Friday 24 May 2013

దేశమేరీతిన బాగుపడేను!


వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. చిన్నప్పట్నుండి కలిసే పెరిగారు. కలిసే ఏడో క్లాసు తప్పారు. వారి ఇళ్లూ పక్కపక్కనే.

వీరు రోజూ టీవీలో వార్తలు కలిసే చూస్తారు. ఆపై కలిసే సిగరెట్లు తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు.

"మన దేశపోళ్ళు ఎంత మంచోళ్ళు! ఆ పాకిస్తాన్ సాలాగాళ్ళు మన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నార్రా!"

"అవునవును. మనం ఆ పాకిస్తాన్ని ఆక్రమించేస్తే పీడా ఇరగడవుద్ది."

"దేశంలో మతకలహాలు పెచ్చురేగిపొతన్నాయి."

"అవునవును. సాయిబుల్నందర్నీ పాకిస్తాన్లోకి తరిమిస్తే ఒక పనైపోద్ది."

"దేశంలో మా భాష గొప్పదంటే మా భాష గొప్పదని కొట్టుకు సస్తున్నారు."

"అవునవును. అందుకే భారద్దేశమంతా తెలుగుభాషే మాట్లాడాలని రూలు పెట్టాల."

"ఎదవ నాయాళ్ళు! ప్రాంతం, అసమానత అంటూ తెగ నీలుగుతున్నారు."

"అవునవును. మనూర్ని రాజధాని నగరంగా సేస్తేగానీ సమస్య తీరేట్టు లేదు."

"ఈ కులాల సమస్య కూడా రోజురోజుకీ ఎక్కువైపోతంది. దేశం ఎనక్కిపోతంది."

"అవునవును. తక్కువ కులం నా కొడుకులకి కొమ్ములొచ్చాయి. ఆళ్ళందరికీ ఓటు లేకండా సేస్తేగానీ దారికిరారు."

"పొలం తగాదాలు కూడా ఎక్కువైపోతన్నాయి. లా అండ్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది."

"అవునవును. ఈ ఊరంతా మన పొలమే ఉండాల. అప్పుడే లా ఉంటది, ఆర్డరూ ఉంటది."

"దేశవంతా రాజకీయంగా యిడిపోయింది. ఇది దేశానికి మంచిది కాదు."

"అవునవును. అందుకే దేశవంతా మనోడి పార్టీయే ఉండాల."

"రాజకీయంగా నాయకుల మధ్య కీచులాట దేశానికి మంచిది కాదురా."

"అవునవును. అందుకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా మనోళ్ళే ఉండాల."

"భలే చెప్పావురా! నాదగ్గర సిగరెట్లైపొయ్యాయి. నీదగ్గిరేవైనా ఉన్నయ్యా?"

"నా దగ్గిరా అయిపొయ్యాయిరా. పద! అచ్చయ్య కొట్టు కాడికెళ్లి కొనుక్కొచ్చుకుందాం."

(photo courtesy : Google)

12 comments:


  1. ఈ డాటేరు బాబు గారు ఈ మధ్య దీశం బాగు గురించి విపరీతం గా ఆలోచిస్తా ఉండా రంటే దేశం ఏదో పెద్ద ప్రాబ్లం లో చిక్కు కున్నట్టే నా >?



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      దేశం సంగతేమోగానీ.. నేనే ఏదో ప్రాబ్లంలో చిక్కుకున్నట్లు తోచుచున్నది!

      Delete
  2. రమణ గారు ... బాగుంది అండి.. నిజం గానే ఈరోజుల్లో జనాలు ఇంత మించి ఏమి చెయ్యటం లేదు.. చాల సింపుల్ గా డీసెంట్ గా చెప్పారు:)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ.

      బయటకి పెద్దపెద్ద కబుర్లు చెబుతూ.. 'ఒకేగూటి' పక్షులు ఒకచోటకి చేరినప్పుడు ఇలా సంభాషించుకోవటం మామూలే. ఆ విషయాన్నే సరదాగా, పొట్టిగా రాశాను.

      Delete
  3. గుడిపూడి జంగాల గురించి ఒక సామెతో/నానుడో ఉండాలి.

    వాళ్ళంతా తీరిక వేళల్లో ఊరిబాగు గురించి తెగ మథనపడిపోతూ సమాలోచనలు చేస్తారట, ముష్టియెత్తి తెచ్చుకున్న అన్నం తిన్నాక. మరలా ఉదయమే లేచి ఊళ్ళో‌ పడటం మామూలే భిక్షాన్నం కోసం.

    తీరి కూర్చుని మాట్లాడుకునే వాక్శూరుల గురించి బాగా వ్రాసారు!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      ఒకే ప్రాంతం, కులం వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నప్పుడు వారి 'అసలు' ఆలోచనలు బయటపడుతుంటాయి.

      ఉదాహరణకి.. మా జిల్లాలో చుండూరులో జరిగిన దళిత హత్యలకి సంతోషించిన అగ్రవర్ణ మేధావులు చాలామంది ఉన్నారు (నేను వారివాడిని కాబట్టి నాదగ్గర హాయిగా 'నిజాలు' మాట్లాడేస్తారు).

      ఈ Jekyll & Hyde మేధావులే ఈ టపాకి స్పూర్తి. వారికి నా కృతజ్ఞతలు.

      Delete

  4. శ్యామలీయం వారి 'తీరి కూర్చుని మాట్లాడుకునే వాక్శూరుల' కోవలో బ్లాగులు టపాలు రాసే 'బ్లాగులోళ్ళు' కూడా వస్తారా అని ఈ టపా లో చర్చించ వలసినది గా 'బ్లాగు లోకం లోని 'బ్లాగులోళ్ళ' కి 'పనిలేక' ఇదే మా ఆహ్వానం ! రండి చర్చిద్దాం !!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      చర్చకి స్వాగతం.

      నా బ్లాగు పేరే "పని లేక.. ".

      (ఇంక చర్చింటానికి ఏముందబ్బా!)

      Delete
  5. ఇటువంటి వ్యంగ్యం మీరు భలే రాస్తారు రమణ గారు :-)
    వెరీ వెల్ సెడ్... చాలామంది ప్రజలు కోరుకునే రిఫార్మేషన్ ఇలాగే ఉంటుంది:-)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      (ఇట్లాంటి చిన్నచిన్న వ్యంగ్యకథల్ని కొడవటిగంటి కుటుంబరావు 'గల్పికలు' అని పేరుతో చాలానే రాశాడు.)

      Delete
  6. మళ్లీ మీరెందుకు రాసినట్టో?పొజులా!

    ReplyDelete
    Replies
    1. ఇట్లాంటి వ్యంగ్యం కొకు రాశాడని నేనేగదా చెప్పాను.

      కొకు రాసిన పద్ధతిలో ప్రస్తుత రాజకీయ ధోరణి గూర్చి చిన్న పీస్ రాశాను.

      ఇందులో తమకి కనపడిన పోజులేమిటో!

      (ఏవిటో! నా పేషంట్లు బ్లాగుల్లో కూడా ఉంటున్నారు. నాకు ఇక్కడా తప్పట్లేదు!)

      Delete

comments will be moderated, will take sometime to appear.