాట్రీని టచ్ చెయ్యక తప్పట్లేదు.

      ఆత్మహత్యల శాస్త్రంలో పెద్ద దిండ్లు లాంటి పుస్తకాలే ఉన్నాయి. ఈ శాస్త్రాన్ని 'సూసైడాలజీ' అంటారు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఆత్మహత్యల గూర్చి పెద్దగా స్టడీలు లేవు.

      ఆత్మహత్యలు ఎక్కువగా మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు చేసుకుంటారు. ఆ క్యాటగిరీని పక్కన పెట్టి.. సామాజిక కారణాల గూర్చి చర్చించేట్లయితే Emile Durkheim అనే ఫ్రెంచ్ గడ్డపాయన చెప్పిన సోషల్ థియరీస్ చాలా ప్రముఖమైనవి. హోల్డాన్! ఇదేంటి నేను మాలతి చందూర్ లాగా రాసేస్తున్నాను! క్షమించాలి.

      ఇంక సూటిగా సమాధానం చెప్పేస్తున్నాను. అవును. మీరు చెప్పిన ఆ విపరీత ఒంటరితనం ఆత్మహత్యకి ప్రికర్సార్ గా ఉంటుంది. కారణాలు అనేకం. మానవ సమాజంలో సోషల్, కల్చరల్ బైండింగ్ ఫాక్టర్స్ తక్కువవుతున్న కొద్దీ కూడా సూసైడ్స్ పెరిగిపోతుంటాయి. వేగంగా వస్తున్న సామాజిక, అర్ధిక మార్పులకి అనుగుణంగా ఇంటిగ్రేట్ అవడంలో ఫెయిల్ అయినప్పుడు.. ఈ బాహ్య ప్రపంచంతో ఎమోషనల్ త్రెడ్ తెగిపోయినప్పుడు.. విరక్తితో ఆత్మహత్య చేసుకుంటారు. ఈ టైపు ఆత్మహత్యల్ని anomie అంటారు.

      టీనజిలో, ఎర్లీ ఎడుల్ట్ హూడ్ లో.. ప్రేమికులు పెద్దల్ని ఒప్పించలేక.. ప్రేమ కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు. దీన్ని suicide pact అంటారు. అప్పుడప్పుడు వింటూనే ఉంటాం.

      ఇంతకన్నా సింప్లిఫై చెయ్యడం నాకు రావట్లేదు. ఇప్పుడు మీకర్ధమైందనుకుంటా.. నేనెందుకు సైకియాట్రీ జోలికెళ్ళనో! తెలుగు ఆలోచనల్ని తెలుగు బ్లాగుల్లో రాసుకోవడం హాయిగా ఉంటుంది. అదే వేరే భాషలో విషయాల్ని తెలుగులోకి మార్చి రాయడం బహు కష్టం!

      Delete
    2. చాలా చాలా థాంక్స్ రమణగారు. నా ప్రశ్న కు మీరు పూర్తి గా సమాధానం ఇచ్చారు. విడిపోతున్న వారి చుట్టూ ఉన్నవి కూడా దాదాపు ఇవే కారణాలు. అసలు పలనాది ఫెయిల్యూర్, దానిని అంగీకరిమ్చాలి అనడమే పెద్ద ట్రాష్. సామాజిక ,ఆర్ధిక మార్పుల వల్ల కొందరు మోసపోతున్నారు.

      ****వేగంగా వస్తున్న సామాజిక, అర్ధిక మార్పులకి అనుగుణంగా ఇంటిగ్రేట్ అవడంలో ఫెయిల్ అయినప్పుడు.. ఈ బాహ్య ప్రపంచంతో ఎమోషనల్ త్రెడ్ తెగిపోయినప్పుడు..***

      అక్షరాలా నిజం. ప్రతి ఆత్మహత్య కు ఇదే కారణం అనడానికి కావలసినన్ని రుజువులు వున్నాయి. కాని ఎవరు వాటిని చూడడానికి ఆసక్తే చూపడం లేదు. చనిపోయిన వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. కాని ఉన్న వాళ్ళు ఈ దిశలో విశ్లేషణ చేసికోక, సమాజం చేస్తున్న నిర్లక్ష్యానికి తిరిగి సమాజమే బలి అవుతున్నది.

      మీరు చెప్పినట్లు గా ఈ భావాలను వ్యక్త పరచడం చాలా కష్టం, సమాజానికి వీటిలో వినోదం లేదు కాబట్టి !!!!!!! నేను కూడా 'దత్తత' గురించి రెండు టపాలు వ్రాసినా వాటివెనక ఉన్న ఆత్మహత్యల్ని మెన్షన్ చెయ్యడానికి సాహసించలేదు :)

      Delete
  24. ఆత్మహత్య కి కారణం ఓటమిని అంగీరకరించనితనం, తాత్కాలికంగా అవతలి వారి మీద పైచేయి సాధించడానికి కావచ్చు.

    కాముద.

    ReplyDelete
    Replies
    1. టాపిక్ గుండమ్మ నుండి ఆత్మహత్యల వైపు మళ్ళుతున్నదేమి!

      అవునండి. ఫ్రాయిడ్ కూడా మీరు చెప్పిందే చెప్పాడు. Karl Menninger అనే ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి ఆత్మహత్యల్ని 'inverted homicides' అన్నాడు.

      ఇంకేమన్నా రాస్తే మన తెలుగు బ్లాగర్లు నన్ను బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం ఉంది. అంచేత.. ఇక స్వస్తి!

      Delete
  25. సరే టాపిక్ ని మళ్ళి గుండమ్మ మీదికి :)

    @నా సైకోఎనాలిసిస్ లో కొన్ని ఫాక్చువల్ ఎర్రర్స్ దొర్లాయి. అందుకు చింతిస్తున్నాను.

    ఖచ్చితం గా కాదు, మీరు చెప్పిన ఫాక్ట్ సినిమాకి /వినోదానికి పెద్దగా అక్కరలేనిది, కాబట్టి స్పష్టత ఇవ్వలేదు దర్శకుడు. అలాగని అది నిజం కాకుండా పోదు. మీ అనాలసిస్ లో లోపం లేదు. కాకుంటే దీన్నే స్త్రీవాదం అని నేను అన్నాను :) (స్త్రీ తరపున చేసే వాదం).

    ReplyDelete
  26. ఔటాఫ్ కాంటెక్స్ట్ అనుకోండి... మీ టైటిల్ చూసి అడుగుతున్నా... (కాకికేమి తెలుసు సైకో ఎనాలిసిస్) వడ్డెర చండీదాస్ గురించి ఏమన్నా రాస్తారా...!

    ReplyDelete
    Replies
    1. సారీ! నేను వడ్డెర చండీదాస్ ని చదవలేదు.

      ఐతే గోపిచంద్ 'అసమర్దుడు' సీతారామారావు, బుచ్చిబాబు 'చివరికి మిగిలేది' దయానిధి లాంటివారి గూర్చి ఎనలైజ్ చెయ్యొచ్చు. నా అనుమానం ఈ పని ఆల్రెడీ ఎవరో చేసే ఉంటారు. తెలుసుకోటానికి ప్రయత్నిస్తాను.

      Delete
  27. Ramana garu,
    I would be interested to see your take on Dayanidhi.

    ReplyDelete
  28. గుండమ్మ కధలోని "గుండమ్మ" యొక్క మానసిక స్థితిని సైకాలజీ పదాలతో చేసిన విస్లేషణ చాలా బాగున్నది. దీనివలన ఒక మనిషి యొక్క "బిహేవియర్" లక్షణాలు కొన్ని తెలుసుకో గలిగాను. ఇకపోతే ప్రస్థుత కుటుంబ వ్యవస్థలో కన్నా పూర్వం సమిష్టికుటుంబాలలో "గుండమ్మ"లు ఉండాటానికి అవకాశములు చాలాతక్కువ. కారణం ఆ కుటుంబములోని సభ్యులందరూ (దాదాపుగా) ఎవరికీ ఎటువంటి అసంతృప్తి అనేది కలగ కుండా ఒకరికొకరూ ఓదార్పులతో, భాధ్యతగా, నైతికంగా, ఉన్నతమయిన సంస్కారములతో మసులుకునే వారు.
    సమిష్టికుటుంబంలో మగ వారు సంపాదనకోసం బయటికి వెళ్తే, ఆ కుటుంబలోని పెద్ద వారు అత్త, అత్తలేకపోతే పెద్దకొడలు ఇంటి వ్యవహారాలు చక్కబెట్టే వారు. ఐడెంటిటీ కోసం కాదు.
    ఎక్కడో, అదీకూడా ఖర్మకొద్దీ తక్కువ మంది కుటుంబ సభ్యులన్నచోట అత్తలు గయ్యాళీగా ప్రవర్తించే వారు.

    కానీ ఇప్పుడో: దాదాపుగా ప్రతి ఇంట్లో ఒక "గుండమ్మ" కనబడుతుంది. అట్లా కనబడట్లేదు అనుకోవటమనేది కేవలం ఒక ఊహ మాత్రమే. "కన్యా శుల్కాలు", "కాంప్రొమైజ్" పెళ్ళిళ్ళు, కొడవగంటి కుటుంబ రావు, శరత్ చంద్ర లాంటి వారివలన సామాజిక స్పృహ కారణాలు కావు. కేవలం ఎవ్వరితోనూ కలిసి ఉండక వేరే కాపురాలు ఏర్పరుచుకోవటం వలన చాలా చక్కగా, ఎవరికి వారు గౌరవంగా ఉంటున్నట్లు వ్యవహరిస్తున్నారు. పండగలకో, లేదా కుటుంబంలో ఎవరన్నా పోతే గౌరవం దక్కించుకోవటానికి కలుస్తున్నారు.

    ఇప్పటివాళ్ళు అన్నదమ్ముల, అక్కచెళ్ళెళ్ళ పిల్లలకో ఒక చాక్లెట్ కొంటే పెళ్ళాం చేతిలో చచ్చినట్లే (కొంతమంది). అందుకనే ఈ భాధంతా ఎందుకని మగాడు పండుగలకి తన పుట్టింటికన్న భార్య పుట్టినింటికి వెళ్ళడానికి ఇష్టపడుతాడు.
    అత్తలేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు కాక ఇంకేమిటి.

    ReplyDelete
  29. *ఇప్పటివాళ్ళు అన్నదమ్ముల, అక్కచెళ్ళెళ్ళ పిల్లలకో ఒక చాక్లెట్ కొంటే పెళ్ళాం చేతిలో చచ్చినట్లే *

    ముర్తి గారు,
    మీరు ఆడవారి ఉదార బుద్దిని బయటకు అలా చెప్పేస్తే ఎలా? తెలుగు సాహిత్యంలో, సినేమాలలో ఒకప్పుడు ఎర్ర ప్రభావం చాలా ఎక్కువ అవటం చేత స్రీలందరు చాలా మంచి వారు, భర్త చేతిలో అష్టకష్టలు పడేవారు. మొగవారు ఇంటిని అశ్రద్ద చేస్తూ, మహిళలకు విలువనివ్వని వాడుగా చిత్రికరించారు. అసలు విషయమేమిటంటే, వాళ్లు చనిపోయినా కూడా వీరి తిండికి, బ్రతుకు తెరువుకు ,ఉండటానికి లోటు లేకుండా సంపాదించి పెట్టి పోయేటట్లు జాగ్రత్తలు గుండమ్మ భర్త లాగా తీసుకొన్నారు. పైసా కష్ట్టపడాకుండ, తెక్కతేరగా భర్త సంపాదించిన ఆస్థిని తిని, స్వతహాగా ధైర్యం లేకపోయినా, గుండమ్మా లాగా చాలా మంది ఆడవారు తెగ నోరు పెంచుకొనేవారు. ఈ గుండమ్మగారి సంతతి ఇప్పటికి తెలుగు నాట ఇంకా స్రీవాదం ముసుగులో కొనసాగుతున్నారు.

    ReplyDelete
  30. డాక్టర్ గారు టపాకి సంబంధం లేని వ్యాఖ్యలు రాశాను. ఎమి అనుకోకండి.

    ప్రస్తుతం మన సమాజం లో ఉన్న స్వార్థానికి మూల కారణం చదువుకొన్న మహిళలే. చదువుకొనే కొద్ది వాళ్ల బుద్ది మరింత సంకుచితమై పోయింది. మొగుడి మీద కన్నా డబ్బులపైన ఆడవారికీ గల ప్రేమ, తెలివిగల, అలోచించే మగవారికి తెలిసినా,వాస్తవాన్ని ఎదుర్కొనటం ఇష్ట్టం లేక, భార్య అతనిని ప్రేమిస్తున్నాదనే పిచ్చలో ఉండాలను కొంటాడు. తనని తాను మోసం చేసుకొని, సమాజం మీద పడి, పగలు రాత్రి కష్ట్టపడి భార్య కి సంపదను దోచి పెడుతూంటాడు. ఈ మధ్య జాతకం చూపించు కోవటానికి వెళ్లినపుడు ఒక కేసు తగిలింది. ఎన్నో ఏళ్లు కాపురం చేసిన భర్త పోయి, ఆరు నేలలు కాక ముందే నాకు మళ్లీ పెళ్లెపుడౌతుందని కనుక్కోవటానికి జ్యోతిష్కుడి దగ్గరికి ఒకావిడ ఆరునేలలో మూడవ సారి వచ్చింది. ఆశ్చర్య పోవటం బాపనోడి వంతైంది. సమాజం మార్పు చెందుతూంట్టుందని పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే లాయర్లకి,డాక్టర్లకి, జ్యోతిష్కులకి మొద|| తెలుసుకాని, ఇంతగానా అని అతడు వాపోయాడు. అతను ఆమే మొదటి భర్త ఎంతో కష్ట్టపడి డబ్బులు సంపాదించి ఇస్తే, సానుభూతి/గౌరవం కొరకన్నా కనీసం ఆమే రెండో పెళ్లి చేసుకోవాల్నుకొనే నిర్ణయం ఒక సం|| పాటైనా వాయిదా వేయకుండా, నాకు మళ్లి పెళ్ళే పుడౌతుంది అని జ్యోతిష్కుడి వెంటపడింది.

    ReplyDelete
  31. Doctor ji
    Arundhati movie meeru chusunte, mee perspective lo, mee analysis rayandi. Chala powerful character.
    Thank you

    ReplyDelete
    Replies
    1. నేను 'అరుంధతి' సినిమా చూళ్ళేదు. దెయ్యాల సినిమాలంటే నాకు భయం! కావున మీ కోరిక తీర్చలేను. మన్నించగలరు.

      Delete
  32. గుండమ్మ కథకి మాతృక అయిన కన్నడ సినిమాలోనూ, మొదట గుండమ్మ కథ స్క్రిప్ట్ దశలోనూ గుండమ్మ సుమంగళి. ఆమెకి ఎదురాడలేని ఓ మొగుడి పాత్ర ఉండేది స్క్రిప్ట్ లో. గుండమ్మని దర్శకుడు కమలాకర కామేశ్వరరావు బంగారు నగలు, పట్టుచీరల్లో నిండుగా చూపిద్దామని ముచ్చటపడ్డాడు కూడా పాపం. అయితే పనికిరానిది ఎంత అందమైనదైనా నా స్క్రిప్ట్ లో వద్దు అనుకునే కథక రాక్షసుడు చక్రపాణి దీనికి రచయిత.
    ఆయన ఓరోజు హఠాత్తుగా ఆ మొగుడి పాత్రను సినిమాలో కీర్తిశేషుణ్ణి, తద్వారా గుండమ్మని విధవరాలిని చేసేశాడు. అదేంటని మాటలు రాసిన నరసరాజు, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు కంగారుపడితే, కథలో ఓ సీన్ ని కూడా మలుపుతిప్పలేని ఆ పాత్ర వేస్టన్నాడు. ‘‘పెళ్ళానికి ఎదురు చెప్పలేని వాడు ఉంటే కతకి ఏం కలిసొచ్చుద్ది, లేకపోతే కతలో ఏం పోద్ది’’ అంటూ సందేహాలు ఎగరగొట్టి గుండమ్మకి వైధవ్యం ప్రాప్తింపజేశాడు.
    ఇంతకీ ఇలా స్క్రిప్ట్ దాదాపు ఫైనలైజ్ అయ్యే సమయంలో మొగుడి పాత్ర తీసేయడం ద్వారా విధవరాలైన గుండమ్మకు అందుమూలంగా అంతకుముందే రాసిపెట్టుకున్న కారెక్టరైజేషన్ మీద అదేం ప్రభావం చూపివుంటుంది? తెలిసీ చెప్పకపోతే.. గుండమ్మకథ మరో వెయ్యిసార్లు చూస్తారు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.