Thursday 17 November 2011

నేను మేధావినే.. నా?

టీవీలో ఏదో చర్చాకార్యక్రమం, తీవ్రమైన వాదన నడుస్తుంది. పాయింటు లేకుండా అరుచుకునే ప్రోగ్రాం చూసే ఓపిక లేదు నాకు. ఇవ్వాళ అనుకోకుండా కొద్దిసేపు ఒక చర్చ చూశాను. వారిలో ఒక వ్యక్తి నా దృష్టిని ఆకర్షించాడు. అతగాడు - కొద్దిగా పెరిగిన గడ్డం, ఇంకొద్దిగా నెరిసిన తల, భుజం మీద ఉన్నిశాలువా.. ఒక యాంగిల్లో అక్కినేని టైపు భగ్నప్రేమికుళ్ళా వున్నాడు. ఆయన ఆంధ్రా మేధావుల సంఘానికి అధ్యక్షుడట!

'మేధావుల సంఘం' - పేరెంత సెక్సీగా ఉంది! ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్న ఈరోజుల్లో మేధావిగా గుర్తింపు పొందటం చాలా కష్టం. దానికి ఎంతో మేధస్సూ, మరెంతో కృషి అవసరం. ఇవన్నీ లేకుండా కేవలం ఒక సంఘసభ్యుడిగా చేరి మేధావిగా మారిపోవటం ఎంత సులభం, ఎంత సుఖం! అర్జంటుగా నేనూ ఈ సంఘం సభ్యుడిగా చేర్తాను, మేధావిగా రెడీమేడ్ కీర్తి సంపాదిస్తాను.

డాక్టర్ల సంఘం, ఆటోడ్రైవర్ల సంఘం అంటూ వృత్తి సంఘాలున్నాయ్. ఆర్యవైశ్య సంఘం, కమ్మ సంఘం అంటూ కులసంఘాలున్నాయ్. ఈ సంఘాల్లో చేరాలంటే అర్హత గూర్చి పేచీ లేదు. అయితే మేధావుల సంఘం అనంగాన్లే ఇబ్బంది వస్తుంది. 'నువ్వు మేధావివి కాదు' అంటే ఎవరూరుకుంటారు?

సర్లే! ఏదోకటి. నేను మేధావినా కాదా అన్న మీమాంస నాకేలా? అదేదో సభ్యత్వం ఇచ్చేవాళ్ళు నిర్ణయించుకుంటారు. నా ఎమ్డీ సర్టిఫికేట్ కాపీ జేబులో కుక్కాను. నాకు బుర్ర తక్కువ అని డౌటొచ్చినప్పుడల్లా ఈ సర్టిఫికేట్ నన్ను కాపాడుతుంది (పేరు పక్కన ఎమ్డీ ఉన్నంత మాత్రాన బుర్ర ఎమ్టీ కాకూడదని లేదులేండి). ఎందుకైనా మంచిదని నా ఎంబీబియ్యెస్ సర్టిఫికేట్ కాపీ కూడా తీసుకున్నాను. సమాజంలో కొందరికి ఎమ్డీ కన్నా ఎంబీబియ్యెస్ ఎక్కువన్న అభిప్రాయం ఉంది. ఎంతైనా రెండక్షరాల కన్నా నాలుగక్షరాలు ఎక్కువ కదా!

తీరా బయల్దేరే ముందు డౌటొచ్చింది. ఆంధ్రా మేధావుల సంఘం వాళ్ళు 'మాక్కావాల్సింది నీ మేధావిత్వం, సర్టిఫికెట్లు కాదు.' - అంటే! మేధావిత్వానికి వాళ్ళదగ్గర వున్న కొలబద్ద యేంటి? జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారా? మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? తెలీదు. మెక్సికో రాజధాని చెప్పు? అస్సలు తెలీదు! పేపర్ లీకైతే బాగుణ్ణు. తలకి మిషన్లూ గట్రా తగిలించి మీటర్ రీడింగ్ తీస్తారా? వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు, అవన్నీ నాకెందుకు? నేను మాత్రం ఇవ్వాళ ఖచ్చితంగా మేధావుల సంఘంలో చేరబోతున్నాను, దట్సాల్!

ఇంతలో మస్తిష్కంలో మెరుపు మెరిసింది (అంటే గొప్ప ఐడియా వచ్చిందని అర్ధం). మనగూర్చి మనం చెప్పుకునేకన్నా ఎదుటివారితో చెప్పిస్తేనే గదా వేల్యూ! పైగా ఇది నాకు చాలా సులువైన పని కూడా. నేను మేధావినని వెయ్యిమందితో చెప్పించగలను.

అప్పటికే లేటయ్యిందని హడావుడిగా ఆస్పత్రికి వెళ్తున్న నా భార్యని ఆపి అడిగాను - "ఈ లెటర్ తీసుకొచ్చినవాడు మేధావి అని ఒక సర్టిఫికేటివ్వు."

సందేహం లేదు, గవర్నమెంట్ డాక్టర్ కావున నా భార్య సర్టిఫికేట్ బ్రాండెడ్ సిమెంటంత స్ట్రాంగ్‌గా వుంటుంది. నా భార్య నాకేసి ఎగాదిగా చూసింది, ఒక్కక్షణం ఆలోచించింది - "సారీ! నేను దొంగ సర్టిఫికెట్లివ్వను." అంటూ వెళ్ళిపోయింది.

హతాశుడనయ్యాను. ఎంత అవమానం! కొంచెం కళ్ళు తిరిగినట్లనిపించింది. చరిత్రలో ఏ భర్తకీ భార్య చేతిలో ఇంత అవమానం జరక్కూడదు. ఈ అవమాన భారం భరింపలేను. 'ఎవరక్కడ? చితి పేర్పించండి'.

"సార్! స్విచ్చిలన్నీ మార్చేశాను. ఇంక మీకు ఇబ్బందుండదు."

నిదానంగా తల పైకెత్తి చూశాను. ఎదురుగా ఎలెక్ట్రీషియన్ నిలబడున్నాడు. మస్తిష్కంలో మళ్ళీ మెరుపు (మళ్ళీ ఇంకో గొప్ప ఐడియా)! సొంతభార్య సర్టిఫికేట్‌కి విలువేముంది? ఈ శ్రామికవర్గ ప్రతినిధితో సర్టిఫికేట్ తీసుకుంటే తిరుగేముంది?

"సర్లే! ఈ కాయితం మీద నేను తెలివైనవాణ్ణని రాసి సంతకం పెట్టు."

ఎలెక్ట్రీషియన్ సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు - "ఆ విషయం నాకు తెలుసు సార్!"

"అవును కదా! ఆ సంగతే రాసివ్వు." విసుగ్గా అన్నాను.

"నేను తెలివైనోణ్ణని నేనే రాసుకుంటే ఏం బాగుంటుంది సార్!" మళ్ళీ సిగ్గు, మెలికలు.

"నేనన్నది నీగూర్చి కాదు, నాగూర్చి! ఈ డాక్టర్ గొప్పమేధావి అని రాసి సంతకం పెట్టివ్వు."

సిగ్గు మాయమైంది - "అదేంటి సార్! అట్లెట్లా రాసిస్తా. నేను రాయలేను."

"అంటే నాకు నీఅంత తెలివి లేదంటావా?" కోపంగా అడిగాను.

"సార్! మీరు పెద్దవారు, ఏమనుకోకండి. మిమ్మల్ని రెండేళ్ళనించి చూస్తున్నాను. మీకు చోక్ అంటే తెలీదు, స్టార్టర్ అంటే అర్ధం కాదు. కనీసం యే స్విచ్చి దేనికో కూడా గుర్తుండదు." అంటూ జారుకున్నాడు.

ఆరి దుర్మార్గుడా! ఇన్నాళ్ళు నువ్వు నన్నో బుర్ర తక్కువ్వాడిగా అనుకుంటున్నావా! నాకు కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తల దిమ్ముగా వుంది, నీరసంగా సోఫాలో కూలబడ్డాను.

"సార్! కాఫీ." అంటూ టీపాయ్ మీద కాఫీకప్పు పెట్టింది వంటమనిషి. అమ్మయ్య! నా బాధ వెళ్ళబోసుకొటానికో మనిషి దొరికింది. ఆ వంటావిడ నాకు నా పగిలిన గుండె అతికించుకునేందుకు దొరికిన ఫెవికాల్ గమ్ములా కనబడింది.

"చూడమ్మా! నేను మేధావినేనా? కాదా?"

ఆవిడ ఇబ్బందిగా మొహం పెట్టింది - "మేధావి అంటే ఏంటో నాకు తెలీదు."

ఈ వంటమనిషి నాపై గల అపార గౌరవంతో మాట్లాడ్డానికి మొహమాట పడుతున్నట్లుంది. అవును మరి! ఆమె భర్తకి వైద్యం చేసి తాగుడు మాన్పించాను, మొన్నామధ్యనే జీతం పెంచాను.

అంచేత కృతజ్ఞతా భారంతో ఒంగిపోతూ - 'మీరు దేవుళ్ళాంటోరు సార్! ఈ ప్రపంచంలో మీకన్నా గొప్ప మేధావి ఎవ్వరూ లేరు.' అని పొగడొచ్చు. కానీ నాకు పొగడ్తలు గిట్టవు. అందుకే -

"చూడమ్మా! నన్ను పొగడకు. నీ మనసులో మాట ఉన్నదున్నట్లు నిర్మొహమాటంగా చెప్పెయ్!" అన్నాను.

వంటావిడ బెరుకుగా - "తప్పుగా మాట్లాడితే మన్నించండి! ఎన్నోఏళ్ళుగా మీ ఇంట్లో పన్జేస్తున్నాను. మీరు చాలా మంచివారు, అమాయకులు. కానీ మీకు బెండకాయకీ, దొండకాయకీ తేడా తెలీదు. పూరీ కూరకీ, చపాతి కుర్మాకీ తేడా తెలీదు. పొద్దస్తమానం యేదో ఆలోచిస్తూ పరధ్యానంగా వుంటారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మేడంగారు లేకపోతే మీకు చాలా కష్టం సార్!" అని అంటుండగా -

నాకు స్పృహ త... ప్పిం.... ది.

ఉపసంహారం :

గౌరవనీయులైన పాఠకులకి నమస్కారం!

ఈ రాతలు రాస్తున్నవాడికి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. వున్నట్లుండి 'నేను మేధావిని, నేను మేధావిని.' అంటూ ఎగిరెగిరి పడుతున్నాడు. వైద్యశాస్త్రంలో ఇదో అరుదైన కేసుగా డాక్టర్లు భావిస్తున్నారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జంటూ అయితే మళ్ళీ తన రాతలతో మిమ్మల్ని హింసిస్తాడని హామీ ఇస్తున్నాం, సెలవు. 

34 comments:

  1. హ హ సూపర్ గా ఉందండి.

    ఆవిడ నాకేసి ఎగాదిగా చూసింది. ఒక్క క్షణం ఆలోచించింది.
    "సారీ! నేను దొంగ సర్టిఫికెట్లు ఇవ్వను." అంటూ వెళ్ళిపోయింది.

    -----------------------------------

    ఇది మాత్రం సూపర్ డూపర్ చదివి నవ్వి నవ్వి బుగ్గలు నొప్పిపెడుతున్నాయి :))

    ReplyDelete
  2. Hilarious, ఇంతకీ చలసాని శ్రీనివాసు గారు పాపం నిజంగా మేధావి కాదా? ఇంతమంది స్వప్రకటిత మేధావులు ఉండగా మీరు ఆయన ఒక్కడినే గురి పెట్టడం బాగోలేదోమే డాక్టర్ గారూ.

    ReplyDelete
  3. Well done again Ramana. Your self deprecating humor is awesome! As you know, there is an association for brainiacs called Mensa. Membership in Mensa requires an IQ of 98 percentile or better. Well, IQ tests do not mean much except that you have good cognition and English language skills. Of course, one can have high IQ and still be stupid. BTW, the Spanish word for stupid is Menso. I tell my wife that my IQ needs to be blamed for my ADHD and cyclothymic personality disorder.

    ReplyDelete
  4. :) సూపర్...

    మీరు మేధావే... నా ఓటు మీకే.. ..

    ReplyDelete
  5. Soooperb! నేనిస్తున్నాను మీకు మేధావి సర్టిఫికేట్! ఎవరు అవునన్నా, కాదన్నా!

    మీకొచ్చిన డౌట్ నాకూ వచ్చింది. ఆ సంఘం లో చేరటానికి అర్హత లేంటి ? అద్యక్షులవ్వాలంటే ఏం చేయాలి? యూనిఫారం ఏంటి? శాలువా కంపల్సరీ యా? మగాళ్ళయితే గడ్డం పెంచుతారు..

    ఆడవారేం చేయాలి? మందపాటి కళ్లజోడు పెడితే చాలా? :)) సర్టిఫికెట్లు ఎవరు ఎటేస్ట్ చేయాలి.. లాంటివి .. ఎవరైనా ఇక్కడ కామెంట్లలో చెప్తారేమో చూస్తా.

    ReplyDelete
  6. మేతావి కావాలంటే ...
    1) ఓ సపరేషన్ ఉజ్జమం లేవదీసుడు/మద్దతు ఇచ్చుడు
    2) ఎర్రజెండా పట్టుకుని గెంతుడు
    3) అమెరికా/పశ్చిమ మీద పడి ఏడ్వుడు
    4) ఇజ్రేయిల్ను తిట్టుడు
    5) కాశ్మీర్ పాకీయులకు ఇచ్చుడే అని స్టేట్మెంట్లు ఇచ్చుడు
    7) డాములు, ఫేక్టరీలు, మెట్రోరైళ్ళు, రోడ్లు రాకుండా అడ్డుకొనుడు
    8) చారిత్రిక తప్పిదాలు చేస్తూ చమాపనలు చెబుతుండాలి
    9) కసబ్, అఫ్జల్ గురులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసుడు
    10) మార్క్, మావో, బూర్జువా, పెట్టుబడిదారీ, వర్గశతృవులు, ఫ్యూడల్ అనే పదాలు విరివిగా వాడటం
    ఇంకా...

    ReplyDelete
  7. డాట్రారూ
    చంపేసారండి అసల!
    ఈ మధ్యన మీరు అదేదో రత్న లాగ, 'కత్తులతో కాదురా...నవ్వులతో చంపేస్తా' అని ప్రతిన పూనినట్టున్నారు.

    మేధావుల సంఘం లో చేరాలంటే ఉండాల్సిన అర్హత:-
    మేధావి అనకపోతే
    '10 కిలోమీటర్ల లోతులో బొంద వెడ్తం' అని బెదిరించండి.
    లేదంటే 'రాష్ట్రం అగ్ని గుండం గా మారుద్ది' అని హెచ్చరించండి.
    లేదంటే కనీసం ఒక స్కాం చేసి వందల కోట్లు సంపాదించేయండి.

    ReplyDelete
  8. "మీకు బెండకాయకీ, దొండకాయకీ తేడా తెలవదు. పూరీకీ, చపాతికీ కూడా తేడా తెలవదు. గొంగూరకీ, తోట కూరకీ తికమక పడతారు. " దీనిని బట్టి చూస్తే మీరు తప్పకుండా మేధావే.

    అయ్యో ! ఈ వ్యాఖ్యను ఐ.సి.యూ. నుండి తిరిగి వచ్చాక చూస్తారని ఆశిస్తూ....ప్చ్. .... .

    ReplyDelete
  9. @కృష్ణప్రియ:

    "యూనిఫారం ఏంటి? శాలువా కంపల్సరీ యా?"

    చేతిలో బట్ట సంచీ తప్పనిసరిగా ఉండాలి. కళ్ళజోడు ఉంటె మంచిదే కానీ "పాత" స్టైల్లోనే (not fashionable) సుమా! మగ వాళ్ళయితే జేబులో కలం కూడా పనికి వస్తుంది.

    "సారీ! నేను దొంగ సర్టిఫికెట్లు ఇవ్వను."

    డాక్టర్ గారూ, మీరిద్దరూ నిజమయిన డాక్టర్లని నిరూపించుకున్నారు. కొంతమంది వైద్యం మానేసి, సర్టిఫికేట్లతోనే వ్యాపారం చేస్తుంటారు మరి.

    ReplyDelete
  10. అన్నయ్య గారూ ( జాగ్రత్త అండి. కళ్ళు తిరుగుతాయేమో ? ) కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చినందుకు మీకు శుభాభినందనలు.

    ReplyDelete
  11. మేతావి కావాలంటే ... ఇంకా...

    11.శంభూక వధ, స్వేఛ్చా, మానవి, ద్రౌపది, నేను హిందువు నేనందుకవుతా? యం.యన్. రాయ్ మానవవాదం ఇవ్వన్ని చదివి చర్చించ గలగాలి.
    12. నయా కార్పొరేట్ -బి (భూస్వామ్య) ఆర్ధిక దోపిడి వాదం. బాబు,పచ్చ మీడీయా వర్సెస్ యువనేత ఎవరేవరు ఎంత తిన్నారు, ఎలా తిన్నారు, ఎవరు ఎవరికి బినామి మొద|| వాటి గురించి కూలంకషయంగా తెలిసి ఉండాలి.
    13. పేకాటలో జోకర్ వాదం - ప్రజారాజ్యం పార్టి పుట్టుక, విలీనం, ఆతరువాత వారికి రాబోయే పదవులు సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టిలో దాని సభ్యుల రాజకీయ భవిషత్. వీరి గురించి చర్చించగలగాలి.
    14. అందరికి తెలిసిన తెలంగాణా వాదం

    ReplyDelete
  12. Hilarious...చంపేసారు పొండి....చెణుకులు అదిరాయి..నవ్వినవ్వి బుగ్గలు నొప్పొస్తున్నాయి. :)))

    ReplyDelete
  13. krishna mohan parvataneni17 November 2011 at 19:08

    డియర్ రమణ,
    నువ్వు మేధావివో కాదో తెలియదు కానీ, నీ రాతలు మాత్రం మనసుకు స్వాంతన కలిగిస్తున్నాయ్.
    కొంతసేపయినా అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకుంటున్నాం.
    నువ్వు ICU లో ఉండిపోతే నీ బ్లాగ్ మిస్ అవుతాం కాబట్టి తొందరగా వచ్చేసెయ్.
    ఇట్లా సర్టిఫికెట్ల కోసం ట్రై చేస్తే మనందరిదీ ఒకే పరిస్థితి.
    కాబట్టి చాలా మంది నీ సోదరులు ఉన్నారని గ్రహించు.
    సేద దీరు.

    ReplyDelete
  14. డియర్ య ర,
    నీ మేధావి రాత చాలా బాగుంది!!! అలంకారాలు, వర్ణనలు మళ్ళీ మళ్ళీ చదివి నవ్వుకోతగ్గవిగా ఉన్నాయ్. భావదారిద్ర్యం అనే పదం నాకెంతగానో నచ్చింది. ఇక పోతే (ఎవరని అడగొద్దు...ICU లో నువ్వే ఉన్నావ్ కాబట్టి) సబ్జక్టు మాటర్ కొస్తే చాలా మంది ఇప్పటికే కామెంట్లిచ్చారు కనుక మళ్ళీ రిపీట్ చెయ్యదల్చుకోలేదు!! Keep them coming - గౌతం

    ReplyDelete
  15. ramana govindaraju17 November 2011 at 19:50

    Hilarious!
    నీ మేధావి కథ బాగుందిరా.
    దీన్నిబట్టి నా కర్ధమయినదేంటంటే నోర్మూసుకుని మన పని మనం చేసుకోవటమే.
    అయినా డాక్టర్లని మేధావులని ఎవరన్నారు?
    మనం కుక్క లాగా కష్ట పడే వాళ్ళం మాత్రమే.
    నువ్వు త్వరగా ICU లోంచి కోలుకుని బయటకి రావాలని కోరుకుంటూ..

    ReplyDelete
  16. ఆవిడ నాకేసి ఎగాదిగా చూసింది. ఒక్క క్షణం ఆలోచించింది.
    "సారీ! నేను దొంగ సర్టిఫికెట్లు ఇవ్వను." అంటూ వెళ్ళిపోయింది.
    మీకు ట్యూబు లైటు చోక్ కీ, స్టార్టర్ కీ తేడా తెలీటల్లేదు. నేనేం చెప్పినా నమ్మేస్తున్నారు. ఎంతడిగినా ఇచ్చేస్తున్నారు. కనీసం స్విచ్చిలు కూడా గుర్తుండవు."
    మీకు బెండకాయకీ, దొండకాయకీ తేడా తెలవదు. పూరీకీ, చపాతికీ కూడా తేడా తెలవదు. గొంగూరకీ, తోట కూరకీ తికమక పడతారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తంది. కెవ్వు కేక నవ్వలేకపోతున్నాను! ICU నించి త్వరగా వచ్చి అందరికీ laughing తెరపి ఇవ్వాలని కోరుకుంటూ................ నేను మిమ్మల్ని మేధావిగా ప్రకటించడం జరిగింది!

    ReplyDelete
  17. డాట్రారూ!
    మీ బ్లాగ్స్ చూసి
    నవ్వలేక నడుం నొప్పి తెచ్చుకున్నాం (ఏదో ప్రాస కోసం అన్నాలెండి)
    మిరపకాయ బజ్జీలు తిని mot...s తెచ్చుకున్నాం (మళ్లీ ప్రాస )
    అంతెందుకు ఈసారి ఇండియా వొచ్చినప్పుడు చిలకలూరిపేట పద్మనాభ హోటల్ కి వెళ్ళాలి అని ప్లాన్ కూడా చేస్కున్నాము.

    ఇన్నీ కామెంట్స్ చూసి నాకు ఓ డౌటు వొచ్చింది!
    మీరు నిజంగానే 'ఇచు' (ICU ని గూగుల్ తెలుగు ఇలాగే మార్చింది మరి) లో ఉన్నారా? ఉంటె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం!

    ReplyDelete
  18. meeru త్వరగా ICU లోంచి కోలుకుని బయటకి రావాలని కోరుకుంటూ..

    ReplyDelete
  19. Very humorous, as every body said couldn't stop laughing . Very proud of you Ramana and keep churning up these marvels .

    ReplyDelete
  20. యనమండ్రాస్18 November 2011 at 04:04

    "మీకు బెండకాయకీ, దొండకాయకీ తేడా తెలవదు. పూరీకీ, చపాతికీ కూడా తేడా తెలవదు. గొంగూరకీ, తోట కూరకీ తికమక పడతారు. " ఇది వీర పురుషులు మాత్రమే సాద్యం .
    అడుగంటిపోతున్న మగజాతి కి మీరే జీవనాధారం, మీరు తప్పకుండా మేధావే.

    ReplyDelete
  21. డాట్రారండీ,

    మీ బ్లాగ్ చితక్కోట్టేసారండి. చాలా చాలా బాగా రాసారు. "I don't have time" అని అందరు అబద్దాలు చెప్పుకునే ఈ రోజుల్లో...ఒక డాక్టర్ అయ్యి ఉంది కూడా ఇంత మంచి చతురతతో కూడిన బ్లాగ్ రాయటం నిజంగా అభినందనీయం. భగవంతుడు మీకు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాగే ప్రోత్సహించాలని ప్రార్ధిస్తూ......

    ReplyDelete
  22. మేధావి ఎవరు?
    చదువుకీ, మేధావిత్వానికీ సంబంధం ఉందా?
    నేనయితే లేదనే అనుకుంటున్నాను.
    ఆ విషయాన్నే రెండు పాత్రల ద్వారా చెప్పించాను.
    ఈ పోస్ట్ రాయటానికి ప్రేరణ అయిన చలసాని శ్రీనివాస్ కి కృతజ్ఞతలు.

    నా ఐ.సి.యూ. ప్రహసనం చివరి నిమిషంలో కలిపాను.
    ఈ పోస్ట్ మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.
    మిత్రులందరూ సరదా కామెంట్లు రాసి పోస్ట్ ని మరింత మెరుగుదిద్దారు.
    అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
    మొదట్లో కామెంట్లు పట్టించుకునే వాణ్ణి కాదు.
    ఇప్పుడిప్పుడే కామెంట్ల కిక్కు తలకెక్కుతుంది!

    స్వీట్లమ్ముకునే వాడికి స్వీట్లంటే మొహం మొత్తుతుంది.
    నా పేషంట్ లకి ఎట్లాగూ నేను 'డాక్టరుగారు' నే!
    ఆ సంబోధనలు బ్లాగుల్లో కూడానా!
    బ్లాగుల్లో నన్ను నా పేరుతొ వ్యవహరిస్తే సంతోషం.

    ReplyDelete
  23. హహహహ చంపేశారండీ బాబు :-)

    ReplyDelete
  24. మేధావులకు వందనాలు!

    మేధావులే బాదిత్వం తప్పిచ్గుకోలేక పొతే మా లాంటి సన్నాసులకు ఆశలు అడియాసలె.

    మొదలు ఈ మెయిలు చదివి నవ్వుకున్నా, తరవాత గుర్తుకు వచ్చింది నేను భార్య బాదితున్నేనని. చావు తప్పి కళ్ళు లొట్ట పోయిన వైనం అప్పుడే మర్చి పోయానేంటి? (last years' black eye!)

    మా ఆవిడకి చూపించ మీ ఈ మెయిలు. అప్పుడు అంది మాఆవిడ, నాకు కాపీ చేయకుండా మీరు మీరు ఏమి చేద్దామని అనుకుంటున్నారు? అప్పుడు చూసాను, నా రిక్షా తొక్కే అడ్ద్రస్సుకు వస్తున్నాయి ఈ ఈ మెయిల్లు అని. అయ్యా నాకు కొన్ని రోజులు బతికి బలుసాకు తినాలని వుంది! అందుకు మీ అందరి సాయం కోరుతున్నా. ఈ మెయిలు కొంచెం మాయవిడ చుసేట్టుగా ఉగందే@యాహూ.కము కు కాపి చెయ్యండి. మీ ఋణం ఈ జన్మలో మర్చిపోలేను.

    ఫ్లగ్స్తాఫ్ఫ్ నుంచి వస్తు తోవలో చూసా ఒక బాదితుడిని. హైవే మీద మారుస్తున్నాడు వాడు టైరు, చేతులు కట్టుకుని చూస్తుంది వాళ్ళావిడ. మా ఆవిడకు చూపించి చెప్పాను పాపమూ కదు అని, గుర్తుకు చేసింది మా ఆవిడ, డొక్కు కారు ఇస్తే అలాగే అవదు మరి అని.

    ఇప్పుడు ఇప్పుడే వచేట్టు లేదు విప్లవం, మన గతి ఇంతేనా ప్రస్తుతానికి?
    చేసేది ఏదో మీ లాంటి మేధావులే చేయాలి, మా లాంటి సన్నాసులు మీ బాటలో నడవడానికి రెడి?

    ఇట్లు

    సన్నాసి అని తెలిసుకున్న

    ఉదయ్

    ReplyDelete
  25. యనమండ్రాస్20 November 2011 at 11:52

    ఇప్పుడే మా ఆవిడకి చదివి వినిపించ. మనసుతీర నవ్వుకున్నాం.

    రమణగారు మేధావి వర్గంలో సభ్యులు కావడానికి ఇంకా ఎక్కువ దూరం లేదని గట్టిగా తీర్మానించుకున్నాం.

    ఈ నవ్వుల పువ్వుల పరిమళాలు మకందిస్త్తునందుకు మీకు మా ధన్యవాదాలు.

    యనమండ్రాస్

    ReplyDelete
  26. యనమండ్రాస్20 November 2011 at 14:46

    "గిన్నెలు తళ తళ నీ కున్న కళ"..
    "గుత్తి వంకాయ కురోయ్ మామ, కోరితే వండవ మా మంచి మామ" ..
    అని నా చేత గిన్నెలు కడిగించి, వంటలు చేయేంచే మా ఆవిడ మేధావా ?

    లేక

    "మీకు బెండకాయకీ, దొండకాయకీ తేడా తెలవదు. పూరీకీ, చపాతికీ కూడా తేడా తెలవదు. గొంగూరకీ, తోట కూరకీ తికమక పడతారు. " అని అనుకునేటట్లు చేసెన రమణగారు మేధావా?
    ఇది ఖ్హచ్చితంగా వీర పురుషులు మాత్రమే సాద్యం .
    అడుగంటిపోతున్న మగజాతి కి ఈయనే జీవనాధారం, తప్పకుండా మేధావే.

    ReplyDelete
  27. అది సరే, ఇంతకీ ట్యూబ్ లైటు చోకు, స్టార్టరు ఒకటి కాదా అయితే?

    ReplyDelete
  28. నాదీ సుజాతగారి‌ డౌటే!

    ReplyDelete
  29. రమణ,

    అప్పుడెప్పుడో నేను మేధావి నే నా అని నీకు అనుమానం వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో చెయ్యబోతున్నాడు అని

    ఇప్పుడు అర్థం అయ్యింది లేక పోతే అప్పుడెప్పుడో మొదలయిన బ్రెయిన్ డ్రెయిన్ గురించి ఇప్పుడు నువ్వు రాయటం ఏంటి

    దానికి నీ బ్లాగు మిత్రులంతా కలిసి ముక్త కంఠంతో నువ్వు మేధావి వే అని సర్టిఫికేట్ ఇవ్వటం ఏమిటి?

    దానికి నువ్వు సంతోషంతో గంతులేయ్యటం ఏమిటి? నాకయితే ఇదంతా ఏదో కుట్రలాగా ఉన్నది

    ఎలాగయినా నిన్ను మేధావి కింద ముద్దరవేసి ఓ సన్మానం లాంటిది చేసి పడేస్తే నువ్వు ఆ

    ఆనందంలో మునిగి పోయి బ్లాగ్లు రాయటం మానేస్తావని లేదా రెచ్చి పోయి పిచ్చి పిచ్చి రాతలన్ని రాసి (మేతావుల్లగా)

    నీ పేషంట్ల లాగ ఇపోతే.. హాయిగా ఎవరి బ్లాగ్లు వాళ్ళే రాసుకుని ఆనందిచాలని నీ మీదో వెనకో జరుగుతున్న కుట్ర లాగ అన్పిస్తోంది

    కాబట్టి ఓ నా పిచ్చి రమణ నువ్వు హాయిగా మామూలు రమణ లాగ నాలాంటి పిచ్చి వాళ్లకి వైద్యం చేసుకుంటూ పనిలేనప్పడు

    పనిఉన్నప్పుదు పిచ్చి బ్లాగ్లు రాసుకుంటూ అనంద భవన్ మసాల దోసె లు తింటూ అప్పుడప్పుడు కో.కు ని రావి ని నెమరు వేసుకుంటూ

    పదికాలాలపాటు దే.చె ల నమస్కారాలు అందుకుంటూ ఉంటావని ఆశిస్తూ

    మిత్రుడు

    రవి

    తో.క. లైట్ తీస్కో

    ReplyDelete
  30. mee tapa Ardham Kavalante Goppa medhavi ayyundaloy...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.