నిరంజనరావుకి తండ్రి లేడు. భూమ్మీద పడగానే అతనికి అమ్మా, ఆకలి తప్ప మరేం దక్కలేదు. అందుకే పరిస్థితుల్ని జయించి పైస్థాయికి వెళ్ళాలనే కసి కూడా అప్పుడే కలిగింది.
అతని మాటలు వేసవికాలంలో మల్లెపువ్వుల్లా మధురంగా ఉండవు. చలికాలంలో వానచినుకుల్లా చురుక్కుమంటాయి... నిశ్చలంగా ఉన్నప్పటికీ అతను ధ్యానంలో ఉన్న యోగిలా నిర్మలంగా కనిపించడు. సత్రంలో బైరాగిలా చవగ్గా కూడా కనిపించడు. పుట్టలో పాములా భయంకరంగా కనిపిస్తాడు.
నిరంజనరావుకి తనచుట్టూ ఉండే దారిద్ర్యపు వాతావరణం అన్నా, తనచుట్టూ ఉండే తనలాంటివారన్నా తెగ ద్వేషం ప్రబలింది... అంతా ఒకే జెయిల్లో ఉన్నప్పటికీ అమెరికాలో తెల్లఖైదీలు నల్లఖైదీలని చూసినట్లు సాటివారిని చూసి అసహ్యించుకోనారంభించాడు... జీవితంలో అమరసౌఖ్యాలున్నాయనీ, వాటిని "చదువు" ద్వారా సంపాదించుకోవచ్చని అతను గ్రహించాడు.
పోటీ పరీక్షకి ప్రిపేర్ అవ్వటం కోసం చేస్తున్న చిన్నఉద్యోగాన్ని వదులుకొని.. పట్నంలో ఒక గది అద్దెకి తీసుకుంటాడు. ఇంటి ఓనర్ పక్కగదిని దగ్గర్లోనే ఉన్న ధర్మాసుపత్రి వైద్యనిమిత్తం వచ్చేవారికి రోజువారి అద్దె పద్ధతిన ఇస్తుంటాడు. పరీక్షల కోసం నిరంజనుడు భీకరంగా చదువుతుండగా పక్కగదిలోకి ఒక పేదకుటుంబం అద్దెకొస్తుంది.
ఆ కుటుంబంలోని భర్తకి చర్మం, దంతం, ఎమిక, దగ్గు తప్ప అతన్లో ఇంకేమి ఉన్నట్లులేవు... ఆ ఆడమనిషి పుల్లలా ఉంది. ఆమె గుండెలు అర్చుకుపోయాయి. ఆమె ముఖం పీక్కుపోయింది. ఆమె కళ్ళు పిల్లిని చూసిన ఎలక కళ్ళల్లా లేవు! పులిని చూసిన లేడి కళ్ళల్లా వున్నాయి. ఆ లేడైనా అర్నెల్లనించీ ఏఆకూ, అలమూ దొరక్క ఉప్పునీళ్ళు తాగి బతుకుతున్న లేడన్నమాట... ఆవిడ పెద్దడాక్టర్ల ముందు నగ్నంగా నిల్చున్న జబ్బుమనిషిలా చాలా దీనంగా కనిపిస్తుంది. ఆ పిల్లవాడి ఏడుపు చాలా ఘోరంగానూ, భయంకరంగానూ ఉంది.
ఆ పిల్లవాడి ఏడుపు తన చదువుకి తీవ్రఆటంకంగా పరిణమిస్తుంది. భర్త ధర్మాసుపత్రిలో చేరతాడు. ఓ అర్ధరాత్రి ఆ పిల్లవాడికి ప్రాణం మీదకొస్తుంది. ఆ ఆడమనిషి నిరంజనరావుని ఆస్పత్రి దాకా తోడు రమ్మని దీనంగా అర్ధిస్తుంది. అప్పటికే చిర్రెత్తిపోయున్న నిరంజనం గావుకేకలు వేస్తాడు.
"పిలవను. రిక్షా పిలవను! రాను. ఆస్పత్రికి రాను. చెయ్యను. సహాయం చెయ్యను. మీకోసం నేను పూచికపుల్ల మొయ్యను. నా చూపుడువేలు చూపిస్తే చాలు మీరంతా బాధల బురదల్లోంచి బైటపడి బంగారులోకాల్లో విహరిస్తానంటే నేను చూపుడువేలు చూపించను! ఎందుకు చూపించాలి?" అంటూ తలుపులు ఫెడిల్మంటూ మూసేసుకున్నాడు.
తెల్లారి చూస్తే ఆ ఆడమనిషి గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కధని రావిశాస్త్రి తనకి అలవాటైన ధోరణిలో ఈ విధంగా ముగిస్తాడు.
"ఇదంతా జరిగి ఎన్నాళ్ళయిందండీ?"
"పదిహేనేళ్ళయింది సార్!"
"మరైతే - రంజనుడో నిరంజనుడో - అతనేం చేస్తున్నాడండీ ఇప్పుడు?"
"వాడిప్పుడు ప్రజలపై పన్నులు విధించే ప్రభుత్వ ప్రత్యేకశాఖలో ప్రధానోద్యోగిగా ఉంటున్నాడు సార్!"
తొలి ప్రచురణ - ఆంధ్రజ్యోతి వారపత్రిక (14 - 07 - 1967)
పుస్తక రూపం - బాకీ కధలు
జీవితంలో అమరసౌఖ్యాలని సంపాదించుకోవటానికి "చదువు" మార్గన్నెంచుకున్న నిరంజనరావుని.. చదువులు, పోటీపరీక్షలు ద్వారా ఉద్యోగాలు సంపాదించుకుని.. సమాజం పట్ల పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉండే ప్రభుత్వోద్యోగులకి ప్రతీకగా తీసుకున్నాడు.
నిరంజనమంటే మనకి అసహ్యం కలిగేట్లు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా.. అనుమానం వచ్చిందేమో!.. వెంకట్రావనే చిన్ననాటి స్నేహితుడిని నిరంజనుడు ఎలా చంపేశాడో చెప్పి.. మనకి నిరంజనుడి పట్ల రోత కలిగేట్లు రాశాడు. బహుశా.. మంచికి చెడు చెయ్యరాదు. చెడుకు మంచి చెయ్యరాదనే తన రచనా పాలసీననుసరించి.. ఈ (అతి) జాగ్రత్త తీసుకునుంటాడు.
చదువు లేనివాడు చదువుకున్నవాడిని ఎందుకు గౌరవిస్తాడు? చదువు జ్ణానాన్నిస్తుందని. సమసమాజ కాంక్షని పెంచుతుందని. కానీ.. కేవలం ఉన్నత స్థానాల కోసం, ఉద్యోగాల కోసం, డబ్బు సంపాదించుకునేందుకు 'చదువు' ఒక మార్గంగా ఎంచుకునేవారు సమాజానికి కీడే చేస్తారని ఈ కధలో రావిశాస్త్త్రి చెబుతాడు.
నేనీ కథని ఇరవైసార్లు చదివుంటాను. తన పాయింట్ ని కథారూపంలో మలచడానికి రావిశాస్త్రి ఎంచుకున్న శైలి అనితర సాధ్యం. అందుకే ఎన్నిసార్లు చదివినా.. 'ఇంత గొప్పగా ఎలా రాశాడబ్బా!' అని ఆశ్చర్యపోతూ చదువుతుంటాను.
రావిశాస్త్రి ఈ కధ రాసి 45 సంవత్సరాలు నిండాయి. ఇప్పుడు నిరంజనుడి వారసులు ఉద్యోగాలేం ఖర్మ! అన్ని రంగాల్లో చెలరేగిపోతున్నారు. రోజురోజుకీ వీరి సంఖ్య పెరిగి పోతుందేమోనన్న భయాందోళనలు చెందవలసిన పరిస్థితులు ప్రస్తుతం మనకున్నాయి.
(photos courtesy : Google)
చదువు లేనివాడు చదువుకున్నవాడిని ఎందుకు గౌరవిస్తాడు?
ReplyDelete------------------------
గౌరవం ఇవ్వాల్సిన అవుసరం ఉందంటారా? "చదువు" అనేది మనం సృష్టించుకున్నది. దానికి "గౌరవం" అనే పదం ఆపాదించేది కూడా మనమే.
అవును. మీతో ఏకీభవిస్తున్నాను.
Deleteరమణ గారు ఇది చదివాకా చాల రోజుల క్రితం చదివిన విషయం గుర్తుకొస్తోంది
ReplyDelete.ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు రాసింది ఎక్కడో చదివాను . నిజంగా జరిగిన సంఘటన ... ఒక ఆఫీసులో ఒక వ్యక్తి పనిచేస్తాడు. అదే ఆఫీసులో మరో మహిళ ఆపని చేస్తుంది . ఆ వ్యక్తి, అతని బార్య, మరో మహిళ ఉద్యోగి అంత ప్యామిలీ ఫ్రెండ్స్ . అనేక సార్లు కుటుంబం తో సహా కలుస్తారు . ఆ వ్యక్తి మరణించాక బార్య . ప్రభుత్వం నుంచి అందే వాటి కోసం వెళుతుంది . ఆ ఫైల్ క్లియర్ చేయాల్సింది . ఆమె భర్త ఆఫీసులోనే పని చేసే తమ ఫ్యామిలి ఫ్రెండ్ అయిన మహిళ ఉద్యోగి . భర్త మరణించిన మహిళ ఆమె వద్దకు వెళితే యోగ క్షేమాలు అడిగి . టి ఇస్తుంది .. ఆ తరువాత ఆ మహిళ తన సమస్య చెప్పి ఫైల్ క్లియర్ చేయమని అడిగితె ఆ ఉద్యోగి నిస్సిగ్గుగా దానికి ఎంత ఖర్చు అవుతుందో చెబుతుంది . ఇచ్చిన తరువాతనే పని చేస్తుంది. భర్త మరణించిన ఆ మహిళ నారాయణ మూర్తి గారికి దగ్గరి బందువు . ఈ సంఘటన నా హివితం పై చాల ప్రభావం చూపిందని ఆయన రాసుకున్నారు . చాల మంది ( అందరు కాదు లెండి ) విధినిర్వహణలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో కాదు . స్నేహితుడు మరణిస్తే అతని బార్య వద్ద లంచం తిసుకొందే వదలని మహానుబవులుంటారు .
రావిశాస్త్రి నిరంజనరావు గూర్చి రాస్తే.. మీరు నిరంజనమ్మ గూర్చి రాశారు!
Deleteనువ్వు రాసిన endnote చాలా నిజం.
ReplyDeleteమన సమాజం నిండా నిరంజన రావులే, నిరంజనమ్మలె.
వీళ్ళు ఈ మధ్య ప్రైవేటు ఉద్యోగాలలో కూడా కనిపిస్తున్నారు.
మన కెవరు రక్ష?
అర్ధం కాని -
పుచ్చా
ప్రస్తుతం మనమున్న స్థితిలో మనకెవరి రక్షా అవసరం లేదు. ఈ కథ మనలాంటి వాళ్ళని నిరంజనరావులుగా మారకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది. ఇదే ఈ కథా ప్రయోజనం.
Delete(నేనీ పోస్ట్ రాసిన అసలు ఉద్దేశ్యం నీ చేత ఈ కథ ఇంకోసారి చదివిద్దామని.)
రమణా,
ReplyDeleteరావిశాస్త్రి పిచ్చి ఒకసారి పట్టుకుంటే వదలని తెల్సి కూడా అంటించుకున్న నీలాటి, నాలాటి వాళ్ళకి ఈ శిక్ష తప్పదు. మొన్నేనే రత్తాలు - రాంబాబు మరోసారి (ఎన్నోసారో గుర్తులేదు) పూర్తిచేసాను. అందులోనించి బయటపడడానికి కే.వి.ఆర్. మహోదయం మొదలుపెట్టినా అదే వెంబడి పడుతోంది.
నామటుకు నాకు 'ఆరు సారా కథలు' అంటే చాల చాల ఇష్టం. దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. డ్రగ్స్, ఆల్కాహాల్ లాంటి వాటికన్నా డి addiction ఉందేమో కాని.. రావిశాస్త్రి పిచ్చికి మందు లేదు.
నువ్వు నయం. గబా గబా రాసి పోస్ట్ లో పడేస్తావు. నాకు ఏ సత్యం లాంటి వాళ్ళో ఫోనులో దొరికిపోతుంటారు. ఈ తరంలో పుట్టి మనం చేసుకున్న అదృష్టం అనుకుంటాను రావిశాస్త్రిని చదవగలగటం!
పోస్ట్ బాగుంది.
గోపరాజు రవి.
రవి,
Deleteఈ ప్రపంచంలో నాకు 'కిక్' ఇచ్చేవి రెండే. ఒకటి single malt whiskey. రెండు రావిశాస్త్రి రచన!
రావి శాస్త్రి ఎవరండీ?
Deleteజిలేబి.
జిలేబి గారు,
Deleteరాచకొండ విశ్వనాథశాస్త్రి అను నామధేయుడైన విశాఖపట్నం ప్లీడరు గారు తెలుగు సాహితీ జగత్తులో 'రావిశాస్త్రి'గా లబ్దప్రతిష్టుడు.
'అల్పజీవి' తో ఆంధ్రదేశాన్ని ఊపేశాడు. ఆరు సారా కథలు, ఋక్కులు, బాకీ కథలు, ఆరు సారో కథలు మొదలైన కథా సంపుటాలతో శాశ్విత కీర్తి సంపాదించేశాడు. ఆయన రాసిన 'నిజం' నాటకం చాలా పాపులర్.
రాజు-మహిషి, రత్తాలు-రాంబాబు, మూడు కథల బంగారం, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి మొదలైన నవలల్తో తెలుగు సాహిత్యాన్ని అత్యున్నత స్థాయికి తీసికెళ్ళిన గొప్ప రచయిత.
రావిశాస్త్రి ప్రభావం నుండి బయట పడటం చాలా కష్టం (ఈ విషయాన్ని పతంజలి వినమ్రంగా ఒప్పుకున్నాడు).
అయితే.. దురదృష్తవశాత్తు రావిశాస్త్రి రచనలు ప్రస్తుతం మార్కెట్లో లేవు. కారణాలు అనవసరం. రావిశాస్త్రి రచనలు అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం.
హమ్మయ్య ,
Deleteఇప్పటికి నిజం బయట పడ్డది !
చీర్స్
జిలేబి.
మొత్తానికి నిరంజనరావు వేతనశర్మగా మారాడు! జన్మతః వేతనశర్మలు కొందరు, మరికొందరు వేతనశర్మలు అవుతారు (parody of "some are born great, others achieve greatness").
ReplyDeleteవేతనశర్మ బ్రతక నేర్చిన వాడు. నిరంజనరావు బ్రతక చదివినవాడు. మీ వ్యాఖ్య చాలా బాగుంది. ధన్యవాదాలు.
Deleteడాట్రు బాబూ
ReplyDeleteసొమ్ములు పోనాయండి కాదబ్బా
సొమ్మలు పోనాయండి
సొమ్మలు = ఎడ్లు
భాస్కర్ రామరాజు గారు,
Deleteనాకు ఎప్పుడూ సొమ్ములు అనే వస్తూంటుంది. బహుశా 'సొమ్మలు' నాకు అంత అలవాటైన పదం కాకపోవడం వల్ల కావచ్చు. మీరు నా బ్లాగులో చర్చని ఫాలో అవుతూ.. నా తప్పును సరిజేసినందుకు కృతజ్ఞతలు.
The guy next door, ah ?
ReplyDeletei am sorry i don't know how totype in telugu
ReplyDeleteravisastri gaari rachanalu chaala baaguntaayi-sastri gaari life chooste-bhaarya dabbuto chaduvukuni,inko aadadaanni pelli chesukovadaaniki muslim ayyadeeyana.drama artiste lanu endarino ventesukuni vere vaalla dabbutho thaagi thirigina chaduvukunna goppa jeevi
నాకు రావిశాస్త్రి వ్యక్తిగత జీవితం గూర్చి తెలీదు. తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. ఒక మనిషి వ్యక్తిగత అలవాట్ల వల్ల కలిగే లాభనష్టాలు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు అనుభవిస్తారు. (నామిని ఒక ఉదాహరణ).
Deleteనాకు తెలిసి రావిశాస్త్రి ఎవరికీ నీతులు చెప్పలేదు. సూక్తులు రాయలేదు. ఆయన "అలగా" జనానికి తెలుగు సాహిత్యంలో ఒక స్థానాన్ని కల్పించాడు. కాబట్టి రావిశాస్త్రి వ్యక్తిగతాన్ని చర్చించబూనడం ఉచితం కాదు. అది మన తెలుగు పాఠకుల పరిధిలో లేని అనవసరమైన విషయం.
కవులు, కళాకారులు మనలాంటి మనుషులే. సమాజంలో ఉన్న బలహీనతలు వారిలోనూ ఉంటాయి. ఈ స్పష్టత లేకపోతే మనం అభిమానించే చాలామందిని వదులుకోవలసి వస్తుంది. నేనైతే అందుకు సిద్ధంగా లేను.
శ్రీశ్రీ అలవాట్లని ప్రస్తావిస్తూ సి.నారాయణరెడ్డి అన్నాడు.
"శ్రీశ్రీ రాసి పడేసిన కవితా కుసుమాలు గుబాళిస్తుండగా.. కొందరు ఆయన తాగి పడేసిన సీసాల కంపులో ఆనందాన్ని అనుభవిస్తుంటారు."
(మీరు lekhini.org తో తెలుగు రాయొచ్చు.)
ఓ తిరుగుబోతు రచయిత సంస్కృతి, సాంప్రదాయాలు, స్త్రీ జనోద్ధరణ గురించి రసవత్తరమైన మెగా నవలలు రాశారనుకోండి, జనాలు ఆ పుస్తకాలు కొని తెగ చదివేస్తారంటారా?
ReplyDeleteజగ్గు సామ్యవాదం గురించి లెక్చర్లు దంచుతూ, అవినీతికి వ్యతిరేకంగా వుజ్జమాలు చేశాడనుకోండి, బుర్రాబుద్ధి వున్న జనాలు(బిస్కెట్లకు ఆశపడని వారుంటే) ఆదరిస్తారా?
ఏమో డాట్టారు గారు, నాకేమో సంశయమే.
శ్రీశ్రీ విషయంలో ఆ సినారె విమర్శ పొంతన లేనిది అనుకోవచ్చు. ఓ కమ్యూనిస్ట్ వోడ్కా, క్యూబా చుట్టలను కాదని, పెట్టుబడిదారీ దేశాల లిక్కర్, సిగరెట్లకు అంగలారిస్తే అది విమర్శించతగ్గదే అనిపిస్తుంది.
శ్రీశ్రీ అన్నారనుకుంటా ... "వ్యక్తుల వారి వారి జీవితాలు వారి స్వంతం, పబ్లిక్కున నిలబడితే ఏమైనా అంటాం" అని.
Snkr
వ్యక్తిగత బలహీనతలు ఒక రచయిత/కవి/కళాకారుడి సొంత గోల. అయితే.. ఈ బలహీనతలు కూడా ఆ వ్యక్తి యొక్క బేసిక్ ఇంటెగ్రిటీని దెబ్బ తియ్యరాదు. రావిశాస్త్రి తను రాసినదానికి ఏనాడూ వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఆయన పేదవారి ప్లీడరు గానే మిగిలిపొయ్యాడు. కాబట్టి రావిశాస్త్రిని వ్యక్తిగా కూడా గౌరవనీయుడే.
Deleteఇట్లాంటి వైరుధ్యాలు శ్రీశ్రీలో మనకి కనబడతాయి. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని పొగుడుతూ పాట రాశాడు. ఇది నిస్సందేహంగా అనైతికం. ఇక్కడ శ్రీశ్రీ 'నా అర్ధిక ఇబ్బందులు, నా వ్యక్తిగతం.. ' అంటూ ఎన్ని చెప్పినా మనం ఒప్పుకోరాదు. అందుకే ఆ తరవాత శ్రీశ్రీ తన తప్పుని బహిరంగంగా ఒప్పుకుని, క్షమించమన్నాడు.
రావిశాస్త్రి గొప్పరచయిత అనేదాంట్లో సందేహం లేదు (నాకు).
Delete"రావిశాస్త్రి తను రాసినదానికి ఏనాడూ వ్యతిరేకంగా ప్రవర్తించలేదు."
ఈ విషయం లో సందేహం ఉంది. రావి శాస్త్రి తన రచనల్లో రిక్షా వాళ్ళ చేత విప్లవాలకీ, మార్స్కిజానికీ అనుకూలం గా లెక్చర్లు ఇప్పించాడు. గన్నుపట్టి అడవుల్లోకి వెళ్ళాలన్నాడు. తాను మాత్రం హాయిగా కథలు రాసుకొన్నాడు. ఈ విషయం లో కొ.కు , శ్రీ శ్రీ అంతా ఒకే కోవ కు చెందిన వారు. అలా అని వారు గొప్ప రచయితలు కాకుండా పోరు.
@గన్నుపట్టి అడవుల్లోకి వెళ్ళాలన్నాడు. తాను మాత్రం హాయిగా కథలు రాసుకొన్నాడు.
Deleteరావిశాస్త్రి కాని ఇంకెవరైనా కానివ్వండి, రచయిత గా తన పని తాను చేసారు. వ్యక్తి గా తనకి లేని సమస్యకోసం అడవికి ఎందుకు వెళ్ళాలి
బొందలపాటి గారు,
Deleteమీ విమర్శ చాలా పాతది. దీనికి శ్రీశ్రీ సమాధానం చెప్పాడు. శ్రీశ్రీ సమాధానమే నాది కూడా. ఆ శ్రీశ్రీ రచన (వెతికి) ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
Mauli గారు,
Deleteనేను బొందలపాటి గారికి శ్రీశ్రీ సమాధానం పబ్లిష్ చేస్తానని చెప్పాను. శ్రీశ్రీ సాహిత్యం ఔపాసన పట్టిన చలసాని ప్రసాద్, సింగంపల్లి అశోక్ కుమార్, తెలకపల్లి రవి వంటి రచయితలు క్షణంలో ఇవ్వగలిగిన సమాచారం నేను వెతుక్కుని రాయాలి.
'గన్ను పట్టినవాడి కన్నా పెన్ను పట్టినవాడు ప్రమాదకారి.' అని ప్రభుత్వాలు కూడా ఎప్పుడో గుర్తించాయి. అందుకే వారిపై నిఘా పెడుతుంటాయి. నిర్భందిస్తుంటాయి.
ఏ ఉద్యమానికైనా intellectual inputs ముడి సరుకే! థియరీ లేకుండా ప్రాక్టికల్స్ ఉండవు.
అయితే మనం పని చేసేవాణ్ణి కొన్ని ప్రశ్నలేస్తుంటాం. 'నువ్వీ పనే ఎందుకు చేస్తున్నావ్? ఆ పని ఎందుకు చెయ్యవు?' అంటే సమాధానం ఉండదు.
'హోటల్లో ఇడ్లీ మాస్టర్ ఇడ్లీలే ఎందుకేస్తాడు? భోజనం ఎందుకు వండలేడు?'
చేసే పని ఎంత చిన్నదైనా.. ఆ పని ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ దిక్కున సాగుతుంది? అనేది ముఖ్యం.
@Mauli gaaru,
Delete"వ్యక్తి గా తనకి లేని సమస్యకోసం అడవికి ఎందుకు వెళ్ళాలి?"
ఎందుకు వెళ్ళాలంటే...వ్యక్తిగతం గా తనకు లేని సమస్య కోసం జనాలని రెచ్చగొడుతూ కథలు రాసినందుకు..ఉపన్యాసాలు ఇచ్చినందుకు.
విప్లవ రచయితల రచనలు చదివి ఎంత మంది అలగా జనం ప్రభావితం అయ్యారో తెలియదు కానీ, విద్యాధికులు చాలా మంది ఆ రోజుల్లో నక్సల్స్ లో కలిసి బంగారమంటి తమ కెరీర్ ని నాశనం చేసుకొన్నారు. వారి లో కొందరు పెద్దయ్యాక తాము తప్పుడు ప్రభావాలకు లోనయ్యామని ఒప్పుకొన్నారు కూడా. కొందరిని "చెరసాలలు, ఉరికొయ్యలు" కబళించాయి.
కానీ రాసిన వారు మాత్రం పట్నాలలో ఉండే తమ వాలుకుర్చీ ల లో హాయి గా ఉండేవారు. తమకు పని చేయని తీరీ ని వారు ఇతరులకు పని చేస్తుందని చెప్పటం విడ్డూరం. ఆంధ్ర దేశం లో అభ్యుదయ మార్గం మన లేక పోవటానికి ఇటువంటి మేధావులూ, దొంగ కమ్యూనిస్టులూ (వీరి లో చాలా మంది తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు గడించిన వారు నాకు వ్యక్తిగతం గా తెలుసు). కేరళ లో కొంతవరకూ నయం.
మన ఇంట్లో పని చేయటానికి వచ్చే వడ్రంగి పని ఎంత బాగ చేశాడనే చూస్తాం. అతని వ్యక్తిగత జీవితం మనకి అనవసరం. కానీ, ఓ విధమైన విలువలు బోధిస్తూ రచనలు చేసె వారు అందుకు ఒక మినహాయింపు.
రావిశాస్త్రి ఒక సారి, ఆయుధాలు పట్టే వారు అసలు యుధ్ధం చేస్తుంటే , కవులూ రచయితలూ వారికి పక్క నుంచీ సహాయం చేసే వంట వారి గా పోల్చాడు. కానీ ఈ మేధావులలో చాలా వరకూ వంట పని చేయటానికి పోటీ పడే వారు. తక్కువ రిస్క్ ఉన్న పని కాబట్టీ". అసలు యుధ్ధం చేసిన మేధావులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ప్రపంచం లో చూస్తే టాల్-స్టాయ్ వంటి వారు చాలా అరుదు గా ఉంటారు.
"ఏ ఉద్యమానికైనా intellectual inputs ముడి సరుకే! థియరీ లేకుండా ప్రాక్టికల్స్ ఉండవు."
Delete"'హోటల్లో ఇడ్లీ మాస్టర్ ఇడ్లీలే ఎందుకేస్తాడు? భోజనం ఎందుకు వండలేడు?'"
కరక్టే! కొందరికి కొన్నిపనులు వస్తాయి. మిగిలిన పనులు రావు. కొందరు మేధో శ్రమ చేస్తారు, ఇంకొందరు తుపాకీ పట్టి పోరాడుతారు.
మేధో శ్రమ చేసే వారు ఆ పనిని వారు అడవులలోని దళాలతో తిరుగుతూ చేస్తే, వారి శ్రమ ను కూడా ఉద్యమాల నిర్వహణ లో ఒక భాగం గా భావించ వచ్చు. వారిని నమ్మవచ్చు.
కానీ వీరు చాలా మంది, బూర్జువా సమాజం ఇచ్చే, సామాన్య మానవుడు పొందలేని, అనేక వసతులను పొందుతూనే,(recommendations, popularity, money etc) అదే సమాజం మీద రాళ్ళేస్తూ రచనలు సాగించారు.
కొ.కు గారు ఒక సారి కార్పొరేట్ కంపెనీ లో మానేజర్ శ్రమ చేయడు కదా? అలానే మేమూ అని డబాయించబోయారు. అంటే నిర్మానం లో కార్పొరేట్ వ్యవస్థకంటే వీరు ప్రవచించే వ్యవస్థలు ఉన్నతమైనవి కావని అంగీకరించినట్లే!
ఒక హోటల్ లో అందరూ ఇడ్లీ మాస్టర్లవటానికి పోటీ పడుతున్నారంటే, ఇడ్లీ వేయటం లో ఏదో సుఖమూ, భోజనం చేయటం లో ఏదో కష్టమూ ఉన్నట్లే!
బొందలపాటి గారు,
Deleteమీ కామెంట్ నుండి నా కర్ధమైనదేమనగా.. రావిశాస్త్రి, శ్రీశ్రీ వంటి రచయితలు, కవులు.. వాలు కుర్చీలో విశ్రాంతి తీసుకుంటూ (రిస్క్ తక్కువ కాబట్టి) విద్యాధికుల్ని రెచ్చగొట్టి.. వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేసిన దొంగ కమ్యూనిస్టులు. అంతేగా!
అంతే అయితే నాకు చాలా శ్రమ తప్పించారు. (నిన్నటి మీ విమర్శకి సమాధానం రాసినవారు శ్రీశ్రీ కాదు, కుటుంబరావని చలసాని ప్రసాద్ గారి వాక్కు.) పొద్దుట్నుండి పని వత్తిడి వల్ల కుదరట్లేదు. రాత్రికి కుటుంబరావుని దుమ్ము దులిపి మీకు సమాధానం రాద్దామనుకున్నా! అమ్మయ్య! ఇప్పుడా బాధ్యత లేదు. థాంక్యూ!
రమణ గారు,
Deleteవివరం గా రాసినట్లు లేను. రెండు రకాల గురించి రాశాను. ఒకరు మేధావులు. వారిని నేను దొంగ కమ్యూనిస్టులు అనలేదు. వారు ఆం చెయిర్ థింకింగ్ చేశారని మాత్రమే చెప్పాను. రావిశాస్త్రి శ్రీశ్రీ లు తమ నమ్మకాలకోసం జైలు కెళ్ళారనేది విస్మరించలేం.
రెండవ రకం దొంగ కమ్యూనిస్టులు. గుంటూరు, కృష్ణా జిల్లాల లో నాకు ఎక్కువగా తగిలారు. వీళ్ళకీ శ్రీ శ్రీ, కొ.కు ల కీ ఎలాంటి సంబంధమూ లెదు.
బొందలపాటి గారు
Deleteమీరు మొదటి వ్యాఖ్య స్పష్టం గా రావిశాస్త్రి, శ్రీ శ్రీ, కో కు గురించి వ్రాసారు!!!??. నా ఉద్దేశ్యం సమస్య ఎవరిది అయితే వాళ్లకు కొంత మార్గ దర్సకం చేసి ఉండొచ్చు లేదా. ప్రత్యక్షం గా చూస్తున్నపుడు కలిగిన భావాన్ని వ్రాసి ఉండొచ్చు ( రమణ గారు కిరణ్కుమార్ రెడ్డి ని ఉతికి పారేస్తున్నట్లు..). అంతవరకే నా సమాధానం. వేరే వ్యక్తులగురించి మాట్లాడదలచుకొంటే తప్పకుండా చెప్పండి కాని రావిశాస్త్రి, శ్రీ శ్రీ, కో కు లను బాధ్యలను చెయ్యవద్దు . గమనించగలరు.
వీళ్ళు అడవిలోకి వెళ్లి రచనలు చేస్తే ప్రయోజనం లేదు.
బొందలపాటి గారు,
Deleteముందుగా చిన్న వివరణ. నా టపా రావిశాస్త్రి కథ గూర్చి. చర్చ మొదలయ్యింది snkr గారి 'వ్యక్తిగత విలువల' కామెంట్ నుండి. అందువల్ల మీరు చేసిన కామెంట్లు రావిశాస్త్రి ఎకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి బ్లాగర్లు రావిశాస్త్రిని అపార్ధం చేసుకునే ప్రమాదముంది (తెలుగు బ్లాగర్లకి రావిశాస్త్రి ఎవరో తెలీదు).
గుంటూరు, కృష్ణా జిల్లాల దొంగ కమ్యూనిస్టుల్ని (తెలంగాణా రైతాంగ పోరాట మాజీ కార్యకర్తల్ని ఉద్దేశించి) శ్రీశ్రీ చాలా వెక్కిరించాడు. వరవరరావు ఎగతాళి చేశాడు. దొంగ కమ్యూనిస్టులు సర్వంతర్యాములు. అయినా ఈ రెండు జిల్లాల వాళ్ళు గిన్నెస్ బుక్ రికార్డ్ హోల్డర్స్!
ఒక రాజకీయ పార్టీ నుండి గెంటివేయబడ్డ వాడు.. బయటకొచ్చిన తరవాత ఆ పార్టీ మీద దుమ్ము, ధూళీ తట్టల కొద్దీ ఎత్తిపోస్తాడు. అంతేగానీ తనో వెధవననీ.. తంతే బయటకొచ్చి పడ్డానని చెప్పుకోడు. (మాజీ టిడిపి వారు టిడిపిని, మాజీ కాంగ్రెస్ వారు కాంగ్రెస్ ని తిట్టడం కూడా మనకి రోజూ టీవీల్లో కనిపిస్తుంటుంది). ఈ బాపతు పెద్ద మనుషులు నాకు కూడా తెలుసు. మీరు చెప్పిన రియల్ వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్థులు ఈ కోవలోనివారే. మీరు గ్రహించవలసిన సంగతి.. వాడు అక్కడా, ఇక్కడా కూడా వెధవే!
మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతాను. మీ అభిప్రాయాలు నాకు తెలుసు. మీరు రావిశాస్త్రిని ఉద్దేశించి ఆ కామెంట్ రాశారని అనుకోలేదు. కానీ.. కొద్దిగా ఆశ్చర్యం. మీతోనే స్పష్టత ఇప్పించేందుకు ఆ కామెంట్ రాశాను. మన్నించగలరు.
*ఓ తిరుగుబోతు రచయిత సంస్కృతి, సాంప్రదాయాలు, స్త్రీ జనోద్ధరణ గురించి రసవత్తరమైన మెగా నవలలు రాశారనుకోండి*
Deleteశంకరు మీరు తిరుగుబోతు రచయిత అని సంబోధించటం నప్పలేదు. భారతీయ సమాజంలో రెండు పెళ్లిళు చేసుకోకుడదనే నిబందన ఎక్కడైనా ఉందా? ఒక పెళ్లి అనేది ఉత్తమం అనేది మన భావన. దానికి ఎన్నో కథలు పురాణాలలో, రామాయణ, భారత, భాగవతాలలో ఉదాహరణలు ఇచ్చారు.
త్యాగరాజు లాంటి వారు రెండు పెళ్లిళు చేసుకొన్నారు. బుద్దుడు, రామానుజాచార్యులు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి,యు జి లాంటి వారు ఉన్న ఒక్క పెళ్లాం ,పిల్లలను వదలివేశారు. ఈ ముగ్గురి జీవితాలు స్రీవాద కోణం లోంచి చూసి,వారి కథలను ఎంతో ఘోరంగా చిత్రికరించవచ్చో మీకు తెలుసు. హిందూ విలువలు నమ్మే మీరు స్రీవాద/సింపతీ సృషిట్టించుకొనే వారు చేసే ప్రభావాలకి మీరు లోనైన్నట్లు ఉన్నరేమో అనిపించి ఇంత వివరణ రాస్తునాను. ఈ వాదలు చేసే వారు, వారు రాసిన పుస్తకాలు మార్క్సిజం కి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. కాని వీరిని ప్రోత్సహించేది, చట్టాలలో మార్పులు తేవటానికి య.జి.ఓ. ల రూపంలో కృషిచేసేది మాత్రం అమేరికా వారు. మన రాష్ట్రం లో జ్వాలముఖి అనే రచయిత దీనిని మొదట గుర్తించారు. కాని మన స్రీ వాద రచయితలు ఎక్కడా ఖండించినట్లు చదవలేదు.
రమణగారు మీకు తెలిసి ఎవరైనా ఉంటే వారి గురించి చెప్పెది.
India Demands US must stop interference in Indian Family System
http://bangalore.ncfm.org/2010/11/07/press-release-india-demands-us-must-stop-interference-in-indian-family-system/
http://www.usdebtclock.org/
SriRam
SriRam,
Deleteనేను ఏ రచయితను వుద్దేశించి అనలేదు, యథాలాపంగా అన్నాను. నాకు రావిశాస్త్రి అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని మాత్రమే తెలుసు.
అయినా... రెండు/మూడు పెళ్ళిళ్ళు(చట్ట/సామాజిక బద్ధంగా, ప్రారబ్ధం వల్లనో) చేసుకుని వుండటం, తిరుగుబోతుతనం వేరని అనుకుంటా. అలాగే తాగటం వేరే, తాగుబోతుతనం కొద్దిగా వేరే.
*జనాలు ఆ పుస్తకాలు కొని తెగ చదివేస్తారంటారా?*
ReplyDeleteఅది ఆ పాఠకుల అవగాహనా పరిధిని బట్టి రచయితని అంచనా వేయటం ఉంట్టుంది. ఇష్ట్టముంటే చదువుతారు లేకపోతే లేదు. అది వాళ్ల ఇష్ట్టం. ఇక పబ్లిక్ లైఫ్ అనే విషయానికి వస్తె ఆయనేమి మంత్రి పదవులు పొంది ప్రజల డబ్బును దుర్వినిఓగం చేశాడా?
SriRam
ReplyDeleteవైజాగ్ లో ఉన్నప్పుడు నాకు రావిశాస్త్రి,అతని ముఖ్య స్నేహితుడు ఆకెళ్ళ కృష్ణమూర్తి బాగా తెలుసును.anonymousఆయన గురించి రాసింది నిజమే.కాని అతని వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. అతని రచనలను బేరీజు వెయ్యడమే ముఖ్యం.ఆయన రచనలని దాదాపు అన్నీ చదివాను.గొప్ప కథా రచయిత.విశాఖ మాండలికంలో ' అలగా ' జనం marginalised groups గురించి వాస్తవికంగా చిత్రించిన గొప్ప రచయిత.'శారద ' తర్వాత అలాంటి ప్రజల గురించి చక్కగా రాసింది అతనే.కళాకారులు చాలామందికి దుర్గుణాలు,బలహీనతలు ఉంటాయి.వాటికి మనం ప్రాముఖ్యం ఇవ్వనక్కర లేదు.వాళ్ళ TALENTS,WORKS కే ప్రాధాన్యం ఇవ్వాలి.ఈమధ్హ్య ఆయన రచనలన్నీ సంపుటాలుగా ప్రచురించారని విన్నాను.
రావిశాస్త్రిగారి వ్యక్తిగత జీవితం గురించి ఇంకా కావాలంటే , 64kalalu.com లో రచయత బాలి గారు బాగా రాసారు. ఓల్డ్ editions లో ఉంటుంది వివరంగా.
ReplyDeleteఇక్కడ రావిశాస్త్రి వ్యక్తిగత జీవితమే మనకనవసరం అనుకుంటుంటే మీరు ఆయనెవరో 'బాగా' రాశారంటారేమిటి!
Deleteకార్టూనిస్ట్ బాలి 'బాగా' రాసిన లింక్ నాకు ఆ.సౌమ్య గారు పంపగా చదివాను. రావిశాస్త్రి, పురాణం కలిసి ఎంత తాగారో, ఎన్నిసార్లు వాంతి చేసుకున్నారో, ఎప్పుడు లుంగీలు జారిపొయ్యాయో 'బాగా' రాశాడాయన. ఆయన రాసింది చదువుతుంటే.. నాక్కూడా వాంతి వచ్చింది!
రమణగారు,
ReplyDeleteఅసలికి మీరు ఇంత వివరణ ఇవ్వటం ఎమీ బాగాలేదు. ఆయనకు నచ్చింది వచ్చింది రాసుకొన్నాడు. ఇష్ట్టం ఉన్న వాళ్లు చదివారు, లేని వాళ్లు లేదు. జిలేబి లాంటివారికి ఆయన పేరుకూడాతెలియదు. మీరు ఆయన డబ్బా కొట్టెంతవరకు నాలాంటి వారికి తెలియదు. ఆయనకున్న బలహీనత లేమిటో నాకర్థం కాలేదు. మందు తాగటం తప్పా? పరస్పర అంగీకారంతో సంబంధం కలగి ఉండటం తప్పా? వీటిని బలహీనతలంటారా? మరి ఏ అలవాటు లేకుండ, బుద్దిగా వచ్చిన సంపాదన వచ్చినట్లు పెళ్లాం చేతికితెచ్చి ఇస్తే, భార్యగారు వేల రూపాయలు ఖర్చు చేసి చీరలు, నగలు కొనుకొని ధరించటనికి సహాయం చేసే మగవాళ్లు మాత్రమే మంచి వారా?
నేను చాలా విషయాల్లో నిక్కచ్చిగానే ఉంటాను. కానీ రావిశాస్త్రిని అభిమానించే విషయంలో మాత్రం సగటు సినీ హీరో బుర్ర తక్కువ అభిమానుల కేటగిరీలోకి వెళ్ళిపోతుంటాను. ఇది ఒక రోగం. ఈ రోగానికి ప్రస్తుతానికి మందు లేదు.
Deleteమీరు నేను రావిశాస్త్రికి డబ్బా కొడుతున్నానంటున్నారు. డబ్బా ఏమిటండి? ఇక్కడ డ్రమ్ములే కొడుతుంటే!
>>ఆయనకున్న బలహీనత లేమిటో నాకర్థం కాలేదు. మందు తాగటం తప్పా? పరస్పర అంగీకారంతో సంబంధం కలగి ఉండటం తప్పా? వీటిని బలహీనతలంటారా? మరి ఏ అలవాటు లేకుండ, బుద్దిగా వచ్చిన సంపాదన వచ్చినట్లు పెళ్లాం చేతికితెచ్చి ఇస్తే, భార్యగారు వేల రూపాయలు ఖర్చు చేసి చీరలు, నగలు కొనుకొని ధరించటనికి సహాయం చేసే మగవాళ్లు మాత్రమే మంచి వారా?<<
ఇవే ప్రశ్నలు మూడు దశాబ్దాల క్రితం ఎవరైనా అడిగినట్లయితే వారిని సంఘ వ్యతిరేకులుగా భావించేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. అన్ని రకాల అభిప్రాయాలు చర్చించబడుతున్నాయి. నేను మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.
అయితే.. ఈ కవుల వ్యక్తిగత "బలహీనతలు" సబ్జక్ట్ చాలా పాతది. శ్రీశ్రీ విషయంలో (ఆయన తన ఆత్మకథ 'అనంతం' లో రాసుకున్న సంగతులపై) అనేకమంది ఆయన్ని ఉతికి ఆరేశారు!
"జిలేబి లాంటివారికి ఆయన పేరుకూడాతెలియదు"
Deleteజిలేబీ గారికి రావి శాస్త్రి ఎవరో తెలీదని నమ్మమంటారా? ఆవిడ అన్ని తెలిసే కేవలం రమణ గారికి ఎంత తెలుసో పరీక్షించడానికి అడిగుంటారు.
అవును. నేనూ అదే అనుకుంటున్నాను.
Deleteజైగో,
Deleteఅంతేనంటారా? నేనేదో హర్యాన జిలేబిలేసుకునేవాళ్ళేమో అనుకున్నా సుమా!!
యక్షుడు ధర్మరాజును పరీక్షించినట్టు, చండాలుడు శంకరుని నిలేసినట్టు మన డాక్టర్ గారిని .. హ్మ్.. నాకు తట్టనేలేదు.
ReplyDeleteతప్పతాగడం,వివాహితులై పరస్త్రీలు,వేశ్యలతో సంబంధాలు పెట్టుకోడం వంటివి తప్పు అనే మాతరం వాళ్ళ నమ్మకం.కాని ,అవి వ్యక్తిగతవిషయాలు కాబట్టి,రచయితలు,ఇతర కళాకారులను evaluate చేసెటప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకో నక్కరలేదు; వారు ప్రదర్శించిన కళను,వారి ప్రతిభా ప్రావీణ్యాలనే లెక్కకు తీసుకోవలసి ఉంటుందని అంగీకరిస్తాను.
సామాజిక రచయితలు/కవులు (సామాజిక రుగ్మతలను ఎండగడుతూ నీతిబోధ చేసేవారు), చట్టాలు చేసే రాజకీయ కళాకారులు, కళాకారుల కోవలోకి రారనుకుంటా.
Deleteశిల్పులు, సినిమా నటులు, గాయకులు, చిత్రకారుల విషయంలో మీరు చెప్పింది సరిగా వుంటుంది.
@SNKR: ఎర్ర (ఎర్రి?) రచయితల లెక్కలో వ్యక్తిగతమయిన విషయాలు ఏమయినా సామాజిక రుగ్మతలు కావు. వారి దృక్పథంలో "విప్లవం వర్ధిల్లాలి" అనే వారందరూ మచ్చ లేని మహాపురుషులే.
Delete:) నిజమే.
Deleteరమణగారు,
ReplyDeleteగుంటూరు, కృష్ణా జిల్లాల దొంగ కమ్యూనిస్టుల్ని శ్రీశ్రీ ఎమని వెక్కిరించాడు? వరవరరావు ఎలా ఎగతాళి చేశాడో తెలుసు కోవాలని చాలా కుతూహలంగా ఉంది. మీరు కొంచెం ఓపిక చేసుకొని వాళ్లు కమ్యూనిస్టుల్ని అన్న మాటలను యథాతదంగా మీ బ్లాగులో ఒక టపాగా ప్రచూరించేది. ఇప్పటివరకు నేను ఎక్కడా ఆమాటలను చదవలేదు.
SriRam
శ్రీరాం గారు,
Deleteమీకు సమాధానం రాయడం లేటైనందుకు సారీ.
బ్లాగుల్లో నా రాతలు కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడి రాసేవి మాత్రమే. గమనించగలరు. కాబట్టి 'యధాతదంగా' రాయలేను.
ఎనభైలలో వరవరరావు మీటింగుల్లో ఈ రెండు జిల్లాల మాజీ కమ్యూనిస్టుల్ని విమర్శించేవాడు.
ఇక శ్రీశ్రీ CPI వాళ్ళని తెల్ల కమ్యూనిస్టులు అనేవాడు (అయితే శ్రీశ్రీ ని CPI నెత్తికెత్తుకుని ఘనంగా నూరవ జయంతి జరిపించడం ఒక వింత).
ఈ సమాచారం పుస్తకాల్లో దొరక్కపోవచ్చు. ఇవన్నీ tongue in cheek remarks.
అయినప్పటికీ.. ఆ రంగంలో పని చేసిన స్నేహితులు కలిసినప్పుడు references కోసం అడుగుతాను.
నాకీ మధ్య బ్లాగుల వైపు రావడం కుదరట్లేదు. పెద్దగా బ్లాగులు ఫాలో అవ్వట్లేదు. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఏదోటి రాసి పబ్లిష్ చేస్తున్నాను. అంతా one way traffic. అంచేత కూడా మీకు సమాధానం రాయడం కుదరలేదు. వెరీ సారీ!