Friday 26 July 2013

మిస్సమ్మ.. నిజంగా గొప్పసినిమానేనా?

హెచ్చరిక :

మిస్సమ్మ సినిమా వీరాభిమానులు ఈ టపా చదవకపోవటం ఉత్తమం. చదివినట్లైతే మీ మనోభావాలు దెబ్బతినొచ్చు.

'చదవొద్దని చెప్పావు కాబట్టి తప్పకుండా చదువుతాం. అంతేకాదు.. మిస్సమ్మపై తేడాగా రాస్తే నీ సంగతీ తేలుస్తాం.' అనేట్లయితే మీ ఇష్టం.

(ఇదంతా మీచేత ఈ టపా చదివించేందుకు ప్రభాకర్రెడ్డి స్టైల్లో నే పన్నిన కుట్ర!)


ముందు మాట ;

'మొన్న దేవదాసుని విమర్శిస్తూ 'దేవదాసు' వేదన - తెలుగువారి రోదన అంటూ రాశావు. ఇవ్వాళ మిస్సమ్మ గూర్చి రాస్తున్నావు. ఎంత 'పని లేక.. ' పొతే మాత్రం మరీ ఇంత అరాచకమా! గొప్ప సినిమాలని తిట్టినంత మాత్రాన గొప్పవాడవైపోవు. పన్లేకపోతే పెద్దలు తీసిన కళాఖండాల్ని శ్లాఘించు, స్తుతించవోయ్! అంతేగానీ తెగనాడకు. నీ ధోరణి చాలా తప్పు.' అనుకుంటున్నారు కదూ!

(మీరెట్లాగూ ఇలాగే అనుకుంటారని.. నాకు నేనే అనేసుకుంటున్నాను).

అయ్యలారా! అమ్మలారా! నా అభిప్రాయమేమనగా మనం ఉత్తమ సినిమాలనే మైక్రోస్కోపిక్ గా పరీక్షించాలి. అందుకే మిస్సమ్మని చూసీచూసీ అరిగిపోయిన కళ్ళతో కొన్ని 'మిస్సమ్మ ఆలోచనలు' రాస్తున్నాను. మిస్సమ్మేమీ ఆషామాషీ సినిమా కాదు. విజయావారి సినిమా. చక్రపాణి మానస పుత్రిక. ఎల్వీప్రసాద్ అంతటి ఘనుడు దర్శకత్వం వహించిన సినిమా.


Introduction :

ముందుగా మిస్సమ్మ సినిమా గూర్చి రెండు ముక్కలు. మిస్సమ్మ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. మిస్ మేరీని ఎన్నోయేళ్ళుగా తీవ్రంగా ప్రేమిస్తున్నాను. నాకు మేరీ ఎందుకంతగా ఇష్టమో వివరిస్తూ ఇంకో టపా రాస్తాను (అదంతా ఓ పెద్దకథ).

తెలుగులో వచ్చిన మంచి సినిమాల్లో నిస్సందేహంగా మిస్సమ్మ కూడా ఒకటి. అయితే మిస్సమ్మ సినిమా గూర్చి critique ఎవరూ రాసినట్లు లేదు. కారణం ఏమైయ్యుండొచ్చు? తెలుగు సినీ విమర్శకులు మర్యాదస్తులు. మొహమాటస్తులు. ఇంకో కారణం.. అందరూ మెచ్చుకున్న సినిమానో, పుస్తకాన్నో కొంచెం విమర్శనాత్మకంగా రాస్తే తెలుగు పత్రికలు ప్రచురించవు (పత్రికలవాళ్ళు వివాదాల జోలికి పోరు).

అయితే నన్ను ఆశ్చర్యపరిచింది.. అటువంటి ప్రయత్నం తెలుగు బ్లాగుల్లో కూడా జరక్కపోవడం. సినిమాలేమీ మతగ్రంధాలు కాదుగదా! ఎంత గొప్పరచనైనా, సినిమానైనా అక్కడక్కడా కొన్నిలోపాలు కలిగుండొచ్చు (కనీసం అవి లోపాలుగా మనకి అనిపించొచ్చు). ఆ అంశాలని చర్చకి పెట్టవచ్చు. నిజానిజాలు తేల్చుకోవచ్చు. కాబట్టి ఇవ్వాళ మిస్సమ్మ గూర్చి రాసే పవిత్ర కార్యాన్ని తలకెత్తుకుంటున్నాను. ఆశీర్వదించండి.

'కథా మిస్సమ్మ' లోపాలు :

ఇప్పుడు కొద్దిసేపు మిస్సమ్మ 'కథ' గూర్చి మాట్లాడుకుందాం. మిస్సమ్మ సినిమాకి మాతృక ఒక బెంగాలి కథ (మంచి కథలు బెంగాలీలోనే దొరుకును). ఈ కథకి సెంట్రల్ పాయింట్ నిరుద్యోగులైన హీరోహీరోయిన్లు ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నటించడం (అందునా వారిద్దరూ భిన్నమతాలకి చెందినవారు). ఆశ్చర్యంగా ఉంది కదూ? 1950 ల మాట అటుంచండి.. ఈ రోజున కూడా ఇట్లాంటి సంఘటన ఊహించలేం.

జమీందార్లు కర్కశంగా శిస్తు వసూళ్లు చేసుకుంటూ సంపద పెంచుకునే యావలో ఉంటారనే అభిప్రాయం నాకుంది. నేనెప్పుడూ జమీందార్లని చూళ్ళేదు (నా అభిప్రాయానికి ఆధారం దాశరధి రంగాచార్య రచనలు, రోజులు మారాయి వంటి సినిమాలు). మిస్సమ్మ కథలో జమీందారు ఒట్టి వెర్రిబాగులవాడు. చాదస్తుడు. తెలుగుదేశంలో ఇట్లాంటి అమాయక జమీందారు ఉన్నట్లు దాఖలా లేదు (వంగదేశపు జమీందార్లు మంచివాళ్ళు. దేవదాసు కథలో పార్వతి ముసలి మొగుడు కూడా 'మంచి' జమీందారే).

ఈ కథ అల్లుకొన్న ముఖ్యమైన పాయింటే (కనీస స్నేహం కూడా లేని స్త్రీ పురుషులు ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నటించడం) బలహీనమైనది. మనం అర్ధం చేసుకోలేనిది. ఇంక మిగిలిన విషయాల జోలికి పోవాల్సిన అవసరం ఉందా? ఈ కథలో అసహజత్వం కోసం వెదకే కన్నా సహజత్వం కోసం వెతకడం సులువైన పని.

- మోసాలు చేసే ముష్టివాడికి హీరో తన అసిస్టెంట్ పోస్టిచ్చి ఊరికి తీసుకెళ్లడం..

- డిటెక్టివ్ నంటూ జోకర్లా ప్రవర్తించే (జమీందారు) మేనల్లుడు..

- సంగీతం నేర్పించమంటూ వెంటబడే బుర్ర తక్కువ (జమీందారు) కూతురు..

- టీచరమ్మకి సీమంతాలు చేసి ముచ్చట తీర్చుకునే వెర్రిబాగుల (జమీందారు) భార్య..

ఏవిటో! అన్నీ eccentric characters తో జంధ్యాల మార్కు కనిపిస్తుంది కదూ! రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలా కూడా ఉంది కదూ! అవును. మిస్సమ్మ కథ కేవలం హాస్యం కోసం రాసుకున్న కథ. అందుకే మిస్సమ్మ కథలో బూతద్దంతో వెదకినా లాజిక్ కనబడదు. ఇక్కడితో మిస్సమ్మ కథ గూర్చి నే రాద్దామనుకున్నా ఆలోచనలు సమాప్తం.


'సినిమా మిస్సమ్మ' లోపాలు :

ఇప్పుడు మిస్సమ్మ సినిమాలోకొద్దాం. ఈ సినిమా టైటిల్ మిస్సమ్మ. అయితే దర్శకుడు మిస్సమ్మ పాత్రలో consistency చూపడంలో విఫలమయ్యాడు. తెలుగులో ఎంతో పాపులర్ అయిన ఒక సినిమాలో, అంతకన్నా ఎక్కువగా పాపులరైన ఒక ప్రధాన పాత్ర characterisation లోపాల్ని ఎవరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం.

మిస్ మేరీకి తన మతం అంటేనే గురి. ఆ విషయం మేరీ స్పష్టంగానే చెబుతుంది. మంచిది. ఎవరి మతవిశ్వాసాలు వారివి. తమ క్రైస్తవ మతం మాత్రమే గొప్పది అని నమ్మే వ్యక్తులు నాకు తెలుసు. వీరు హిందూ సాంప్రదాయాలకి వందమైళ్ళ దూరంలో ఉంటారు. ఉదాహరణకి.. వీరు ఎంత ఆకలిగా ఉన్నా హోటల్లో ఇడ్లీ కూడా తినరు (కొబ్బరి పచ్చడిలోని కొబ్బరి.. హిందూ దేవుళ్ళ ప్రసాదంతో చేసిందేమోనన్న భయం కారణంగా). వీరిలో పాడగలిగిన వ్యక్తులు చర్చిల్లో యేసుక్రీస్తు భక్తి పాటలు మాత్రమే పాడుతుంటారు. అంతే.

అయితే మన మిస్సమ్మ సినిమాలో మిస్ మేరీ త్యాగరాజ కృతి పాడటమే కాదు.. శాస్త్రీయ సంగీతం నేర్పించేంత స్థాయిలో ఉంటుంది! త్యాగరాజ కృతి పాడగలిగినంత పరిజ్ఞానం ఉన్న మేరీకి.. మరి రుక్మిణి, సత్యభామలు ఎవరో తెలీదు! అలాకాకుండా పార్కులోనే ఎం.పి.రావుతో 'నాక్కూడా మీలాగే మతాల పట్ల అంత పట్టింపు లేదు.' అని ఒక్క మాట చెప్పించేస్తే బాగుండేది. అప్పుడు మేరీ బొట్టు పెట్టుకోటాన్ని కూడా అర్ధం చేసుకునేవాళ్ళం.

మిస్సమ్మ కేవలం ఒక కామెడీ సినిమా మాత్రమేనా? :

సాధారణంగా ఒక కామెడీ సినిమా ఎంత సూపర్ హిట్ అయినా.. హాల్లో ఉన్నంతసేపూ మనసారా నవ్వుకుని.. ఆ తరవాత మర్చిపోతాం. కామెడీ సినిమాలైనా.. సమాజంలో తారసపడే సజీవ పాత్రలు, మనసుకి హత్తుకుపోయే ఉదాత్త సన్నివేశాలతో ఉన్నప్పుడు.. ఆ సినిమాలకి ఒక iconic status వస్తుంది. ఉదాహరణగా చార్లీ చాప్లిన్ సినిమాలు చెప్పుకోవచ్చు.

ఈ రకంగా చూస్తే మిస్సమ్మ చిత్రంలో తమ జీవితాలని ఐడెంటిఫై చేసుకోటానికి తెలుగువారికి ఒక్క పాయింట్ కూడా లేదు. ఏవేవో పాత్రలు వస్తుంటాయ్. నవ్వు తెప్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రవర్తిస్తుంటాయ్. మరైతే తమ జీవనానికి ఏ మాత్రం సంబంధం లేని పాత్రలు, సన్నివేశాలతో తీసిన సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం ఎందుకు పట్టారు?


మిస్సమ్మ విజయానికి కారణం :

ఏ సినిమా విజయానికైనా బేసిక్ సూత్రం కథ బాగుండాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతటి ప్రతిభావంతులైనా కథలో సరుకు లేకపోతే ఇంతే సంగతులు. ఈ విషయం చెప్పడానికి అనేక సినిమాలు ఉదాహరణలుగా ఉన్నాయి. కాబట్టి సావిత్రి బాగా నటించిందనో, రాజేశ్వరరావు సంగీతం గొప్పగా అందించాడనో కబుర్లు చెబితే సరిపోదు. ఈ లబ్దప్రతిష్టులే అనేకసార్లు సూపర్ ఫ్లాపులూ అందించారు.

మిస్సమ్మ విజయానికి నేననుకునే కారణం ఏమనగా.. ఈ సినిమా 1955 లొ విడుదలైంది. అప్పటికి తెలుగు సినిమా బరువైన కుటుంబ కథలతో భారంగా నడుస్తుంది. సినిమాలో కథా బరువు మరీ ఎక్కువైపోయి మునిగిపోకుండా.. కామెడీ కోసం ఏ కస్తూరి శివరావునో, రేలంగినో వాడుకుంటూ దర్శకులు కథని బ్యాలెన్స్ చేస్తుండేవాళ్ళు.

పెళ్ళిచేసిచూడు (1952) వంటి సినిమాలో హాస్యానికి పెద్దపీట వేసినా.. ఆ సినిమాకి హాస్యమే ప్రధానం కాదు. వరకట్న సమస్యని హైలైట్ చేస్తూ lighter vein లో తీసిన సందేశాత్మక సినిమా పెళ్ళిచేసిచూడు. అప్పుచేసి పప్పుకూడు మిస్సమ్మ తరవాత వచ్చింది. కావున తెలుగులో మొట్టమొదటి పూర్తి స్థాయి కామెడీ సినిమా మిస్సమ్మ.

అప్పటికి తెలుగు ప్రేక్షకులకి absurd comedy తెలీదు. బరువైన కథాచిత్రాల ద్వారా మాత్రమే మనకి తెలిసిన ప్రముఖ నటులు.. హాస్యపాత్రలలో, సరదాసరదాగా నటించెయ్యడం కూడా గమ్మత్తుగా అనిపించి ఉండొచ్చు. ఈ గమ్మత్తుకి ఉత్తమ నటన, గొప్పసంగీతం వంటి హంగులు అద్ది.. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించి విజయావారు బోల్డంత డబ్బు మూట కట్టుకున్నారు.

ఉపసంహారం :

ఇంతటితో మిస్సమ్మ సినిమా గూర్చి రాయడం కూడా అయిపోయింది. చదువరులు నేనేదో మిస్సమ్మ సినిమాపై కక్షగట్టి రాసినట్లు అనుకునే ప్రమాదం కనిపిస్తుంది. అంచేత పాతతరం దర్శకులు.. సెంటిమెంట్ సినిమాని కామెడీతో బ్యాలెన్స్ చేసినట్లు.. నే కూడా హాస్యచిత్రాల గూర్చి ఇంకొద్దిగా రాసి నా టపాని బ్యాలెన్స్ చేస్తాను.

ఎప్పుడైనా, ఎక్కడైనా కామెడీ కోసమే రాసుకునే కథల్లో లాజిక్ పెద్దగా ఉండదు. Shakespeare అంతటివాడే కామెడీ కోసం 'The Comedy of Errors' అంటూ అర్ధం పర్ధం లేని కథ రాసుకున్నాడు. Shakespeare దగ్గర్నుండి ఆమధ్య Bill Murray మానసిక రోగిగా నటించిన సినిమా 'What About Bob?' (ఈ సినిమాని 'తెనాలి' అన్న పేరుతొ కమల్ హసన్ మక్కికిమక్కి దించేశాడు.) దాకా అన్నీ అసహజ, అసందర్భ సన్నివేశాలే!

bottom line :

కామెడీ సినిమా చూసి హాయిగా నవ్వుకో. లాజిక్ వెతుక్కోకు.

(photos courtesy : Google)

66 comments:

  1. http://navatarangam.com/2008/12/missamma-analysis/



    http://navatarangam.com/2008/12/missamma-analysis-2/

    ReplyDelete
  2. డాక్టరుగారూ, పరమసహజంగా ఉంటే అది కామెడీసినిమా ఎలా అవుతుందండీ?

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      అవును. అవ్వదు. నాకా విషయం చివరాకరికి తెలిసింది.

      (అందుకే bottom line అంటూ ఒక వాక్యం రాశాను.)

      Delete
  3. గత వారం ఈటీవిలో మిస్సమ్మ మళ్ళీ చూసినప్పుడు నాకు కలిగిన సందేహాలు.

    టీచర్ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు జమిందారు వాళ్ళకి సర్టిఫికెట్లలో మేరీ అని పేరు తెలియలేదా?

    ఇంత గొప్ప సినిమాకి ఘంటసాల ఎందుకు పాడలేదు?

    ReplyDelete
    Replies
    1. >>ఇంత గొప్ప సినిమాకి ఘంటసాల ఎందుకు పాడలేదు

      ఆ సమయంలో ఘంటసాల గారికి రాజేశ్వరరావు గారికి ఏదో మనస్పర్థ వచ్చి ఏ.ఎం. రాజా గారి చేత పాడించారు.

      ఒకసారి పాడుతా తీయగాలో బాలు గారు ఈ విషయం చెప్పారు.

      Delete
    2. @bonagiri,

      నిజమే! నాకీ పాయింట్ (మేరీ పేరు విషయం) తట్టనేలేదు.

      (ఇన్నేళ్ళ తరవాత మనం బ్లాగుల్లో మిస్సమ్మని శల్యపరీక్ష చేస్తామని ఎల్వీప్రసాద్ ఊహించి ఉండడు కదూ!)

      Delete
    3. నాకు కూడా మిస్సమ్మ సినిమా చాలా ఇష్టం. చాలాసార్లు చూశాను. మిస్సమ్మ లో మీరు లాజిక్కు వెతకడం బాగానే ఉంది కానీ, ఒక మాట. చివరగా మీరు కామెడీ సినిమాలో లాజిక్కు వెతుక్కోకు అన్నారు. నేను ఏమంటానంటే, లాజిక్కును వెతికే అవసరం లేకుండా, అంటే లాజిక్కును మరిపించేలా చేసి నవ్వించేదే మంచి కామెడీ సినిమా. కామెడీ సినిమాలో సహజత్వాన్ని, లాజిక్కును వెతకడం ఎప్పుడు ప్రారంభించామో అప్పుడా సినిమా విఫలమైనట్టే.
      ఇక బోనగరి గారూ లేవనెత్తిన ప్రశ్న బాగుంది. టీచర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో మేరీ పేరు ఉండాల్సిందే. పైగా ఆమె పేరు మేరీ జీవరత్నం. ఎన్నిసార్లు చూసినా ఆ సందేహం రాలేదంటే కారణం మిస్సమ్మ లాజిక్కును మరిపించే కామెడీ సినిమా కావడమే.

      Delete
    4. టీచర్ పోస్ట్ కు దరఖాస్తు పంపినప్పుడు , సర్టిఫికేట్లు పంపలేదు , దరఖాస్తు లో సంతకం కూడా మిసెస్:ఎం.టి..రావు ( Mrs. M.T.Rao ) అనే సంతకం చేస్తుంది , గుర్తులేనట్టుంది మీకు , మఱో సారి చూసెయ్యండి :)

      Delete
  4. నేను ఈ సినిమా చూడలేదండీ. మొన్న ఈటీవీ లో వచ్చినపుడు రెండు నిముషాలు చూసి బోర్ గా అనిపించి చానెల్ మార్చేశాను. మీ ఈ పోస్ట్ చదివాక అనిపిస్తోంది "మిస్సమ్మ" చూడాలని.

    ReplyDelete
    Replies
    1. @Priya,

      మిస్సమ్మ సినిమా ఎంజాయ్ చెయ్యాలంటే కనీసం సావిత్రి, రామారావులు తెలిసుండాలి. చిన్నవయసువారికి మిస్సమ్మ బోరు కొట్టేస్తుంది.

      Delete
  5. మీ బ్లాగ్ టైటిల్ మీ పోస్ట్ కు అతికినట్లు సరిపోయిందని పిస్తోంది మీ ఐ టపా చదివాక. సినిమా అనేది లాజిక్ గా వుండదు. ఎందుకంటే సగటు మనిషి ప్రాపంచిక జీవితంలో సాధ్యం కానివి సినిమా లో చూసి అనందిస్తాడు. సినిమా లలో హీరో చేసే ఫీట్ లు నిజజేవితంలో ఎవరైనా చేయగలరా ? సగటు మనిషికి సినిమాలో కావలసింది వినోదం . అది వుంది అంటే ఆ సినిమాలో హీరో ఎవరు ? కధేంటి ? కధానాయకి అందాల ఆరబోతలు ఇవేమి చూడడు. మిస్సమ్మ లో వినోదం పుష్కలంగా వుంది. చక్కని ఫీల్ వుంది మంచి పాటలు వున్నాయి . ఇవే ఆ సినిమా విజయ రహస్యమ్.

    ReplyDelete
    Replies
    1. @సుమ,

      చక్కగా విడమరిచారు. ధన్యవాదాలు.

      (నాకీ సంగతి తెలీక పన్లాపుకుని మరీ ఏదేదో రాశాను.)

      Delete
  6. దేవదాసు మీద నెగటివ్ సమీక్ష చేసి, మీ పోస్ట్ మీద నెగటివ్ కామెంట్లను చూసి కాస్త తెలివిడిగా రాసినట్టు వున్నా... కొన్ని అభిప్రాయాలు మీ వ్యక్తిగతం గానే తెలిపితే బావుంటుంది.. (వుదా: తెలుగుదేశం జమిందార్లు గురించి)
    2శ్రీ.జేసుదాసు కూడా క్రిష్టియన్ అయినా మన కృతులు, భక్తి పాటలు అద్భుతంగా పాడతాడు..
    3. శ్రీ నాగేశ్వర్ రావు గారితో అలాంటి పాత్రను కావాలనే ప్రయోగాత్మకంగా చేయించారు..(ఆయన కూడా సంతోషంగా చేసారు)
    4. పొట్టకూటి కోసం తప్పని పరిస్థితుల్లో (అనైతికం కాని) విధంగా వారి ఒడంబడిక దాంపత్య నాటకం బాగా పండింది... ఈ సినిమా హిట్ కి ప్రధాన కారణం..
    5. "కరుణించు మేరిమాత" అన్న పాట అన్ని మతస్థుల వారిని కదిలించింది... సావిత్రి అద్భుత నటన ఈ సినిమా హిట్ కి మరో కారణం..
    ఇప్పుడు అది సూమోలు ఒకేసారి గాల్లోకి లేపుతున్నా, వందమందిని ఒక్కడే చంపుతున్నా, సంసార పక్షంగా కాక బజారు మనిషిలాగ హీరోయిన్ అంగాంగ ప్రదర్శన చేసినా పట్టించుకోని మనం.. అనాటి మంచి సినిమాలని ఈ విధంగా విమర్శించుకుంటూ వెళ్ళడం చాలా అవసరమే... నాకేదో సామెత గుర్తుకు వస్తోంది... కాని వదిలేస్తున్నాను..

    ReplyDelete
  7. డాక్టర్ గారు, మిస్సమ్మ సినిమా మొత్తం తప్పులు తడకలనండి బాధలేదు. కానీ "ఆడువారి మాటలకు అర్థాలు వేరులే" పాటను మాత్రం ఏమీ అనకండి. ఆ పాటలో ఉన్నటువంటి తాత్వికత, పరమ సత్యం ఎక్కడా దొరకదు.

    ReplyDelete
    Replies
    1. @రవి,

      మీ కామెంట్ చదివి పెద్దగా నవ్వుకున్నాను. థాంక్యూ!

      మీ favourite song ని నేను ఏమీ అననని హామీ ఇస్తున్నాను:)))

      Delete
  8. మంచి కథలు బెంగాలీ లోనే దొరుకును. ఏలయనగా తెలుగులో మనం పెగ్గు శాస్త్రి, బిలం, మోషన్ ఫ్రీ లాంటివారి బరువైన కథలనే నెత్తికెత్తుకుంటాం. తెలుగులో కామెడీ కథ రాసేవాడూ చదివేవాడూ కడుపు నిండిన బూర్జువాలు, దుష్టులు. మనకి రాముడు మంచి బాలుడు అని చెప్పే పుస్తకమంటే పడదు. కాని అతనొక వేస్టు ఫెలో అని ఎవరైనా రాస్తే "సూపరో సూపరు. చావగొట్టి చెవులు మూయటం తమకే చెల్లింది" అని చంకలు గుద్దుకుంటాం. వీలైతే నాలుగు బిరుదులు సమర్పించుకుంటాం. ఇంత గొప్ప భావ దాస్యం ఉన్న మనకు ఒక సినిమాలో నో కథలోనో మంచి జమీందారు కనబడితే ఎలా తట్టుకోగలం. అది మనకి కావలసిన సహజత్వానికి భిన్నం కదా మరి! ఒక లాజిక్కూ పాడూ లేని సినిమాని ఎన్నోసార్లు చూస్తున్నామంటే మనకి పని లేదు, బుర్ర లేదు (బహుశా మన సహజత్వమా!). కాని లాజిక్కుకందని కథని మనం అన్నేసి సార్లు చూసేలా సినిమా తీసారంటే వారు నిజంగా గ్రేట్. లెట్ అజ్ కంగ్రాచులేట్ దెం!

    ReplyDelete
    Replies
    1. మిస్సమ్మ సినిమాలో ఎస్వీ రంగారావు జమీందారేనా లేక ఒక పెద్ద భూస్వామా? సందేహం. సినిమా గుర్తున్నవారు చెప్పగలరు.

      Delete
    2. భూస్వామి

      Delete
  9. దీన్నే కోడిగుడ్డుమీద ఈకలు పీకడం అంటారు డాట్రారండి

    ReplyDelete
    Replies
    1. @Ramesh Bobbili,

      మీరు తెలివైనవారు. కరెక్టుగా చెప్పేశారు.

      Delete
  10. మిత్రులారా,

    నేనీ పోస్టు మిస్సమ్మ సినిమా స్థాయిని తగ్గించడానికి రాయలేదు. ఈ సినిమా గూర్చి నాకు తోచిన నాలుగు ముక్కలు రాసుకున్నాను. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే.

    మీకు నా అభిప్రాయాలు సరికాదని అనిపిస్తే మంచిదే. అంతేగాని మీతో వాదించి ఒప్పించేందుకు నేను సిద్ధంగా లేను.. ఎందుకంటే ఇక్కడ వాదించడానికేమీ లేదు. గమనించగలరు.

    ReplyDelete

  11. ఈ టపా నిజ్జం గా డాటేరు బాబు గారు పనిలేక రాసిన టపా యే నని ఈ కామెంటు మూలకం గా కీ బోర్డు నొక్కి ఒప్పేసు కుంటున్నా !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. @Zilebi,

      'పని లేక.. ' రాస్తున్నాను. మరి నా బ్లాగ్ పేరుకి న్యాయం చెయ్యాలిగా!

      Delete
  12. బాగా రాశారు రమణ గారు. రామరావు నటించిన సినెమాలలో నటుడు తప్ప రామారావు ఇమెజ్ కనపడకుండా నటించిన సినెమా మిస్సమ్మ. ఓలేటి గారు ఎందుకు అంత ఫిలౌతున్నారొ నాకు అర్థం కవాటం లేదు. నిన్న ఆనంద నిలయం సినేమా చుశాను. రాజనల నటన చాలా బాgumది. కాని సూర్యకాంతం అటువంటి పాత్ర వేసిందాని ఆశ్చర్యపోయాను. అదికూడ 1970 సం లొ తీసిన సినెమాలొ తల్లికుతురులిద్దరు కలసి ప్రేమ అంట్టూ కాంతారావు వెంటపడటం తెలుపు నలుపు సినేమాల కాలంలో ఊహకందని విషయం.

    ReplyDelete
    Replies
    1. @UG SriRam,

      నాకు 'ఆనందనిలయం'లో ఘంటసాల పాట, రాజనాల కామెడీ మాత్రమే గుర్తున్నయ్.

      మిస్సమ్మ సమయానికి రామారావుకి పెద్ద ఇమేజ్ ఉన్నట్లు లేదు.

      Delete
  13. UG SriRam గారు.. నేనెందుకు ఫీల్ అయ్యానంటే 1. పోస్ట్ టైటిల్ (నిజంగా....) Title is not good..
    2. సంగీతానికి కూడా మతాన్ని ఆపాదించినందుకు... క్రిష్టియన్ అయ్యుండి సావిత్రి మన కృతులను పాడింది అని విమర్శించారు కాబట్టి... క్రిష్టియన్లు హిందూ మతానికి వంద మైళ్ళ దూరంలో వుంటారట... కొన్ని కొన్ని పండగలు, వుత్సవాల్లోనూ కుల, మతాలకి అతీతంగా ఈ దేశంలో పాల్గోంటారు... అదీ మన దేశ గొప్పతనం..
    3. కేవలం మన తెలుగు జమిందార్లు చెడ్డవాళ్ళని, బెంగాలీ జమిందార్లు అమాయకులు, మంచి వాళ్ళు అని ఒక స్టేట్ మెంట్ రాసినందుకు...

    మిగతా పోస్ట్ అంతా బాగుంది.. ఈ విధంగా అయినా ఒక మంచి సినిమా మీద నాలుగు ముక్కలు రాసే భాగ్యాన్ని కల్గించినందుకు శ్రీ రమణ గారికి ధన్యవాదములు....

    ReplyDelete
  14. @Ahmed Chowdary,

    మీరేమో 100 బ్లాగులకే చోటు అంటున్నారు. అర్హత లేని బ్లాగుల్ని తొలగించేస్తామని కూడా అంటున్నారు. నేను మీ 100 లో ఉంటానో, లేదో తెలీదు. ఉన్నా.. తరవాత నన్ను తొలగించే అవకాశమూ ఉంది. నాకసలే tension. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాను. ఉంటాను.

    ReplyDelete
  15. డాట్రు గారు, మీరు బ్లాగ్ రాస్తున్నప్పట్నుంచి ఫాల్లొ అవుతున్న ఫాన్ ని నేను. మామూలు గా ఐతే మా ఇంట్లో మిమ్మల్ని పనిలేని డాట్రు గారు అని రెఫెర్ చెసుకుంటాం (మా అప్పారావు కూడా బ్లాగులు చదువుతారు) కాని ఈ పోస్టు తర్వాత మిమ్మల్ని పిచ్చి డాట్రు అనే జనరల్ ( సైఖియాట్రిస్తులని అలానే అంటాం మరి) స్టాటస్ కి తగ్గించేస్తున్నాం.

    చక్కని అందమైన తెల్లని గుడ్డు లాంటి సినేమాని పట్టూకుని ఇలా ఈకలు పీకడం అస్సలు మీ బ్లాగ్కు తగ్గట్టు లేదు.

    ఇంకోటేంటంటే, నేను అక్షరాలా క్రిస్టియన్ ని, కాని నాకు చాలా త్యాగరాజ/అన్నమయ్య కృతులు వచ్చు. సంగీతం నేర్చుకునేటప్పుడు అవి కామన్ కద?

    ఈ సినేమాలో నాకు కనిపించిన ఒకే ఒక్క కాంట్రడిక్షన్ --- మేరీ జమీదారు కూతురు అనితెలియగానే తను ఊహతెలిసినప్పట్నుంచీ ఫాలో ఐన మతం వదిలేసి హిందూ ఐపోతుంది. అంత గట్టి పెర్సనాలిటీ ఉన్న అమ్మాయి అలా చేయడం సరిగా అతకదు.

    ReplyDelete
    Replies
    1. @Ruth,

      నాకున్న సమయంలో, నా అభిప్రాయాలు రాసుకోడానికి మాత్రమే నా బ్లాగ్రాతలు. నా ఆలోచనలు నచ్చనివారికి నే చెప్పేదేమీ లేదు.

      (నా స్టాటస్ తగ్గించించినందుకు ధన్యవాదాలు.)

      Delete
    2. //ఈ సినేమాలో నాకు కనిపించిన ఒకే ఒక్క కాంట్రడిక్షన్ --- మేరీ జమీదారు కూతురు అనితెలియగానే తను ఊహతెలిసినప్పట్నుంచీ ఫాలో ఐన మతం వదిలేసి హిందూ ఐపోతుంది. అంత గట్టి పెర్సనాలిటీ ఉన్న అమ్మాయి అలా చేయడం సరిగా అతకదు//
      హిందూ అయిపోతుందా ?
      లేదనుకుంటా , మల్లి ఇంకోసారి క్లైమాక్స్ చూసాను.అందరు కలిసిన ఆనందం లోనే సినిమా అయిపోతుంది. హిందూ దేవతలని పూజించడం లాంటివి ఏమి లేవే.
      ఇకపోతే బొట్టు పెట్టుకోవడం అనేది ముందే ఉంటుంది , అదే చివరివరకు ఉంటుంది .
      :venkat

      Delete
  16. నవ్వాగటంలేదండీ..

    ReplyDelete
  17. కత్తి లాంటి జవాబు...అంతే.

    ReplyDelete
  18. ప్రతీ దానికి అఫెండ్ ఐతే కష్టం. ఇక్కడ చాలా మంది 'క్రిస్టియన్లు - త్యాగరాయ కీర్తనలు నేర్పగలగడం' అనేది చూస్తున్నారు గానీ, 'త్యాగరాయ కీర్తనలు నేర్ప గలగడం - రుఖ్మిని, సత్యభామ తెలియక పోవడం' అనే పాయింటు చూడట్లెదు.

    ఇక విషయానికొస్తే నేనీ సినీమా చూడలేదు, కానీ బ్లాగ్ పోస్ట్‌లో రాసిన అనలసిస్ నచ్చింది, ముఖ్యంగా మొట్ట మొదటి పూర్తి స్థాయి తెలుగు కామెడీ చిత్రం అని కంక్లూడ్ చేసిన విధానం, మరియూ కామిడీ చిత్రాలకి ఐకానిక్ స్టేటస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పిన పార్టు.

    ReplyDelete



  19. కాలేజ్ లో మా ఇంగ్లిష్ లెక్చరర్ గారు షేక్స్పియర్ చెప్తూ అనేవారు - నాటకాల్ని, సినిమాల్ని చూస్తున్నప్పుడు willing suspension of disbelief తో (మనలోని అపనమ్మకాన్ని తెలిసే కొంచెంసేపు పక్కన పెట్టటం అనచ్చు) చూడాలి అని. ఆయన చెప్పిన సూత్రం అవసరం లేదని, ఆ రోజుల్లో మేం నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ సినిమాలు ఎంజాయ్ చేసేసే వాళ్ళం. ఆ వయసటువంటిది. కాని...కాని... (ఆ సూత్రం ఉన్నప్పటికీ) వయసు, అనుభవం పెరుగుతున్న కొద్దీ మనిషి దృక్కోణం కూడా మారుతుంది కదా. ఆ మార్పు వల్లనే, అప్పుడు గొప్పగా వున్నాయి అనిపించిన వాటిల్లో ఇప్పుడు లోపాలు కనిపించవచ్చు. అటువంటి మార్పు వస్తుందని తెలుసుకోవడానికి కూడా ఈ టపా ఉపయోగపడుతుందని అని నా అభిప్రాయం. కాకపోతే డాక్టర్ గారు టపా మొదట్లోనే "హెచ్చరిక" చేసినప్పటికీ, "ముందు మాట"
    "bottom line" చెప్పుకున్నప్పటికీ, "ఇటుకల" వాన (brickbats) కొంచెం ఎక్కువగానే కురుస్తున్నట్లున్నది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహారావు గారు,

      >>వయసు, అనుభవం పెరుగుతున్న కొద్దీ మనిషి దృక్కోణం కూడా మారుతుంది కదా. ఆ మార్పు వల్లనే, అప్పుడు గొప్పగా వున్నాయి అనిపించిన వాటిల్లో ఇప్పుడు లోపాలు కనిపించవచ్చు. <<

      నా విషయంలో మీ పాయింట్ నూటికి నూరుపాళ్ళు నిజం. నేను ఈ నెల్లోనే రాసిన దేవదాసు, మిస్సమ్మ టపాలని.. ఇరవయ్యేళ్ళ క్రితం ఇంకెవరన్నా రాసి ఉన్నట్లైతే విపరీతంగా బిపి తెచ్చుకునేవాణ్ని. నాకు నవ్వొచ్చే విషయమేమనగా.. ఇవ్వాళ ఈ సినిమాలకి సంబంధించి నేను receiving end లో ఉండటం!

      ఇంకో విషయం. నా చిన్నప్పుడు చిత్తూరు నాగయ్యని 'వణుకుశ్రీ' అనుకుంటూ జోక్స్ వేసుకునేవాళ్ళం. ఇవ్వాళ నాకు ఆయన హీరోగా నటించిన సినిమాలు గొప్ప క్లాసిక్స్ అనిపిస్తున్నాయి. వాటిని చాలా ఆసక్తిగా చూస్తున్నాను కూడా. ఇది కూడా మీరు చెప్పిన పాయింటుకి ఇంకో ఉదాహరణ అనుకుంటున్నాను.

      Delete

    2. బాగా గుర్తు చేసారు. నాగయ్య గారిని "వణుకు శ్రీ" అని పిలుచుకున్న కుర్ర తరం లో నేనూ ఒకడిని - ఆయన గొప్పతనాన్ని అప్పట్లో పూర్తిగా తెలుసుకోలేక పోవటం వల్ల. అవును మీరు చెప్పినట్లు, మనలో మార్పుకి ఇది కూడా చక్కని ఉదాహరణ. Thanks.

      Delete
  20. "ఏవిటో! అన్నీ eccentric characters తో జంధ్యాల మార్కు కనిపిస్తుంది కదూ!"

    ఆహా!! :) వేసుకోండి సార్ పది వీరతాళ్ళు :)
    ఒక్క క్షణం ఆనందంలో మునకలేసాను :)))

    ReplyDelete
  21. ఓ Disclaimer పడేయడం ఎందుకైనా మంచిదనుకుంటాను :))
    నా పై కామెంట్ కేవలం ఆ కోట్స్ లో ఉన్న వ్యాక్యానికి మాత్రమే, ఈ పోస్టుకి సంబంధించినది కాదు సుమా :))

    ReplyDelete
  22. పాత సినిమాల గురించి మీ చీల్చి చెండాలుడు బాగున్నది. ఈ విధంగా అయినా వాటిని తలుచుకొని ఆనందించ వచ్చును. ఇక మీ మిస్సమ్మ లాజిక్కులకి చక్రపాణిగారే ఎప్పుడో సమాధానం చెప్పేశారు. చక్రపాణిగారితో ఒకాయన భీష్మ సినిమాలో ఎంటివోడు గురించీ చెపుతూ "అసలు ఆ మేకప్పులో ఎన్టిఆర్ గుర్తించలేని విధంగా ఉన్నారు" అని అన్నారు. దానికి చక్రపాణిగారు "ఆ మాత్రానికి అక్కడ ఎన్టిఆర్నీ పెట్టడం ఎందుకు అని అన్నారుట. మరో సందర్భంలో గుండమ్మ కధలో విజయలక్ష్మి గారి డాన్సు సిను గుండమ్మ కధకి అవసరమా? దేనికి ? అని విమర్శకుడు ప్రశ్నిస్తే; "చూడటానికి" అని సమాధానం చెప్పారు చక్రపాణిగారు.

    అంతా బాగానే వ్రాశారు కానీ, "ఏవిటో! అన్నీ eccentric characters తో జంధ్యాల మార్కు కనిపిస్తుంది కదూ! రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలా కూడా ఉంది కదూ!" అని అనటం "తండ్రిని కొడుకులా ఉన్నావని" అన్నట్లుగా ఉన్నది.

    ఇక మీ చీల్చుడికి సమాధానం.

    1]జమిందార్లు కర్కశంగా ఉన్నారని పుస్తకాలని చూసే కానీ, నిజంగా చూసామా? ఇప్పటి ప్రజాసామ్య నాయకులు సాత్వికంగా ఉన్నారా?

    2]ఇద్దరు పరిచయం లేని వారు మొగుడు పెళ్ళా లుగా నటించటం ఆశ్చర్యం అని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు. సహజీవనం పురాణాలలోని కృష్ణుడే చేసాడని మన కోర్ట్ వారు ఉదాహరింఛి మరి తీరుపునిచ్చారు కదా.

    3]మేరి పేరు సర్టిఫికేట్టులో చూడటం...అంత చదువు అందరు జమిదారులకి లేదు. అందులో ఎస్విగారు కూడా చదువులేని పెద్దమనిషిగా బాగా నటించారు కదా.

    4] ఇక మీరు క్రిస్టియన్ల గురించి ఊహించినది కూడా తప్పే. ఒకే వేళ ఉన్నా అది 1950లొ లేదు. ఇప్పుడు కూడా అలా కొద్ది మందే ప్రవర్తిస్తారు. అలాంటి వారు హిందువులలోను ఎక్కువే.

    5]మన సంగీత జ్ఞానం కావాలంటే కీర్తనలు తప్పని సరిగా తెలియాలిసి ఉన్నది. దీనికి మన జేసు దాసు గారిని ఓ ఉదాహరణగా తీసుకోవచ్చును. అరవమే దైవం అని భావించే అరవ వాళ్ళు కూడా తెలుగు కీర్తనలు తప్పనిసరిగా నేర్చుకోవలసిందే.

    6]అప్పటి కాలానికి సంగీతం నేర్చుకోవటానికి ఆ మేరి గారు వెళ్ళింది అంటే ఆవిడకి మతాల పట్ల పట్టింపు లేనట్లేకదా.

    7]సహజత్వం గురించి ఓ విమర్శకుడు ఓ ఇంగ్లిషు డైరెక్టరుగారిని అడిగాడుట.., "ఆ కొండల్లో మ్యూజిక్ ఎక్కడ నుండి వచ్చిందని". దానికి ఆ డైరెక్టరు గారు "కొండల్లో కెమెరా ఎక్కడ నుండి వచ్చిందో అక్కడ నుండే మ్యూజిక్ వచ్చింది" అని సమాధానం చెప్పాడుట.

    ఇలా ఒకటేమిటి ముష్టి వాడి కేరక్టర్, జోకర్ మేనల్లుడు, సంగీతం పిచ్చిది, అమాయకపు ఇల్లాలు ఇవేమీ లేకుడా సహజత్వంతో తీసిన సినిమాల గతెమితో తెలిసిందే కదా, అందుకనే చార్లీ చాప్లిన్ గారు కూడా హాస్యంతో మేళవించే సామాజిక దౌర్భాగ్యాన్ని చూపించాడు.

    ఉపసంహారం లాజిక్కుగా చేసి, లాజిక్కుగా తప్పించుకున్నారు(: (: (:

    ReplyDelete
    Replies
    1. @BHAARATIYAVAASI,

      వివరణాత్మకంగా చాలా మంచి వ్యాఖ్య రాశారు. ధన్యవాదాలు.

      మిస్సమ్మని ఇంతమంది defend చేస్తుండటం సంతోషంగా ఉంది.

      నా మిత్రుడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు.. 'మిస్సమ్మ, మాయాబజార్ సినిమాలని విమర్శిస్తే ఒప్పుకోరు. అవి మన జీవితంలో భాగం. వాటిల్లో మన emotional investment చాలా ఉంది.'

      నా స్నేహితుని observation ని ఒప్పుకుంటున్నాను.

      Delete
  23. అక్కినేనిజీవితంలో తానే స్వయంగా చక్రపాణిని అడిగి దీనిలోని పాత్ర ధరించారు!హాస్యసన్నివేశాలు బాగా పండినందువలన మిస్సమ్మ ఆరోజుల్లో విజయధంకా మోగించింది!కనకవర్షం కురిపించింది!నందమూరి ఈ సినిమాలో అప్పుడే కోసిన లేలేత గులాబిపువ్వులా తాజాగా ఉన్నాడు!సావిత్రి పేరలుక మరిపించి మురిపించింది!అందమైన అమాయకపు గారాలపట్టిగా జమున అలరించింది!రసాలూరు సాలూరు సంగీతంసంగతి చెప్పనే అక్కరలేదు,ఇన్ని దశాబ్దాలు గడచినా ఇప్పటికీ వినిపిస్తే చెవులు రిక్కించి మరీ వింటాము!ఇదే కథను పాత్రలు తారుమారు చేసి చనిపోయేముందు చక్రపాణి మళ్ళీ తీసిన సంగతి సర్వులకు విదితమే!పనిలేని డాక్టరుగారు మిస్సమ్మను మళ్ళీ సమీక్షించి అలనాటి యువకులకు పెద్దపని పెట్టారు!నేటి యువతకు పరిచయం చేసారు గిలిగింతలు పెట్టిన అలనాటి అందాలను!

    ReplyDelete
    Replies
    1. surya prakash apkari గారు,

      మన మిస్సమ్మపై కొంచెం harsh గా రాశాను. మన్నించగలరు.

      Delete
  24. మొదటగా, హాస్యం మాటున అంతర్లీనంగా కరుణ రసాన్ని జత చేసి ఉదాత్తమైన పాత్రలను సృష్టించిన గొప్ప కళాకారుడు చార్లీచాప్లిన్ ను ఈ పోస్టులో సందర్భోచితంగా ప్రస్తావించడం చాలా బాగుంది. ధన్యవాదాలు.
    ఇక రెండోదిగా, నేను మిస్సమ్మ వీరాభిమానిని కాను. కాబట్టి చదివినా నా మనోభావాలేమీ పెద్దగా దెబ్బతిన్న దాఖలాలేం లేవ్. ఎలాగూ మీరు రాశారు కాబట్టి, నా అభిప్రాయాలను కూడా కొన్నింటిని ఇక్కడ వెళ్లడిస్తాను. సాధారణంగా కళ అయినా, కళాకారుడైనా చేసేది, చెయ్యాల్సింది... నిజ జీవితానికి దగ్గరగా పాత్రల్ని సృష్టించి, ఎడిషన్ గా దానికి కొంత హయ్యర్ బ్యూటీని, సామాజిక కోణాన్ని అద్ది దానివైపుగా అందరినీ ఆకర్షితుల్ని చేయడమే. అప్పుడే కళకైనా, కళాకారుడైనా సార్థకత! ఆ రకంగా చూస్తే మిస్సమ్మ సినిమాలో కథగానీ, పాత్రలు గానీ, పాత్రల మధ్య సంభాషణలు గానీ, చిత్రీకరణ గానీ చాలా అందంగా, ఆహ్లాదంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. మానవీయ సంబంధాల్ని కూడా మనోజ్ఞంగా, మనోహరంగా చిత్రీకరించారీ సినిమాలో. అలాగే సినిమాలో అంతర్లీనంగా నిరుద్యోగ సమస్యను టచ్ చేయడం నిజంగా అభినందనీయ ప్రయత్నం. అందుకే, తెలుగు సినిమా తాలూకు స్వర్ణయుగంలో వచ్చిన కొన్ని మంచి సినిమాల్లో మిస్సమ్మ మూవీని కూడా ఒకటిగా పరిగణిస్తాన్నేను. అయినా సరే, వీరాభిమానిని మాత్రం కాను :)
    చివరగా ఓ చిన్నమాట.. ప్రతీ దృగ్విషయంలోనూ (సినిమాలో కూడా) మంచీ చెడూ రెండు అంశాలూ తప్పనిసరిగా మిళితమై ఉంటాయి. Pure మంచి అంటూ, లేదా pure చెడు అంటూ ఉండడం అసాధ్యం. పైగా మనమెలాగూ ప్యూరిటన్స్ కాదు కాబట్టి, ’మంచి‘ పాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు దానినే ప్రధానంగా ప్రొజెక్ట్ చేయడం; ‘చెడు‘ పాళ్లు ఎక్కువగా ఉంటే చెడును దునుమాడడం చేయాలన్నది పెద్దల ఉవాచ. అసలే సినిమాల్లో కథ, కథనం, విలువలు అధ:పాతాళానికి పడిపోయిన నేటి పరిస్థితుల్లో అలనాటి చిత్రరాజాల్లోని మంచిని మనం ప్రొజెక్ట్ చేస్తేనే బావుంటుంది(మీరు అలాంటి పోస్టులు చాలానే రాశారు). వాటిల్లోని పొరపాట్లను, లోపాలను (కొద్దోగొప్పో ఉన్నప్పటికీ నెగ్లెక్ట్ చేసి) వాటిని ప్రస్తావించకపోవడమే మంచిదని నేను భావిస్తాను. ఎందుకంటే, Every action surely has its own reactions & repercussions!! థాంక్యూ!!

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      ఈ పోస్ట్ రాసేప్పుడు నా ఆలోచన ఏమనగా.. ఒకప్పుడు మిస్సమ్మని నేను flawless అనుకున్నాను. కానీ తర్వాత్తర్వాత ఈ సినిమాలో (నాకు) కొన్ని లోపాలు కనిపించాయి. ఆ ఆలోచనలని టపాగా రాశాను (ఇదేమీ blasphemy కాదుగదా అనుకుంటూ రాసేశాను).

      మీ వ్యాఖ్య వల్ల.. ఒక మంచి సినిమాలోని సూక్ష్మలోపాల్ని చర్చించడం మూలానా time waste తప్ప ఒనగూరేదేమీ లేదని అర్ధం చేసుకున్నాను. థాంక్యూ.


      Delete
    2. Let a hundred flowers bloom and thousand schools of thought contend అని ఆర్యోక్తి. నూరు పూలు వికసించనీ, వేయి భావాలు సంఘర్షించనీయండీ. వాస్తవాల్ని స్వీకరించే మీలాంటి సత్యశోధకులకు విమర్శలు, భావాల సంఘర్షణలు మరింత స్ఫూర్తినిస్తాయని, మీరు మరెన్నో విషయాలను వ్యక్తిగతాతీతంగా విశ్లేషిస్తారని ఆశించనీయండి. థాంక్యూ!!

      Delete
    3. కరెక్ట్ నాగరాజ్ గారు; మన పిల్లలు మనకెంతో ఇష్టమే అయినా వాళ్ళలో చిన్నచిన్న లోపాలు,లోటుపాట్లు కనిపిస్తూంటే ఎలా ఉంటుందో అదే ఫీల్ ఈ పొస్ట్ లో కనిపిస్తోంది.

      Delete
  25. మిత్రులారా,

    ఒక వివరణ.

    గత రెండేళ్ళుగా బుర్రకి తట్టిన ఆలోచనల్ని బ్లాగులో unload చేస్తున్నాను. నాకిదో సరదా.

    మిస్సమ్మ సినిమా గూర్చి రాసేప్పుడు మిస్సమ్మ అభిమానిగానే రాశాను. ఆ విషయం పోస్టులోనే స్పష్టంగా రాశాను కూడా.

    పత్రికల్లో ఒక వ్యాసం రాయాలంటే చాలా వివరంగా రాయాలి. కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవర్ని నొప్పించకూడదు. ఎందుకంటే రచయితకి పాఠకుడితో ఆ వ్యాసం ఒక్కటే connecting link.

    కానీ.. బ్లాగుల్లో ఆ సమస్య ఉండదు. బ్లాగర్ చాలా టపాలు రాస్తుంటాడు. బ్లాగర్ అభిప్రాయాలు చాలామటుకు తెలిసే ఉంటాయి (ఒక్కోసారి రిపీట్ కూడా అవుతుంటాయి). బ్లాగర్ రాతల్లో ఆ threads of continuity తెలుస్తూనే ఉంటుంది. అనగా ఇక్కడ రాసేవారికి, చదివేవారికి 'పరిచయం' ఆల్రెడీ establish అయ్యుంటుంది.

    ఏ బ్లాగుకైనా కొందరు regular readers ఉంటారు. కొత్తగా add అయ్యేవారు తక్కువ. అంచేత ఒక ఆలోచనని పోస్టుగా మలిచేప్పుడు బ్లాగర్ (పత్రికల్లో వ్యాసాలకి మల్లే) కొత్తవారి కోసం అంత శ్రద్ధ పెట్టకపోవచ్చు.

    నాకు బ్లాగ్ రాయడం ఒక హాబీ మాత్రమే. వృత్తి రీత్యా బిజీగా ఉంటాను. అంచేత professional writers తీసుకునే checks and balances తీసుకునే సమయం ఉండదు. మరప్పుడు హడావుడిగా ఎందుకు రాయాలి? అంటే నా దగ్గర సమాధానం లేదు. నేనప్పుడు రాయకపోతే ఎప్పటికీ రాయలేకపోవచ్చు కూడా. A thought for a blog is like pregnancy. If the baby (the thought) is not delivered in time.. the baby may die.

    నాకు బ్లాగింగ్ ఒక కబుర్లు చెప్పడం వంటిది. ఒక్కోసారి నా ఆలోచన కరెక్ట్ కాకపోవచ్చు. ఇంకోసారి రాసిన విధానం చెత్తగా ఉండొచ్చు. మొన్నరాత్రి మిస్సమ్మ గూర్చి రాసి వెంటనే పోస్ట్ చెయ్యకపోతే.. మిస్ మేరీ గూర్చి నేనసలు రాసేవాడినే కాదు. అప్పుడలా అనిపించింది. రాసేశాను. అంతే!

    అందువల్ల నా మిస్సమ్మ పోస్ట్ ఒక్కటే బయటకి లాగి చర్చింప పూనితే అది కరెక్ట్ కాదు (అది సినిమా 18 రీళ్ళల్లో ఒక రీలునే చూసి విమర్శించడం వంటిది అనుకుంటున్నాను). నేను పాత సినిమాలపై పోస్టులు చాలానే రాశాను. మిస్సమ్మని వాటితో కలిపి చూడ ప్రార్ధన.

    నా మిస్సమ్మ టపాపై నేను అనుకున్నదాని కన్నా చాలా మంచి కామెంట్లు వచ్చాయి.. వస్తున్నాయి. ధన్యవాదాలు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

    ఈ వివరణ నాకోసం నేను రాసుకుంటున్నాను. నా టపాలు పొట్టిగా, ఒక్కోసారి blunt గా ఉంటాయని అనుకునేవారికి explanation గా కూడా రాస్తున్నాను.

    ReplyDelete
  26. కామెడీ సినిమా చూసి హాయిగా నవ్వుకో. లాజిక్ వెతుక్కోకు.
    - ఏమిటి నా బొంద కామెడీ? అర్థంలేని లాజిక్కే అర్థంకాకుండా వుంటే పైగా కామెడీకైనా నవ్వు అని ప్రాధేయపడటం నాకు కంపరం పుట్టిస్తోంది. ఇదేమన్నా బాలయ్య, సొరచేపమొహం రాంచరణ్, నత్తి అల్లు అర్జున్ సినిమాలా లాజిక్కు పక్కనపెట్టడానికి?

    ReplyDelete
  27. "సరిలేరు మీకెవ్వరూ.." అని ఒక బాక్ గ్రౌండ్ సాంగేస్కోండి రమణ గారు :-))
    మీరు టూమచ్ :) (ఇది కేవలం పైకామెంట్ కి మాత్రమేనండోయ్.. పోస్ట్ గురించి కాదు)

    ReplyDelete
  28. మీ దృష్టిలో గొప్ప సినిమా అంటే ఏమిటో, ఒక టపాలో వ్రాసేస్తే ఎవరికీ ఎలాంటి అపార్థాలు కలగవు.

    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,

      నా సినిమా జ్ఞానం ambassador car వంటిది. ఆ కారు బలమైనది మరియూ దృఢమైనది. కానీ ప్రస్తుతం రోడ్ల మీద కనిపించదు.

      (ఈ సంగతి చాలాసార్లు ఎలుగెత్తి చాటుతూనే ఉన్నాను.)

      Delete
  29. తెలుగోడు29 July 2013 at 12:24

    విమర్శించడం అంటే చాలు, జనం ఎగబడి పోతారు... మా పిచ్చి డాట్రు గారు, బాబోయ్ నేను మిస్సమ్మ ఫాన్, ఏసి అని ముందు మాటలో, కిందగీతలో (bottomline) లో చెప్పినా సరే, ఇలా పొలోమని వచ్చేసి, అక్కడికేదో, మిస్సమ్మ ను బలాత్కారం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు ఒకొక్కరు... సరదాగా వ్రాసినదాన్ని, సరదాగా తీసుకోవాలి. అలా తీసుకోలేకపోతే "ముదుకెళ్ళు బాబు... ముందుకెళ్ళు" అని కసురుకోవాలేమో.

    @డాట్రు గారు
    మీరిలాంటివి పట్టించుకోకండి. మీ టపాలు చదివి, ఆనందించి, నెక్స్ట్ టపా కోసం ఎదురు చూసే, మాలాంటోళ్ళకోసం మీ రూట్ లో మీరెల్లిపోండంతే... (మీరెల్తారని నాకు తెలుసు... నా తుత్తి కోసం చెప్పా)

    ReplyDelete
  30. అవును డాక్టరుగారు, మీరు తగ్గొద్దు అంతే. పద్మవ్యూహం లోకి అభిమన్యుడిలా దూసుకుపోండి అంతే! పోస్టు రాస్తే వచ్చేది లేదు కామెంట్లు తప్ప!

    ReplyDelete


  31. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

    జిలేబి

    ReplyDelete

  32. పార్లమెంట్ వెళితె ప్రతిపక్షాలు గొడవ చేస్తారని ప్రధాని ఇంట్లొ కుర్చొంటాడా? విమర్శిస్తారని రచయితలు పోస్ట్ రాయకుండా ఉండగలరా? రమణ గారు మీ వివరణ రాజనీతిజ్ణుడి జవాబులా చాలా చక్కగా ఉంది :)

    SriRam

    ReplyDelete
  33. వైద్యులుగారు,
    ఎంత చెప్పినా గాని(పని లేక....), కొద్ది మంది , వ్యక్తి గతంగా తీసుకుంటున్నారు. అది ఒక రకంగా వాళ్ళ పరిణితిని తెలియజెస్తుంది కూడా.
    వాళ్ళని పటించుకోకండి. మీరు రాసే టపాలలొ సునిసిత హాశ్యం, చేదుగా వుండే నిజం ఎప్పుడూ వుంటూనే వున్నాయి.
    డబ్బులు పెట్టి, కొని చదివే అబద్దాలకంటె (అనగా సాక్షి , జ్యొతి , ఈనాడు వగైరాల కంటే ) ఉచితంగా వచే మీ టపాలు 1000 రెట్లు నయం.
    కృష్ణ

    ReplyDelete
  34. మీ అందరి తెలుగుకి ఒక పరీక్ష
    (source ఈనాడు)

    సిద్దాహారం అంటే ఏంటి?

    ReplyDelete
  35. సిద్దాహారం అనగా రెడీ మెడ్ ఫుడ్

    జిలేబి

    ReplyDelete
  36. brilliant! త్యాగరజకృతి పాడిన అమ్మాయికి రుక్మిణి, సత్య లు తెలియకపోవడం...నిజమే సుమండీ. మీరు చెప్పిందనతా నిజమే అనిపిస్తోంది. ఈ కోణం నుండి ఎప్పుడూ ఆలోచించలేదు.

    బొట్టు పెట్టుకోవడం విషయంలో...మొదటినుండీ పెట్టుకోదు కదండీ!! జమీందార్లు బలవంత చేస్తే, ఎంటీవోడు "అది ఆచారం" అని వివరిస్తే అప్పుడు కదా పెట్టుకుంటుంది?

    కాని మిస్సమ్మ నాకు చాలా ఇష్టమైన సినిమా...మీరిలా విమర్శిస్తుంటే, ఏవేవో బలమైన పాయింట్లు పట్టేసి, మీతో గట్టిగా వాదించేసి, ఠాట్ మిస్సమ్మ గొప్ప సినిమా అని నిరూపించేసెయ్యాలని మనసు పీకేస్తోంది :) కానీ పాయింట్లే దొరకట్లేదు...ఇలాక్కాదుగానీ మరోమారు కూర్చుని ఆలోచిస్తా. :)

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. @ఆ.సౌమ్య,

      థాంక్యూ.

      మిస్సమ్మ విషయంలో మనిద్దరిదీ ఒకటే పక్షం. ఒక మంచి స్టూడెంట్ 99/100 తెచ్చుకున్నా, ఆ వందో మార్కు ఎందుకు మిస్సయిందని ప్రశ్నిస్తాం. నా పోస్టూ అంతే!

      Delete
  37. తెలుగు బ్లాగ్ ప్రపంచంలో నాకు బాగా నచ్చిన బ్లాగ్ మీదే.
    మీరు బ్లాగ్ లో రాసె విషయాలు అన్నీ చాలా సరదాగా ఉంటాయి.
    నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేలా మీ బ్లాగ్ ఉంటొంది.
    మీ రచనా శైలి అద్భుతం.
    ఏదైనా పోస్ట్ లో మిమ్మల్ని ఎవరైనా విమర్శించినా కూడా, అది ఆ పోస్ట్ కే పరిమితమని నా నమ్మకం.
    కబుర్లు చెప్తున్నట్టు రాసే మీ శైలి మాకు బాగా నచ్చుతోంది.

    ReplyDelete
  38. meeru Maya Bazaar gurinchi raaste chudalani undi :)
    PS : Nenu Missamma veerabhimaanini mestaru...meeru mayabazar gurinchi raasi choodandi..nenenduku raayamantunnano ardam avutundi ;)

    ReplyDelete
  39. btw..i liked the way u looked at this movie...abhimanamto naa kallu mooskupoyayemo..aina anta nachina cinema meeda inta visleshana jeernam kavatam ledu guru gaaru..

    ReplyDelete
  40. మాయాబజార్ లో పింగళి గారన్నట్లు రసపట్టు లో తర్కం కూడదు , అలాగే హాస్యం ( మిస్సమ్మ) లో కూడ తర్కం తగదు. నాక్కూడా పనిలేక మీ సమీక్ష, సమీక్ష పై కారాలూ, మిరియాలూ చదివి టై పాస్ చేశాను. ధన్యవాదాలు. చాలా చాలా ఆనందించాను.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.