"రమణ మామ! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.
టీవీలో ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ చూస్తున్నాను.
"సుబ్బూ! భలే సమయానికొచ్చావు. బోల్ట్ ని చూడు, అదరగొట్టేస్తున్నాడు. హేట్సాఫ్ టు ఉసైన్ బోల్ట్ , ద గ్రేటెస్ట్ ఎథ్లెట్." అన్నాను ఉత్సాహంగా.
సుబ్బు మొహం చిట్లించాడు.
"బోడిగుండు బోల్టుగాడు ఆ గ్రౌండులో పరిగెత్తడం నాకేమంత గొప్పగా అనిపించట్లేదు." అన్నాడు సుబ్బు.
నా ఉత్సాహం మీద నీళ్ళు కుమ్మరించినట్లయ్యింది.
"సుబ్బూ! నీకు బుర్ర సరీగ్గా పన్జేస్తున్నట్లులేదు, అతను గ్రౌండులో పరిగెత్తక ఇంకెక్కడ పరిగెత్తుతాడోయ్?" అన్నాను.
"జీవితంలో పరిగెత్తాలి, పరిగెత్తడంలో మనకిలా కొత్త రికార్డులు సృష్టించుకోవాలి." కవితాత్మకంగా అన్నాడు సుబ్బు.
ఇంతలో కాఫీ వచ్చింది, సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.
"మన పిల్లల జీవితాలు చూడు. వాళ్ళని పుట్టంగాన్లే కేజీల్లో పడేస్తారు. ఇంక చదువుల పరుగు, పరీక్షల పరుగు. కార్పొరేట్ స్కూళ్ళు, నిర్బంధ ర్యాంక్ సాధన పధకాలు. మెడిసిన్ సీటు, IIT సీటు అనే పతకాలు సాధించాలి.. ఆపకుండా పరిగెత్తుతూనే ఉండాలి."
"మంచిదే కదా! కాంపిటీటివ్ గా లేకుంటే మంచి భవిష్యత్తు ఎలా సాధ్యం?" అడిగాను.
"మంచిదా! ఎవరికి మంచిది? ఎందుకు మంచిది? ఇక్కడ మంచిదో కాదో నిర్ణయించుకునే అవకాశం, సమయం ఎవ్వరికీ లేదు నాయనా! వేలం వెర్రిగా పరిగెత్తడమే అందరి పని." అన్నాడు సుబ్బు.
"ఇంతకీ నీ కంప్లైంట్ ఏంటి? చదవొద్దనా? మంచి భవిష్యత్తు సంపాదించొద్దనా?" చికాగ్గా అన్నాను.
"నాకే కంప్లైంట్ లేదు, జరుగుతున్నది చెబుతున్నానంతే. మనవాళ్ళు స్పీడుగా పరిగెత్తుకుంటూ 'మంచి' ఉద్యోగంలోకొచ్చి పడతారు. కానీ ఇక్కడ ఫినిష్ లైన్ ఉండదు. విజయవంతంగా పరిగెత్తినందుకు 'మంచి' పెళ్ళిసంబంధం అనే పతకం ఇవ్వబడుతుంది. సినిమాల్లో హీరోకి పెళ్ళవ్వంగాన్లే 'శుభం' కార్డు పడుతుంది, ఇక్కడా సౌలభ్యం లేదు. కాళ్ళు లాగేస్తున్నాయి, పరుగు స్పీడు తగ్గిద్దామనుకున్నా.. కొత్తభార్య అందుకు ఒప్పుకోదు. కొత్త లక్ష్యాలు నిర్దేశింపబడతాయి. పెద్దఇల్లు, పెద్దకారు, అనేక ఇన్వెస్టిమెంట్ ప్లాన్లు, ఖరీదైన వెకేషన్లు.. ఇవొక అంతులేని లక్ష్యాలు. ఇక్కడ ఫినిష్ లైన్ కి తావులేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్రం గుండెలు పగిలేలా పరిగెత్తాల్సిందే." అన్నాడు సుబ్బు.
"అందుకేనా నువ్వు పెళ్ళి చేసుకోంది?" నవ్వుతూ అన్నాను.
సుబ్బు కూడా నవ్వాడు.
"అన్నీ అమర్చుకున్నాం, అమ్మయ్య! అంటూ కొద్దిసేపు ఆ పక్కన కూర్చుని అలుపు తీర్చుకుందామనుకునేలోపు, పిల్లలు పెద్దవాళ్ళవుతుంటారు. వారికి 'మంచి భవిష్యత్తు' కోసం.. గుర్రం మళ్ళీ పరుగో పరుగు. అంత పరిగెత్తుతూ కూడా అభద్రతా భావం, భయం, ఆందోళన. అంచేత - బిపి, షుగరు బోనస్. ఆ తరవాత రిటైర్మెంట్ ప్లాన్లంటూ మళ్ళీ కొత్త లక్ష్యాలు నిర్దేశింపబడతాయి. పడుతూ లేస్తూ కుంటి గుర్రంలా మళ్ళీ పరుగు షురూ." అంటూ ఖాళీకప్పు టేబుల్ పై పెట్టాడు సుబ్బు.
"సుఖమయ జీవనానికి ఇవన్నీ అవసరమోయీ! వీటిని నొప్పిగా భావించరాదు." అన్నాను.
"సుఖమయ జీవనమో, భారమయ జీవనమో.. అది చూసేవాడి దృష్టికోణం బట్టి ఉంటుంది మిత్రమా!" అంటూ టైమ్ చూసుకుంటూ లేచాడు సుబ్బు.
"సుబ్బూ! పొరబాటున కూడా సజావుగా మాట్లాడవు గదా! బట్టతలకి మోకాలికి ముడేస్తూ ఏదేదో వాగుతావు." అన్నాను.
సుబ్బు పెద్దగా నవ్వాడు.
"నీకలాగే ఉంటుందిలే. నువ్వా బోల్టో, నట్టో.. వాణ్నే పొగుడుకో. నేకాదన్నానా? కాకపోతే - వాడు పరిగెత్తేది మాత్రం వంద మీటర్లు, పది సెకండ్లే! కానీ మనవాళ్ళు పరిగెత్తేది వందేళ్ళు. పరిగెత్తడానికి మనకి మంచి బూట్లుండవు, నున్నటి ట్రాకులుండవు, ఉత్సాహపరిచే ప్రేక్షకులుండరు, మైమరిపించే గర్ల్ ఫ్రెండులుండరు. నెత్తిన ట్రంకు పెట్టెలో బాధ్యతల బరువు, ఎగుడు దిగుడు రోడ్డు, గులకరాళ్ళు, దుర్భర వాతావరణం, ఎంత పరిగెత్తినా కనపడని ఫినిష్ లైన్. నా మటుకు నాకు ఆ బోల్టుగాడి కన్నా మనమే పరుగుల చాంపియన్లం అనిపిస్తుంది. పనుంది, వస్తా మరి!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.
(photo courtesy : Google)
అమ్మయ్యో! బోల్ట్‌కు మాత్రం జీవితం అనే పరుగు పందెం ఉండదా ఏమిటి? అతని జీవిత పరుగు పందెంలో 'ఒలంపిక్స్ పరుగు' ఒకానొక లక్ష్యం మాత్రమే కదా!
ReplyDeleteజమైకాలో శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల బ్రాంచ్ లు లేవనుకుంటున్నాను. కాబట్టి బోల్ట్ 'జీవితం అనే పరుగు పందెం' మనంత దుర్భరంగా ఉండకపోవచ్చు.
Deleteమీ సమాధానం చూస్తే ఒక తుంటరి ఆలోచన మెదిలింది! శ్రీచైతన్యా, నారాయణ సంస్థలు క్రీడలలో దిగితే ఎట్టా ఉండుద్ది? ఒలంపిక్స్‌లో మన పంట పండుద్దేమో కదా! :-)
Deleteష్! గప్ చుప్!
Delete(ఇట్లాంటి బిజినెస్ ఐడియాలు బ్లాగుల్లో చర్చించరాదు.)
వాళ్ళంతా జీవితపు పరుగు పందెం లో నేగ్గదానికే ఒలింపిక్స్ లో పరిగేడుతున్నరేమో అని అనిపిస్తుంది.
ReplyDeleteనేను చదివిన దానిని బట్టి వాళ్ళ జీవితాలు మొదలుపెట్టింది మనలా శుబ్రంగా ఉన్న ట్రాక్ మీద కాదేమో, ఎగుడు దిగుడు రోడ్ల మీద మొదలెట్టి ఇప్పటకి ఒక ట్రాక్ లో పడ్డారు. మనం కూడా వేగంగా పరిగెత్తి , ఆ తరువాత విశ్రాంతిగా కూర్చోవచ్చు. కాకపోతే జనం అలా లేరు. అది మన తప్పు.
:venkat
>> మనం కూడా వేగంగా పరిగెత్తి , ఆ తరువాత విశ్రాంతిగా కూర్చోవచ్చు.<<
Deleteఆ విశ్రాంతి ఎడారిలో ఎండమావి వంటిదని నా టపా సారంశం!
"Even if you win the ratrace, you are still a rat": Anon.
ReplyDeleteమీ సుబ్బుది చాలా విచిత్రమైన కేరక్టర్.
ReplyDeleteఎంత గొప్పవాళ్ళదైనా గాలి తీసేస్తుంటాడు.
గొప్ప గొప్ప వాళ్ళని కూరలో కరివేపాకులా ఏరి పారేస్తాడు.
మీ సుబ్బు గారి డిక్షనరీలో లిజండ్‌లు, సెలబ్రిటీలు ఉండరా?
సుబ్బుది కొద్దిగా తలతిక్క వ్యవహారం లేండి. ఏదో వాగేస్తూ ఉంటాడు. ఆ వాగుడంతా 'పని లేక.. ' నేను బ్లాగులో రాసేస్తుంటాను. అంతే!
Delete*ఎంత పరిగెత్తినా కనపడని ఫినిష్ లైన్ ఉండదు. ఇక్కడి దాకా విజయవంతంగా పరిగెత్తినందుకు 'మంచి' పెళ్ళిసంబంధం అనే పతకం ఇవ్వబడుతుంది*
ReplyDeleteరమణ గారు,
ఇంత ఆలోచించిన మీకు ఫినిష్ లైన్ కనపడలేదా ? లేక రాయటానికి ఇష్ట్టంలేక వదిలేశారా? మీరు పైన రాసిన లక్ష్యాల మీద, ప్రజలు మరీ ఎక్కువగా ఫోకస్ పెట్టటం వలన చాలా దుష్పరిణామాలు రానున్న కాలంలో ఎదుర్కొనాల్సి వస్తుంది. అందులో మొదటిది ముఖ్యమైనది విజయతంగా పరిగెత్తినందుకు 'మంచి' పెళ్ళిసంబంధం అనే పతకం లభిస్తుందనే గేరంటి రానున్న తరానికి ఉండదు. రెండవది ఇప్పుడు చాలా మందిఒక సంతానంతో సరి పెట్టుకోవటం, ఆ పిల్లా/పిల్ల వడికి ఏ లోటు లేకుండా తల్లిదండ్ర్లు టాటా/ బిర్లాల పిల్లలను పెంచినట్లు పెంచుతున్నారు. తల్లిదండృల గారాబంతో మొబైల్ పోన్ లు, డిజిటల్ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తూ , వర్ట్యుయల్ ప్రపంచంలో పెరుగుతున్న పిల్లలు,పెరిగి పెద్ద వారై పెళ్లి చేసుకొని అన్యొన్యంగా కలసి జీవిస్తారనేది ఊహించటానికి కష్ట్టం గాఉంది. అయ్యేపని కాదు కూడాను. మనుషులకు ఎప్పుడు భవిషత్, వర్తమానానికన్నా చాలా బాగుంట్టుందని ఊహించుకొంటూ వుంటారు. మార్పు వలన ఎప్పుడు మంచి జరుగుతుందని గేరంటి ఎమీ లేదు. సామాజిక అవగాహన లేని తల్లిదండృల సంఖ్య మనదేశంలో, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలలో ఎక్కువ. వీరిలో చాలామందికి పేపర్ చదవటం అనేది కూడా ఒక లాభం లేని, జీవితానికి ఉపయోగ పడని, పనికి మాలిన పని. వీరి లక్ష్యం ఎప్పుడు పిల్లలు చదువుకొని, మంచి డబ్బులు సంపాదించాలి. వీళ్లె ఇప్పుడు సమాజానికి డ్రైవింగ్ ఫోర్స్. మీలాగా ఆలోచించే వారిని నేగటివ్ గా మాట్లాడుతున్నారని కొట్టి పారేయొచ్చుకూడా! ఈ రోజుల్లో ఒక సంతానం తో ఎలాగూ సరిపుచ్చుకొంట్టున్నారు, ఈ ఒక సంతానం వారికి పెళ్లై, పిల్లలు పుట్టే అవకాశాలు చాలా చాలా తక్కువ. చాలామంది అప్పర్ మీడిల్ క్లాస్ వారి వంశాలు రానున్నతరంలో అంతరించే అవకాశాలు పుష్కలం. అప్పుడు ఫినిష్ లైన్ కనిపించినా ఎమీ చేయలేరు.
SriRam
శ్రీరాం గారు,
Deleteచక్కటి కామెంట్. ప్రస్తుత పరిస్థితుల్ని నిర్మొహమాటంగా రాశారు. కొన్ని విషయాల్లో మీకున్నంత అవగాహన నాకు లేదు. అందువల్ల లోతుల్లోకి పోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేస్తాను.
(ఆ తొర్రల్ని పూడ్చడానికి మీ నుండి వివరణాత్మక లింకుల కామెంటొకటి వచ్చేస్తుందిలే అన్న భరోసా కూడా ఉంది.)
* నిర్మొహమాటంగా రాశారు*
Deleteరమణ గారు,
నాకు తెలిసిన వారిలో నిర్మోహమాటమంటే యు జి కృష్ణముర్తిగారిదే. ఇక మీకు లింక్ ఇవ్వటానికి కారణం డా|| సుబ్రమణ్య స్వామి గారు. ఆధారం లేకుండా మాట్లాడడు. వీరిద్దరు సత్యం ఎంత సింపులో, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో, అతి తక్కువ సమయం లో చెప్పగల సమర్ధులు. గంటల గంటల తాత్విక చర్చలు, ప్రెసేంటేషన్ స్కిల్స్ , ఇతరులను ఆకట్టుకొనే శైలి కోసం ప్రయత్నాలు ఏవి పెద్దగా ఉండవు. వారిద్దరి మేసేజ్ ఈజ్ సింపుల్ అండ్ క్రిస్టల్ క్లియర్. వీరి ప్రభావం నాపైన ఉంది, 99% యు జి గారి ప్రభావం.
SriRam
రమణగారు,
ReplyDeleteమన సమాజం అమేరికనైజేషన్ ఊహించిన దానికన్నా ఎక్కువై పోతున్నాది. కనుక ఆ పైన వ్యఖ్య రాయటం జరిగింది. నేను చెప్పినదానికి మద్దతూgaa మీకు క్రింది లింక్ ఇస్తున్నాను. తీరిక సమయం లో చదువుకోండి.
Many singles looking for love, but not marriage
So many singles appear to be enjoying their unencumbered and unmarried state that two-thirds aren't even sure they want to marry, suggests a broad national survey of the dating habits, sexual behaviors and lifestyles of 5,541 single adults across the USA
Almost 40% of singles 21 and older surveyed were uncertain about wanting to marry; overall, 34.5% say they do want to marry, but 27% don't.
http://www.usatoday.com/news/health/wellness/story/2012-02-01/Many-singles-looking-for-love-but-not-marriage/52922248/1
SriRam
చాలా అద్భుతమైన పోస్టు.అందరూ చదివి ఆలోచించవలసిన విషయం. నేను 50 ఏళ్ల క్రితమే భారతి పత్రిక లో మదురాంతకం రాజారాం గారి కథ సర్కసు డేరా చదివాను.దానిలో ఇలాగే ఇద్దరు మిత్రులు సర్కసుకు వెళ్లినప్పుడు అందులో ఒకరు ట్రపీజ్ పీట్లను మెచ్చుకుంటుంటే, అతడి మిత్రుడు దానిదేముంది వారికి క్రిందని నెట్ ఉంటుందనీ, నిజజీవితంలో తన తండ్రి నూతి గట్టుమీద నిలబడి తాపీ పని చేస్తాడనీ క్రిందపడితే ప్రాణాంతకమేననీ అంటాడు.అలాగే సింహం నోట్లో తల పెట్టడం గురించి మాట్లాడుతూ దానికి మాస్టరంటే విశ్వాసమైనా ఉంటుందనీ నిజ జీవితంలో మనుషులు అంతకంటె ప్రమాదకారులనీ అంటాడు. ఇలాగే అన్ని విషయాలలో సర్కస్ లో కంటె నిజ జీవితం లోనే అభద్రత ఎక్కువ అని చెబుతాడు. మీ సుబ్బు చెప్పిందీ అదే కదా?
ReplyDeleteగోపాలకృష్ణారావు గారు,
Deleteమీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
నా పోస్ట్ చదువుతున్నప్పుడు మధురాంతకం రాజారాం గారి కథ మీకు జ్ఞాపకం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
(స్వగతముగా.. గర్వంగా కూడా ఉంది.)
ReplyDeleteడాక్టర్ రమణగారూ. సుబ్బులు పేరుపెట్టి మీ అభిప్రాయాలు రాస్తున్నారు.పరవా లేదులెండి.కాని మీ పిల్లల్ని ఎలా పెంచారో(పెంచుతున్నారొర్ )ఎలా చదివిస్తున్నారో లేక(చదివించారో కాస్త తెలుసుకోవాలనిఉంది.
కమనీయం గారు,
Deleteతప్పకుండా. దయచేసి నా ఈ మెయిల్ కి రాయండి. నా వ్యక్తిగత సమాచారం మీతో షేర్ చేసుకుంటాను. బ్లాగులో కేవలం నా అభిప్రాయాలు రాస్తున్నాను. నా అభిప్రాయాలు అందరికీ నచ్చాలని లేదు (నా కుటుంబ సభ్యులతో సహా).