Sunday 26 October 2014

రేహనే జబ్బారి! సారీ తల్లీ!


నిన్న ఇరాన్‌లో రేహనే జబ్బారి అనే అమ్మాయిని ఉరి తీశారు. ఆ అమ్మాయి ఒకణ్ని కత్తితో పొడిచి చంపిందట! గల్ఫ్ దేశాల్లో శిక్షలు కౄరంగానూ, అమానవీయంగానూ వుంటాయి. ఇందుకు వాళ్ళేవో కారణాలు చెబుతారు కానీ - అవి నాకు అర్ధం కావు. 

'నేరం - శిక్ష' అన్నవి ఆయా సమాజాల పురోగతిని తెలియజేస్తాయని అనుకుంటున్నాను. చైనాలో మరణ శిక్షలు ఎక్కువ. యూరోప్‌లో మరణ శిక్షలే లేవు. ఈ యార్డ్‌స్టిక్‌తో చూస్తే - యూరోపియన్ దేశాలు మంచివనీ, చైనా చెడ్డదనీ అనుకోవచ్చు. అలాగే - అమెరికావాడి కన్నా మనం చాలా మంచివాళ్ళం.

అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది. 'శిక్షలు ఆయా దేశాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల్ని బట్టి చేసుకున్న శాసనాల్ని అనుసరించి నిర్ణయించబడతాయేగానీ - అన్ని దేశాలకీ ఒకే యార్డ్‌స్టిక్ ఎలా వాడతాం?' అని. ఇందులో వాస్తవం వుంది కూడా.

అన్ని మతాల్ని, సంస్కృతుల్ని గౌరవించినట్లుగానే ఆయా దేశాల శిక్షాస్పృతుల్ని గౌరవించాలని కొందరు వాదించొచ్చు. ఒప్పుకుంటున్నాను. నేరవిచారణ, శిక్షాస్పృతి వంటి విషయాలు చర్చించాలంటే బోల్డంత సాంకేతిక పరిజ్ఞానం కావాలి. నాకది లేదు కాబట్టి ఇక్కడితో ఈ విషయం వదిలేస్తాను.

అయితే - ఒకానొక దేశంలో భార్యపై అనుమానం వచ్చినా చాలు - హాయిగా ఆమె పీక పిసికేసుకోవచ్చనో.. అరటిపండు దొంగైనా చాలు - వాడి అరిచెయ్యి అందరిముందు కులాసాగా నరికేసుకోవచ్చనో.. లాంటి శిక్షలు విన్నప్పుడు నా కడుపులో తిప్పుతుంది. ఇలా నా కడుపులో తిప్పడం - ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమో, కొందరి మతవిశ్వాసాల్ని అగౌరవపర్చడమో అయినట్లైతే - అందుకు నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.  

ఒక దేశంలో మలేరియా, టైఫాయిడ్‌తో జనాలు చస్తున్నారంటే ఆ దేశంలో ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ దరిద్రంగా వుందని చెప్పొచ్చు. ఒక దేశంలో చిల్లుచెంబులు కూడా దొంగతనానికి గురవుతున్నాయంటే, ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరమ దౌర్భాగ్యంగా వుందని చెప్పొచ్చు. ఒక దేశంలో కొరడా దెబ్బలు, రాళ్ళతో కొట్టి చంపడాలు లాంటి కౄరమైన శిక్షలు అమలవుతున్నాయంటే, ఆ దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టం అత్యంత ఆటవికంగా వుందని చెప్పొచ్చు. 

'రేహనే జబ్బారి ఇరాన్ పౌరురాలు. ఆ దేశంవాళ్ళు వాళ్ళ చట్టాలని అనుసరించి విచారించారు, నేరస్తురాలిగా తేల్చారు, చట్టప్రకారం ఉరి తీశారు.' అని కొందరు అనుకోవచ్చు. కానీ - నాకు మాత్రం బాధగా వుంది. నేరస్తుల్ని - వాళ్ళు చేసిన నేరానికి తూకం సరిపొయ్యేంత కౄరంగా శిక్షించాలనే ఆలోచనని తీవ్రంగా వ్యతిరేకించే నాకు - రేహనా జబ్బారి ఫేట్ పట్ల జాలిగా అనిపిస్తుంది.

ఒక విశ్వమానవుడిగా (సాటి మనిషిగా) అనుకుంటున్నాను - 

"రేహనే జబ్బారి! సారీ తల్లీ!"

(picture courtesy - Google)

4 comments:

  1. ఎందుకు ఆవిడ అతన్ని పొడిచి చంపిందో అలోచించ్ కుండా విచారించ కుండా వేలికి వేలు, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, ప్రాణానికి ప్రాణం (అర్ధం అయ్యిందనుకొంటా) ఉరి తీస్తే మాత్రం శొచనీయమే!! నేనీ వార్త చదవలేదు విషయం ఏమాత్రం తెలీదు.
    గౌతం

    ReplyDelete
    Replies
    1. http://en.wikipedia.org/wiki/Reyhaneh_Jabbari

      ఇదో 1st degree murder అనుకుందాం. కానీ - ఇదేమిటి!? -

      After her arrest, Reyhaneh was kept in solitary confinement for two months, without access to her family or a lawyer.

      Delete
  2. //ఒక దేశంలో మలేరియా, టైఫాయిడ్‌తో చస్తున్నారంటే ఆ దేశంలో ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ దరిద్రంగా వుందని చెప్పొచ్చు. ఒక దేశంలో చిల్లుచెంబులు కూడా దొంగతనానికి గురవుతున్నాయంటే, ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరమ దౌర్భాగ్యంగా వుందని చెప్పొచ్చు. ఒక దేశంలో కొరడా దెబ్బలు, రాళ్ళతో కొట్టి చంపడాలు లాంటి కౄరమైన శిక్షలు అమలవుతున్నాయంటే, ఆ దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టం అత్యంత ఆటవికంగా వుందని చెప్పొచ్చు. //
    ఇవన్నీ ఏ యాడ్‌ స్టిక్‌ తో కొలిచారు? ఈలాంటి యాడ్‌ స్టిక్‌ మీరు కలిగి ఉండటమే మీరు పరమ భయంకర వాదులని తెలియజేస్తుంది. నేను కొలిచిన యాడ్‌ స్టిక్‌ ఇరాన్‌ వాల్లది. ఆయా దేశాల్లో కొంతమందిని ఉరి తీసీ మాదేశం న్యాయానికి, ధర్మానికి కట్టు బడి ఉన్నది. ధర్మం నాలుగు పాదాలనడుస్తూన్నది. మేము గొప్ప నాగరికతను సాధించాము. ఏమాత్రం తేడా ఉన్న వాల్లని నాలుగు పాదాల మా ధర్మ దేశంలో ఏ మాత్రం సహించి ఉంచుకోము అని ప్రపంచానికి చాటుకొని సంతృప్తి చెందు తుంటారు.వాడు ఆమెను రేప్‌ చేస్తుంటే కిక్కురుమని పడiu్మ్డకుండా వాన్ని చంపేయటం ఏ యాడ్‌ స్టిక్‌ తో సరిపోద్ది చెప్పండీ? ఆ అమే ఆత్మ విన గలిగితే నా సారి కూడా చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. కౄరమైన శిక్షలు వల్ల నేరాలు తగ్గుతాయని ఈమధ్య మనవాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మీడియా కూడా వీరిని సమర్ధిస్తూ / రెచ్చగొడుతూ తమ వంతు పాత్ర పోషిస్తుంది.

      ఉరిశిక్షని సెలబ్రేట్ చేసుకున్న దేశంలో మనం వున్నాం!

      Delete

comments will be moderated, will take sometime to appear.