Sunday, 6 November 2011

నా 'ఖడ్గతిక్కన' ఖష్టాలు

మనుషులు అనేక రకాలు. కొందరు మంచివాళ్ళే కాదు, మొండివాళ్ళుగా కూడా వుంటారు. నా క్లాస్మేట్ మరియూ మదీయ మిత్రుడు అయిన మూర్తి అటువంటి అరుదైన మంచిమొండివాడు. అవతలవాళ్ళు చెప్పేది అర్ధం కాకపోయినా, డామినేట్ చేస్తున్నారన్న అనుమానం కలిగినా మరింత మొండిగా అయిపోతాడు. ఈ వొక్కవిషయంలో తప్పించి మా మూర్తి మంచివాడు, మృదుస్వభావి, స్నేహశీలి - అఫ్కోర్స్ మొండిశీలి అని ఇందాకే చెప్పాను! కొందరు మూర్తిని 'ఖడ్గతిక్కన' అనేవాళ్ళు. నాకు మావాడి ధోరణి అలవాటైపోయింది, పట్టించుకునేవాణ్ని కాదు. ఒక్కోసారి మా మూర్తి మొండిదనం నాక్కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేది.

ఇప్పుడంటే మెడికల్ కాలేజీలు కులాల గోలల్లో పీకల్లోతు కూరుకుపొయ్యున్నాయి గానీ, మా రోజుల్లో దేశ రాజకీయాల చర్చల్తో వాతావరణం హాట్‌హాట్‌గా ఉండేది. నాకు రాజకీయాలు తగుమాత్రంగా తెలుసు, మూర్తికి మాత్రం యెంతమాత్రం తెలీదు. ఆరోజు లీలామహల్లో జేమ్స్ బాండ్ సినిమా చూడాలని మా ప్లాన్. లైబ్రరీ నుండి కాలేజ్ క్యాంటీన్‌కి వెళ్లాం. అక్కడ రాజకీయ చర్చలతో, సిగరెట్ పొగతో గందరగోళంగా వుంది. మేం క్యాంటీన్‌లోకి అడుగుపెట్టంగాన్లే, మమ్మల్ని చూస్తూ -

"బ్రదర్స్! కంపూచియాపై అమెరికా దురాక్రమణని ఖండించండి." అని అరిచాడొకడు.

మా మూర్తి ఠక్కున అన్నాడు - "నేను ఖండించను."

వెంటనే ఆవైపు నుండి ఆవేశంగా ఒక ఉపన్యాసం మొదలైంది. "అమెరికా సామ్రాజ్యవాదం.. పెట్టుబడిదారి ఆర్ధికవ్యవస్థ .. " కొంత అర్ధమయింది. చాలా అర్ధం కాలేదు. అయిదు నిముషాల తరవాత ఉపన్యాసం అయింది. మూర్తి సూటిగా చూస్తూ స్థిరంగా, నొక్కివక్కాణిస్తూ అన్నాడు - "నేను ఖండించను." మళ్ళీ ఉపన్యాసం మొదలైంది. నాకేమో తొందరగా కాఫీ తాగి బయటపడాలని ఉంది. జేమ్స్ బాండ్ సినిమా టైటిల్స్ మిస్సైపోతాననే భయం, అవంటే నాకు చాలా ఇష్టం.

'బాబ్బాబూ! ఖండించరా.' అంటూ చెవిలో దీనంగా వేడుకున్నా. మూర్తి మనసు పాషాణం, ఇసుమంతయిననూ కరగలేదు! మావాడితో ఒప్పించాలని వారి పట్టుదల. అలా ఓ అరగంటపాటు వీడితో ఖండింపజెయ్యాలనే విఫలయత్నం కొనసాగింది. వాళ్ళు ఎన్నిరకాల ఆర్గ్యుమెంట్లు చెప్పినా మావాడిది ఒకటే సమాధానం.

"నేను ఖండించను."

సినిమా ప్రోగ్రాం అటకెక్కింది. క్యాంటీన్ నించి బయటకి వచ్చాక విసుక్కున్నాను.

"రాజకీయాల్లో నీకంత పట్టుదల ఎందుకు? "

"నేనంతే! చాలా పట్టుదల కలవాణ్ణి." గర్వంగా అన్నాడు.

నేనేం మాట్లాళ్ళేదు, కొంచెంసేపు ఆగి నెమ్మదిగా అడిగాడు రమణమూర్తి.

"సర్లే గానీ, ఇంతకీ కంపూచియా అంటే ఏమిటి?"

ఒక్కక్షణం వాడడిగింది నాకర్థం కాలేదు. అర్ధమయ్యాక కోపం, ఏడుపు ఒకేసారి వచ్చాయి!


అటు తరవాత.. సాధ్యమైనంత మేరకు మూర్తిని మేనేజ్ చేసుకుంటూ బండి లాక్కోస్తున్నాను. అన్నిరోజులూ మనవి కావు, కొన్నిసార్లు దురదృష్టం పిచ్చికుక్కలా వెంటాడుతుంది.

ఆరోజు మెడిసిన్ కేస్ ప్రెజంటేషన్‌లో ప్రొఫసర్‌తో తీవ్రంగా తిట్టించుకున్న మూర్తిని హాస్పిటల్ క్యాంటిన్లో శాయశక్తులా ఓదారుస్తున్నా.

"నీ కేస్ ప్రెజంటేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉంది. మన ప్రొఫెసర్‌కే నీస్థాయి లేదు. అందుకే ఆయనకి నీ కేస్ అర్ధంకాక నానామాటలన్నాడు!"

"అంతేనంటావా!" మూర్తి కళ్ళల్లో మెరుపు. హమ్మయ్యా! నా ఓదార్పుమాటలు బానే పన్జేస్తున్నయ్.

ఈలోగా ఇద్దరు జూనియర్లు స్టూడెంట్లు మా పక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఆరెస్సెస్ సానుభూతిపరులని నాకు తెలుసు.

"ఏంటి! మీ రాముడి గుడి ఎందాకా వచ్చింది?" అంటూ సరదాగా పలకరించాను.

వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపొయ్యి - "మన హిందువులది సిగ్గులేని జాతి, రాముడి గుడి తలుపులు తెరవక పోవటాన్ని ఎందుకు ఖండించరు?" అన్నారు.

'ఖండన' అన్నమాట చెవిన పడంగాన్లే మా మూర్తి ఖయ్యిమన్నాడు.

"ఖండించను, ఎందుకు ఖండించాలి? నాకు గుడి తలుపులు తెరవక్కరలేదు. అవి ఎప్పటికీ మూసే ఉంచాలి. అర్ధమయ్యిందా? మూసే ఉంచాలి." ఒక్కోఅక్షరం వొత్తిపలుకుతూ అన్నాడు.

ఆ జూనియర్స్ బెదిరిపొయ్యారు, చల్లగా జారుకుని వేరే టేబుల్ చూసుకున్నారు.

నాకు మా మూర్తి ప్రవర్తన మొరటుగా అనిపించింది.

"మూర్తీ! వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి. ఏదో మర్యాదగా పలకరిస్తే అట్లా కరుస్తావే?"

ఈసారి నామీద ఎగిరాడు.

"నేను నీలా కాదు, గంగిరెద్దులా ప్రద్దానికి తలూపను. నాకు సొంత బుర్ర ఉంది. సొంత అభిప్రాయాలున్నాయ్."

"నీకు అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ చెప్పే పద్ధతే బాలేదు." అన్నాను.

ఒక్కక్షణం ఆలోచించి అన్నాడు రమణమూర్తి.

"ఇంతకీ వాళ్ళు చెప్పేది మనూళ్ళో వున్న రామనామ క్షేత్రం సంగతేగా? దాని తలుపులు ఎప్పుడు మూశారు? ఏమన్నా రిపేర్లు చేస్తున్నారా?"

తల పట్టుకున్నాను.

'ఓరి నాయనోయ్! వీడి పాండిత్యం డేంజరపాయం స్థాయికి చేరుకుంది.'

అటు తరవాత మావాణ్ని మరింత పకడ్బందీగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. 

11 comments:

  1. హ హ హ : ) బాగుంది అండీ .

    ReplyDelete
  2. పురాణ పురుషుల్ని పరచయం చేస్తున్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారూ...

    ReplyDelete
  3. జాతి రత్నాలని పరిచయం చేస్తున్నారు మాష్టారు మీరు! బాగుంది ఇలా తెలుసుకోవడం!

    ReplyDelete
  4. సుభ గారు..
    జ్యోతిర్మయి గారు..
    రసజ్ఞ గారు..
    ధన్యవాదాలు.

    నా చిన్న నాటి స్నేహితుల్ని గుర్తు తెచ్చుకుంటూ.. సరదాగా రాస్తున్నాను.
    వీళ్ళంతా చాలా సక్సస్ ఫుల్ పీపుల్.
    కష్టపడి చదివారు. తెలివైనవాళ్ళు.
    నా జీవితంలో ముఖ్య భాగం వీరితోనే గడిపాను.
    మా అందరికీ మేమంతా కలిసి గడిపిన కాలం అత్యంత ఇష్టమైనది.
    వాళ్ళూ సరదాగా తీసుకుంటున్నారు.
    ఎందుకంటే..
    మాకందరికీ ఈ రొజుకీ మంచి స్నేహం.
    ఈ వివరణ నా బ్లాగ్ చదువుతున్న అందరి కోసం.
    ఎందుకంటే..
    నా స్నేహితుల గూర్చి ఒక్కళ్ళు కూడా జోకర్లు అనుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి.
    మరప్పుడు వాళ్ళ గూర్చి రాయటం దేనికి?
    మా చిన్నప్పటి ముచ్చట్లు గుర్తు తెచ్చుకోటానికి.
    కానీ.. ఆ పని బ్లాగుల్లో చేయవచ్చునా?
    ఇప్పుడు నాకీ సందేహం పట్టుకుంది.

    ReplyDelete
  5. రమణమూర్తి గారు ఖచ్చితంగా ఎం.ఎస్ చేసి ఉండరు , ఎం.ఎస్. చేస్తే ఖండించాల్సి(operation) ఉంటుంది కదా!

    ReplyDelete
  6. మా వ్యాఖ్యల వలన మీకు ఆ సందేహం కలిగితే మమ్మల్ని మన్నించాలి! తప్పకుండా మీకు గుర్తు చేసుకుని రాయవచ్చును! నా వరకు నేనెప్పుడూ జోకర్లలగా అనుకోలేదు! ఐ రియల్లీ ఎంజాయ్! పైగా నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవడం ఒక గొప్ప డాక్టరుగా స్థిరపడిన వాళ్ళ చిన్న చిన్న చిలిపి అల్లరి పనులలో సరదా ఉంటుంది! కనుక ఇలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీరు ఇలాంటివెన్నో వ్రాయాలని కోరుకుంటూ.......

    ReplyDelete
  7. రమణ గారూ పురాణ పురుషులన్నది మీరు వారికి పెట్టుకున్న సరదా పేర్లు గురించి కానీ, వారి గురించి కాదండీ. మా వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మన్నించాలి. అంతకు ముందు చెప్పినట్లు మీ బ్లాగుకి వచ్చి మనసారా నవ్వుకు౦టున్నాం కానీ అపహాస్యం ఎంత మాత్రం కాదండి. మీరు వ్రాసే పద్ధతి చాల బావుంటుంది. మీరేమీ సందేహాలు పెట్టుకోక మీ కబుర్లన్నీ మాతో పంచుకోండి.

    ReplyDelete
  8. రసజ్ఞ గారు..
    జ్యోతిర్మయి గారు..
    నేను మిమ్మల్ని ఉద్దేశించి కామెంట్ రాయలేదు.
    బయటకెళ్ళే హడావుడిలో అన్నీ ఒకే బాక్స్ లో రాసేశాను.
    అందువల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చు.

    అప్పుడప్పుడు నాలో గుమ్మడి ప్రవేశిస్తాళ్ళేండి!
    అందుకే గుమ్మడి డైలాగులు రాసేశాను.

    చాలా ఎంకరేజింగ్ గా చక్కటి కామెంట్లు రాశారు.
    కృతజ్ఞతలు.

    ReplyDelete
  9. రసజ్ఞ గారు చెప్పేది నిజం అండీ.. మేమెప్పుడూ మీ బ్లాగ్ ని సరదాగా నవ్వుకోవడం కోసం సందర్శిస్తుంటాం తప్ప..మీరు చెప్పే మీ స్నేహితులని తప్పుగా అర్ధం చేస్కోవడానికి కాదు. మరీ అలా కామెడీగా ఉంటారని కూడా ఎవరూ అనుకోరండీ. సాధారణంగా అందరి జీవితాల్లోనూ ఇలాంటి సరదా సంఘటనలు ఉంటాయి. కానీ వాటిని ఇలా సరదాగా వ్యక్తీకరించడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది.అందుకే మీ బ్లాగుకి రావడం.. మరో ఉద్దేశ్యం ఏం లేదండీ..మమ్మల్ని ఉద్దేశించి రాయకపోయినా చిన్న clarification.

    ReplyDelete
  10. ఖడ్గతిక్కన జిందాబాద్!
    ఖండన మండన అనడం వాడుక. ముండనం అంటే గుండు గియ్యడం - గమనించగలరు.
    ఖండన అనే మాట తమిళంలో కాదు, బహుశ ఫ్రెంచి భాషలో ఉండిఉండదు - అంచేతే ఆయన పాండిచ్చేరిలో హాయిగా ఉన్నారు

    ReplyDelete
  11. కొత్త పాళీ గారు..
    ధన్యవాదాలు.
    శిరోముండనము అంటే గుండు గియ్యడం అన్నది తెలుసు.
    అక్కడి ముండనం ఇక్కడ పనికి రాదంటారా?
    నాకు తెలీదు.
    సరి చేసినందుకు కృతజ్ఞతలు.
    అయినా నేను నా పోస్ట్ లో సరిచెయ్యట్లేదు.
    ఒకటి. ఎలాగూ సరి చేస్తూ మీ కామెంట్ ఉంటుంది.
    రెండు. ఒక్కసారి కమిటయితే నా భాషని నేనే దిద్దుకోను!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.