Friday, 24 August 2012

నో ప్రోబ్లెం

అది  ఢిల్లీలో  ఆంధ్రాభవన్. ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  దిగాలుగా  ఉన్నాడు. ధర్మాన  రాజీనామాని అమోదింపజేద్దామని  ఢిల్లీ  వచ్చాడు. ఇప్పుడు  అధిస్టానం  తన  రాజీనామాని  అమోదించే  పనిలో  ఉంది!

రేడియోలో  మంద్ర స్థాయిలో  పాట.

'తలచినదే  జరిగినదా  దైవం  ఎందులకు?'

ముఖ్యమంత్రికి  చికాకేసింది. సెక్రెటరీని  విసుక్కున్నాడు.

"సెక్రెటరీ! చేంజ్  ద  సాంగ్." అజ్ఞాపించాడు.

సెక్రెటరీ  హడావుడిగా  రేడియో  స్టేషన్  మార్చాడు.

'ఏ  నిమిషానికి  ఏమి  జరుగునో  ఎవరూహించెదరు.. విధి విధానమును  తప్పించుటకు  ఎవరు.. '

ముఖ్యమంత్రి గారి  చిరాకు  ఇంకా  ఎక్కువవడాన్ని  గమనించిన  సెక్రెటరీ  కంగారుగా  రేడియో  ఆఫ్  చేశాడు. టీవీ  ఆన్  చేశాడు.

టీవీలో  కేంద్రమంత్రి  బేణీప్రసాద్ వర్మ  మాట్లాడున్నాడు. "ద్రవ్యమాంద్యం  రైతులకి  మంచిది. ఇందువల్ల  రైతులకి  గిట్టుబాటు  ధర  పెరుగుతుంది.... " శ్రద్ధగా  వినసాగాడు  ముఖ్యమంత్రి.

ఇంతలో  సెక్రెటరీ  అడిగాడు.

"సార్! మన  తెలుగు  జర్నలిస్టులు. మీ  ఇంటర్వ్యూ  కావాల్ట. పంపించమంటారా?"

పంపించమన్నట్లు  చేత్తో  సైగ చేశాడు  ముఖ్యమంత్రి.

బిలబిల మంటూ  వచ్చేశారు  జర్నలిస్టులు. మూణ్ణిమిషాల్లో  మైకులు  ఎరేంజ్  చేసుకున్నారు.

"ముఖ్యమంత్రిగారు! కరెంట్  లేక  పంటలు  ఎండిపోతున్నాయి. కరువొచ్చే  పరిస్థితులున్నాయి. మీ  రియాక్షన్?"

"నో  ప్రోబ్లెం! కరువొస్తే  ఫార్మర్స్ కి  మంచిదే. వంద బస్తాల  రేటు  ఒక  బస్తాకే  వచ్చేస్తుంది. రైతులకి  కూలీల  ఖర్చు  మిగుల్తుంది. విత్తనాలు  కొనుక్కునే  అవసరం  కూడా  ఉండదు." బేణీప్రసాద్ వర్మని  గుర్తు  చేసుకుంటూ  అన్నాడు  ముఖ్యమంత్రి.


"రాష్ట్రంలో  రోడ్డు  ప్రమాదాలు  పెరిగిపోతున్నాయి. మీ  ప్రభుత్వం  చర్యలు  తీసుకోటల్లేదని  చంద్రబాబు  తిట్టిపోస్తున్నాడు. మీ  సమాధానం?"

చంద్రబాబు  పేరు  వినంగాన్లే  కిరణ్ కి  కోపమొచ్చింది.

"నో  ప్రోబ్లెం! రోడ్డు  ప్రమాదాల  విలువ  చంద్రబాబుకేం  తెలుసు? మెకానిక్ లు  లాభపడుతున్నారు. కార్ల  ఇండస్ట్రీ  బాగుపడుతుంది. ఇన్సూరెన్స్  కంపెనీల  నుండి  పరిహారం  పొందడంలో  మనమే  అగ్రస్థానంలో  ఉన్నాం. ఇవన్నీ  కేంద్రం  నుండి  వచ్చే  నిధులుగానే  భావించాలి."

"రాష్టంలో  అంటురోగాలు, విషజ్వరాలు  విజృంభిస్తున్నాయి. అయినా  ప్రభుత్వం  నిమ్మకి  నీరెత్తినట్లు  ఉందని  మీ  పార్టీకే  చెందిన  రవీంద్రారెడ్డి  విమర్శిస్తున్నారు."

ఈ  సారి  కిరణ్  కోపం  తారాస్థాయికెళ్ళింది.

"నో  ప్రాబ్లెం! యు మస్ట్  అండర్ స్టాండ్  దట్  వి హేవ్ ఏ స్టేటజీ! రోగాలు  రాకపోతే  హాస్పిటల్స్ కి  లాభాలెలా వస్తాయి? డాక్టర్లు  ఎలా  బతుకుతారు? సీ! అవర్  స్ట్రాటెజీ  ఈజ్.. "

ఇంతలో  సెక్రెటరీ   ముఖ్యమంత్రి  చెవిలో  ఏదో  ఊదాడు. కిరణ్  ముఖంలో  రంగులు  మారాయి. హడావుడిగా  బయటకి  పరిగెత్తాడు  ముఖ్యమంత్రి.

"ముఖ్యమంత్రిగారికి  మేడం గారితో  ఇంటర్వ్యూ  ఉంది. అన్ని  విషయాలు  తరవాత  మాట్లాడతారు." అంటూ  దయచెయ్యండన్నట్లు  విలేఖరులకి  నమస్కరించాడు  సెక్రెటరీ.

"నో  ప్రోబ్లెం!" అంటూ  విలేఖరులు  కూడా  నిష్క్రమించారు.

(photo courtesy: Google)

5 comments:

  1. Very interesting :)

    ReplyDelete
  2. Very funny!
    Cheif minister change again? No problem. Another corrupt one will replace him, good for state. congress has so many corrupt ministers, one of them would gladly come forward. Perhaps Ravindra reddy himself? ;)

    ReplyDelete
  3. chala thingariga unnai congress rajakeeyalu. super

    ReplyDelete
  4. సలిపెట్టె ముందు కూచొని కూచొని మీకు మతిమరుపు వచ్చినట్టుంది. లేని ముఖ్యమంత్రి డిల్లీ ఎలా వెళ్తాడు? పాటలు ఎలా వింటాడు? బేణీ "సువార్త" ఎలా నేర్చుకుంటాడు? వచ్చీ రాని తెలుగులో పాత్రికేయుల బుర్రలు ఎలా ఖరాబు చేస్తాడు? మేడం గారిని ఎలా కలుస్తాడు?

    యాడైనా సచ్చినోడు బతికొస్తాడా ఏంది?

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.