Saturday 28 March 2015

నేడు శ్రీరామనవమి - 'థాంక్స్ టు ఎన్టీఆర్'


ఇవ్వాళ శ్రీరామనవమి. నేను ప్రతి శ్రీరామనవమి రోజునా - 'థాంక్స్ టు ఎన్టీఆర్' అనుకుంటాను! ఎందుకంటే - ఎన్టీఆరే గనక సినిమాల్లో శ్రీరాముడిగా నటించకపోయినట్లైతే - నాకు శ్రీరాముడు గుర్తుండే అవకాశం లేదు! 'రాముడు, సీత' అంటూ చిన్నప్పుడు క్లాసు పుస్తకాల్లో కొంత చదువుకున్నాను గానీ - పరీక్షలైపోంగాన్లే, మార్కుల కోసం సంపాదించిన పుస్తక జ్ఞానాన్ని - పాము కుబుసం విడిచినట్లుగా వదిలియ్యడం నాకలవాటు. కానీ - సీతారాముల్ని మర్చిపోకుండా ఎన్టీఆర్ సినిమాలు అడ్డుపడ్డాయి!

మనం బ్రతకాల్సింది జ్ఞానిగానా, అజ్ఞానిగానా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మన్దేశంలో పాఠ్యపుస్తకాల్ని బుద్ధిగా చదవేసి, పరీక్షలనే బురదగుంటల్ని ఈది, మార్కులనే పన్నీట స్నానం చేసిన యెడల సుఖమయ జీవనం సంప్రాప్తించుననే జీవన సత్యం గ్రహించినందున - నేను ఎకడెమిక్ జ్ఞానిగానే మిగిలిపొయ్యాను. కానీ - అందుకు నేను చింతించను. ఎందుకంటే - ఈ సత్యాన్ని గ్రహించని (నాకన్నా తెలివైన) వాళ్ళు - జ్ఞానులయ్యేరు గానీ, జీవితంలో మాత్రం వెనకబడ్డారు.

నేను తొమ్మిదో క్లాసు దాకా 'దేవుడు వున్నాడు' అని నమ్మాను. తొమ్మిదో క్లాసులో దేవుడికో కఠినమైన పరీక్ష పెట్టాను. నాకు చదువులో పుచ్చా పవన్ కుమార్ అనే భీభత్స ప్రత్యర్ధి వున్నాడు. మా ఇద్దరికీ మధ్య తీవ్రమైన మార్కుల యుద్ధం జరిగేది. అన్ని పరీక్షల్లో - మా ఇద్దరికీ రెండు మార్కులు అటూఇటుగా వచ్చేవి. మార్కులలా అటూఇటుగా కాకుండా - ఇటే (అంటే నాకే ఎక్కువ) వచ్చేట్లు చెయ్యమని దేవుడికి పరీక్ష పెట్టాను. 

శివుడు, ఆంజనేయస్వామి మొదలైన దేవుళ్ళని రంగంలోకి దించాను. పన్జరగలేదు. ఇంక లాభం లేదనుకుని - కుంకుడు రసంతో శుభ్రంగా తలంటుకుని, భక్తిప్రవృత్తులతో వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వెళ్ళాను. కొబ్బరికాయ కొట్టాను, ద్వజస్థంభం ముందు సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ రోజంతా స్వచ్చమైన, పవిత్రమైన మనసుతో పదే పదే 'స్వామీ! నాకు పవన్ గాడి కాన్నా ఎక్కువ మార్కులొచ్చేట్లు చూడు!' అనే మంత్రం ఉచ్చరిస్తూనే వున్నాను!

ఎప్పుడూ లేనిది - ఈసారి పరీక్షల్లో పవన్ గాడు నాకన్నా చాలా ముందుకెళ్ళిపొయ్యాడు! ఆనాడు నేనొక సత్యం కనుగొన్నాను - 'దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉన్నా - ఆ దేవుడుకి నాకు సహాయం చేసే ఉద్దేశం లేదు! నాకు సహాయం చెయ్యని ఆ దేవుడు ఎంత గొప్పవాడైతే మాత్రం నాకెందుకు?' అంచేత - ఆనాటి నుండి దేవుణ్ని పట్టించుకోవటం మానేశాను! కొంతమంది నన్ను నాస్తికుడంటారు గానీ, నాకా మాట అప్లై అవదనుకుంటాను!

ప్రస్తుతం - దేవుడి ప్రమేయం లేకుండా నా జీవితం సాఫీగానే సాగుతుంది. శ్రీరామనవమి అంటే రాముడు పెళ్ళి చేసుకున్న రోజనీ, సీతాదేవిని రాముడు అడవులకి పంపించాడనీ.. ఇట్లా చాలా విషయాలు నాకు తెలుసు. అందుకు కారణం ద గ్రేట్ ఎన్టీఆర్. ఆయనే లేకపోతే - 'పోర్షన్‌'లో లేని రామాయణం నాకు గుర్తుండేది కాదు. మా పిల్లల్లాగా రాముడి తండ్రి భీష్ముడని 'గెస్' చేస్తుండేవాణ్ని! 

 'థాంక్స్ టు ఎన్టీఆర్'

(picture courtesy : Google)

16 comments:

  1. /కొంతమంది నన్ను నాస్తికుడంటారు గానీ, నాకా మాట అప్లై అవదనుకుంటాను!/
    అవును మీకు ఆ మాట అప్ప్లై అవదు. శ్రీ రామ నవమి నాడు మీరు శ్రీ రామున్ని స్మరిఒచు కున్నారు - ఎన్.టి.ఆర్ పేరుతోనైనా.
    /ఆయనే లేకపోతే - 'పోర్షన్‌'లో లేని రామాయణం నాకు గుర్తుండేది కాదు/
    అందుకే కాబోలు ఆకారం తెలియక పోయినా కొన్ని ఆకారాల్ని సృష్టిమ్చుకొన్నారు. దేవుడి రూపంలో?
    / రామాయణం తెలీనివారికి ఆధార్ కార్డు రద్దు చేసేస్తామంటే, కొంచెం ఇబ్బందే! బి కేర్ఫుల్! /
    అందుకే కాబోలు ఈ పోష్టు-తెలిసినట్లు తెలియ పరచు కోవాడానికి ? అన్నట్లు రంగనాయకమ్మగారికి రద్దు చేస్తారా ఏమిటి?! ఆమెకు రామాయణం తెలీదని కాదు . విషవృక్షం అన్నది కనుక!

    ReplyDelete
    Replies
    1. రంగనాయకమ్మ సంగతేమో గానీ - ముందు నా కార్డు చిరిగేట్టుంది. :)

      Delete
  2. "రామ్-గోపాల్" వర్మ అనే అతను కూడా మీలాగే "జ్ఞానాన్ని" తెలియచేస్తూ వుంటాడు.. అబ్బా..కృతయుగంలో హిరణ్యకశిపుడి నుండి ఇప్పటి మీదాకా ఎంత జ్ఞానాన్ని బోధించినా పిచ్చి జనం అజ్ఞానంతో కొట్టిమిట్టాడుతూ వుంటారు.. మీ సినిమా రాముడు .. రావణ,దుర్యోధనాదులని హీరోలుగా చూపించి ఎంతో విగ్నానాన్ని పంచినా అగ్నానంతో ప్రజలు, ముఖ్యమంత్రులు రాముణ్ణి పూజిస్తున్నారు.. ఇలా చెప్పి లాభం లేదు.. ఈ పిచ్చి జనానికి మీలాంటి డాక్టేరు బాబులు వైద్యం అందించి సామూహికంగా "షాక్" ట్రీట్ మెంట్ ఇస్తేగాని పిచ్చి కుదరదు.. మీకు సహాయంగా రంగబాయమ్మలు, పున్నయ్యలు, మెంటల్ వర్మలు వస్తారు.. కళ్ళు తెరిపించండి బాబయ్యా...

    ReplyDelete

  3. ఎన్ టీ ఆర్ సినిమాలు జూసి కూడా మీరు ఇంత అజ్ఞానం లో ఎట్లా ఉన్న్నారండి !!

    ><> శ్రీ రామ నవమి అంటే రాముడు పెళ్లి చేసుకున్న రోజు !! నవమి బర్తడే నా 'భర్త' డే నా !!

    జేకే !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎన్టీఆర్ సినిమాలు చూసినంత మాత్రానికే జ్ఞానం రాదనుకుంటా. అందుకు సాక్ష్యం - తెలుగువాళ్ళే! :)

      Delete
    2. శ్రీరామనవమి రాములవారి జన్మధినం. ఆయన వివాహదినం కాదు. కాని ఆగమసంప్రదాయం ప్రకారం దేవుడికల్యాణం ఆయన జన్మదినాన జరిపించటం ఆచారంగా జరుగుతున్నది.

      Delete
  4. రామ రామ.

    ReplyDelete
  5. డాక్టరుగారూ, ఈ‌ 'పని లేక' అనేది మీ బ్లాగు - మీరు కాలక్షేపంకోసం వ్రాసుకొనేది. "ఏదో ఊసుబోక రాసుకోడమే" అని మీరే అన్నారు. కాని మీరు వ్రాసిన ఈ వ్యాసం కొందరి మనస్సులను నొప్పించేదిగా ఉంది. ఈ సంగతి మీ‌ గమనికలో ఉందో లేదో తెలియదు. రామాయణం తెలుసుకోవాలని లేదా అక్కరలేదని అనుకోవటం కేవలం మీయిష్టం. కాని మీ‌హాస్యధోరణిలో‌ పడి రాముడిపైనా రామాయణం పైనా అభిమానం ఉన్నవారి మనస్సులు నొచ్చుకొనేలా వ్రాసారని నా అభిప్రాయం. ఎవరిష్టం వారిది అని నేనూ ఒప్పుకుంటాను కాని మీ యిష్టాన్ని మరొకరి మనోభావాలని గేలిచేసేలా వ్యక్తం చేయటం భావ్యం అని అనుకోను. గేలి చేసానని మీరు అనుకోకపోవచ్చు - గేలిచేసారని కొందరు అనుకోవచ్చును. మనకు నచ్చని ప్రతిదానినీ‌ వ్యంగ్యంతో చీల్చిచెండాడవచ్చునని అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండరాదనీ మీరు నిర్ణయించుకుంటే అది కొంచెం పునరాలోచించుకొన వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నిజానికి ఈ‌ మాటలు నాకు నేను కూడా చెప్పుకోవచ్చునేమో. నాకు నచ్చని విషయాలపై ఉదారంగానే స్పందిస్తున్నానా అన్నది నేనూ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఒప్పుకుంటాను. ఏది ఏమైనా ఇలా ఆత్మహననవ్యాపారంగా హిందూసమాజం తమను తామే కించపరచుకుంటూ పలచన అవుతూ ఉండటం బాధాకరం. మీరు మేథావులు కాబట్టి హిందువు అన్న మాటకూడా మీకు నచ్చకపోయే అవకాశం ఉన్నా ఈ‌మాట చెప్పక తప్పలేదు. నా వ్యాఖ్య మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ,

      మీ అభిప్రాయాల్ని గౌరవిస్తాను. మిమ్మల్ని నొప్పించినందుకు క్షమించండి.

      నేరాసిందంతా నా సొంత గొడవ, అజ్ఞానం. నా అభిప్రాయాలు కొందరిని ఇబ్బంది పెట్టొచ్చు, కోపం తెప్పించొచ్చు. నేనీ పోస్టు రామభక్తుల్ని కించపరిచే ఉద్దేశంతో మాత్రం రాయలేదు. నా ఉద్దేశం ఏదైనా - కొందరి నమ్మకాల్ని కించపరిచేట్లు వుందని మీరు భావిస్తున్నారు కనుక - ఈ పోస్టుని ఉపసంహరించుకోడానికి నేను సిద్ధం.

      Delete
    2. నిజంగా మీరు ఉపసమ్హరించుకుంటే సంతోషం.... మీ టపా చదివినప్పుడు నిజంగానే చాలా బాధ కలిగింది.

      Delete
  6. Syamaleeyam gaaru:

    You have 2 options, grow some thick skin or stay off the internet.

    Good luck!

    ReplyDelete
    Replies
    1. Edge గారూ,

      మీ‌ అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నాను.
      అంతర్జాలం నుండి తప్పుకోవటం పలాయనవాదం అవుతుంది. సమజసం కాదు.
      మీ‌ అభిప్రాయాలు పంచుకుందుకు మీరెలా ఆసక్తి చూపుతున్నారో నేనూ అంతే.
      ఇతరుల అభిప్రాయాలు తెలుసుకుందుకు మీరెలా ఆసక్తి చూపుతున్నారో నేనూ అంతే.
      అందరమూ అంతే.

      ఒక్కొక్కసారి మనం పొరబడవచ్చును. అప్పుడు ఇతరులు సున్నితంగా ఆవిషయం చెప్పటం హుందాగా ఉంటుంది.
      ఒక్కొక్కసారి ఇతరులు పొరబడవచ్చును. అప్పుడు మనం సున్నితంగా ఆవిషయం చెప్పటం హుందాగా ఉంటుంది.
      అందరమూ మనుష్యులమే. అందరమూ పొరబడే అవకాశమూ‌ ఉంది, ఇతరులనుండి నేర్చుకొనే అవకాశమూ ఉంది.
      అందుచేత అందరమూ అందరితో కలిసి ఉండి అభిప్రాయాలు పంచుకోవటంలో అభిప్రాయబేధాల కారణంగా అంతర్జాలం నుండో సమాజం నుండో‌ పారిపోవటం అయుక్తం.

      మీరన్న రెండో విషయం. నేను కొంచెం సున్నితమనస్కుడిని కావటంలో‌ నా ప్రమేయం లేదు. నన్ను దేవుడలాగే చేసాడు. ఇప్పుడు బండబారటం‌ నా వల్ల కాదు. అందువల్ల లాభమూ‌ ఉండదు. ఇతరుల పొరపాట్లను ఎత్తిచూపవలసిన సందర్భం అని నేను అనుకున్నప్పుడు సున్నితంగానే ఆపని చేయాలని ప్రయత్నిస్తాను. అది ఇతరులకూ సాధారణంగా ఉపయోగకరం కాబట్టి నేను బండబారటం వలన నాకూ ఇతరులకూ కూడా మంచి జరగదని నా విశ్వాసం,

      ఇతే నిష్కారణనిందాశీలురకు దూరంగా ఉండటం అందరికీ అవసరమే కాబట్టి అది నాకూ సమ్మతమే. అటువంటి అవినయశీలుర అర్భాటపు వ్రాతలరణరంగాలకు దూరంగానే ఉండాలని ప్రయత్నిస్తాను.

      Delete
    2. Edge గారూ, శ్యామలీయం గారు పై వ్యాఖ్యలో తన మనసు నొచ్చుకుందని అనలేదు. కొందరి మనసులు నొచ్చుకుంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తపరచడంలో తప్పేమీ లేదు. ఆయన సలహా పాటించడం మానడం రమణ గారి నిర్ణయం, అసలు సలహాయే ఇవ్వొద్దని అనలేము కదా.

      Delete
  7. శ్యామలీయం గారు,

    అభిప్రాయాలు పంచుకోవడం తెలుసుకోవడం గురించిన ఆదర్శాలు సుద్దులు బాగానే వల్లెవేస్తున్నారు.

    కాకపోతే గత కొంత కాలంగా మీ వరస గమనిస్తే…

    ఎవరైనా ఏ విషయం మీదైనా అభిప్రాయం చెప్పొచ్చు… as long as ఆ అభిప్రాయాలు మీరు పెట్టిన హద్దుల్లో ఉన్నంతవరకు, గీసిన లక్ష్మణరేఖలు దాటనంత వరకు, చిరుగాలిలో చిగురుటాకులా వణికిపోయే మనోభావాలకి ఇబ్బంది కలగనంతవరకు.

    రాముడి మీద రాయకూడదు, భారతాన్నివిమర్శించకూడదు , భగవద్గీతని చర్చించకూడదు, జ్యోతిష్యాన్ని ప్రశ్నించకూడదు…
    కులాన్ని ఎదిరించకూడదు, మతం గురించి మాట్లాడకూడదు, భాష గురించి ఎత్తనేకూడదు…
    హాస్యం వాడకూడదు, వ్యంగ్యం అసలే వద్దు…

    ఆ మాత్రం దానికి రమణ గారి లాంటి పనిలేని జనాలు స్వంతంగా బ్లాగులు రాసుకోవడమెందుకు? కధలు కవిత్వాలు ప్రచురించడమెందుకు?

    ఎవరేమి రాయాలో, చర్చించాలో, ఎంతవరకు ప్రశ్నించ వచ్చో ఎంచక్కా మీబోటి సంస్కృతీ సాంప్రదాయ పరిరక్షకులు నిర్ణయించి “Ten Commandments ” మాదిరి అచ్చేస్తే సరి.

    మీ నమ్మకాలు విశ్వాసాల మీద మీకు, మీరు వకాల్తా పుచ్చుకొన్న ఇతరులకు ఉన్న గౌరవ మర్యాదలు అందరికీ ఉండాలని కోరుకోవడం వరకు మంచిదే. అందుకు మీ ప్రయత్నం మీరు చెయ్యడమూ సబబే. అయితే అందరూ ఆ విధమైన గౌరవ మర్యాదలు, భక్తి ప్రపత్తులతో ప్రవర్తించాలనే నిర్బంధమే అనాగరికం.

    మీకు మీరు చాలా సున్నితంగా చెప్పానని సమర్ధించుకోవచ్చు గాక… కాని మీ బోటివారికి, తస్లిమా నస్రీన్, సల్మాన్ రష్దీ లాంటి వారి తలలకు వెలకట్టిన ముల్లాలకు పెద్ద తేడా ఏమీలేదు.

    ఇద్దరిదీ ఒకే లక్ష్యం… వీరికి అంగీకారంకాని భావాలను వ్యక్తీకరించే స్వాతంత్ర్యం ఇతరులకి లేకుండా చేయడం… మార్గాలే వేరు అంతే.

    “I may not agree with what you have to say, but I'll defend to the death your right to say it.”
    ― Voltaire

    ReplyDelete
  8. చాలా బాగా చెప్పారు edji గారు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.