Monday, 20 May 2013

సూర్యకాంతం సృష్టించిన సమస్య


కాలం నిరంతరంగా ముందుకు సాగిపోతుంది. సమాజం కాలానుగుణంగా మారుతుంటుంది. మార్పు అనేది సమాజ ధర్మం, సహజ గుణం. అదేవిధంగా మారుతున్న కాలాన్ననుసరించి, సమాజంలో మనం వహించాల్సిన పాత్ర కూడా మారుతూ ఉంటుంది. 

సమాజ చలన సూత్రాలు కూడా క్లిష్టంగా ఉంటాయి. అందుక్కారణం ఈ సమాజంలో మతం, కులం, వర్గం, వర్ణం, ప్రదేశం అంటూ అనేక వేరియబుల్స్ ఉండటం. అందువల్ల సమాజాన్ని ఒకే యూనిట్‌గా చేసి ఆలోచించడం సరైన విధానం కాదు. 

ఉదాహరణకి - కొన్ని కుటుంబాల్లో మద్యం పేరేత్తితేనే తప్పు. ఇంకొన్ని కుటుంబాల్లో మద్యం సేవించడం స్టేటస్ సింబల్. మరికొన్ని కుటుంబాల్లో మద్యం తాగడం కాఫీ తాగినంత చిన్న విషయం. అదే విధంగా ఆహారపు అలవాట్లు కూడా. ఇవన్నీ చిన్న విషయాలు. వీటిల్లోనే ఇంతలా తేడా వుంటే ఇక జీవన విలువల్లో ఇంకెంత వైరుధ్యాలు ఉండాలి!?

మధ్యతరగతి కుటుంబాల్లో మగపిల్లాడి కోసం (ఈనాటికీ) తపించిపోతారు. ఆడపిల్లకి లేని అనేక ప్రివిలేజెస్ అనుభవిస్తూ మగవాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఉద్యోగం సంపాదించి ఒక 'ఇంటివాడు' అవుతాడు. ఇక అప్పట్నుండి అత్తాకోడళ్ళ సంవాదం మొదలౌతుంది. ఇందుకు ప్రధాన కారణం తరాల అంతరం.

అత్త తన కొడుకు కోడలితో ప్రవర్తించే తీరుని పెళ్లైన కొత్తలో తన భర్త తనతో ప్రవర్తించిన తీరుతో బేరీజు వేసుకుని ఆలోచిస్తుంది. తన భర్త కొడుకులా రొమేంటిక్ గా ఉండేవాడు కాదు. సినిమాలు, షికార్లు కాదు గదా - కనీసం సరదాగా కూడా మాట్లాడింది లేదు. ఒకప్పటి తన భర్త ప్రవర్తనతో పోల్చుకుంటే ఇవ్వాల్టి తన కొడుకు ప్రవర్తన చికాగ్గా అనిపిస్తుంది. ఈ విషయం మీద కుటుంబరావు చాలా కథలు రాశాడు. 

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ వ్యక్తైనా ఒక విషయం అర్ధం చేసుకోవాలంటే అతని రెఫరెన్స్ పాయింట్ - "నేను". 'నా'కన్నా డబ్బు ఎక్కువ ఖర్చు చేసేవాడు జల్సారాయుడు, దుబారా మనిషి. 'నా'కన్నా తక్కువ ఖర్చు చేసేవాడు లోభి, పిసినిగొట్టు. ఇలా ప్రతి విషయంలోనూ ఈ "నేను" రిఫరెన్స్ గా ఉంటుంది. ఈ పాయింటు మీద ముళ్ళపూడి చాలా జోకులు రాశాడు.

ఒక పట్టణంలో ఓ సీనియర్ డాక్టర్ వుంటాడు. ఆయన ఎప్పట్నుండో జనరల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. క్రమేణా ఊరితో పాటు డాక్టర్లూ పెరిగారు. అదే ఊరికి ఓ కుర్ర స్పెషలిస్టు డాక్టర్ వస్తాడు. కొంతకాలానికి కుర్ర డాక్టర్ పేరుప్రఖ్యాతుల్లో సీనియర్ డాక్టర్ని మించిపోతాడు. సీనియర్ డాక్టర్ ఒకప్పటి తన ప్రాముఖ్యత తగ్గడానికి కారకుడుగా కుర్ర డాక్టర్ పట్ల విముఖత పెంచుకుంటాడు. వాస్తవానికి ఇందులో కుర్ర డాక్టర్ ప్రమేయం ఏమీ ఉండదు. సరీగ్గా అతాకోడళ్ళదీ ఇదే సమస్య.

ఇప్పుడు సూర్యకాంతం గూర్చి రెండు ముక్కలు. సూర్యకాంతం మంచినటి. 1950 లలో కుటుంబ కథలతో తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు ధరించిన సూర్యకాంతం తెలుగు ప్రజల్ని మెప్పించింది. తద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ తరవాత గయ్యాళి అత్తగా ఆవిడకి స్టార్డమ్ వచ్చిపడింది.

1960 ల కల్లా సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్ర ఒక బాక్సాఫీస్ ఫార్ములా అయి కూర్చుంది. సినిమా రచయితలు సులభ సాధనాలని వదులుకోరు గదా! కథా వంటకంలో కూరలో కారం వేసినట్లు.. సూర్యకాంతం పాత్రకి ప్రాధాన్యతనిస్తూ కథలు వండారు. ఈ చర్య సినిమా విజయాలకి బాగానే తోడ్పడింది గానీ, తెలుగు (మధ్యతరగతి) సమాజానికి మాత్రం నష్టం చేకూర్చింది.

మీరు 1960 సినిమాలు చూడండి. ఆ సినిమాల్లో మైనస్ సూర్యకాంతం పెద్దగా కథ ఉండదు. సావిత్రిని ముప్పతిప్పలు పెట్టటానికి దర్శకులు సూర్యకాంతాన్ని వాడుకున్నారు. ఆ రకంగా దుష్టత్వానికి ప్రతీకగా మారిన సూర్యకాంతం పాత్రలు మనకి అత్తల పట్ల భయం, ఏవగింపు కలిగించేట్లుగా చేశాయి. అలా ఒక మంచినటి ప్రతిభావంతంగా పోషించిన పాత్రల వల్ల తెలుగు సమాజంలో సోషల్ డైనిమిక్స్ ప్రభావితం అయ్యాయి.

సినిమా ఒక వినోద సాధనం. సగటు తెలుగు ప్రేక్షకుని చదువు హైస్కూల్ స్థాయి. వీరికి చిరంజీవి ఒక్క గుద్దుతో వందమందికి నెత్తురు కక్కిస్తే చూడ్డానికి కార్టూన్ సిన్మాలా సర్దాగా ఉంటుంది. ఈ నెత్తురు కక్కుడు నిజజీవితంలో సాధ్యమని అనుకునే అమాయకులెవరూ లేరు. 

శాస్త్రీయ సంగీతం నిర్లక్ష్యం చెయ్యబడిందని శంకరశాస్త్రి గొంతు చించుకుని కుంభవృష్టి తెప్పించాడు. సినిమా హాలు బయటకొచ్చిన మరుక్షణం ప్రేక్షక దేవుడు శంకరశాస్త్రి కురిపించిన భోరువర్షాన్ని మర్చిపోయాడు. ఈ శాస్త్రీయ సంగీత గోల చిరంజీవి ఫైటింగులా సినిమా హాలు వరకే పరిమితం. కానీ సూర్యకాంతం పాత్రల ప్రభావం సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది.

అత్తలు ప్రతి ఇంట్లో ఉంటారు. కోడళ్ళు అత్తలో సూర్యకాంతాన్ని దర్శిస్తారు. తలిదండ్రులు కూడా కూతుర్ని కాపురానికి పంపేప్పుడు 'మీ అత్త ముండతో జాగ్రత్త తల్లీ' అని మరీమరీ చెప్పి పంపిస్తారు. ఆ పిల్లకి ఈ హెచ్చరికల్తో టెన్షన్ మరింత పెరుగుతుంది. శత్రుదేశంలోకి అడుగెడుతున్న సిపాయిలా బిక్కుబిక్కున అత్తారింట్లోకి అడుగెడుతుంది.

అత్తకి కూడా కోడలంటే అభద్రత, అనుమానం. 'ఇన్నాళ్ళూ కొడుకు నా సొంతం. ఇవ్వాళ ఈ పిల్లకి కూడా వాటా వచ్చేసింది. నా ప్రాముఖ్యత తగ్గిపోనుందా?' మనసులో బోల్డన్ని సందేహాలు. కోడలి ప్రతి చర్యా నిశితంగా పరిశీలిస్తుంది. కఠినంగానూ ఉంటుంది. తన ప్రవర్తనని జస్టిఫై చేసుకోడానికి సూర్యకాంతాన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటుంది ('నేను' సూర్యకాంతంలా గయ్యాళిని కాదు).

అంటే - అత్తాకోడళ్లిద్దరూ తమకి తెలీకుండానే సూర్యకాంతం ప్రభావానికి లోనవుతున్నారు. తమని తాము స్టీరియో టైప్ చేసుకుని, ఎదుటివారిని కూడా అలానే చూడ్డానికి మైండ్‌ని కండిషన్ చేసుకుంటున్నారు. అందువల్ల ఒకరిపట్ల మరొకరు మనసులో ముందే 'ప్రీ ఫిక్స్' అయిపోయ్యారు. ఇందువల్ల ఇద్దరికీ నష్టమే.

చిన్న ఉదాహరణ. కోడలు ఇల్లు చిమ్ముతుంది. గచ్చుపై ఎక్కడో కొద్దిగా ధూళి ఉండొచ్చు. అది అత్తకి నచ్చదు. చిన్న విషయమే కదాని ఆ పెద్దావిడ ఊరుకోదు. అదేదో పని ఎగ్గొట్టడానికి కోడలు వేస్తున్న ఎత్తుగా భావిస్తుంది. అంచేత కొత్తకోడలుకి పని చేతకాదని తేల్చేస్తుంది. కోడలు ఆ విమర్శని తట్టుకోలేదు (మహామహా రచయితలే విమర్శల్ని తట్టుకోలేరు. ఇంక కోడలు కుంక ఏపాటి!). 'నేను పని బాగానే చేస్తున్నాను. అమ్మ చెప్పినట్లు ఈ ముసల్ది కేవలం తన ఆధిపత్య ప్రదర్శన కోసమే నానా యాగీ చేస్తుంది.' అనుకుని చిటపటలాడిపోతుంది.

నిందితుడికి శిక్ష పడేదాకా నిరపరాధే. మంచిదని నిరూపింపబడేదాకా ఏ అత్తైనా సూర్యకాంతమే. సోషల్ సైకాలజీలో 'ఒబీడియన్స్ కాన్సెప్ట్' అని ఒకటుంది. ఉదాహరణకి జైలు అధికారులు ఖైదీలు తమపట్ల మిక్కిలి వినయంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండకపోతే వారికి కోపం వస్తుంది. అప్పుడు వారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు (అత్యంత క్రూరమైన జైలుహింస గూర్చి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ఒక నవల్లో వొళ్ళు గగుర్పాటు కలిగేట్లు వివరంగా రాశాడు). దీన్నే 'ఏక్టింగ్ ఔట్' అంటారు. ఈ విషయాన్ని సోషల్ సైకాలజిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

వాస్తవానికి జైల్లో శిక్షననుభవించేవారు జైలు అధికారులకి శత్రువులు కారు, అలాగే అత్తాకోడళ్ళు కూడా. వారు మారుతున్న తరాలకి ప్రతీకలైన వేర్వేరు వయసుల స్త్రీలు. ఒకర్నొకరు అనుమానంగా చూసుకోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఐతే సూర్యకాంతం తెలుగువారి కుటుంబ జీవితాల్లో అనుమానాలు రేకెత్తించి సమస్యలు సృష్టించిందని నా అభిప్రాయం.

(photo courtesy :Google)

23 comments:

  1. చాలా బాగుంది. మంచి ఎనాలసిస్ రాశారు రమణగారూ.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ వర్మ గారు.

      నాకీ వ్యాసం రాయడానికి ప్రేరణ మేకప్ లేని సూర్యాకాంతం ఫొటోలు. అవి టపా మొదట్లో, చివరా ప్రచురించాను (సూర్యాకాంతం బోల్డంత బాగుంది కదూ!).

      Delete
  2. నాకు భయం గా ఉంది.. భవిష్యత్తులో నాకూ సూర్యకాతం పూనుతుందంటారా?
    బాగా వ్రాసారండీ

    ReplyDelete
    Replies
    1. మీరు నా టపా చదివారు కాబట్టి భయపడనవసరం లేదు!

      Delete
  3. అత్తా కోడళ్ళ వివాదాలన్నిటికీ తప్పంతా సూర్యాకాంతం మీద వేసేశారు. పాపం సూర్యాకాంతం.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. డాక్టరుగారూ, పాతతరం అత్తాకోడళ్ళ మీద సూర్యకాంతం ప్రభావం ఉండటాన్ని బాగానా విశ్లేసించారు. చాలా బాగుంది. నిజజీవింతంలో‌ సూర్యకాంతమ్మగారు చాలా సౌమ్యురాలూ కలుపుగోలు మనిషీ అనీ మిఖ్యంగా సావిత్రిగారి పట్ల వెఱ్ఱి అభిమానం‌గల వారనీ అందరికీ‌ తెలుసు. అదట్లా ఉంచి ఈ‌ తరం వారికీ‌ సూర్యకాంతమ్మగారి సహజనటనావైదుష్యం పట్ల మంచి అభిమానం ఉంది. మీకూ యెంతో అభిమానం కాబట్టే యీ వ్యాసం వ్రాసారంటాను.

    ReplyDelete
    Replies
    1. అవును. నేను సూర్యాకాంతానికి భీకరాభిమానిని. అందుకే తెలుగు నిఘంటువులో తక్షణమే 'సూర్యాకాంతత్వం' అనే పదం కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నాను.

      Delete
  6. చాలా మంచి ఎనలిటిక్ వ్యాసం.ఇలా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తో కాపురాలు ప్రారంభించబట్టే ఎన్నో సమస్యలు వస్తున్నాయి.తన కూతురు మీది అమితమైన ప్రేమ వల్లనే కావచ్చు కాని ఈ విషయంలో తల్లులు కూతుళ్ళకి చేసే హితబోధలు చాలా వరకూ చెడు ప్రభావాన్ని కలుగ జేసేవి గానే ఉంటాయి.పాపం ఉత్తమ సహజ నటి శ్రీమతి సూర్యకాంతం తన పాత్రల్లో జీవించడంవల్ల,పరోక్షంగానే కానివ్వండి,అత్తా కోడళ్ల మనస్పర్థలకు కారణభూతురాలైదంటారు.కొంత వరకూ నిజమే.కానీ ఈ సమస్య సూర్యకాంతం పుట్టక ముందునుంచీ ఉన్నదే కదండీ.

    ReplyDelete
    Replies
    1. పంతుల గోపాలకృష్ణ రావు గారు,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు. ముందుగా మీరూ, శ్యామలీయం గారు రాసిన విధంగా.. సూ'ర్యా'కాంతంని సూ'ర్య'కాంతంగా సరిచేసుకుంటున్నాను.

      అవును. అత్తాకోడళ్ళ తగాదాలు సూర్యకాంతం కన్నా ముందు నుండే ఉన్నాయి. అలాగే ఈ సమస్య ఒక్క తెలుగువాళ్ళకే పరిమితం కాదు.

      ఈ వ్యాసం రాసేప్పుడు చివర్లో ఒక disclaimer రాద్దామనుకుని మర్చిపోయ్యాను. సైకలాజికల్ థియరీలు అన్నిచోట్లా అప్లై అవ్వవు. మహా అయితే సమాజాన్ని అర్ధం చేసుకోడానికి కొంత సహాయకారిగా ఉండొచ్చు.

      పాత సినిమాల్లో కథ ఉంటుంది. సజీవమైన పాత్రలు ఉంటాయి. మా అమ్మమ్మతో కొన్ని సినిమాలు చూశాను. ఆవిడ ఏ సినిమా చూసినా.. 'సూరమ్మ ఇంట్లో ఇదే కథ కదా! వెంకయ్య మావ పెళ్ళాం కూడా ఇంతే కదా!' అంటూ రన్నింగ్ కామెంటరీ చెబుతుండేది. అంటే పాత తెలుగు సినిమాలలో కొంతమేరకు మన జీవితం రిఫ్లెక్ట్ అయ్యింది. అలాగే ఆ సినిమాలు సమాజంలో కొందరినైనా ప్రభావితం చేశాయని నా అభిప్రాయం.

      నిజం అనిపించే కథలో అంతకన్నా నిజం అనిపించే సూర్యకాంతం వల్ల కొంతమేరకు నష్టం కలిగిందేమోననే ఆలోచనతో ఈ టపా రాశాను. సూర్యకాంతం సినిమాల రచయితలు, దర్శకులు అత్యంత ప్రతిభావంతులన్నది మనం మర్చిపోకూడదు.

      'ఇప్పుడు టీవీల్లో వచ్చే సీరియళ్ళలో కూడా ఇవన్నీ చూపిస్తున్నారు కదా. అవి మాత్రం నష్టం కలిగించవా?' ఏ మాత్రం కలిగించవని నా నమ్మకం. టీవీ అత్తాకోడళ్ళు ప్లాస్టిక్ క్యారెక్టర్స్. వీరికి తెలుగువారి జీవితాలతో సంబంధం లేదు. జనాలు ఏదో ఫ్రీ కాలక్షేపం కోసం చూస్తున్నారే కానీ.. తమని ఆ పాత్రలతో ఐడెంటిఫై చేసుకునే అవకాశం లేదు. ఆ రకంగా టీవీ సీరియళ్ళు హానికారం కాదు.

      తెలుగు టీవీ సీరియల్స్ నేను చూళ్ళేదు. ఏ ఒక్క సీరియల్, సింగిల్ ఎపిసోడ్ కూడా పూర్తిగా చూళ్ళేదు (అప్పుడప్పుడు అమ్మతో కలిసి ఓ పది నిమిషాలు టీవీ చూడంగాన్లే, ఆ శబ్దాలకి తల వాచిపోతుంది). కాబట్టి టీవీ సీరియల్స్ పట్ల నా అభిప్రాయానికి వేలిడిటీ లేదని కూడా మనవి చేసుకుంటున్నాను.

      Delete
    2. @కాని ఈ విషయంలో తల్లులు కూతుళ్ళకి చేసే హితబోధలు చాలా వరకూ చెడు ప్రభావాన్ని కలుగ జేసేవి గానే ఉంటాయి.

      అయితే తల్లి లేని కోడలు ఉత్తమురాలు, కూతురు లేని తల్లి గుణవంతురాలు అంటారా :)

      Delete
  7. ఏమైనా, ఈ ప్రపంచంలో అత్తలు ఉన్నంతవరకు సూర్యకాంతం బతికే ఉంటుంది.

    ReplyDelete
  8. వ్యాసం లో సూర్యకాంతం కి ముందు పార్టు చాలా బావుందండీ, ( ఒక చోట కోడలు బదులు కూతురు అని వ్రాసారు )

    ఇక అన్ని సినిమాలు అలానే రావడానికి కారణం సూర్యకాంతం నటన అని మీరు అనడం లాజికల్ గా సరిపోయినా, కాదని అంతే నమ్మకంగా చెప్పాలనిపిస్తున్నది. సూర్యకాంతం ఫాంటసీ సినిమాల్లో లా ఊహించుకొని నటించలేదు , ఆవిడ నటన తర్వాత ఎక్కువ అవడానికి. సౌందర్య ఉన్నపుడు కుటుంబ కధా చిత్రాలు విరివిగా తీసి ఉండొచ్చు, కాని సౌందర్య మూలాన్నే కుటుంబాలు ఆ సమయం లో అలా ఉన్నాయనడం సరికాదు. రామారావు లేదు కాబట్టి పౌరాణికాలు ఎక్కువ తియ్యరు, కాని రామారావు సిన్మాలులో నటించాడు కాబట్టి జనం లో ఆ రోజుల్లో దైవ భక్తి ఉందా ????

    ఇప్పుడు గయ్యాళి అత్తలు ఎక్కువగా సిన్మాలలో ఉండరు , ఒకవేళ తీసినా వాళ్ళ ప్రవర్తన కి సరియైన కారణం చెప్పి మరీ చూపిస్తున్నారు . కారణం మరీ పైకి గయ్యాళి గా కనిపించే అత్తగార్ల రోజులు పోయాయి .

    మీ ఇంకో పాయింట్ తో కూడా విబెదిస్తున్నాను ఇప్పుడు అత్తగార్ల సమస్య 'ప్రాముఖ్యత' కాదు , సౌకర్యం. ( http://teepi-guruthulu.blogspot.co.uk/2013/04/blog-post_29.html ఈ టపాకు తర్వాతి భాగం లో ఈ కోణాన్ని వివరిస్తాను ఎలాగు )

    @ మంచిదని నిరూపింపబడేదాకా ఏ అత్తైనా సూర్యకాంతమే.

    కాదు, ఇప్పుడు అసలు ఏ అత్తా సూర్యకాంతం కాదు . అలాగే మంచిదని నిరూపించడం కూడా ఏ అత్త విషయంలోనూ సాధ్యం కాదు . మధ్య తరగతి సౌకర్యాల మధ్య.


    మొత్తానికి సూర్యకాంతాన్ని అడ్డం పెట్టుకొని ఎదోలాగ అత్తాకోడళ్ళ గొడవల విశ్లేషణ బండి లాగించేయ్యడానికి పాల్పడ్డారు . మీరు సూర్యకాంతం లేకపోతె ఈ టపా వ్రాయలేరన్న మాట. కాని మా టపాలకి , ఈ గొడవల్ని వివరించడానికి సూర్యకాంతము అస్సలు అవసరం లేదు మరి .:)

    ReplyDelete
    Replies
    1. Mauli గారు,

      కూతుర్ని కోడలిగా మార్చాను. ధన్యవాదాలు.

      మీ పాయింట్ ఒప్పుకుంటున్నాను. కాలం, సందర్భం, పరిస్థితులు చరిత్రని నిర్ణయిస్తాయి. నేన్రాసింది ఇప్పటి పరిస్థితులకి సరిపడుతుందో లేదో ఆలోచించవలసి ఉంది. ఇక సూర్యకాంతం, సౌందర్య, ఎన్టీఆర్ ల గూర్చి మీ అభిప్రాయమే నాది కూడా.

      నా సినిమా నాలెడ్జ్ చాలా పాతది. అలాగే సాహిత్య జ్ఞానం కూడా పురాతనమైనదే. ఈ టపా అంశంతో కొడవటిగంటి కుటుంబరావు ఒక నవల రాశాడు.

      నేను సూర్యకాంతం గూర్చి రాద్దామనుకున్నాను. అద్భుత నటీమణి, గొప్ప వ్యక్తిత్వం.. వంటి పొగడ్తలకి నేను దూరం. కానీ సూర్యకాంతాన్ని గ్లోరిఫై చేస్తూ రాయాలి! ఎలా? ఇదిగో ఇలా!

      సూర్యకాంతం + కుటుంబరావు + సోషల్ సైకాలజీ + అత్తాకోడళ్ళు. అయితే పాళ్ళు సరిపోయ్యాయో లేదో అర్ధం కావట్లేదు!

      (సూర్యకాంతం కోసమే ఈ టపా రాశాను.)

      Delete
  9. డాక్టరుగారూ, నాకు తెలిసి జనం సర్వేసర్వత్రా సూర్యకాంతమ్మగారిని "సూరేకాంతం" అనే పిలిచే వారు. (అలాగే రేలంగి వేంకట్రామయ్యగారినీ రేలంగోడు అనే పిలచేవారు.) అన్నట్లు మా నాయనమ్మగారి పేరు కూడా సూర్యకాంతమ్మే. ఊరి వారు ఆవిడని సూరమ్మగారు అని పిలిచే వారు. ఆ రోజుల్లో‌ సూర్యకాంతం అనే పేరు చాలా మందికే ఉండేదేమో ననిపిస్తుంది. బహుశః సినిమా విలన్ సూర్యకాంతమ్మ గారి ప్రఖ్యాతి పుణ్యమా అని ఆడపిల్లలకు ఆ పేరు పెట్టటం తగ్గిపోయిందని అనుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      మీరు అరుద్ర రాసిన 'సినీ మినీ కబుర్లు' చదివారా?

      'సూర్యకాంతం సుగుణాలు' అంటూ సూర్యకాంతం కబుర్లు ఆసక్తికరంగా రాశాడు ఆరుద్ర. సూర్యకాంతం కాకినాడ సున్నంబట్టీ స్కూల్లో చదువుకుంది. పంతులమ్మని తెగ ఏడిపించేది. 1940 లలోనే సైకిల్ మీద ఊరంతా షికార్లు కొట్టేది.

      అవును. సూర్యకాంతం పేరు తెలుగునాట అప్రకటిత నిషేధానికి గురయ్యింది.

      Delete
  10. అవును. నేను సూర్యాకాంతానికి భీకరాభిమానిని. అందుకే తెలుగు నిఘంటువులో తక్షణమే 'సూర్యాకాంతత్వం' అనే పదం కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. - Me too. :D Wonderful analysis Doctor garu.

    ReplyDelete
    Replies
    1. సుజాత గారు,

      మనం తక్షణం 'సూర్యకాంతం అభిమాన సంఘం'ని స్థాపించేద్దాం. నేను ప్రెసిడెంట్. మీరు సెక్రెటరీ.

      Delete
  11. సూర్యకాంతం పాత్రలను ఒక మూసలో తయారు చేసారు రచయితలు ఆమెను పెడితే గయ్యాళి తనం మళ్లీ ప్రత్యేకముగా నిరూపించనక్కరలేదు!గుండమ్మ ఒక మొండి పాత్ర!ఆడ జగ మొండి పాత్రలలో రాటుతేలి దీటు న టన ప్రదర్శించి దిట్ట అని పేరు పొందింది!సూర్యకాంతం ఒక బ్రాండ్ నేమ్ గా రూపొందింది!అయితే ఆమె లోని potential ను పూర్తిగా ఉపయోగించుకోలేదనే నా అభిప్రాయం!

    ReplyDelete
    Replies
    1. 1950-60 సూర్యకాంతంని నేను అర్ధం చేసుకోగలను (ఇంతకుముందు 'గుండమ్మ' గూర్చి రాశాను). ఆ సినిమాల్లో సూర్యకాంతం క్యారెక్టర్ కి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి.

      అదే సూర్యకాంతంని 'దసరాబుల్లోడు'లో ఎందుకూ పనికిరాని గంపగయ్యాళిగా చూపించారు (హీరో కోసమే సినిమాలు తీస్తే పాత్రలు అలాగే ఏడుస్తాయి).

      Delete
  12. This is an excellent observation.

    ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ వ్యక్తైనా ఒక విషయం అర్ధం చేసుకోవాలంటే.. అతని రెఫరెన్స్ పాయింట్.. "నేను". 'నా'కన్నా డబ్బు ఎక్కువ ఖర్చు చేసేవాడు జల్సారాయుడు.. దుబారా మనిషి. 'నా'కన్నా తక్కువ ఖర్చు చేసేవాడు లోభి.. పిసినిగొట్టు. ఇలా ప్రతి విషయంలోనూ ఈ "నేను" రిఫరెన్స్ గా ఉంటుంది.

    ReplyDelete
  13. doctor garu,
    suryakantham gari original photos chusi chalaa anamdam vesindi, Thank you very much

    ReplyDelete
  14. I want to write that Smt Suryakantam gave wondeful performance as a comedy actoir in Chakrapani movie by Smt Bhanumathi. Her dialogues are excellnt. e.g. ""sagam chalu"" etc/.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.