ఇది ఒక పైడిరాజు కథ. అప్పుడే పుట్టిన (ఒక గంట వయసులో) పైడ్రాజు మురిక్కాలవ పక్కన ఓ ముష్టి దంపతులకి దొరుకుతాడు. పైడ్రాజు రాకతో ముష్టి దంపతులకి 'రాజయోగం' పట్టింది. వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడే ముష్టి. వీరి ముష్టి భోగానికి కన్నుకుట్టిన ఇంకో ముష్టి జంట నాలుగేళ్ల పైడ్రాజుని దొంగిలిస్తారు.
అయితే ఈ రెండో ముష్టి జంట ప్రధానవృత్తి దొంగతనం. పైడ్రాజు కొత్త తలిదండ్రులు వీధుల్లో అడుక్కుంటూనే దొంగతనాలు చేస్తుంటారు. వీరి మోడస్ ఒపరాండి ఏమనగా.. ఒక వీధిలో 'అమ్మా! లచ్చిం తల్లి, బిచ్చవమ్మా' అంటూ కొడుకుతో తల్లి యాచిస్తుండగా.. తండ్రి వారికి రెండిళ్ళ ముందుగా నడుస్తూ.. తాళం వేసున్న ఇళ్ళ తలుపుల గొళ్లెం క్షణంలో తీసేసి.. అడుక్కుంటూనే ముందుకెళ్తాడు.
"గదిలో కెల్లి గిన్నెలొట్టుకురా!" అని తల్లి పైడ్రాజుని లోపలకి పంపి అడుక్కుంటున్నట్లు బయట కాపలా ఉంటుంది. గిన్నెలు తీసుకొచ్చి తల్లి జోలెలో వేసేవాడు పైడ్రాజు. ఆ విధంగా ముష్టి ముసుగులో దొంగతనాలు చేస్తూ హాయిగా జీవించసాగారు. అందుకే ఎక్కడైనా 'తలుపు గొళ్లెం' చూస్తే పైడ్రాజు కి వళ్ళంతా పులకరింపుల్తో నిండిపొయ్యేది.
ఒకసారి జోలెలో చెంబులతో 'దొంగ' తల్లి పట్టుబడుతుంది. మనిషి కష్టాన్ని దోచుకునే దొంగని ఒక వెర్రి కుక్కని కొట్టినట్లు వాళ్ళంతా తన తల్లిని కళ్ళముందు కొడుతుంటే అతను గజగజ లాడేడు. చిల్లరపాముని వాకిట్లో నిర్దయగా మనుషులు కొడుతుంటే, వాకిట కాలవ కన్నం లోంచి పిల్లల తాచు ఆ దృశ్యం చూసినట్లు, అతను జనాన్ని అతిభయంతోనూ పరమ దుర్మార్గంగానూ చూసేడు. ఆ దెబ్బలకి ఆ మర్నాడు ఆ దొంగ తల్లి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది.
అటు తరవాత నేలమీద ఇళ్ళ బేరం కంటే నీటి మీద ఓడల బేరం ఎక్కువ లాభసాటిగా ఉందని అనుభవం మీద తెలుసుకుని, ఊర్లోంచి హార్బర్లోకి పైడ్రాజు తన సాహస రంగాన్ని మార్చేడు. దొంగతనం చెయ్యడం పైడ్రాజు డ్యూటీ. దొంగసొత్తుని డబ్బుగా మార్చడం దొంగతండ్రి డ్యూటీ.
ఒకసారి హార్బర్లో కొత్త ఓడొకటి వచ్చింది. దాని కడుపు నిండా ఇంగ్లీషు మందులే. పినిసిలిన్ గొట్టాల పాకేజీ పెట్టెల్ని కొట్టుకొస్తాడు పైడ్రాజు. వాటిని ఆప్యాయంగా బిడ్డల్లా కావిలించుకుని,
"ఏ చావుకారు?" అని ప్రశ్నించాడు దొంగకొడుకు.
"మందుల్చావుకారు, ఈ మందుల బేరాలన్నీ ఆడియే!"
'చావుకారు' తో బేరం కుదిరి.. కొత్త కన్నెపిల్లలా కరకరలాడిపొతున్న పది పదుల్ని జోబులో వేసుకుని కులాసాగా ఇంటికెళ్ళిపోయారు తండ్రీకొడుకు.
దొంగ తండ్రికి చాల్రోజులుగా దాంపత్య సుఖం లేని కారణాన.. సంచుల సూరిగాడి కంపెనీలో పాతిక ఖర్చు చేసి అమర సౌఖ్యం అనుభవించీసేడు. తద్వారా పోలీసువారి దృష్టిలో పడి.. ఆర్నెల్లు జైలు చేస్తాడు.
జైల్ల్లోంచి బయటకొచ్చాక 'చావుకారు'ని కలిసి.. సంగతి బయట పెడతానని అతన్ని బెదిరిస్తాడు. షావుకారు భార్య భారీ మెరుపు తీగ. షావుకారు మంచి సరసుడైతే ఆవిడ మంచి సరసురాలు. అతను వేరేగా సరసుడు. ఆమె వేరేవేరేగా సరసురాలు. ఒకరి యెడల ఒకరికి ఉండే కోపాలకే గాని రూపాలొస్తే అవి పులులుగా మారి ఒకదాని మీదొకటి విరుచుకుపడి దెబ్బలాడతాయి. ఆ రోజు షావుకారు ఖూనీ చెయ్యబడతాడు. ఆ కేసులో దొంగ తండ్రి ఇరుక్కుంటాడు.
కోర్టు హాల్లోకి వెళ్ళడం, కోర్టు వ్యవహారం దగ్గర్నుండి చూడ్డం అదే ప్రధమం పైడిరాజుకి.
"ఏటీ ఈ ఓసన?" అనుకున్నాడు.
అది కోర్టు వాసనని అతనికి తెలీదు.
"మద్దినాలపేళ దీపాలెట్టుకున్నారేటి?" అనుకున్నాడు.
ఆ గదులు కట్టినప్పుడే చీకటిగా కడతారని అతనికి తెలీదు.
"ఆలీబాబా చినీమాల్లో దొంగల్లా ఇంతమందున్నారు! ఈళ్ళెవుళ్ళు?" అని ప్రశ్నించుకున్నాడు.
"ఓహో! ఈళ్ళే కావోలు పీడర్లు!" అని సమాధానం చెప్పుకున్నాడు.
జడ్జీ పైడ్రాజు సాక్ష్యం నమ్మడు. జడ్జీగారు చాలా విట్టీగానూ, విపులంగానూ రాసిన జడ్జిమెంటు కొనావరకు అలా మెరుపుతీగలా సాగి, ఆఖర్న దొంగతండ్రికి ఉరిశిక్ష విధిస్తూ భగ్గున ముగిసింది.
పుట్టగానే ఏడ్చేడు. వాతలు వేసిన్నాడు ఏడ్చేడు. తల్లిని కొట్టిననాడు ఆమె చనిపోయిననాడూ ఏడ్చేడు. ఆ తీర్పు రోజున ఏడ్చేడు. ఆ తండ్రిని ఉరితీసిన రోజున ఏడ్చేడు - మరింక జీవితంలో ఏడవకూడదని భీకరంగా నిశ్చయించుకున్నాడు పైడ్రాజు.
అప్పుడు పైడ్రాజు దీర్ఘంగా ఆలోచిస్తాడు. పెద్దల్లా దోచుకుతినడం బెస్టు అన్న నిశ్చయానికి అతను రావడానికి అట్టేసేపు పట్టలేదు.
దోచుకు తినడం బెస్టు!!..
అనేటటువంటి పరమ ఘోరమైన నిశ్చయానికి ఏ మానవుడైనా వచ్చి సాహసంతో రంగంలోకి ఉరికి, మెలకువతో వ్యవహరించి పట్టుదలతో పనిచేస్తే!! - వాణ్ణి మరింక ఆపడం చాలా కష్టం. వాడు చాలా దూరం వెళ్తాడు, చాలా పైకి వెళ్తాడు. పాపభీతి, దైవభీతి, సంఘభీతి, ఏ భీతీ ఉండదు వాడికి. వాడు పెద్దపులిలా ఉంటూనే పరమ ధర్మరాజులా కనిపించగలడు. తన బాగు కోసం వాడు తల్లి గొంతు నొక్కగలడు, తండ్రి వెన్ను పొడవగలడు, తమ్ముడి నెత్తురు తాగ్గలడు. లొంగిన వాళ్ళని వాడు అణుస్తాడు, లొంగని వాళ్ళలో కలుస్తాడు. అవసరం తీరిపోయాక నివురంతా కప్పేసుకుంటాడు. దైవం, ధర్మం, అర్ధం, కామం, సంఘం, స్వర్గం అన్నీ తనకోసమే ఉన్నాయి కాని తనెవరికోసమూ ఉండనంటాడు. చెదలా తినేస్తాడు. పులిలా విరుచుకుపడతాడు. దేశాన్ని అమ్ముతాడు, ధర్మాన్ని చంపుతాడు. వాడు చాలా దూరం వెళ్తాడు.
పైడ్రాజు ఆ తరవాత చాలా మెట్లు పైకెక్కి చాలా దూరం వెళ్ళేడు. బ్యాంక్ లొంచి బయటకొచ్చిన ఒక వృద్ధుణ్ణి హత్య చేశాడు. బంగారం కాజెయ్యడం కోసం ఒక మేస్త్రమ్మని చేరదీశాడు. అవసరం తీరాక ఆమెని తన్ని తగలేశాడు. రిక్షా తొక్కిన పైడ్రాజు టీ కొట్టు, ఆపై ఓటేలు, ఒక ఫేక్టరీ, ఆపై చిన్న కాంట్రాక్టరు.. క్రమేణా అత్యంత ధనవంతుడు ఐపోయ్యాడు.
పైడ్రాజు ఇప్పుడెక్కడున్నాడు?
చాలా దూరంలో ఉన్నాడు.
ఆపై పైడ్రాజు భార్య, కొడుకు గురించి కొంత ప్రస్తావించి కథ ముగుస్తుంది.
(ఎర్రరంగు అక్షరాలు రావిశాస్త్రివి)
1965 లో రాయబడ్డ ఈ కథని మొదటిసారిగా ముప్పైయ్యేళ్ళ క్రితం 'ఋక్కులు' సంకలనంలో చదివాను. ఇప్పటిదాకా మొత్తం ఓ నాలుగైదుసార్లు చదివుంటాను. రావిశాస్త్రిని ఇలా మళ్ళీమళ్ళీ చదవడానికి నాకో కారణం ఉంది. నాకు ఉత్తరాంధ్ర మాండలికం సరీగ్గా అర్ధం కాదు. పైపెచ్చు రావిశాస్త్రి శైలి పదాలని కలిపేస్తూ గమ్మత్తుగా ఉంటుంది. అందుకే నేను రావిశాస్త్రిని మార్కర్ తో అండర్ లైన్ చేస్తూ.. మార్జిన్లో అర్ధాలు రాసుకుంటూ.. ఒక టెక్స్ట్ బుక్ చదివినట్లు శ్రద్ధగా చదువుతాను.
బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంపుటి 'రూపం - సారం' గూర్చి ఇంతకు ముందో టపా రాశాను. ఈ సంపుటిలో 'రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం' అని ఒక వ్యాసం ఉంది. నాకు తెలిసి రావిశాస్త్రిని ఇంత ప్రతిభావంతంగా విశ్లేషించిన వ్యాసం మరొకటి లేదు. "తలుపు గొళ్లంలో కోర్టు వర్ణన చాలా అద్భుతమైనది." అంటూ తన వ్యాసంలో ఈ కథని ప్రస్తావించాడు బాలగోపాల్. చాలామంది విమర్శకుల అభిప్రాయమూ ఇదే.
ఈ కథలో కోర్టుని వర్ణిస్తూ దాదాపు రెండు పేజీలు రాశాడు రావిశాస్త్రి. ప్రతి వాక్యమూ అపురూపమే (కోర్టు వర్ణన టపాకి అనుబంధంగా చివర్లో ఇచ్చాను). తెలుగు భాషలో మరి ఏ ఇతర రచయిత ఇంత అద్భుతంగా ఒక్క వాక్యం కూడా రాయలేడని నా విశ్వాసం. దటీజ్ 'చాత్రిబాబు'! చదివినప్పుడల్లా గొప్ప 'కిక్' వస్తుంది!
ఈ దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని వాదించేవారు ఈ కథ చదివి తీరాలి. ఈ సమాజంలో అన్యాయం ఎంతగా వ్యవస్థీకృతమై ఉందో రావిశాస్త్రి చాలా నిశితంగా చెబుతాడు. మంచి డాక్టర్ రోగాన్ని అసహ్యించుకోడు. రోగ కారణం గూర్చి ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి రోగ నివారణ ఎలాగో తెలుస్తుంది. మంచి రచయిత కూడా అంతే.
రావిశాస్త్రి రచనల్లో రాజ్యాంగ యంత్రం గూర్చి వివరిస్తూ బాలగోపాల్ ఇంకా ఇలా అంటాడు.
'రాజ్యాన్ని గురించీ రాజ్యాంగ యంత్రాన్ని గురించీ వకీళ్ళకి అర్ధమైనంతగా మరెవ్వరికీ కాదేమో! నేరానికీ రాజ్యాంగ యంత్రానికీ మధ్యనున్న సంక్లిష్టమైన పరస్పరత రెండురకాల అమాయకులకి అర్ధం కాదు. అమాయకులైన అమాయకులు (వీళ్ళు మొదటిరకం) నేరాన్ని అరికట్టడం, నిరోధించడం రాజ్యాంగ యంత్రం పని అనుకుంటారు. ఈ కోవకు చెందినవాళ్ళు బడిపంతుళ్ళు, కుర్ర ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు. రెండవ రకంది దుస్సాహసిక అమాకత్వం. రాజ్యాంగ యంత్రం నేరాన్నసలు అరికట్టనే అరికట్టదని, నేరం మీద బలవడమే ప్రభుత్వ 'కార్యనిర్వాహకుల' పని అనీ అనుకుంటుంది. ఈ కోవకి చెందినవాళ్ళు సాధారణంగా కవిత్వం రాస్తారు.'
బాలగోపాల్ రావిశాస్త్రి పరిమితుల గూర్చి కూడా వివరంగా రాశాడు. లంపెన్ వర్గాల జీవితాన్ని ఎంత వాస్తవికంగా చిత్రించినా అది కేవలం వాస్తవిక దృక్పధంగా మాత్రమే మిగిలి పోతుందంటాడు బాలగోపాల్. ఆ రకంగా అంచనా వేసినా.. రావిశాస్త్రి ఎమిలీ జోలా, మొపాసా, చెహోవ్, దోస్తోవస్కీల సరసన ఒక బంగారు పీట వేసి కూర్చోపెట్టేంత గొప్ప రచయిత అని గట్టిగా నమ్ముతున్నాను.
చివరి తోక..
ఈ మధ్య టపాలు రాసే ఉత్సాహం తగ్గిపోయింది. ఇక నా బ్లాగ్జీవితం చరమదశలోకొచ్చిందనే అనుకుంటున్నాను. అయితే మొన్నో పీడకలొచ్చింది. తెలుగు సాహిత్యంలో 'గీకుడురాళ్ళు' రాసిన ప్రముఖ రచయితకి తరవాత రావిశాస్త్రికి అదేదో ఒక పీట (ఇది కూర్చునే పీట కాదు) వచ్చిందిట.
ఆ సందర్భంగా ఓ ప్రముఖ కళాబంధువు.. నిలువెత్తు రావిశాస్త్రి బొమ్మకి సన్మానం చేయుచుండగా.. 'పాడుతా తీయగా' అనే ఓ ప్రముఖ గాయకుడు రావిశాస్త్రి గూర్చి శంకరాభరణం స్టైల్లో పాడుచుండగా.. వందేళ్ళ తెలుగు కథల వందనాలయ్య రావిశాస్త్రి గూర్చి తనకి మాత్రమే సొంతమైన భయానక బీభత్స వాగ్దాటితో కీర్తించుచుండెను.
ఆ దృశ్యము గాంచి.. భీతి చెందాను, వణికిపొయ్యాను, తల్లడిల్లిపొయ్యాను, దుఃఖించాను. ఫినాయిల్ తో నోరు పుక్కిలించినట్లుగా, గజ్జికుక్క చెక్కిలి నిమిరినట్లుగా, చెవిలో పిశాచాలు పాళీ భాషలో పాట పాడుతూ.. మెదడు పీక్కు తింటున్నట్లుగా అనిపించింది.
ఒక్కసారిగా మెళకువొచ్చింది. మనసంతా దిగులుగా అనిపించసాగింది. తెల్లవారు ఝాము కలలు నిజమవుతాయంటారు. ఏమో! గురజాడ, శ్రీశ్రీలకి లేని రక్షణ రావిశాస్త్రికి ఎక్కణ్నుంచి వస్తుంది? నా పీడకలకి విరుగుడుగా ఏదైనా ఓ రావిశాస్త్రి కథపై టపా రాసి ప్రక్షాళన చేద్దామనిపించింది. ఆ ఫలితమే ఈ పోస్ట్.
ఏ దేశంలోనైనాసరే ఎక్కడైనాసరే ఏ ఖుషీ కుర్చీల్లో ఎంత గంభీరంగా ఉండ ప్రయత్నించినాసరే నునుమెత్తని పులుల్లా ఉంటారు. అందమైన తోడేళ్ళలా ఉంటారు. లేదా దుక్కబలిసిన గుంటనక్కల్లా ఉంటారే తప్ప జడ్జీలెవరూ దయగల మనుషుల్లా ఉండరు (అనిన్నీ);
ఏ దేశంలో ఎక్కడికి వెళ్లి చూసినాసరే, సరసరలాడే తాచులాగో పడగెత్తిన నాగులాగో లేక తోక మీద నిలబడి నడిచే జెర్రిపోతులాగో ఉంటాడే తప్ప ఏ ప్లీడరూ కూడా మనిషిలా మాత్రం ఉండడు.. ఛస్తే ఉండడు (అనిన్నీ);
ఏ దేశంలో ఏ మారుమూల ఏ కోర్టుకి వెళ్లి చూసినప్పటికీ అక్కడ కనిపించే పోలీసులూ బంట్రోతులూ గుమాస్తాలూ అంతా కూడా పీడించడానికి యముడు పంపిన స్పెషల్ టైపు పిశాచాల్లా ఉంటారే తప్ప మనుష్యుల్లా కనిపించరు, మనుషుల్లా ప్రవర్తించరు (అనిన్నీ);
ఏ దేశంలోనైనాసరే ఎంత ఉన్నత న్యాయస్థానమైనాసరే దాని ఆవరణలో ఎంత మంచి పూలమొక్కలు పెంచినా వాటికి విషపుష్పాలు తప్ప వేరేమీ వికసించవు (అనిన్నీ);
అక్కడ ఎంత మంచి చెట్టు ఎంత బాగా ఎదిగినప్పటికీ ఆకొక నాలికగా గల వింత రాక్షసిలా ఉంటుంది తప్ప చల్లని చెట్టులా ఉండదు (అనిన్నీ);
అక్కడ ఏ పచ్చని తీగె సాగినా అది పసిరికపాములా ఉంటుందే తప్ప నును లేత పూతీగెలా ఉండదు (అనిన్నీ);
అక్కడ పచ్చటి పచ్చిక పరిస్తే అది పచ్చటి నివురుగప్పిన నిప్పుల తివాచీలా ఉంటుందే తప్ప మరో విధం గా ఉండదు (అనిన్నీ);
అక్కడ మానస సరోవరంలాంటి మంచినీటి చెరువు తవ్వితే అది అభాగ్యుల్ని మింగేసే ముసలి మొసలి గొయ్యిగా కుంచించుకుపోతుందే తప్ప చెరువుగా నిలవదు (అనిన్నీ);
అన్నెంపున్నెమెరుగని అమాయకపు చిలకల్ని అక్కడికి తెచ్చి పెంచితే అవి అక్కడ గెద్దలుగా ఎదుగుతాయి, చిలకలనే చంపుతాయి (అనిన్నీ);
అక్కడ తెల్లని మల్లెపూల మనసులు నాటితే అవి బ్రహ్మజెముడుడొంకలు గా ముళ్ళుముళ్ళుగా చావుచీకటిగా పెరుగుతాయి (అనిన్నీ);
నాలికలతో నిజం తప్ప వేరేదీ ముట్టని వారికి అక్కడికి వచ్చీ రాగానే వెయ్యి విషజిహ్వలొస్తాయి (అనిన్నీ);
అక్కడ చల్లటి నీడ ఉన్నప్పటికీ అది ఎండని మింగిన కొండచిలవలా ఉంటుందే తప్ప, తాపమార్చి ప్రాణమిచ్చే నీడలా ఉండదు (అనిన్నీ);
అక్కడ ఎండ ఉన్నప్పటికీ అది నీడని చంపి నిప్పులు చిమ్మే రక్కసి డేగలా పెనురెక్కల విసురులా ఉంటుందే తప్ప, దివాకరుని దివ్యాతి దివ్యమైన అనుగ్రహం లా ఉండదు (అనిన్నీ);
అక్కడ భగవంతుడు పుట్టించిన దేదీ భగవంతుడు పుట్టించినట్టుగా ఉండదు (అనిన్న్నీ);
అక్కడ దేముడే వెలిస్తే అతను ఠారున చచ్చి అక్కడ తప్పక దెయ్యమే అవుతాడు (అనిన్నీ);
ఏ దేశంలో ఏ కోర్టులో అయినా సరే తడిగుడ్డలు చల్లగా గొంతుకులు పిసుకుతాయి ప్రాణాలు తీస్తాయి తప్ప బాహాటంగా కత్తులు రాపాడవు గదలు ఢీకోవు (అనిన్నీ);
ఏ దేశంలో ఏ కోర్టులో ఎవరు నవ్వినప్పటికీ ఆ నవ్వు రాక్షస వృశ్చికాలు తోకలతో నవ్వినట్లుంటుందే కాని మానవత్వాన్ని సూచించే మనిషి నవ్వుగా సహజంగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండదు (అనిన్నీ);
ఏ దేశంలో ఏ కోర్టయినా సరే అది ఎంత చక్కగా ఎంత మంచి పాలరాతితో ఇంద్రభవనంలా స్వర్గహర్మ్యంగా మలిచినప్పటికీ అది వెన్వెంటనే గుండె లేని గోరీగా మారితీరుతుంది (అనిన్నీ);
ఆ కోర్టు ఎంత "కళ"గా ఉన్నప్పటికీ ఎప్పుడూ తొడతొక్కిడిగా శవాల హడావిడిగా ఉండే శ్మశానంలా ఉంటుందే తప్ప ఇంకో విధంగా ఉండదు (అనిన్నీ);
ఏడ్చే దౌర్భాగ్యులు తప్ప అక్కడ వేరెవరూ మనుషుల్లా ఉండరు (అనిన్నీ);
హమ్మయ్యా,
ReplyDeleteఅజ్ఞ్యాతం వీడి మా ఆనందకేంద్రాలను త్రుప్తి పరచినందుకు thanks.
అజ్ఞాతం ఏమీ లేదులేండి. బ్లాగులు రాయడం కొంత తగ్గించాను. అంతే.
Deleteenti sir eennalu emi aipoyaru sir
ReplyDeleteకొన్నాళ్ళపాటు నెట్ కు దూరంగా ఉన్నాను. హాయిగా ఉంది.
Deleteన్యాయ వ్యవస్థను అనుమానిస్తారా ? అంటూ రాజకీయ నాయకులు అన్నప్పుడు .. నాకు తెలిసిన కొన్ని విషయాలు గుర్తుకు వచ్చి నవ్వు కుంటాను .. ఆ మాటలు విన్నప్పుడు రావి శాస్త్రి రాసిన ఈ వాఖ్యలు చదవడానికి మించిన ఉపశమనం లేదనిపిస్తుంది
ReplyDeleteరాజకీయ నాయకులు మనల్ని ఏమార్చడానికి అలా అంటుంటార్లేండి!
Delete(బాలగోపాల్ చెప్పిన 'అమాయకులైన అమాయకులు' నిజమే కాబోలనుకుంటారు.)
>>దోచుకు తినడం బెస్టు!!..
ReplyDeleteఅనేటటువంటి పరమ ఘోరమైన నిశ్చయానికి ఏ మానవుడైనా వచ్చి సాహసంతో రంగంలోకి ఉరికి, మెలకువతో వ్యవహరించి పట్టుదలతో పనిచేస్తే!! - వాణ్ణి మరింక ఆపడం చాలా కష్టం........
ఆహా ! భవిష్యత్తును ఆనాడే ఇంత ఖచ్చితంగా చెప్పినందుకు పీఠం కాకపోయినా విగ్రహమైనా పెట్టించాలని నా కోరికండీ, ఈ విషయంలో సుబ్బు ఏమైనా సహాయానికి వస్తాడేమో కనుక్కుంటారా.
మనవాళ్ళు విగ్రహాల విషయంలో చాలా ఫాస్ట్. ఆల్రెడీ రావిశాస్త్రికి విశాఖలో విగ్రహం పెట్టేశారు.
Delete'పాపం రావిశాస్త్రి!'
ఈ పోస్టు ని రెండు మూడు పోస్టులు గా విడతీసి వ్రాస్తే బాగుండేది. ఒకప్పుడు మీరు రవి శాస్త్రి గారి కధల పరిచయానికి ఈ బ్లాగ్ పెట్టాను అన్నట్టు గుర్తు. మధ్యలో చాలా చోట్లు దర్శించారు. ఏమయినా గానీ రవి శాస్త్రి గారి కధా పరిచయం బాగుంది.
ReplyDeleteఅవును. నిడివి ఎక్కువయింది. అయినా.. కథాపరిచయాన్ని ముక్కలుగా విడగొట్టడం ఇష్టం లేకపోయింది.
Delete>> ఈ మధ్య టపాలు రాసే ఉత్సాహం తగ్గిపోయింది. ఇక నా బ్లాగ్జీవితం చరమదశలోకొచ్చిందనే అనుకుంటున్నాను
ReplyDeletePlease do *NOT* stop writing under any cost. Your blogs are most welcome and well read. Take a break but do NOT stop. Thanks
థాంక్యూ!
Deleteఇటువంటి కామెంట్లు చదువుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తప్పకుండా రాస్తాను.
అయితే నా బ్లాగ్ వల్ల నాక్కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి.
ముఖ్యమైన సమస్య.. ఫోన్లు. మొబైల్ అయితే ఇబ్బంది లేదు. unknown numbers నేను ఎలాగూ రిసీవ్ చేసుకోను. అయితే కొందరు land lines కి కాల్ చేసి టపాల గూర్చి మాట్లాడుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
మీకు నా పోస్ట్ నచ్చితే ఒక కామెంట్ రాయంది. సంతోషిస్తాను. అంతేగానీ దయచేసి నాకు phone చేయకండి.
ఇది నా వినయపూర్వక విజ్ఞప్తి. మన్నించగలరు.
టపాల గురించి మాట్లాడుతున్నారా లేక పోట్లాడుతున్నారా !! మొత్తానికి ఈ ఒక్క వ్యాఖ్యతో బాగా నవ్వించారు
DeleteThis can be solved easily with an answering machine :-) On the first ring direct it to answering machine to filter it with a message like "If you are calling to talk about my telugu blog, sorry please hang up! Otherwise please press the given code" and supply the code only to those who are required to call.
DeleteProblem solved. BTW how did you phone came to be so well known for bloggers without your knowledge?
@DG
Deleteఇది బ్లాగ్ పబ్లిసిటీ లా ఉంది, మామూలుగా ఫోన్ చేసే వారు కూడా మానేస్తారు ;-)
ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. నాకు ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళకి అర్ధమయ్యే ఉంటుంది.
Delete
ReplyDeleteడాక్టర్ గారూ,నేను కొంచెం విభేదిస్తున్నాను.రా.వి.శాస్త్రి గారు నాకు కొంచెం తెలుసును.నేను కూడా ఆయన రచనలని అభిమానిస్తాను.కాని ఒకొకసారి వర్ణనలకోసమే వర్ణిస్తూపోతారని,అతిశయోక్తులు కూడా ఎక్కువని నా అభిప్రాయం.మన వృత్తిమీద కూడా విమర్శలు ఉన్నప్పటికీ,కొందరు కొంత అవాంఛనీయమైన చర్యలు చేస్తున్న ఉదంతాలు ఉన్నప్పటికీ,మనకి మన వృత్తి మీద అభిమానం ఉంటుంది.మనండాక్టర్లమైనందుకు గర్విస్తాము.శాయశక్తులా రోగి మేలు గురించే ఆలోచిస్తాము. మరి లాయర్లకి ,న్యాయమూర్తులకీ వారివారి వృత్తులమీద గౌరవం ఉండదా?కోర్టుల ఆవరణలో అన్ని వస్తువులూ,అన్ని విషయాలూ,అందరు మనుష్యులూ,భయంకరంగా,రాక్షసంగా,విషప్రాయంగా ఉన్నట్లు ఆయనకనిపిస్తే,ఆయన కూడా ఒక లాయరుగా అందులో భాగం కాదా?అంతగా ఆవృత్తినీ,వాతావరణాన్నీ ఆయన ద్వేషిస్తే అందులో ఎందుకు ఉన్నట్టు?నిజాయతీగా,వేరే వృత్తిని చేబట్టి ఉండవచ్చును కదా?పోలీసులు,లాయర్లు, ఎక్కువగా నేరస్తులు,నేరప్రవృత్తి కలవారితో డీల్ చేయవలసివస్తుంది.అందువలన ఆయనకలాంటి ఆలోచనలు వచ్చి ఉండవచ్చును.కాని లీగల్ వృత్తి కూడామంచిదే అని నా అభిప్రాయం.లేకపోతే ,సమాజం ఇంకా అల్లకల్లోలమైపోతుంది.
కమనీయం గారు,
Deleteవ్యాఖ్యకి ధన్యవాదాలు.
>>ఒకొకసారి వర్ణనలకోసమే వర్ణిస్తూపోతారని,అతిశయోక్తులు కూడా ఎక్కువని నా అభిప్రాయం.<<
మీ అభిప్రాయమే చాలామంది విమర్శకుల అభిప్రాయం. అది వాస్తవం కూడా అయ్యుండవచ్చు. (అయితే నాకు అవే చాలాచాలా ఇష్టం.)
>>కోర్టుల ఆవరణలో అన్ని వస్తువులూ,అన్ని విషయాలూ,అందరు మనుష్యులూ,భయంకరంగా,రాక్షసంగా,విషప్రాయంగా ఉన్నట్లు ఆయనకనిపిస్తే,ఆయన కూడా ఒక లాయరుగా అందులో భాగం కాదా?<<
రావిశాస్త్రి కోర్టు గూర్చి చేసిన వర్ణన ఆయన రాజకీయ విశ్వాసంపై ఆధారపడి ఉంది. ఆ వ్యవస్థలో ఆయన కూదా ఒక భాగం కనుకనే అంత చక్కగా రాయగలిగాడు.
ఎవరికైనా వృత్తులు, ఉద్యోగాలు పొట్టకూటి కోసమే. వాటిని ప్రేమించాలని లేదు.
('స్పార్టకస్' అనే కలం పేరుతో ఓ పోలీసు కానిస్టేబుల్ పోలీసు వ్యవస్థలోని అమానవీయ కోణాన్ని గొప్పగా ఆవిష్కరించాడు.)
>>మనండాక్టర్లమైనందుకు గర్విస్తాము.శాయశక్తులా రోగి మేలు గురించే ఆలోచిస్తాము.<<
ఒప్పుకుంటున్నాను. అయితే కొందరికి ఈ వైద్య విద్య, ఆరోగ్య రక్షణ వ్యవస్థ మీద తీవ్రమైన అసంతృప్తి ఉండొచ్చు. వారు ఆ విషయాన్ని (ప్రతిభావంతంగా) ప్రపంచానికి తెలియజేస్తే మనం ఆహ్వానించవలసిందే గదా.
కమనీయం గారు
ReplyDeleteడాక్టర్ల గురించి నాకు తెలీదు . డబ్బు తీసికొన్నా వ్రుత్తి పై అభిమానం బానే ఉండి ఉండాలి. వృత్తి పై అభిమానం లాయర్లకీ, న్యాయమూర్తులకి ఎక్కువగా మిగిలిన వారికి ఒక స్థాయి వరకు తగ్గిందనే అనాలి. లాయర్లు కాస్త ముందు ఆ దారిలో వెళ్ళారు. న్యాయం కన్నా ఖరీదైన సేవ ఆరోగ్యం, రక్షణ లో కూడా లేవు. కాబట్టి రావిశాస్త్రి గారి వర్ణనలో పెద్దగా అతిశయోక్తి లేదు. కేవలం నోటరీ కోసం కోర్టు ముందరకు వెళ్లి చూస్తేనే అక్కడి వాతావరణం భయంకరంగా,రాక్షసంగా,విషప్రాయంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
రమణ గారు,
ReplyDeleteరావి శాస్రి గారు వాస్తవికతకు దూరం గా రాశారేమో అని అనుమానం వేసింది. ఆయన రాసిన వర్ణలను చదివితే, పాఠకులు కోర్ట్ లో వాదోపవాదాలు జరిగి, కథలో లాగా చాలా త్వరగా తీర్పులు వస్తాయేమో అని అనుకోవచ్చు. న్యాయవాదులు వాదించటం కన్నా, వాయిదా వేయటానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని ఎక్కడా రాసినట్ట్లుగా కనపడటం లేదు.
మీరు రావిశాస్త్రి గూర్చి బాలగోపాల్ రాసిన వ్యాసం చదివారా? చదవనట్లయితే చదవండి.
Deletehttp://balagopal.org/wp-content/uploads/2012/01/5.RUPAM-SARAM.pdf
*మీకు నా పోస్ట్ నచ్చితే ఒక కామెంట్ రాయంది. సంతోషిస్తాను. అంతేగానీ దయచేసి నాకు phone చేయకండి. *
ReplyDeleteమీరిచ్చిన సమాధనం చదివి లవంగం గారు గుర్తొచ్చారు. కావాలంటే ఎప్పుడైనా పారిస్ కి రండి మాయింటికి రాకండి :) :)
http://www.youtube.com/watch?v=Xk8o19udifc 2:02 min
డాక్టరు గారు నేను ఈ మధ్య "మానసిక వ్యాధులు" మీద డాక్టర్ మురళీ కృష్ణ గారి సెమినార్ కి వెళ్లాను. ఆయన వైజాగ్ మెడికల్ కాలేజీ నుండి. ఒక్లోహోమా సిటీ లో మానసిక వైద్యులు. వారు మానసిక వైద్యం మీద ఒక పుస్తకం వ్రాశారు. మె 15, 16 తేదీలలో Amazon నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ ఉపయోగపడుతుందని మీ పోస్ట్ లో కామెంట్ పెడుతున్నాను. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.
ReplyDeleteSubject: Fwd: From Dr. Krishna -- Free two day download of my book "VIBRANT" on Amazon
Dear Rajagopal, Subbarrao Garu and Ram,
I want to share the good news of the special 2day free download of my book on Amazon tomorrow and Thursday. I would like you to share this with all of our AMCANA graduates and other friends so they may take advantage of this. We have donated all the proceeds of this book to the Integris Foundation to Eliminate the Stigma of Mental Illness efforts.
I sincerely appreciate all of your good work very day that makes a huge difference in the lives of many.
Murali
Greetings:
I appreciate all you have done to help support my new book, VIBRANT To Heal and Be Whole From India to Oklahoma City!
Sales of the book have been going very well and I have received outstanding feedback from many people but my desire is to share it with even more people. My publisher and I have arranged a promotion with Amazon to make the electronic book free for anyone to download on May 15th and 16th.
Would you help me spread the word about the free book to people around the state and beyond? There are three ways - please do as many as you can.
// తెలుగు సాహిత్యంలో 'గీకుడురాళ్ళు' రాసిన ప్రముఖ రచయితకి తరవాత రావిశాస్త్రికి అదేదో ఒక పీట (ఇది కూర్చునే పీట కాదు) వచ్చిందిట.//
ReplyDeleteఇలా విమర్శించడం సబబేనంటారా ?
నామటుకు నాకు సబబే.
Delete(నాకీ అవార్డుల పట్ల చాలా హీనమైన అభిప్రాయం ఉంది.)
సర్, రావిశాస్త్రి గారు అప్పుడు ఏ కోర్టుల్లో ఏ పరిస్తితి ఉందో ఈనాడు అదే విధంగా ఉంది. ఏ మాత్రం మార్పు రాక పోగా ఇంకా అధ్వాన్నంగా తయారు ఐంది.ఉదాహరణకు జయలలిత కేసే.
ReplyDelete