తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ సెల్వంని అభినందిస్తున్నాను. రాజకీయాలు అత్యంత క్రూరమైనవి. ఛాన్సు దొరికితే నమ్మినవారే నట్టేట ముంచేస్తారు. బ్రహ్మానందరెడ్డిని నమ్మిన ఇందిరా గాంధీకి ఏమైందో మనకి తెలుసు. అందుకే నాయకులందరూ తమ కొడుకుల్నీ, కూతుళ్ళనీ రంగంలోకి దించుతున్నారు. ఈ నేపధ్యంలో - తన నాయకురాలు కోసం, క్రికెట్‌లో నైట్ వాచ్‌మెన్‌లాగా ముఖ్యమంత్రి కుర్చీకి కుక్క కాపలా కాస్తున్న పన్నీర్ సెల్వం ధన్యజీవి. నాకు తెలిసి - పన్నీర్ సెల్వంతో పోల్చదగ్గ వ్యక్తి పాదుకా పట్టాభిషేకం చేసిన భరతుడు ఒక్కడే.
పుస్తకాల్లో, పత్రికల్లో - ఫలానావాడు గొప్పనాయకుడు అంటూ ఏదేదో రాస్తుంటారు. ఎందరో నాయకులు! అందరికీ వందనములు! మరి గొప్పనాయకుడు కానివాడికి చరిత్ర వుండదా? ఈ ప్రశ్నకి సమాధానం చరిత్ర పుస్తకాల్లో దొరకదు. ఎందుకంటే వారి చరిత్రని ఎవరూ రాయరు. ఒక రాజ్యాన్ని సమర్ధవంతంగా యేలాలంటే గొప్పనాయకుడొక్కడే సరిపోడు. ఆ నాయకుడికి విశ్వాసపాత్రత, భక్తి ప్రవృత్తత కలిగిన అనుచర గణం కూడా వుండాలి. ఇటువంటి లక్షణాలు పుష్కలంగా వున్న పన్నీర్ సెల్వం దొరకడం పురచ్చి తలైవి అదృష్టం.
పన్నీర్ సెల్వం గూర్చి రాస్తుంటే నా స్నేహితుడొకడు గుర్తొస్తున్నాడు. అసలు పేరేదైతేనేం? అతగాడు 'హౌజ్ హస్బెండ్'గా ప్రసిద్ధుడు. దించిన తల ఎత్తకపోవడం, ముక్తసరిగా మాట్లాడ్డం మంచితనపు లక్షణాలే అయినట్లైతే అతను మంచివాడే! ఎంతో కష్టపడి డిగ్రీ అయిందనిపించాడు. ఉద్యోగం కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నించినా - ఉద్యోగం అతనికో ఎండమావిలా మిగిలిపోయింది.
ఇంతలో - వన్ ఫైన్ డే - నా స్నేహితుడు పెళ్ళి చేసుకున్నాడు! భార్యది బాగా కలిగిన కుటుంబం, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు బోల్డెంతమంది వున్నార్ట. అందుకే - పెళ్ళైన సంవత్సరం లోపే భార్య తరఫువాళ్ళు మావాడికి ఏదో గవర్నమెంటు ఉద్యోగం కూడా వేయించుకున్నారు. ఈడ్చి తన్నినా పైసా రాలని మావాడిని చేసుకోడానికి ఆ పిల్లెలా ఒప్పుకుంది?!
ఈ ప్రశ్నకి సమాధానం మాకు మావాడి పెళ్ళిలోనే దొరికింది. పెళ్లికూతురు పొట్టిగా వుంది, లావుగా వుంది, దళసరి కళ్ళద్దాలతో వుంది. ప్యూను పెళ్ళికొచ్చిన అయ్యేయస్ ఆఫీసర్లా - నొసలు చిట్లిస్తూ చిటపటలాడుతూ చిరాగ్గా వుంది. పెళ్ళయ్యాక మావాడి పరిస్థితేంటి? బండకేసి బాది ఉతికి ఆరేస్తుందా? ముక్కలుగా కోసి మిక్సీలో పడేసి జ్యూసుగా చేసుకుంటుందా? గాడిపొయ్యిలో పడేసి బాగా కాల్చి తందూరీగా చేసుకుంటుందా?
ఉండబట్టలేక మా సుబ్బు అడగనే అడిగాడు - 'ఏరా నాన్నా! పెళ్ళికూతుర్ని సరీగ్గా చూసుకున్నావా?'
మావాడు తలెత్తకుండా తొణక్కుండా స్థిరంగా చెప్పాడు - 'మనకి పిల్లనివ్వడమే గొప్ప! ఇంక సరీగ్గా చూట్టం కూడానా?'
అటుతరవాత మావాడి కాపురం విశేషాలు అడపాదడపా మా సుబ్బు నా చెవిలో వేస్తూనే వున్నాడు. మావాడి భార్య ఇంటిపని చెయ్యదు. పనిమనిషినీ పెట్టలేదు. మావాడు రోజూ తెల్లారగట్టే లేచి ఇల్లు చిమ్మి, వంట చేసి, పిల్లల్ని స్కూలుకి రెడీ చేస్తాడు. ఆఫీసు పని అవ్వంగాన్లే - ఇంటికొచ్చి బట్టలుతికి, మళ్ళీ వంటపన్లో పడతాడు. ఒక్క మంగళ సూత్రం మాత్రమే తక్కువ - మావాడు మంచి గృహిణుడు (గృహిణికి పు.లింగం).
మరి మావాడి భార్యేం చేస్తుంది? ఆవిడకి పొద్దస్తమానం నీరసంట! అంచేత - నీరసం తగ్గడానికి బోర్నవిటా, బూస్టులు తాగుతుంది. పడక్కుర్చీలో పడుకుని నవలలు చదువుతుంది, సోఫాలో జార్లగిలబడి టీవీ చూస్తూంది, డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ చేస్తుంది. ఇన్ని పన్లు చేసినందున అలసిపొయ్యి డబుల్ కాట్ మీద దుప్పటి తన్ని నిద్రోతుంది.
మావాణ్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి సుబ్బు తీవ్రంగా శ్రమించాడు.
'ఇంట్లో కుక్కలాగా బండెడు చాకిరీ చేస్తున్నావు. సిగ్గులేదా?'
'మన పని మనం చేసుకోడానికి సిగ్గెందుకు!'
'ఏం? నీ భార్యెందుకు పనందుకోదు?'
'పని కావడం ముఖ్యం గానీ - ఎవరు చేస్తే ఏముంది!'
'కదా? మరావిడ పనెందుకు చెయ్యదు?'
'పోన్లేద్దూ! ఆవిడకి నీరసంట!' వెధవ నవ్వుతో నంగి సమాధానం.
కందకి లేని దురద కత్తిపీటకేల? - ఈ విషయం ఇంతటితో వదిలేద్దామనుకున్నాం, మా వల్ల కాలేదు.
ఇప్పుడంటే భర్తల గ్రాఫు పడిపోయింది గానీ - మన తాతల కాలంలో భర్తలంటే ఎలా వుండేవాళ్ళు? అచ్చు సింహాల్లా వుండేవాళ్ళు. మా తాత గాండ్రింపుకి మా అమ్మమ్మ వణికిపొయ్యేది. ఆయనకి నిద్ర పట్టకపోతే - నిద్రొచ్చేదాకా మా అమ్మమ్మని, ఆవిడ పుట్టింటివాళ్ళని తెగ తిట్టి పోసేవాడు. ఆయన నిద్ర పోయ్యాకే మా అమ్మమ్మ నిద్ర పోవాలి. అది రూలు! మా అమ్మమ్మ మహాఇల్లాలు! కావున మా తాత తిట్లని వినయంగా గుడ్ల నీరు గుక్కుకుని భరించేది!
అట్టి సింహాల వంటి భర్తల స్థాయిని - ఎట్లాగూ మా తరం వాళ్ళం గ్రామసింహాల స్థాయికి దిగజార్చాం. పైగా సంసారానికి భార్యాభర్తలు రెండు స్కూటర్ చక్రాల్లాంటివాళ్ళని దరిద్రపుగొట్టు సుభాషితాల్తో సమర్దింపులు! కానీ - మావాడు భర్తలకి కనీసం ఆ స్థాయైనా మిగల్చలేదు. భార్యకి చరణదాసిగా మారిపొయ్యి మగజాతికే మాయని మచ్చగా మిగిలిపోయ్యాడు. పైగా ఏదో ఘనకార్యం సాధినవాళ్ళా ఆ వెధవ నవ్వొకటి! మావాణ్ని చూస్తుంటే మాకు మండిపొయ్యేది. అందువల్ల కసిదీరా సూటిపోటి మాటలని తృప్తినొందేవాళ్ళం.
'మేమందరం హస్బెండులం మాత్రమే! నువ్వు మాకన్నా ఎక్కువ - హౌజ్ హస్బెండువి!'
'బట్టల మురికి పోవాలంటే రిన్ బాగుంటుందా? సర్ఫ్ బాగుంటుందా?'
'మా ఆవిడ పుట్టింటి కెళ్ళింది. ఓ సారలా వచ్చి వంట చేసి పోరాదూ?'
అన్నింటికీ సమాధానంగా మళ్ళీ అదే వెధవ నవ్వు! వీణ్నీ, ఈ దేశాన్ని బాగు చెయ్యడం మన వల్లకాదు అనుకుని వదిలేశాం. తరవాత వాడికేదో ఊరికి బదిలీ అయ్యి వెళ్ళిపొయ్యాడు.
చాల్రోజుల తరవాత మొన్నో పెళ్ళిలో మావాడు కనిపించాడు. కొంచెం లావయ్యాడు, జుట్టు సగం పైగా రాలిపోయింది.
'ఏరోయ్ హౌజ్ హస్బెండూ! బాగున్నావా?' పలకరించాను. సమాధానంగా ఓ వెధవ నవ్వొకటి నవ్వాడు. వీడికీ జన్మకి ఆ నవ్వు పోదనుకుంటా!
'పెళ్ళికి మన హౌజ్ హస్బెండుగాడొచ్చాడు. వాడి ట్రేడ్‌మార్కైన ఆ వెధవ నవ్వు మాత్రం అలానే వుంది. నీక్కనబడ్డాడా?' భోజనాల తరవాత బయట లాన్‌లో కనబడ్డ ఇంకో స్నేహితుణ్ని అడిగాను.
'వాడిది వెధవనవ్వవొచ్చు గానీ - మనం మాత్రం అసలు సిసలు వెధవలం!' సీరియస్‌గా అన్నాడతను.
ఆశ్చర్యపోతూ క్వశ్చన్ మార్కు మొహం పెట్టాను.
'మనం వాడి మీద ఎన్నెన్నో జోకులేసుకున్నాం. వాడు తెలివైనవాడు కాబట్టే మన కుళ్ళుజోకుల్ని పట్టించుకోలేదు.' అన్నాడు.
'అసలు సంగతి చెప్పు.' అసహనంగా అన్నాను.
'నా భార్య నేను ఆఫీసు నుండి రాంగాన్లే కాఫీ ఇస్తుంది, భర్తగా నన్ను గౌరవంగా చూస్తుంది. అయితే ఏంటి లాభం? గానుగెద్దులా ఉద్యోగం చేశాను. అప్పు చేసి మరీ మా అబ్బాయిని పెద్ద చదువు చదివించాను. వాడికి మంచి ఉద్యోగం వచ్చింది. అప్పులన్నీ తీర్చాల్సిన సమయానికి - ఆ దరిద్రుడు పక్క సీటులో అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపొయ్యాడు. రూపాయి పంపించడు - ఇక్కడ అప్పులకి వడ్డీ కట్టలేక ఛస్తున్నాను.' దిగులుగా అన్నాడతను.
'అలాగా!' సానుభూతిగా అన్నాను.
'అదే ఆ హౌజ్ హస్బెండుగాణ్ని చూడు. మావఁగారితో పెద్ద ఇల్లు కొనిపించాడు. పిల్లల భారం మొత్తం బావమరుదులకి వొదిలేశాడు. ఆ పిల్లలిప్పుడు మంచి పొజిషన్లో సెటిలయ్యారు. పైసా ఖర్చు లేదు. వాడి జీవితంలో తలకిందులుగా తపస్సు చేసినా చిన్నపాటి ఉద్యోగం కూడా వచ్చేది కాదు. వాడు చేసిందల్లా ఏమిటి? వంట చేసి బట్టలుతకడమే కదా!' దాదాపు ఏడుస్తున్నట్లుగా అన్నాడు నా మిత్రుడు!
ఇక్కడితో మా హౌజ్ హస్బెండు గాడి కథ సమాప్తం.
ఈ కథ చదువుతుంటే మీకు పన్నీర్ సెల్వం గుర్తొస్తే సంతోషం. పన్నీర్ సెల్వం కూడా మా హౌజ్ హస్బెండు గాడిలాగే తెలివైనవాడు. ఒక ఎమ్మెల్యే కావాలంటేనే అనేక ఖర్చులు, వెన్నుపోట్లు, నక్కజిత్తులు. అట్లాంటిది కేవలం అమ్మ భక్తుడిగా వుంటూ - అదేపనిగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ - రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా అయ్యాడంటే ఎంత అదృష్టవంతుడు!
రాజకీయాల్లో అందరూ చంద్రబాబు, మమతా బెనర్జీల్లాగా కష్ట పడనక్కర్లేదు. హాయిగా మా హౌజ్ హస్బెండు గాడిలాగా వినయంగా, విధేయంగా, తల వంచుకుని లేదా దించుకుని - పని చేసుకుంటూ పొతే చాలు. అదృష్టం కొంచెం తంతే మంత్రి కుర్చీలోకి, గట్టిగా తంతే ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్లి పడతాం!
ప్రమాణ స్వీకారం సమయాన పన్నీర్ సెల్వం ఉద్వేగంతో కన్నీరు కార్చాడు. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదనే మోటు సామెతల జోలికి వెళ్ళను గానీ - నాకెందుకో పన్నీర్ సెల్వంలో అంట్లు తోమి, బట్టలుతికి జీవితంలో విజయం సాధించిన మావాడు కనిపిస్తున్నాడు! వీళ్ళకి తమ అయోగ్యత, బలహీనతల గూర్చి సంపూర్ణమైన అవగాహన వుంది. అందుకే విజయలక్ష్మిని వరించారు!
పన్నీర్ సెల్వం! హ్యాట్సాఫ్ టు యువర్ తెలివి తేటలు మేన్ ! కీపిటప్!
((photo courtesy : Google)