"ష్! అబ్బా! సలి పెడతాంది. పొద్దుగూకులు ఈ సలిపెట్టె ముందు కూకుంటా వెందుకు? ఆపెయ్!" నా కన్సల్టేషన్ చాంబర్లోకి అడుగు పెడుతూనే హుకుం జారీ చేశాడు పేరయ్య.
పేరయ్యది దుర్గి మండలంలో ఒక చిన్న పల్లెటూరు. మనిషి నల్లగా, పల్చబడ్డ తెల్ల జుట్టుతో, ముడతలు పడ్డ చర్మంతో కాయబారుగా ఉంటాడు. వయసు అరవై పైనే. కానీ చాలా హుషారుగా ఉంటాడు. ఒక ఎకరం పొలముంది. కూతుళ్ళ పెళ్ళి చేశాడు. ఒకడే కొడుకు. ఆ అబ్బాయికి మానసిక వ్యాధి. రెండేళ్ళుగా నా దగ్గర కొడుక్కి వైద్యం చేయిస్తున్నాడు. ఈ మధ్య కొడుకు రానని మొరాయిస్తుండటంతో.. ఒక్కడే వచ్చి పరిస్థితి వివరించి మందులు తీసుకెళ్తున్నాడు.
మానసిక వైద్యం ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. రోగి, రోగి తరఫున వారు ఎక్కువసార్లు వైద్యుణ్ణి కలుస్తుంటారు. ఆ ప్రాసెస్ లో బాగా పరిచయస్తులైపోతారు. ఇనీషియల్ కన్సల్టేషన్స్లో రోగ లక్షణాలు, మందులు వగైరా విషయాలే మాట్లాడుకున్నా.. తర్వాత్తర్వాత సంభాషణల్లో పిచ్చాపాటి కూడా చోటు చేసుకుంటుంది. వీరు స్నేహితులు కారు. కాని స్నేహం ఏర్పడుతుంది. అదే విధంగా పేషంట్లకి, వైద్యుడికి మధ్య చనువు కూడా ఏర్పడుతుంది.
ఇదిగో ఆ చనువే పేరయ్య చేత ఏసీ ఆపెయ్యమని ఆజ్ఞ జారీ చేయించింది.
"ఏంటి పేరయ్యా! ఏసీ ఆపేస్తే ఐదు నిమిషాల్లో గది వేడెక్కిపోతుంది. ఆ తరవాత చచ్చూరుకుంటాను." అన్నాను నవ్వుతూ.
పేరయ్య మొహం చిట్లించాడు.
"నువ్వింత సలిలో కూకుంటావేమో! నా వల్ల గాదు. ఒణుకు పుడతాంది." అన్నాడు పేరయ్య.
హఠాత్తుగా జ్ఞానోదయం! అవును. పేరయ్యే కరెక్ట్. వాతావరణం వేడిగా, ఉక్కుపోతగా ఉంది. ఇది ప్రకృతి సిద్ధం. ఈ వాతావరణానికి పేరయ్య శరీరం చాలా సహజంగా అలవాటు పడిపోయింది. నా గది కృత్రిమంగా చల్లబరచబడింది. డబ్బు, నాగరికత నన్ను సుకుమారంగా మార్చేశాయి.
వెంటనే ఏసీ ఆపేశాను.
"కూర్చో పేరయ్యా! ఏమంటున్నాడు మీ అబ్బాయి?" అంటూ ఫేన్ స్విచాన్ చేశాను.
పేరయ్య సమాధానం చెప్పలేదు. భయంగా ఫేన్ వైపు చూస్తూ..
"అదొద్దంటే మళ్ళిదేశావేంది? నువ్వు కుదురుగా కూకోవా ఏంది!" అన్నాడు.
నాకు చికాకేసింది.
"పేరయ్యా! ఏసీ వద్దన్నవ్. ఆపేశా. ఇప్పుడు ఫేన్ వద్దంటున్నావ్. నేనీ గదిలో కూర్చోవాలా వద్దా? ఫేన్ కేమయ్యింది?" అంటూ విసుక్కున్నాను.
"నాకు కరెంట్ గాలి పడదు. ఏడి సేస్తది." అన్నాడు.
నాకు నవ్వొచ్చింది.
"మైడియర్ పేరయ్యా! కరెంట్ ఫేన్ రెక్కల్ని తిప్పుతుంది. అంతే! ఆ రెక్కలు పైనున్న గాలిని కిందకి తోస్తాయి." అన్నాను న్యూటన్ లా.
పేరయ్య ఫేన్ వైపు అనుమానంగా చూస్తూ అన్నాడు.
"అయితే ఏంది? కరెంటే గదా రెక్కల్ని తిప్పేది." అన్నాడు.
"రెక్కల్ని కరెంట్ తిప్పినా.. " చెప్పబోతూ ఆగిపొయ్యాను.
ఇప్పుడు మహీధర నళినీ మోహన్, కొడవటిగంటి రోహిణీ ప్రసాదుల్లా పేరయ్యని నేను ఎడ్యుకేట్ చెయ్యల్సిన అవసరం ఉందా? లేదు. లేదు గాక లేదు. అదీగాక.. బయట పేషంట్లు చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
ఫేన్ ఆపేస్తూ అన్నాను.
"పేరయ్యా! నీలాంటోళ్ళు ఉండబట్టే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మా లాంటివాళ్ళకి కొద్దో గొప్పో పవర్ ఇవ్వగలుగుతున్నాడు."
పేరయ్య మళ్ళీ మొహం చిట్లించాడు.
"నీకు నాతో యేంది ఆసికాలు? మనకి ముక్యమంత్రి యాడుండాడు? ఎప్పుడో సచ్చిండుగా!" అన్నాడు.
వామ్మో! ఈ పేరయ్యని బాగు చెయ్యడం నా వల్ల కాదు. అయినా ప్రయత్నిస్తాను.
"చూడు పేరయ్యా! నువ్వు చెప్పే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చనిపొయ్యాడు. మనుషులు చనిపోయినా ముఖ్యమంత్రి పదవి చనిపోదు. అందుకే ఆ తరవాత రోశయ్య, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులయ్యరు." అన్నాను.
పేరయ్య నన్ను నమ్మలేదు.
"నీకాడ మా కుంటెంకళ్ళా శానా ఎకసెక్కలుండాయే! మనకి ముక్యమంత్రి ఏడుండాడు? యాడైనా సచ్చినోడు బతికొస్తాడా ఏంది?" అన్నాడు.
నాకూ మళ్ళీ జ్ఞానోదయం! అవును. నిజమేగా! మనకి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా కలిగే అభిప్రాయం ఇదే! అవును పేరయ్యా! నువ్వే కరెక్ట్! ఒప్పుకుంటున్నాను. మనకి ముఖ్యమంత్రి లేడు!
(photo courtesy: Google)
అదిరింది. నిర్భయం గా నిజం చెప్పావు.
ReplyDelete- పుచ్చా
My vote to Perayyaa.
ReplyDeletethank you.
Deleteపెళ్ళిళ్ళ పేరయ్యల గురించి విన్నాము కానీ చావుల పేరయ్య గురించి వినడం ఇదే మొదటి సారి!
ReplyDeleteమీరు ఈ టపా మొన్నటి ఉప ఎన్నికల ముందు వ్రాసుంటే నేను నమ్మేవాడిని కాను.
ReplyDelete(ఈ సంఘటన అప్పుడు జరిగి ఉంటే)
సామాన్య పౌరులిచ్చే ఇలాంటి strong message అర్ధం చేసుకోకుండా నాయకులు తప్పులు చేస్తుంటారు.
>> "నీకాడ మా కుంటెంకళ్ళా శానా ఎకసెక్కలుండాయే! మనకి ముక్యమంత్రి ఏడుండాడు?"
ReplyDeleteLOL. :)) Good One from Perayya.
Nice post :)
చాలా బావుంది ఈ పోస్ట్. నేనే పేరయ్య తో మాట్లాడుతున్నంత ఆనందంగా చదివాను. నేను పేరయ్యలతో మాట్లాడి చాల సంవత్సరాలు అయిపోయింది. మా ఊళ్ళో ఉండేవాళ్ళు, ఉదయాన్నే సద్దన్నం తిని , కొంత అన్నం మూట కట్టుకుని , మళ్ళి రాత్రి కి వచ్చి ఉడుకు నీళ్ళు పోసుకుని , కాస్త అన్నం తిని, ఒక చుట్ట వెలిగించి , ఒరేయ్ అబ్బాయి అంటూ ప్రారంభించే ఆ పేరయ్యలుని అస్సలు మర్చిపోలేను. ఎందుకో మీరు రాజకీయాలు రాసిన, అవేప్పుడు ఉండేవే కాని, పేరయ్యని కలవడమే బాగుంది నాకు. ముఖ్యమంత్రి ఏంటి , ఇప్పుడు ఎవడు ఉన్నాడు మన రాష్ట్రం లో, ఎవడి కి వాడే కింగ్ .
ReplyDelete:venkat
అందుకే కిరణ్కుమార్ పేరయ్య వాళ్ళ ఆవిడకి వడ్డీ లేని రుణాలు పంచే పనిలో పడ్డాడు.
ReplyDeleteఈ సారి వచ్చ్సినపుడు చుడండి , ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోతాడు అని అడుగుతాడు :))
Spell Bound
ReplyDeleteడాక్టర్ గారు,
ReplyDeleteపేరయ్య లాంటి వాళ్ళు వున్నందుకు కాదండి మనకు పవర్ ఇవ్వగలుగుతోంది.పుకార్లను నమ్ముతున్న వాళ్ల వలన ఇవ్వగలుగుతున్నారు.
మొన్న రంజాన్ రోజున,బుధవారం రాత్రి వచ్హిన పుకార్లకు జనాలు కంటి మీద కునుకు లెకుండా రోడ్ల పైనే జాగారం చేసారు.ఈ పుకార్ల వెనకాల కూడా పెద్దల తలకాయలున్నాయెమొ ............ఇంకొ c.b.i enquiry వేస్తే పోలా.ఇలా రోజు మరిన్ని పుకార్లు పుట్టిస్తు ఎంత power save చెసెయ్యవచ్హొ కదా!
కామెంటిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా క్లినికల్ ప్రాక్టీస్ లో అనేకమంది పేరయ్యలని చూస్తుంటాను. వారు చెప్పే సంగతులు ఆసక్తిగా, ఎడ్యుకేటివ్ గా ఉంటాయి. ఒక చిన్న అనుభవం మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినందుకు సంతోషిస్తున్నాను. కృతజ్ఞతలు.
ReplyDelete