Thursday 9 October 2014

మానసిక రోగుల ప్రత్యేక సమస్య


ఆ కుర్రాడికి పదిహేడేళ్ళు. దుప్పటి కప్పి హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. కన్సల్టేషన్ రూములోకి వచ్చాక దుప్పటి తీశాడు తండ్రి. ఎడమ వైపు భుజం దగ్గర్నుండి పొట్ట దాకా శరీరం కాలిపోయుంది.

"ఏమైంది?" ఆందోళనగా అడిగాను. 

"పది రోజుల్నించి మళ్ళీ తేడా పడ్డాడు, మందులు మానేశాడు. నేనే దేవుణ్ననీ, తల్చుకుంటే ఏదైనా చెయ్యగలననీ ఒకటే రోల్లుడు." తండ్రి చెప్పసాగాడు. 

"అద్సరే! వొళ్ళెందుక్కాలింది?" అసహనంగా అడిగాను. 

"ఊళ్ళో కుర్రోళ్ళతో అగ్గి ముట్టించినా తన వొళ్ళు కాలదని పందెం కాశాడు. చొక్కా ముట్టించుకున్నాడు. వొళ్ళు తగలబడింది." దిగాలుగా చెప్పాడు తండ్రి. 

"అతనికి ఒంట్లో బాగోక ఏదో అంటాడు. అతనితో పందెం ఎలా కడతారు?" కోపంగా అన్నాను. 

"మా ఊళ్ళో కుర్రోళ్ళు ఈడిని ఎదవని చేసి ఆడిస్తారండి. చెప్పినా వినరు." అన్నాడు తండ్రి. 

నాకా కుర్రాణ్ణి చూస్తుంటే చాలా జాలేసింది. ఒక మానసిక వ్యాధి వున్న రోగితో ఇంత అమానవీయంగా ఎలా వుండగలరు!

ఆ కుర్రాడు నావైపు చూస్తూ గర్వంగా నవ్వాడు. 

"నేను తల్చుకుంటే చిటికినేలుతో రైలు నాపేస్తా, బస్తీ మే సవాల్! నాలో సాంబశివుడున్నాడు. మూడో కన్ను తెరిస్తే సచ్చిపోతావ్!" అంటూ అరవడం మొదలెట్టాడు. 

తండ్రితో ఇంకొంచెం సేపు మాట్లాడాక తెలిసింది - ఈ అబ్బాయిని రెచ్చగొట్టింది అతని వయసువాళ్ళు కాదు, అతనికన్నా పెద్దవయసు వాళ్ళే. ఇతని ప్రవర్తన వాళ్లకి వినోదంగా అనిపించింది. సరదా కోసం రెచ్చగొట్టారు!

ఆ అబ్బాయి కొన్నాళ్ళుగా నా పేషంట్. బైపోలార్ డిజార్దర్ అనే మానసిక సమస్యకి మందులు వాడుతున్నాడు. ఆ జబ్బులో తాము ఎంతో ఉన్నతులమనీ, తమకి సాధ్యం కానిదేదీ లేదనీ, తమలో దైవశక్తులున్నాయని ఊహించుకుంటారు. 

మనలో చాలామందికి మానసిక సమస్యల పట్ల అవగాహన వుండదు. బహుశా అందువల్లనే కావచ్చు - మానసిక రోగుల పట్ల ఉండవలసినంత సున్నితంగా వుండం. ఇందుకు చదువుకున్నవాళ్ళేమీ మినహాయింపు కాదు. కావాలంటే భూతవైద్యుల దగ్గరకెళ్ళి చూసుకోండి - ఎంతమంది చదువుకున్నవాళ్ళుంటారో!

మనసిక సమస్యల గూర్చి ఏ మాత్రం అవగాహన లేనివాళ్ళు మానసిక రోగుల్ని అర్ధం చేసుకుంటారని ఆశించడం దురాశే. పోనీ - కనీసం కంటికి కనపడే అంగవైకల్యంతో ఇబ్బంది పడేవారి పట్లనైనా మన ప్రవర్తన మెరుగ్గా వుంటుందా? వుండదు. 

మా బంధువుల్లో ఒకమ్మాయికి చూపు లేదు. కొన్నాళ్ళ క్రితం ఒక పెళ్ళిలో ఒక ముసలాయన అరుస్తున్నట్లుగా మాట్లాడుతూ (ఆయనకి సరీగ్గా వినపడదు) ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు, నానా ప్రశ్నలతో వేధిస్తున్నాడు. 

"ఏమ్మా! నువ్వు పుట్టు గుడ్డివా? మధ్యలో గుడ్డివా? డాక్టర్లు లాభం లేదని చెప్పారా? నీకు రాత్రికి పగలు క్కూడా తేడా తెలీదా? నీ పన్లు నువ్వు చేసుకోగలవా?" 

ఆ ముసలాయన తన ప్రశ్నల పరంపరతో ఆ అమ్మాయిని వదలట్లేదు. నాకా అమ్మాయితో ఏదో పని వున్నట్లు చెయ్యి పట్టుకుని ఇవతలకి తీసుకొచ్చేశాను. 

"అందుకే నేను ఎక్కడకి రాను. రానన్నా వినకుండా - ముఖ్యమైన పెళ్లి అంటూ డాడీ తీసుకొచ్చారు." దుఃఖంగా అంది ఆ అమ్మాయి. 

నాకు సిగ్గుగా అనిపించింది. 

చిన్నప్పుడు నాక్కూడా ఈ విషయాలు తెలిసేవి కావు. మా వీధిలో వుండే అంగ వికలుల్ని అనుకరిస్తూ ఇంట్లోవాళ్ళకి వినోదం పంచేవాణ్ని. స్నేహితుల్లో కూడా - వ్యక్తుల ఆకారాల్ని బట్టి బండోడు, బక్కోడు అని పిల్చుకునేవాళ్ళం, పైగా అదేదో జోకులాగా ఫీలయ్యేవాళ్ళం.

సినిమావాళ్ళు కూడా వినికిడి సమస్య వున్న వ్యక్తుల్ని, సాఫీగా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే వ్యక్తుల్ని ఎగతాళి చేస్తూ తమ వంతు సేవ చేస్తుంటారు. తెలుగు సినిమా దర్శకులకి క్రియేటివిటీ తక్కువ కాబట్టి హాస్యం కోసం ఇట్లాంటి వెకిలి చేష్టల్ని ఆశ్రయిస్తారు.

ఒక సమాజం ఎంతమేరకు ఎడ్యుకేట్ అయిందో ఎలా తెలుసుకోవాలి? 'ఎంతమందికి టెన్త్ క్లాసు సర్టిఫికెట్లున్నాయి? యూనివర్సిటీ డిగ్రీలున్నాయి?' మొదలైన వివరాలతోనే కాదు - 'ఒక సమస్యని ఏ విధంగా అర్ధం చేసుకుంటున్నారు, ఆ సమస్య పట్ల ఎలా స్పందిస్తున్నారు' అన్నది కూడా ఒక ముఖ్య ప్రమాణం కావాలి.

ముగింపు -

మన సమాజం మానసిక రోగాల పట్ల అవగాహన పెంచుకోవాలనీ.. మానసిక రోగంతో ఇబ్బంది పడేవారి పట్ల సానుభూతి, సున్నితత్వంతో వ్యవహరించాలని ఆశిద్దాం.

అంకితం -

చిన్నారి జె.అఖిల్‌కి. మొన్న మూడో అంతస్తులోంచి 'ప్రమాదవశాత్తు' పడి చనిపొయ్యాడు. ADHD కి ట్రీట్‌మెంట్ ఇస్తున్నాను. ఆ బాబు హైపర్ యాక్టివిటీ అతనికి శత్రువయ్యింది. వైద్యం గూర్చి నన్ను అనేక సందేహాలు అడిగిన ఆ బాబు తల్లికి నా ప్రగాఢ సానుభూతి.

సందర్భం -

నేడు World Mental Health Day. 

(picture courtesy : Google) 

6 comments:

  1. రమణ గారు,
    మిమ్మల్ని మిస్సవుతామేమో అని బాధ పడ్డాను. థాంక్స్. రోజు పొద్దున్నే, ఈనాడు పేపెర్ తర్వాత open చేసెది మీ బ్లాగే.
    మహెష్

    ReplyDelete
  2. కళ్ళు చెమర్చాయి.

    ReplyDelete
  3. Well Said!
    ఒక సమాజం ఎంతమేరకు ఎడ్యుకేట్ అయిందో ఎలా తెలుసుకోవాలి? 'ఎంతమందికి టెన్త్ క్లాసు సర్టిఫికెట్లున్నాయి? యూనివర్సిటీ డిగ్రీలున్నాయి?' మొదలైన వివరాలతోనే కాదు - 'ఒక సమస్యని ఏ విధంగా అర్ధం చేసుకుంటున్నారు, ఆ సమస్య పట్ల ఎలా స్పందిస్తున్నారు' అన్నది కూడా ఒక ముఖ్య ప్రమాణం కావాలి.

    ReplyDelete
  4. వార్త చదివాక కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

    ReplyDelete
  5. "కావాలంటే భూతవైద్యుల దగ్గరకెళ్ళి చూసుకోండి - ఎంతమంది చదువుకున్నవాళ్ళుంటారో!"
    ఇవి అక్షరలక్షల విలువగల మాటలు.

    "తెలుగు సినిమా దర్శకులకి క్రియేటివిటీ తక్కువ కాబట్టి హాస్యం కోసం ఇట్లాంటి వెకిలి చేష్టల్ని ఆశ్రయిస్తారు."
    ఇవి కూడా అక్షరలక్షల విలువగల మాటలు.

    "ఒక సమాజం ఎంతమేరకు ఎడ్యుకేట్ అయిందో ఎలా తెలుసుకోవాలి? .... 'ఒక సమస్యని ఏ విధంగా అర్ధం చేసుకుంటున్నారు, ఆ సమస్య పట్ల ఎలా స్పందిస్తున్నారన్నది కూడా ఒక ముఖ్య ప్రమాణం కావాలి."
    ఇవి కూడా అక్షరలక్షల విలువగల మాటలు.

    ధన్యవాదాలు రమణగారూ. మంచి అవగాహన కల్పించే టపా అందించారు.

    ReplyDelete
  6. మంచి అవగాహన కల్పించే టపా అందించారు thanq sir

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.