Wednesday, 22 May 2013

దొంగ


ఆ యువకులిద్దరూ బాగా చదువుకున్నవారు. చాలాకాలంగా స్నేహితులు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో నిత్యం కలహించుకునే రెండు రాజకీయ పార్టీల అభిమానులుగా విడిపొయ్యారు. అందువల్ల వారిమధ్య రాజకీయంగా తరచూ వాదప్రతివాదనలు చోటు చేసుకుంటున్నాయి. 

ఇవ్వాళ కూడా (రోజూలాగే) ఇద్దరి మధ్యా చర్చ చిన్నపాటి వాదనగా మొదలై పెద్దపాటి కేకలు, అరుచుకునే స్థాయిదాకా వెళ్ళింది.

"మీ నాయకుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు కాజేశాడు."

"మీ నాయకుడు మాత్రం తక్కువా? రెండు లక్షల కోట్లు కాజెయ్యలేదా?"

"మా నాయకుడికి రాష్ట్ర అభివృద్దే ఊపిరి."

"మా నాయకునికి ప్రజల సంక్షేమమే జీవనం."

స్నేహితులిద్దరూ ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకున్నారు.

ఇంతలో "దొంగ! దొంగ!" అంటూ అరిచారెవరో. స్నేహితులిద్దరూ తల తిప్పి అటుగా చూశారు.

ఎదురుగా పెప్సీ తాగుతున్న నడివయసు బట్టతల పెద్దమనిషి. అతని జేబులోంచి పర్స్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఓ కుర్రాడు. పెప్సీ బట్టతల ఆ కుర్రాడి చెయ్యి గట్టిగా పట్టేసుకుని 'దొంగ దొంగ' అంటూ అరుస్తున్నాడు.

స్నేహితులిద్దరూ క్షణంలో దొంగని దొరకబుచ్చుకున్నారు. ఆ దొంగకి సుమారు పదహారేళ్ళు ఉండొచ్చు. నల్లగా, సన్నగా వెదురుబద్దలా ఉన్నాడు. మాసిన చొక్కా, చింపిరి జుట్టు. మన హీరోల పట్టు విడిపించుకోడానికి గిలిగిలలాడుతూ మెలికలు తిరిగిపోతున్నాడు.

స్నేహితులిద్దరూ ఆ పక్కనే కొబ్బరి బొండాలు అమ్మేవ్యక్తి దగ్గర కొబ్బరి తాడు తీసుకున్నారు. దొంగ పెడరెక్కలు వెనక్కి విరిచి రోడ్డు వారాగా ఉన్న కరెంటు స్తంభానికి కట్టేశారు.

ఇంక విడిపించుకోలేనని గ్రహించిన దొంగ "అన్నా! వదిలెయ్యన్నా! ఇంకెప్పుడూ చెయ్యనన్నా! నీ కాల్మొక్తా అన్నా!" అంటూ ఏడవసాగాడు. ఈ లోపు చుట్టూతా పెద్ద గుంపు తయారయ్యింది.

ఎర్రటి ఎండ. తారు రోడ్డు పెనంలా కాలిపోతుంది. కరెంటు స్తంభం నిప్పుల కొలిమిలో కాల్చి తీసినట్లు మండిపోతుంది. ఎవరో దొంగ చొక్కా, పేంటు చింపేసారు. చిరుగుల డ్రాయర్ అతగాడి నగ్నత్వాన్ని కప్పలేకపోతుంది.

స్నేహితులిద్దరూ దొంగపై పిడిగుద్దులు కురిపించారు. కొద్దిసేపటికి చేతులు నొప్పెట్టాయి. మోకాళ్ళతో దొంగ డొక్కల్లో కుమ్మారు. కొద్దిసేపటికి మోకాళ్ళు నొప్పెట్టాయి. అంచేత ఎగిరెగిరి కడుపులో తన్నారు.

ఈ దృశ్యానికి ఉత్తేజితులైన ఇంకొందరు యువకులు కూడా దొంగని తన్నటం మొదలెట్టారు. అటుతరవాత దొంగని తన్నే పవిత్రకార్యానికి వారిలో పోటీ మొదలైంది. గుంపుగా తన్నారు. వంతుల వారిగా తన్నారు.

కొద్దిసేపటికి దొంగ కళ్ళు తేలేశాడు. నోట్లోంచి నెత్తురు కారసాగింది. ఇంకొద్దిసేపటికి తల వాల్చేశాడు. శరీరం మాంసం ముద్దలా ఎర్రగా మారిపోయింది.

ఇంతలో పోలీసులోచ్చారు. ఈ దేశంలో చట్టం తన పని తను చేసుకుపోతూనే ఉంటుంది. అందుచేత చట్టబద్దులైన పోలీసులు దొంగ కట్లిప్పదీశారు.

దొంగ రోడ్డుమీదగా వాలిపోయ్యాడు. చచ్చాడా? చచ్చే ఉంటాళ్ళే. ఇట్లాంటి దొంగవెధవలు బ్రతికి ప్రయోజనమేమి.. పరుల సొత్తు దోచుకోవడం తప్ప! మనది పుణ్యభూమి. ఇచ్చట దొంగతనం మహాపాపం.

స్నేహితులిద్దరికి సంతోషంగా ఉంది. బాధ్యత కలిగిన పౌరులుగా సమాజానికి సేవ చేసినందుకు ఆనందంగా ఉంది. ఈ దేశంలో అందరూ తమలా నేరం చేసినవాడికి శిక్ష పడేట్లు చేస్తే నేరాలే ఉండకపోను!

దొంగని శిక్షించడంలో అలిసిన స్నేహితులిద్దరూ ఆ పక్కనే ఉన్న హోటల్లో వన్ బై టూ టీ తాగుతూ మళ్ళీ కబుర్లలో పడ్డారు.

"మా నాయకుడు ప్రజాధనం దోచుకుంటే మాత్రం తప్పేంటి? అందులో కొంత ప్రజాసంక్షేమానికే ఖర్చు చేశాడుగా."

"మా నాయకుడు మిక్కిలి నిజాయితీపరుడు. ఇతరులెవ్వరినీ దోచుకోనివ్వడు."

ఈ విధంగా తమ కబుర్లు కొనసాగిస్తూ ఇంటిదోవ పట్టారు.

(photo courtesy : Google)

10 comments:

  1. చాలా బాగుంది. మంచి వర్తమాన నీతి కథ.
    ఇది ఒక షార్ట్ ఫిలింగా తీసి టివిలో చూపిస్తే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు,

      చాలా థాంక్సండి. మరింత క్లుప్తంగా రాద్దామనుకున్నాను. కుదర్లేదు.

      Delete
  2. సారూ, ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నిలేవూ? మొన్నటిదాకా మా నాయకుడు దేవుడు అనేవారే, టికెట్ రాకపోతే మా నాయకుడు దోపిడిదారుడు అంటున్నారు. మరి ఇన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు అని చట్టం అడగదు. అసలు ఇక్కడ చట్టం, రాజ్యాంగం అనేవి ఒహటి ఏడ్చాయాని! ఆంధ్రోళ్ళ నాలుకలుకోస్తా, నడిరోడ్డుమీద ఆపేస్తా అని అంటారు; రాజ్యాంగవిరుద్ధమైనా చట్టం చూసీ చూడనట్టు పనిచేస్తూనే ఉంటుంది. ఇంకొకరు పార్టీ మారగానే వీళ్ళు రాజకీయ వ్యభిచారం అంటారు. అదే వీళ్ళ పార్టీలోకివస్తే రాజకీయపునీతులౌతారు. అటుండి ఫలానా పార్టీనాయకుడు దోపిడీదారుడు అంటారు. ఇప్పుడు అదే పార్టీలోకివెళ్ళి నేనుకాదు, మాపార్టీ అనిపించింది అంటారు. నైతికత అనేది జనాలకి కొఱవడితే ఇలాంటి విచిత్రన్యాయాలే కనిపిస్తాయి.
    కోడిముందా, గుడ్డుముందా?
    ప్రజలదితప్పా? చట్టానిదితప్పా?

    -
    ఆత్రేయ

    ReplyDelete
    Replies
    1. ఆత్రేయ గారు,

      రాజకీయనాయకులు అవసరార్ధం అనేకం చెబుతుంటారు.. మాట్లాడతారు. అది వారి వృత్తిధర్మం కూడా. నాకు అర్ధం కానిదల్లా.. ఎంతో చదువుకున్నవారు కూడా వారి రాజకీయాల్ని సీరియస్ గా పట్టించుకోవటం!

      Delete
  3. రమణ గారు సరిగ్గా నాకు కుడా ఇలానే అనిపిస్తుంది .. నాయకులు అనతి సీరియస్గా కామెడి చేస్తూ బోలెడు సంపాదిస్తుంటే .. వారి అభిమానులు దాన్ని సీరియస్గా తీసుకోని బుర్ర బదాహాలు కొట్టుకోవడం ఎందుకు

    ReplyDelete
    Replies
    1. మురళి గారు,

      ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని/నాయకుణ్ణి కులం, మతం, ప్రాంతం మొదలైన కారణాలతో అభిమానించేవారిని(వీరిలో చదువుకున్నవారే ఎక్కువ)అర్ధం చేసుకోవచ్చు.

      నా స్నేహితుడొకడు బద్ద కమ్యూనిస్టు వ్యతిరేకి. ప్రస్తుతం CPI, CPM ల పట్ల మాత్రం చాలా ప్రేమగా ఉన్నాడు.. కారణం ఈ రెండు పార్టీల రాష్ట్రనాయకత్వం అతని కులస్తులే! అతన్ని నేను అర్ధం చేసుకోగలను.

      ఇట్లాంటి ఏ కారణం లేకుండా.. కేవలం రాజకీయ కారణాలతో.. ఓ పార్టీనో/నాయకుణ్నో అభిమానించేవారిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

      Delete
    2. వైద్యులుగారు,
      "ఇట్లాంటి ఏ కారణం లేకుండా.. కేవలం రాజకీయ కారణాలతో.. ఓ పార్టీనో/నాయకుణ్నో అభిమానించేవారిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది."
      నిజంగా ఇలంటి వాళ్ళు వున్నారా? ఐతే, వాళ్ళు మరి ఎమి చూసి అభిమానిస్తారు? రాజకీయ పార్టీల సిద్ధాంతాలు చూసి? అందరికి తెలుసు అలాంటివి ఎమీ లేవు అని. మరి , ఎం చూసి అభిమానిస్తారు?
      కృష్ణ

      Delete
  4. వెనక గుమ్మం నుండి ఏనుగులు దూరినా పర్వాలేదు గాని , ముందు గుమ్మం నుండి చిన్న దోమ కూడా రాకూడదు

    ReplyDelete
    Replies
    1. రాజశేఖర్ గారు,

      అవును. నా టపా సారాంశాన్ని ఒక్కవాక్యంలో తేల్చేశారు. థాంక్యూ.

      Delete
  5. గతంలో తమ్ముడు మనవాడైనా ధర్మం చెప్పమనే నీతి ఉండేది
    ప్రస్తుతం మనవాడైతే చాలు వాడుచేసినదాంట్లో పెద్దగాతప్పేముంది అనే రీతి నడుస్తోంది.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.