Sunday 21 December 2014

ఇవ్వాల్టి ఆంధ్రజ్యోతి చూడు


పొద్దున్నే స్నేహితుడి ఫోన్.

"ఇవ్వాళ ఆంధ్రజ్యోతి పేపర్ చూశావా?"

"చూళ్ళేదు, ఏం?" 

"ఇవ్వాళే వారం?"

"ఆదివారం."

"ఆదివారం ఆ పేపర్ ఓనర్ తన రాజకీయ విశ్లేషణ చాంతాడంత రాసుకుంటాడని విమర్శిస్తుంటావ్?" 

"అవును, మామూలుగానే ఆ పేపర్ చదవను. ఆదివారం చదివే ధైర్యం మాత్రం అస్సల్లేదు." 

"ఎందుకని? నీకో న్యాయం, ఆంధ్రజ్యోతి ఓనరుకో న్యాయమా?"

"ఏవిఁటోయ్ నీ గోల?"

"గుర్తు తెచ్చుకో. చిన్నప్పుడు పోలీస్ పెరేడ్ గ్రౌండులో క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఘోరంగా ఔటైనా ఏదొక వంక చెప్పి ఆ ఔట్ ఒప్పుకునేవాడివి కాదు, ఏం చేస్తాం? బ్యాట్ ఓనరువు నువ్వేనాయె! నీ కుతి తీరేదాక బౌలింగ్ చెయ్యలేక చచ్చేవాళ్ళం."

"ఆ మాటంటే నేనొప్పుకోను. నేనో పెద్ద బ్యాట్స్‌మెన్‌ని." 

"సరీగ్గా ఆంధ్రజ్యోతి ఓనర్ కూడా నీలాగే అనుకుంటూ వుండొచ్చుగా?"  

"దానికీ దీనికీ సంబంధం ఏంటి!?"

"సంబంధం ఎందుకు లేదు మిత్రమా? అవ్వాళ నీ చేతిలో బ్యాటు, ఇవ్వాళ ఆంధ్రజ్యోతి ఓనర్ చేతిలో పేపర్ ఒకటే కదా! బ్యాట్ నీదని ఇష్టమొచ్చినంతసేపు బ్యాటింగ్ చేసేవాడివి. పేపర్ ఆయన్ది కాబట్టి ఇష్టమొచ్చింది ఆయన రాసుకుంటున్నాడు. నువ్వో పెద్ద బ్యాట్స్‌మెన్‌వని నీ ఫీలింగు, ఈయనో గొప్ప జర్నలిస్టునని ఈయన ఫీలింగు! ఒకరకంగా నీకన్నా పేపర్ ఓనరే నయం!"    

"ఎలా?" 

"అది చెబ్దామనే ఫోన్ చేశాను. ఆయనివ్వాళ తన గొప్ప విశ్లేషణ ఆపాడు, ఆ ఎడిట్ పేజిలో ఇంకేవో వ్యాసాలు పబ్లిషయ్యాయి. ఓనర్‌కి బ్యాటింగ్ బోర్ కొట్టిందేమో!"

"దుర్మార్గుడా! ఇది చెప్పడానికేనా ఫోన్ చేసింది?"

"అవును. బోడి ముప్పై రూపాయిల బ్యాట్ వున్నందుకే సర్వహక్కులూ ప్రకటించుకుని స్నేహితుల్ని క్షోభ పెట్టిన నువ్వు, ఆయనేదో తన పేపర్లో విశ్లేషణ పేరుతో ఏదో రాసుకుంటుంటే విమర్శిస్తావా? నీకా నైతిక హక్కు ఎలా వుంటుంది?"

"..... "

"హి హి హి! నోట్లోంచి మాటొస్తున్నట్లు లేదు! ఇవ్వాల్టి ఆంధ్రజ్యోతి పేపర్ చూడు, వుంటాను!"   

(picture courtesy : Google)     

3 comments:

  1. ఇంతకూ ఆ 30 రూపాయల బ్యాట్ ఉందా ? ఏమయింది ?

    ReplyDelete

  2. పని లేక రమణ గారు,


    అదేదో 'ప్రతిష్టాత్మక' పాట ఒకటి ఉంది ! - జోతిలక్ష్మి చీర కట్టింది అంటూ ....


    జిలేబి

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.