ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని మైసూరు పాక్ తింటున్నారు, వారిద్దరికీ ఆ స్వీట్ ఎంతగానో నచ్చింది. ఆ ఇద్దర్లో ఒకాయన జ్ఞాని, వంటలో కూడా అనుభవం ఉంది, పైగా కవి. అంచేత - ఆయన తనకెంతగానో నచ్చిన ఆ స్వీటుని మెచ్చుకుంటూ.. దాని రుచికి కారణమైన పంచదార పాకాన్ని, నెయ్యిని వర్ణిస్తూ మాట్లాడసాగాడు. అంతేనా! కొద్దిసేపటికి అద్భుతంగా కవిత్వం చెప్పడం కూడా మొదలెట్టాడు.
ఆ రెండోవాడు అజ్ఞాని. వాడికసలు మైసూర్ పాకం తయారీలో శెనగ పిండి, నెయ్యి వాడతారని కూడా తెలీదు. కానీ - తియ్యతియ్యగ, మెత్తమెత్తగా నోట్లోకి జారిపోతున్న మైసూరు పాకాన్ని ఆపకుండా మింగుతూనే ఉన్నాడు. వాడు కవిగారి కవిత్వాన్ని వింటున్నాడు గానీ అర్ధం చేసుకోలేకపోతున్నాడు! అయితే - మైసూర్ పాక్ ముక్కల్ని కవిగారి కన్నా ఎక్కువే పొట్టలోకి పంపేశాడు.
ఇదంతా నే రాయదలచుకున్న విషయానికి ఉపోద్ఘాతం. పై కథలో అ అజ్ఞానిని నేనే! నాకు సంగీత పరిజ్ఞానం లేదు, కానీ పాటలు వింటాను, చాలా పాటలు చాలాసార్లు వింటాను. కొన్ని పాటలంటే మరీమరీ ఇష్టం. పాటలకి ముడిసరుకు సంగీతం. మరి సంగీతంలో ఓనమాలు కూడా తెలీని నేను పాటల్ని ఎందుకు ఇష్టపడుతున్నాను? ఇందుకు కారణాలు (నాకు తోచినవి) రాస్తాను.
ఆలోచించగా - నా 'ఫలానా పాట ఇష్టం' అనేది, నా 'ఫలానా సినిమా ఇష్టం'తో కలిసిపోయి ఉందని అనిపిస్తుంది. నేను సినిమా పాటని సినిమాలో భాగంగా మాత్రమే చూస్తాను. సినిమాని ఒక 'ఇల్లు'గా ఊహించుకుంటే, పాట ఆ ఇంట్లో ఒక గది వంటిది. ఇల్లంతా శుభ్రంగా ఉంటేనే ఆ గదికూడా శుభ్రంగా ఉంటుంది, లేకపోతే లేదు. అంతే! ఇంకొంచెం వివరంగా చెబుతాను.
సినిమా దృశ్యప్రధానమైనది. పాటలు కథలో కలిసిపోయి ఉంటాయి, అంటే - పాట అనేది ఒకకథ చెప్పేవిధానంలో భాగం. దర్శకుడు కథని ముందుకు నెట్టడానికో, విషయాన్ని మరింత గాఢంగా చెప్పడానికో పాటని వాడుకుంటాడు. అంచేతనే మనకి బాగా నచ్చిన పాటలు రేడియోలో వింటున్నా ఆ సినిమా సన్నివేశం గుర్తొస్తుంది. అంటే ఒకపాట మెదడులో దృశ్యపరంగా స్టోర్ అయ్యుంటుంది, సినిమా పాటలకి మాత్రమే ఈ రకమైన కండిషనింగ్ ఉంటుంది. క్లాసికల్ సంగీతం ధ్వని ప్రధానమైనది, కాబట్టి ఈ లక్షణం కలిగుండదు.
ఒక పాట సాహిత్యం కాగితంపై చదువుతాం, 'బాగుంది'. అదే పాటని ఒక మంచి గాయకుడు భావయుక్తంగా ఆలపించాడు, 'ఇంకా బాగుంది'. అదే పాటకి నటనని జోడించి సినిమాలో దృశ్యపరంగా చూశాం. ఇప్పుడు మనసు సాహిత్యాన్ని ఫాలో అవుతుంది, చెవి శబ్దాన్ని (సంగీతం) ఫాలో అవుతుంది, కన్నుదృశ్యాన్ని ఫాలో అవుతుంది. ట్రిపుల్ ధమాకా! జ్ఞానేంద్రియాల్లో visual impact బలమైనది. అంచేత ఇప్పుడా పాట ఇంకాఇంకా బాగుంటుంది. ఈ విషయం మరింత వివరించడానికి నాకెంతో ఇష్టమైన ఆవకాయ ఉదాహరణ రాస్తాను.
ఇవ్వాళ మీరు డైటింగ్ చేస్తున్నారు, కాబట్టి - ఈ రోజంతా ఏమీ తినకూడదని డిసైడైపొయ్యారు. ఇంతలో ఎదురుగా - ఒక గిన్నెలో అప్పుడే కలిపిన కొత్తావకాయ కనిపిస్తుంది. కమ్మని ఆవఘాటు ముక్కుపుటాల్ని తాకింది - ఇది olfactory (వాసన) sense. ఎర్రటి ఆవకాయ చూడ్డానికి కన్నుల పండుగలా ఉంటుంది - ఇది visual sensory (కంటిచూపు) impact. ఇప్పుడు olfactory + visual sensory organs మెదడులోని hypothalamus లో ఆకలిని కలిగించే నాడీవ్యవస్థని stimulate చేస్తాయి - నోట్లో నీరూరుతుంది. ఇక్కడ ఆవకాయ రుచి gustatory (రుచి) sense, కావున - ఆకలి నకనకలాడుతుంది.
ఇంక ఆ ఆవకాయని వేడివేడి అన్నంలో ఎర్రెర్రగా కలుపుకుని తినకుండా ఆపడం ఎవరి తరం? ఎవడన్నా ఆపుదామన్నా మర్డర్ చేసెయ్యమా? ఆవకాయని కళ్ళు మూసుకుని వాసన చూసినా, ముక్కు మూసుకుని కంటితో చూసినా ఇంత ఆకలి వెయ్యదు. అంటే - ఇక్కడ మూడు sensory organs ఒకదాన్ని ఇంకోటి compliment చేసుకున్నాయి, అదీ సంగతి! 'ఒక దృశ్యరూపం మైండ్ లో స్థిరంగా స్థిరపడిపోతుంది.' అన్న నగ్నసత్యం మీక నా ఆవకాయ పచ్చడి ఉదాహరణ ద్వారా అర్ధమైందని అనుకుంటున్నాను. ఇక్కడిదాకా నా వాదన మీరు ఒప్పుకున్నట్లయితే, ఇప్పుడు ఇదే వాదనని సినిమా పాటల్లోకి లాక్కెళ్తాను.
ఇందుకు ఉదాహరణగా 'మూగ మనసులు'లోని పాటొకటి తీసుకుంటాను. ఈ సినిమాలో 'పాడుతా తీయగా చల్లగా.. ' అనే పాట నాకు చాలా ఇష్టం. దిగుల్లో ఉన్న అమ్మాయిగార్ని ఓదార్చడానికి గోపి పడే వేదనలో చావుపుట్టుకల మర్మమంతా వండి వార్చేశాడు ఆత్రేయ. నాకీ పాట వింటున్నప్పుడల్లా సావిత్రి, నాగేశ్వరరావులే కళ్ళముందు కనిపిస్తారు. దుఖాన్ని గొంతునిండా నింపుకున్న ఘంటసాలని భారంగా కె.వి.మహాదేవన్ సంగీతం ఫాలో అవుతుంది. ఈ పాట ఇంతలా నాకు గుర్తుండిపోడానికి కారణం ఘంటసాల, ఆత్రేయ, కె.వి.మహదేవన్, నాగేశ్వరరావు, సావిత్రి. ద స్కోర్ ఈజ్ పెర్ఫెక్ట్ టెన్!
అయితే - వీళ్ళంతా ఎవరికేవారే గొప్పప్రతిభావంతులు. వీళ్ళని సరీగ్గా వాడుకోగలగడమే అసలైన సవాల్. వీళ్ళ ప్రతిభని తన వంటలో దినుసులుగా సమపాళ్ళలో దట్టించి కమ్మగా వంట చేసిన హెడ్ చెఫ్ ఆదుర్తి సుబ్బారావు. నాకు టోపీ లేదు, అయినా - హేట్సాఫ్ టు యు ఆదుర్తి! ఇక్కడ దర్శకుడి కాంట్రిబ్యుషనే ఈ పాటకి ఇంత చిరస్మరణీయతని ఇచ్చింది. ఆయనీ పాటని సినిమాలో చొప్పించిన సందర్భం, సన్నివేశం అద్భుతం. ఇప్పుడో చిన్న ప్రయోగం. ఈ పాట వింటూ పాట సన్నివేశ దృశ్యాన్ని, సావిత్రి, నాగేశ్వరరావుల ఇమేజెస్ ని బలవంతంగా పక్కనపెట్టటానికి ప్రయత్నిద్దాం. చాలా వెలితిగా, ఇబ్బందిగా ఉంది కదూ (ముక్కు మూసుకుని కొత్తావకాయని చూసినట్లు)!
నే చెప్పదలచుకుంది ఇదే. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి మొదలైనవారు దర్శకత్వం వహించిన సినిమాల్లో పాటల్ని గుర్తు తెచ్చుకోండి. దాదాపు అన్నిపాటలూ దృశ్యంగానే కళ్ళముందు కదలాడుతాయి. అందుకే - సినిమా పాటల్ని కేవలం సంగీతపరంగా అంచనా వెయ్యరాదని నా అభిప్రాయం. పాట బాగుంది, కాని సన్నివేశం బాలేదనిపిస్తే.. స్వీట్ బాగుంది, కానీ నెయ్యి ఎక్కువైందన్నట్లుగా ఉంటుంది. అప్పుడు స్వీట్ వెగటుగా ఉంటుంది.
ఇప్పుడు చెడిన వంటకి ఉదాహరణ చెబుతాను. నే చదువుకునే రోజుల్లో 'కన్నెవయసు' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ' అనే పాట సూపర్ హిట్. సత్యం చక్కగా స్వరపరిచాడు. బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడే గాయకుడిగా నిలదొక్కుకుంటున్నాడు. పాపం కష్టపడి పాడాడు. హీరో మా గుంటూరబ్బాయే! సినిమా చూడ్డానికి నాకింతకన్నా కారణమేం కావాలి? రిలీజ్ రోజే సినిమాని శేషమహాల్లో చూశాను - పరమ చెత్త. పాటని చెడగొట్టటానికే సినిమా తీసినట్లున్నారు!
'కన్నెవయసు' హీరో సున్నిత మనస్కుడు, కవి. హీరోయిన్నికావ్యకన్యగా భావిస్తాడు. దాశరధి, సత్యం, బాలుల మేజిక్ 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ' పాట. మంచిభోజనం పెట్టేముందు పరచిన చక్కటి అరిటాకులా, ఈపాట సినిమా మొదట్లోనే వచ్చేస్తుంది. కానీ అక్కడ అరిటాకు తప్ప భోజనం ఘోరం! ఇంత మంచిపాట ఆ సినిమాకి ఉపయోగపళ్ళేకపోయింది. 'పాడుతా తీయగా.. ' పాటని ఆదుర్తి ఆకాశమంత ఎత్తుకి తీసికెళితే, ఇక్కడ ఇంకో దర్శకుడు ఒక మంచిపాటని పాతాళానికి తొక్కేశాడు. అదీ కథ! అందువల్ల - 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ' పాట మాత్రమే 'మంచిపాట' అన్నట్యాగుతో అలా మిగిలిపోయింది.
అవడానికి రెండూ మంచి పాటలే. ఒకటి మంచిసినిమాలో స్థానం సంపాదించుకుని వన్నె పెంచుకుంటే, మరోటి బురదలో మందారంలా అక్కడే ఉండిపోయింది. నాకు చింతపండు పులిహోర భలే ఇష్టం. పులిహోర తయారీలో పచ్చిమిరపకాయల్ని ముందుగా చింతపులుసులో ఉడికించాలి. అప్పుడా చింతపులుపు పట్టిన పుల్లమిరపకాయల్ని పులిహోరలో నంజుకుంటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంటుంది. అలాగే - ఒక మంచిపాట కూడా 'కథ' అనే పులుసులో బాగా ఉడకాలి, అప్పుడే రుచి!
అమెరికా రోడ్ల మీద గుంపులుగా కనిపించే అందమైన కార్లు, అక్కడి రోడ్లమీద తిరిగితేనే బాగుంటాయి. అక్కడ బాగున్నాయి కదాని వాటిని మనూళ్ళో తిప్పితే దిష్టిపిడతల్లా ఉంటాయి, అట్లే - మనూరికి మూడుచక్రాల ఆటోలే అందం (అది చూసేవాడి దృష్టికోణం బట్టి ఉంటుంది). అమెరికా భారత సంతతి బోల్డెంత సొమ్ము పోసి నేర్చుకున్న కూచిపూడి నాట్యాన్ని రవీంద్ర భారతిలో ప్రదర్శిస్తేనే శోభిస్తుంది (గొప్పకళని ఖరీదైన కళారాధకులు మాత్రమే ఆస్వాదించగలరు), శ్రీరామనవమి పందిళ్ళలో కాదు. కావున - ఒక మంచి పాటకి మంచి సన్నివేశం జత అయితేనే మరింతగా ప్రకాశిస్తుంది, లేకపోతే లేదు, అదీ సంగతి!
(photo courtesy : Google)