Friday 31 October 2014

చెత్తమనిషి


"అయనెంత పెద్దనాయకుడు! ఏ మాత్రం భేషజం లేకుండా రోడ్లూడుస్తున్నాడే! ఇన్నాళ్ళూ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అసలైన సమస్య అపరిశుభ్రత. అది ఆయన చెబ్తేగానీ మనం తెల్సుకోలేపొయ్యాం! దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికిదే రాచమార్గం. రా! నువ్వూ ఓ చీపురు తీసుకుని ఊడువు!"

"ఈ రోడ్లూడవడానికి పారిశుధ్య కార్మికులున్నారు. పర్యవేక్షించడానికి మునిసిపాలిటీ వుంది. ఆ వ్యవస్థని మెరుగు పరిచే ఆలోచన తరవాత చేద్దాం. కానీ అంతకన్నా ముఖ్యమైనది - మనూరి చెరువు సమస్య. ఆ మందుల కంపెనీవాడు వదిలే కాలుష్యంతో చెరువు విషంగా మారిపోతుంది. ఈ సంగతి ఆ పెద్దనాయకుడుగారికి చెప్పి కాలుష్యాన్ని ఆపించరాదా?"

"అదెలా కుదురుతుంది? మందుల కంపెనీవాణ్ని ఇబ్బంది పెడితే ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పోవా? రేపు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారు? అన్ని నిబంధనలు తూచా పాటించేట్లైతే ఆ కంపెనీవాడు వాళ్ళ దేశంలోనే మందులు తయారుచేసుకునేవాడు కదా! మన్దేశంలో మందుల ఫ్యాక్టరీ ఎందుకు పెడతాడు?"

"ఒకపక్క జనాలు చస్తున్నా పట్టించుకోనప్పుడు - రోడ్ల మీద చెత్తకాయితాలు ఊడవడం దేనికి?"

"పిచ్చివాడా! చెత్త అనునది అనారోగ్య హేతువు, దేశానికి దరిద్రం. నీ అధర్మ సందేహాలు వీడి - నువ్వూ ఓ చీపురు చేత బుచ్చుకో! నీక్కూడా ఓ ఫొటో తీయిస్తాలే!"

"ముందా కాలుష్యం సంగతి తేల్చు, అప్పుడూడుస్తా!"

"అన్నా! వీడితో మాట్లాడేదేంది? వీడెవడో చెత్తమనిషిలా వున్నాడు. అరేయ్! రోడ్డు మీద చెత్త సంగతి తరవాత - ఎట్లాగూ ఫోటోగ్రాఫర్ రావడానికి ఇంకా టైముంది. ఈలోపు ఈ చెత్తనాకొడుకుని ఎత్తి ఆ చెత్తకుండీలో నూకండిరా!" 

(picture courtesy : Google)

2 comments:

  1. మనసులో ఉండే చెత్తను బయటకు నెట్టలేక కనీసం రోడ్ల మీద ఉండే చెత్తనన్న ఊడ్చి పారెయ్యాలనుకుంటే ఇవేమిటి చెత్త మాటలు చెత్త బుట్ట! కాలుష్యం ఎక్కడ లేదు? ఇందుగలడందులేడనలేని కాలుష్యంతో నిండిపోయినప్పుడు ఆ మాత్రం ప్రజల దృష్టి మరల్చొద్దు?

    ReplyDelete
  2. వైద్యులు గారు,
    ఒక చిన్న అభ్యర్ధన ! (నిజ్జంగా అభ్యర్ధనే )
    ప్రస్తుతం వున్న కేంద్ర ప్రభుత్వం చేసిన లేక మొదలు పెట్టిన ఏ పనైన మీకు మంచింది అని అనిపించిందా?
    ఏ ఒక్కటైనా, ఎంత చిన్నదైన ఫర్లేదు. అలా అనిపిస్తే, మీరు దాని పొగడఖర్లేదు, నా కామెంటుకి తిరుగు కామెంటు కింద చెప్పండి చాలు.
    For any reason you can't write here, feel free to write to me in person.
    Again, you will be doing a great help to me if you could honor my request. Because that will help me to understand few things I am perplexed about.
    If you don't write or reply, I guess, I can assume you didn't find any.

    Thanks much for your time and help,
    కృష్ణ

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.