Tuesday, 28 October 2014

ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది? పరపీడణ పరాయణత్వం!


పొద్దుట్నుండి టీవీ చూళ్ళేదు. ఇవ్వాళ రోజంతా పేషంట్లతోనే గడిచిపోయింది. అందువల్ల - దేశంలో ఎక్కడ ఏ రైలు పడిపోయిందో, ఎవరు ఎవర్ని తిట్టారో తెలుసుకోవడంలో చాలా వెనకబడిపొయ్యాననే అందోళనతో, ఆత్రుతతో టీవీ ఆన్ చేసి ఓ ఇంగ్లీషు చానెల్ నొక్కాను. ఆశ్చర్యం! దేశం ప్రశాంతంగానే వుంది.

టీవీ చానెళ్ళు నానా రకాలు. కొన్ని చానెళ్ళు అదే పనిగా ప్రకటనలు గుప్పిస్తూ, ఆ ప్రకటనల మధ్యన లేటెస్ట్ హిట్ సినిమా వేసుకుంటూ కళకళలాడుతుంటాయి. పాపం! కొన్ని చానెళ్ళు దివాళా తీసిన బట్టల కొట్టులా, ఐసీయూ పేషంటులా అలిసిపోయి, వెలిసిపోయి బ్రతుకీడుస్తుంటాయి.

నా ఖర్మ కాలి - అట్లాంటి ఒక దిక్కుమాలిన ఛానెల్నే నొక్కాను. ఆ చానెల్లో మైసూరుమహారాజ పేలెస్‌లో జరుగుతున్న దసరా ఉత్సవాల్ని చూపిస్తున్నారు! దీపావళి అయింతరవాత కూడా దసరా ఉత్సవాల్ని చూపిస్తున్నాడంటే ఈ చానెల్‌వాడు ఎంత దరిద్రంలో వున్నాడో అర్ధమవుతుంది! అది మైసూరు పేలెస్.. ఒక క్షణం అలానే చూస్తుండిపొయ్యాను.

పదిహేనేళ్ళ క్రితం అనుకుంటాను - సౌత్ ఇండియా సైకియాట్రీ కాన్ఫెరెన్సుకి మైసూరు వెళ్ళాను. సాధారణంగా కాన్ఫరెన్సులకి వెళ్ళినప్పుడు (విడి సమయంలో) హోటల్ రూం వదిలి బయటికి పోను. టీవీ చూసుకుంటూనో, ఏదో పుస్తకం చదువుకుంటూనో కాలం గడిపేస్తాను. వీలైనంత మేరకు కాన్ఫరెన్సు జరిగే హోటల్లోనే రూం బుక్ చేసుకుంటాను కాబట్టి ఇబ్బంది వుండదు.

మైసూరుకి కుటుంబ సమేతంగా వెళ్లాను. కావున - 'చచ్చినట్లు' సైట్ సీయింగ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. కాన్ఫరెన్సు నిర్వాహకులే మైసూరు మహారాజా పేలెస్ అంటూ తోలుకెళ్ళారు. చూస్తున్నవాళ్ళల్లో కొందరు 'ఆహా! ఓహో!' అంటూ పేలెస్ అందాల్ని చూసి మురిసిపోతున్నారు. నాకు మాత్రం ఆ పేలెస్ డబ్బు, అధికార దర్పానికి వికృత నిదర్శనంగా కనిపించింది.

నాకప్పుడు జాన్ రీడ్ రాసిన 'టెన్ డేస్ దట్ షూక్ ద వరల్డ్' కూడా గుర్తొచ్చింది. నేనా పుస్తకం చదివాను, కొన్నాళ్ళకా సినిమా కూడా చూశాను. బోల్షివిక్కులు అధికార భవనాన్ని ఎంత చక్కగా ఆక్రమించుకున్నారు! మనం మాత్రం ఇక్కడ రాజుల సంపదని, వైభోగాన్ని దర్శిస్తూ ముచ్చట నొందుతున్నాం! పైగా - దసరా ఉత్సవాలు బాగా చేస్తాడని మెచ్చుకోళ్ళు!

నా ఈ గొప్ప ఆలోచనని నా భార్యతో పంచుకున్నాను. ఆవిడ నా అభిప్రాయాన్ని (ఎప్పటిలాగానే) పట్టించుకోలేదు.

అప్పుడు గుర్తొచ్చింది. హైస్కూల్లో వుండగా క్యూలో నించుని సాలార్‌జంగ్ మ్యూజియం చూశాను (ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ చూళ్ళేదు). అప్పుడు నాకో ధర్మసందేహం వచ్చింది.

'ఈ సాలార్‌జంగుకి ఇన్ని డబ్బులెక్కడివి?'

సమాధానం అప్పుడు నాకు తెలీలేదు గానీ - ఇప్పుడు తెలుసు.

రాజులు ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేస్తారు. నిజాం నవాబు పక్కనుండే సాలార్‌జంగుల్లాంటి అసిస్టెంట్లు - ద్రాక్షా సారాయము సేవిస్తూ, అంతఃపుర నర్తకిల నృత్యగానముల్ని తిలకిస్తూ.. మానసికోల్లాసానికి దేశవిదేశాల నుండి ఖరీదైన వస్తువులు సేకరించెదరు. అందువల్ల ప్రజలు శాశ్వతముగా గోచీపాతరగాళ్ళలా మిగిలిపోవుదురు, రాజులు మాత్రం హాయిగా నుందురు.

నాకీ సందేహం ముప్పైయ్యేళ్ళ క్రితం తాజ్ మహల్‌ని చూసినప్పుడు కూడా వచ్చింది.

'ఈనాడైనా, ఆనాడైనా, ఏనాడైనా - సగటు మనిషి జీతం జీవితం ఒక జీవన పోరాటం! ఇక కూలీజనులు కష్టాల జీవితం కడు దుర్భరం. ఈ రాజు ముండాకొడుకులు మాత్రం ప్రజల వద్ద పన్నులు పిండడం - చచ్చిన పెళ్ళాలకి, ప్రియురాళ్ళకి పాలరాతి మందిరాలు కట్టించడం! పైగా - అదేదో ప్రేమకి నిదర్శనమని మనలాంటి బుద్ధి లేని గాడ్డె కొడుకులు మురిసిపోవడం! అసలీ షాజహాను గాణ్ని ఈ తాజ్ మహల్ ఓపెనింగ్ రోజున పైకెక్కించి తోసేస్తే పొయ్యేది. చచ్చి - వెంటనే ముంతాజుని కలుసుకునేవాడు. అసలు నిజమైన ప్రేమంటే అదే!'

'నువ్వు రాసేది తప్పు. ఈ రాజులు చాలా మంచివాళ్ళు. అందునా ఒక మతం రాజులు మరీ మంచివారు. వాళ్ళు రహదారుల పక్కన వృక్షములని నాటించారు, బాటసారుల కోసం సత్రాలు కట్టించారు. ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో నువ్వు చదువుకోలేదా?'

కవులు నానావిధములు. ఒకరకం కవులు కడదాకా ప్రజల పక్షానే నిలబడతారు. వీళ్ళు 'ప్రజాకవులు'. ఇంకోరకం కవులు నిక్కముగా, నిక్కచ్చిగా ప్రభువుల పక్షానే నిలబడతారు. వీళ్ళు 'గిట్టుబాటు కవులు'. మరోరకం కవులు - ప్రజల పక్షాన వున్నట్లుగానే వుంటూ - ప్రభువులు విదిలించే అవార్డులకీ, రివార్డులకీ ఆనందంతో వొళ్ళు పులకించగా, కృతజ్ఞతతో శిరస్సు వొంగిపోతుండగా - ప్రభువుల పక్షాన చేరతారు. అది వారి బలహీనతట! ఈ మూడోరకం కవుల్ని 'ఉభయచర జీవులు' అనాలని రంగనాయకమ్మ రాయంగా చదివాను.

మనం చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్న చెత్తని టన్నుల కొద్దీ కుమ్మరించినవారు గిట్టుబాటు కవులు మరియూ ఉభయచర జీవులు అని నా అనుమానం! రాజుల కన్నా ఆ రాజుల్ని కీర్తించిన కవులే పెద్ద దొంగాముండాకొడుకులని నమ్ముతున్నాను.

ముగింపు -

అసలు మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర చరిత్రేనా? చరిత్ర రాసిన పండితులు రాజులకి ప్రాముఖ్యతనిస్తూ - వారి వంశపాలన ఆధారంగా కాలాన్ని అధ్యాయాలుగా విడగొట్టారు. రాజుల చరిత్ర ప్రజల చరిత్ర ఎలా అవుతుంది? కాంగ్రెస్ చరిత్ర దేశచరిత్ర అవుతుందా? కాదు కదా! ఇది చాలా అసంబద్ధం, అన్యాయం కూడా. ప్రజల వైపు నుండి, ప్రజల తరఫున, ప్రజల కోసం రికార్డ్ చేసిన వాస్తవాలే చరిత్ర అవుతుంది తప్ప - అసత్యాలు, అతిశయోక్తుల సమాహారం చరిత్ర కాజాలదు.

ముగింపుకి ముగింపు -

"ఈ విషయంతోనే మహాకవి శ్రీశ్రీ డెబ్భైయ్యైదేళ్ళ క్రితమే 'దేశచరిత్రలు' అంటూ ఒక మహప్రస్థాన కవిత రాశాడు. ఆ కవిత కాన్సెప్ట్ కాపీ కొట్టేశావేమిటి?"

స్వగతముగా -

'వీడి దుంప దెగ, విషయం పట్టేశాడే!'

ప్రకాశముగా -

"అయ్యో! అలాగా? నాకా శ్రీశ్రీ ఎవరో తెలీదు! ఆయన 'మహప్రస్థానం' అసలే తెలీదు. అయినా - నే పుట్టక ముందు రాసిన కవిత నాకెలా తెలుస్తుంది!? కావున ఇది అచ్చంగా నాకొచ్చిన సొంత ఆలోచనే! శ్రీశ్రీకీ, నాకూ ఒకే ఆలోచన రావడం కేవలం యాదృచ్ఛికం! ఇది మీరు నమ్మాలి."

(picture courtesy : Google)

21 comments:

  1. ‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?’ అనే వాక్యం మొదటిసారి చదవగానే షాకులాంటిది కలిగింది నాకు! అనూహ్యమైన కొత్త చూపు వల్ల ఏర్పడిన సంభ్రమం..! అప్పటికే దీన్ని ఎన్నో సంవత్సరాల ముందు చదివిన లక్షలమందికి ఇలాంటి షాకే కలిగివుంటుంది!

    ReplyDelete
    Replies
    1. ఒకే చిహ్నం (తాజ్ మహల్) & ఒకే వస్తువు (ప్రేమ) తీసుకొని షకీల్ సాహిర్ కవితలలో వ్యత్యాస్యం చూడండి:

      షకీల్ బదాయూని:

      एक शहँशाहूने बनवाके हँसी ताजमहल
      सारी दुनियाको मोहब्बत की निशानी दी है

      సాహిర్ లుధ్యాన్వీ:

      एक शहेंशाहने दौलत का सहारा लेकर
      हम गऱीबोंका मोहब्बत का उड़ाया है मजाक!

      Delete
    2. జై గారు,
      మీరు, ఆ కవులిద్దరు వాస్తవాన్ని వాస్తవం గా చూడలేదు. వాస్తవమేమిటంటె, షాజహాన్ తన మూడవ భార్యయైన ముంతాజ్‌తో పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో పధ్నాల్గవ కాన్పు సమయంలో మరణించింది. ఆమేతో ప్రేమగా ఉండేవాడని మచ్చుకు ఒక్క అధారం కూడా లేదు. చరిత్రకారుల ప్రకారం ఆయన వృదాప్యంలో ఉన్నపుడు అతని ప్రవర్తన క్రింది లింక్ లో పదకొండవ పేరాలో ఉంది చదువుకొండి.

      JAHANARA, a historical novel translated from the French language, is based upon the memoirs of the Mughal princess, written in Persian. Yane Guillaume who had spent several years in India and Afghanistan has brought her imagination of fabulation and sense of history into full play.

      11th para starts with

      The most painful period of her troubled life begins when soon enough her aged father

      http://www.tribuneindia.com/2003/20031123/spectrum/book6.htm

      దేశ విభజనానంతరం సాహిర్ లుధ్యాన్వీ రెండేళ్లు కూడా పాకిస్తాన్ లో ఉండలేక, లాహోర్ ను వదలి హిందుస్థాన్ కి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి అద్నాన్ సమి వరకు కవులు,కళాకారులు బాంబే లో స్థిరనివాస మేర్పరచుకొంట్టున్నరు. రహత్ ఫతెహ్ అలీఖాన్ , అతిఫ్ అస్లం, అలి జఫర్, హుమైమా మాలిక్, మీరా, జేబా భక్తియార్, వీణా మాలిక్ లాంటివారు ఇక్కడికి వచ్చి క్షేమంగా తిరిగివారి స్వస్థలాలకు వెళుతున్నారు. వీరంతా శివసేనా, బిజెపి హిందుత్వ వాదుల అడ్డా అయిన బాంబే లో వచ్చి పోతున్నారు,వీలైతే సేటిల్ అవుతున్నారు.ఎంత మంది హిందుస్తాని కవులు, కళాకారులు లహోర్, పెషావర్,ఇస్లామాబాద్,రావల్పిండి, కరాచి కి వెళ్లి స్థిరపడ్డారు? కనీసం ఎవరైనా ఆసక్తి చూపినట్లన్నా ఎక్కడైనా చదివారా? అందరు పాలకులు ఒకలాగైతే ఈ పాటికి ఇండియా నుంచి చానా మంది లైన్ కట్టి పాకిస్థాన్ కి వెళ్లి స్థిరపడి ఉండేవారు కదా! కాదంటారా?

      Delete

  2. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం
    ప్రూఫు రీడింగ్ చేసిందెవ్వరు
    అచ్చొత్తిన అ కార్మికులెవ్వరు
    శ్రీశ్రీ‌ మాత్రం చెప్పాడా?

    మహాప్రస్థానం మంచి పుస్తకం
    నిఘంటుపదజాలపటాటోపం
    సంస్కృతసమాసభూయిష్టం
    సగటుమనషికోసం కవిత్వం

    తాజ్ మహల్ దేవు డెరుగును
    ఇంత సంస్కృతం ఎవరు నేర్పిరో
    ఏఏ కవులను చదివాడో
    శ్రీశ్రీ మాత్రం చెప్పాడా?

    తానూ ఇళ్ళను కట్టించాడే
    వాటిని కట్టిన కూలీ లెవరో
    వారిని గురించి వ్రాసాడా
    తన సంగతి తానే చెప్పడు

    ReplyDelete
  3. >>> ఒక మతం రాజులు మరీ మంచివారు.

    అవును. వారు మాత్రమే చెట్లను త్రవ్వించెదరు, రోడ్లను కట్టించెదరు, చెరువులను నాటించెదరు. వారిపై ఈగ వాలరాదు.

    ఇతరులు అవేమీ చేసే అవకాశము లేదు. వారు చేసినవి కళ్ళముందు కనపడిననూ ఒప్పుకొనుట పాపము.

    ReplyDelete
  4. రాజులందరూ నీచులే అన్న అవగాహనను అంగీకరించ లేను. హెచ్చుమంది రాజులు చెడ్డవారు కావచ్చును. కాని మంచివారూ ఉత్తములూ కూడా కొందరు రాజులు ఉండవచ్చును కదా?

    అలాగే ఏ రంగంలో ఉన్నవాళ్ళనైనా హెచ్చు మంది మీద సమాజానికి ఉన్న అవగాహనను మనం సార్వజనీనం చేయరాదు. ఆ రంగంలోనూ యోగ్యులూ భిన్నమైన వ్యక్తిత్వం కలవారూ తప్పక ఉంటారు.

    పెట్టుబడిదారులంతా చెడ్దవాళ్ళే, కమ్యూనిష్టులంత మంచివాళ్ళే అన్న అవగాహననూ మీరు సార్వజనీనంగా చెప్పగలరా? మేథావులుగా చెలామణీ అవుతున్నవారంతా సమాజశ్రేయస్సు కోసం నిజంగా పాటుపడే వాళ్ళే అని కూడా చెప్పగలరా?

    ReplyDelete
    Replies
    1. ఈ వ్యాఖ్య బాగా ఆలోచించాక వచ్చిన అభిప్రాయం (considered opinion) కాదు, కేవలం బిగ్గరగా చేస్తున్న ఆలోచన (thinking aloud) అని గమనించగలరు.

      ఇక్కడ కొన్ని మిధ్యలు ఉన్నాయి. అనేక కారణాల వల్ల ఈ రెంటికీ బహుళ ప్రాచుర్యం వచ్చింది.

      1. రాజులు (దొరలు) అందరూ (లేదా దాదాపు అందరూ) దుర్మార్గులు
      2. వారు చేసే దుర్మార్గాలకు మూల కారణం వారి నైజం
      3. ఈ దురాగాతాలను భరించలేని బడుగు జీవులు తిరుగుబాటు చేస్తారు

      రంగనాయకమ్మ/మాదాల రంగారావు/ఆర్. నారాయణ మూర్తి తరహా ఫార్ములాకు పై విషయాలు కీలకం. పరమ నీచుడయిన రాజు ప్రజలను పన్నులతో చంపడమే కాక (హీరో చెల్లెలితో సహా) బీద మహిళలపై అత్యాచారం చేస్తాడు. హీరో తన వ్యక్తిగత దుఖాన్ని పక్కన పెట్టి జనాల్ని పోగు చేసి రాజును గద్దె దించి విప్లవానికి నాంది పలుకుతాడు. కథ సుఖాంతం.

      ఇదే తరహా మిధ్యలకు దాసరి/విశ్వనాథ్ తరహా "బూర్జువా" రూపాంతరం కొద్దిగా మారుతుంది. ఇందుట్లో రాజు పేదా ఇద్దర్లోనూ మంచి/చెడు వారు ఉంటారు అయితే ఒక వ్యక్తి చేష్టలకు అతని నిజమే కారణం అన్న సిద్దాంతం మాత్రం యధాతధం. ఇక్కడ మహారాజు గుమ్మడి తరహా మంచివాడు కానీ ఆయన రెండో భార్య (సూర్యకాంతం) తమ్ముడు (సత్యనారాయణ) ప్రజలను పీక్కు తింటాడు. పనిలోపనిలా సవితి తల్లి బాధలకు తల్లడిల్లే యువరాణి నిరుపేద హీరోను ప్రేమిస్తుంది. షరా మామూలుగా విలన్ హీరో చెల్లెల్ని చెరిచాక సదరు దుర్మార్గుడిపై హీరో గారి నాయకత్వంలో తిరుగుబాటు. నిద్ర మేల్కొన్న రాజు గారు తన కూతురిని రాజ్యాన్ని రామారావుకు కట్టపెట్టి మళ్ళీ సినిమా పాత్ర వచ్చేదాకా తొంగుంటాడు.

      This is the power of our dream merchants! ఫార్ములానా మజాకా!

      Delete
    2. నీచులా కాదా అని చర్చించే ముందు "నీచత్వం అనగా నేమి?" అన్న ప్రశ్న వేసుకోవాలి.

      ప్రజల్లో అనేకులు దరిద్రులుగా వుండగా విశాలమైన భవంతులలో అష్టైశ్వర్యాలతో రాజు తులతూగాడు అంటే అది శ్రమదోపిడీ లేకుండా సాధ్యమా?

      ఒకవేళ ఏ రాజైనా "ప్రజలంతా సమానం" అంటూ తన గొడ్డూ గోదా, ఇల్లూ వాకిలీ ప్రజలకు పంచాడనుకోండి. ఇక మరుక్షణంలోనే అతని కుర్చీ వుండదు. కాబట్టి అతను ఆ తర్వాత రాజుగా కొనసాగే అవకాశం లేదు.

      కాబట్టి రాజుగా వుండాలనుకునే వాడు ఏదో ఒక్కటే ఆచరించ గలడు. రెండూ ఏకకాలంలో ఆచరించ లేడు.

      Delete
    3. మీరట్లా అనకూడదు. ప్రస్తుత చర్చానేపధ్యంలో ఒక వ్యక్తి చేసే పనులకు ఆయన వ్యక్తిగత మంచి/చెడులకే తప్ప ఆయన సాంఘిక పాత్రకు సంబంధం లేదు, ఉండడానికి వీల్లేదు.

      అంచేత రాయలు మంచివాడు, ఉస్మాన్ అలీ ఖాన్ చెడ్డవాడు. దీన్ని ఒప్పుకోని వారందరూ తెలబానులు.

      Delete
    4. < రాజుగా వుండాలనుకునే వాడు ఏదో ఒక్కటే ఆచరించ గలడు. రెండూ ఏకకాలంలో ఆచరించ లేడు. >

      u r right sreekanth chari garu.

      Delete

  5. @శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం
    ప్రూఫు రీడింగ్ చేసిందెవ్వరు
    అచ్చొత్తిన అ కార్మికులెవ్వరు
    శ్రీశ్రీ‌ మాత్రం చెప్పాడా?

    శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం
    ప్రూఫు రీడింగ్ చేసిందెవ్వరు
    అచ్చొత్తిన అ కార్మికులెవ్వరు
    శ్రీశ్రీ‌ మాత్రం చెప్పాడా?

    అవునవును శ్రీ శ్రీ వ్రాసినదంతా మార్చి వ్రాస్తే కాని మహా ప్రస్థానం పనికిరాలేదు, అది చేసిన ప్రూఫ్ రీడర్స్ ఎవరో చెప్పకపోవడం దుర్మార్గం. ప్రూఫ్ రీడర్స్ కూడా నానా చెత్త వ్రాస్తే అచ్చేసినవాడు పుణ్యం కట్టుకొని కాస్త విషయాన్ని నింపాడు . కాబట్టి అచ్చొత్తిన వాడికి భారత రత్న ఇవ్వకపోవడం నీచం .

    ReplyDelete
  6. @కాని మంచివారూ ఉత్తములూ కూడా కొందరు రాజులు ఉండవచ్చును

    ఉన్నారు కాని వారు రాజరికం ని వ్యతిరేకించారు. ఇక వారు రాజులే కానపుడు మంచి రాజు ఎలా అయ్యారు???????????? కదా?

    ReplyDelete
  7. శ్యామలీయం గారు, చక్కగా చెప్పారు.

    తాజ్ మహలుకు రాళ్ళెత్తిన కూళీలెవ్వరు?
    అనవసరం. ఎవ్వరైనా ఎత్తి ఉండొచ్చు. దానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. తాజ్ మహలును డిజైన్ చేసిన వాడిని గురించి చెప్పుకోవచ్చు. అంత గొప్ప కట్టడాన్ని కట్టడానికి కావలసిన ప్రేరణనూ మెచ్చుకోవచ్చు. కూళీల గొప్పదనం ఏముంది ఇక్కడ? కాదు అదంతా కూలీల గొప్పదనమే అని అంటారా? సరే అయితే..

    మహా ప్రస్తానం గురించి శ్యామళీయం గారు రాసిన దానికి నా కొనసాగింపు...

    శ్రీ శ్రీ రాసిన కవిత్వం ఒక పక్క
    ఆ కవిత్వం రాయబడిన కాగితం మొరొక పక్క
    కవిత్వమా, కాగితం చేసిన కార్మికుడా?
    కవిత్వమా? పెన్ను చేసిన కార్మికుడా?
    కవిత్వమా? పెన్నులో ఇంకు నింపిన కార్మికుడ?

    శ్రీ శ్రీ, అచ్చు తప్పులు లేకుండా రాసాడే అనుకున్నా, కాగితం, పెన్నూ కూడా తానే తయారు చేసుకుని రాయలేదు కదా? బహుషా ఏ టేబులు మీదనో, రైటింగ్ ప్యాడు మీదనో కాగితం పెట్టి రాసుంటాడు. ఆ రైటింగ్ ప్యాడూ, టేబులు తయారు చేసిన కార్మికుడెవ్వరు?

    ఇక మీదనుండి, శ్రీ శ్రీ మహా ప్రస్థానం అయినా మరొకటైనా, మనం పొగడాల్సింది ఆ రాతలను కాదు. ఆయా వస్తులను తయారు చేసి ఇచ్చిన కార్మికూని మాత్రమే. కాబట్టి, శ్రీ శ్రీకి ఇచ్చిన గౌరవం ఇక మీదట ఇవ్వనవసరం లేదు.

    ReplyDelete
  8. ఈనాడు మాత్రం మారిందేమిటి? పేర్లు మారాయి.ఆనాడు రాజులైతే ఈ నాడు మంత్రులు. ''చెట్లను త్రవ్వించెదరు, రోడ్లను కట్టించెదరు, చెరువులను నాటించెదరు'' ఈ నాడు రోడ్లు, రైలు మార్గాలు మరియు ఇండిస్ట్రియల్‌ కారీడార్లు నిర్మింతురు, సెజ్‌ లు ఏర్పపరిచెదరు. ఉచిత విధ్యత్‌ నిత్తురు, కిలో బియ్యం రెండ్రూపాయలకిత్తురు, ఉచిత గోచి, ఉచిత చీర మరియు ఉచిత ప్యానులు, గ్రైండర్లు, మిక్సీలు నిత్తురు, కొండకచో ఎన్నికలప్పుడు ఓటుకు వెయ్యిరాపాయలనిత్తురు. అదేలాగునా, ఆరోజు రాజులకు డబ్బులెక్కడవో తెలియనట్లె ఈ రోజుకూడా ఇవన్ని చేయటానికి డబ్బులెక్కడవోబ్‌ తెలియదు. ప్రజలపై పన్నులు వేతురు ప్రజల్ని పీడింతురు అన్నసంగతి ఆనాడు ఎలా తెలియదో ఈనాడు అలానే తెలియదు. శ్రీ కృష్ణ దేవరాయలు, మైసూర్‌ మహారాజ, సాలార్‌ జంగు ఎంతగొప్ప ధాన పరులో ఈ నాటి మన రాజ కీయ్తులు అంతే గొప్ప దానపరులు. రాజు అనే వాడు గొప్ప దైవాత్మ సంభూతుడు, రాజు అధి కారం నిరపేక్ష మైనది అలాగే ఈనాడు ఎన్ని కుంబకోణాలలో పల్గొన్నారు అనే దానితో నిమిత్తం లేకుండా వారి మీద ఈగ వాలితే వారి పార్టీ ప్రజలు సహించ లేరు.

    ReplyDelete
  9. నా పోస్ట్ చదివి కామెంటిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    కామెంట్లు రాసినవారి ప్రొఫైల్స్ నాకు బాగా పరిచయం కాబట్టి - కామెంట్లు చదవకుండానే పబ్లిష్ చేశాను - సమయం లేక (అవన్నీ ఇప్పుడే చదివాను).

    (ఒక్క 'శుక్రాచార్య' గారి కామెంట్ మాత్రం ఇందాక చదివి పబ్లిష్ చేశాను.)

    శ్రీశ్రీ 'దేశచరిత్రలు' నాకు చాలాచాలా ఇష్టమైన కవిత, ఎన్నిసార్లు చదివుంటానో లెక్కలేదు. ఆ కవిత ప్రభావం వల్లే నాకు రాజులంటే ఎలర్జీ.

    ఈ పోస్ట్ శీర్షిక ముందుగా - 'ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది? పరపీడణ పరాయణత్వం!' అనుకున్నాను. కానీ చివర్లో మార్చాను. 'నీచుడు' అన్న పదం రాకుండా వుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది.

    మిత్రులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. రమణ గారూ.! పాలకులను నిందించటంలో, దూషించటంలో మన ప్రాచీన కవులేమీ వెనకబడిలేరు...

      ‘రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు’ ( ధూర్జటి)
      ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెట పోటులం బడక ’ (పోతన)

      Delete

  10. ఏమిటో వీరి ఆరాటం ! వీరు నీచుదన్నా, గోప్పోడన్నా బాల్చీ తన్ని న వాళ్ళు మళ్ళీ వచ్చి మార బోతారా ??

    ఇక రాజులు మణి హర్మ్యాలు కట్టు కో కుంటే ఇక కూలీ ల కి పని ఎవరు ఇస్తారు ? బువ్వ ఎవరు బెడ తారు ??

    ఈ కాలపు ఐటీ కారిడార్ ఆఫీసు లు రాజు ల మణి హర్మ్యాల కన్నా సెహ బాష్ అన్న రీతి లో ఆఫీసు కాంప్లెక్సులు ఉన్నాయే వీటిని ఏమి అనాలి ?

    మా బెంగళూరు మహా నగరం లో లీలా ప్యాలసు అనబడు ఒక ఆకాశ హార్మ్యం అనబడు ఐదు నక్షత్రముల హొటేలు ఉన్నది ! దాని షోకులు ఆ కాలపు రాచ వాడల కి సరి పోదు ! వీటిని ఈ కాలము లో నూ డబ్బులు బెట్టి మరీ ఆదరణ ఇస్తున్నామే మరి !

    అంతా 'పనిలేక' మాయ!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  11. రాజుని ఎన్నుకునే అవకాశం అప్పుడు ప్రజలకు లేదు. అందుకే రాజు నీచుడైనా, మంచివాడైనా భరించారు.
    మరి ఇప్పుడు పాలకులని ఎన్నుకునే అవకాశం ప్రజలకి ఉన్నా ఎక్కువగా అలాంటివాళ్ళనే ఎందుకు ఎన్నుకుంటున్నారు?

    ReplyDelete
    Replies
    1. కం. ఒక పులిరా జొక సింగము
      నొక నక్కయు నొక్క కిటియు నొక్క యెలుగు నా
      నకటా మనయభ్యర్థుల్
      ప్రకటంబున నందరిట్టి వారుగ నుండన్

      ఆ. వె. మంచివారి నెట్లు మనకెన్ను కొననగు
      ఎన్నుకొనక తీర కున్న వేళ
      ధనపిశాచములకు దక్కవా విజయాలు
      మంచివార లణగిమణగి బ్రతుక

      Delete
  12. My 2paisa and some lateral thinking ....
    This must be survival instinct for a society.
    Create a big pyramid and survive in its shadow.
    Without the temples of angkor wat the revolution in their agriculture is impossible. Of course once the water stopped flowing these temples stopped flourishing. These power centers, power structures must be part of our evolution. But the question is are we at a point where we evolved to get rid of these power structures?

    ReplyDelete
  13. చాలా నచ్చింది.
    ముఖ్యంగా మీ తిట్లు చదువుతున్నప్పుడు వచ్చిన చిరునవ్వు,వ్యాసం చివర దాకా మొహం మీద నుంచి చెరగలేదంటే నమ్మాలి మీరు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.