Tuesday, 11 June 2013

దృఢచిత్తుడు


వారివురు భార్యాభర్తలు. అతనికి నలభైయ్యేళ్ళు ఉండొచ్చు. ఎర్రగా, ఎత్తుగా, అందంగా ఉన్నాడు. ఆవిడకి ఓ ముప్పైయ్యేళ్ళు ఉండొచ్చు. నల్లగా, లావుగా ఉంది. బాగా పొట్టిగా కూడా ఉంది. ఎత్తుపళ్ళు, మందపాటి కళ్ళజోడు. నేనెప్పుడూ మనుషుల అందచందాలు పెద్దగా పట్టించుకోను. అయితే నాకీ జంట రూపంలో తేడా మరీ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. 

కేస్ హిస్టరీ తీసుకుంటుండగా అర్ధమయినదేమనగా.. ఈయనగారికి ఈవిడగారు రెండో భార్య. ఈయన మొదటి భార్యగా ఓ అందమైన యువతిని పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆవిడగారు కొద్దికాలానికి ఈయనగారి స్నేహితుడితో 'వెళ్ళిపోయింది'. అప్పుడీయన కొంతకాలం డిప్రెషన్లో మునిగిపొయ్యాడు. ఆ తరవాత తీవ్రంగా ఆలోచించాడు. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులేమీ ఉండరాదని ఒక గట్టి నిర్ణయం తీసుకుని.. ఏరికోరి ప్రస్తుత భార్యని పెళ్ళి చేసుకున్నాడు.
     
"అందానికి ప్రాముఖ్యతనిచ్చి ఒకసారి దెబ్బ తిన్నాను. నాక్కావలిసింది నాతో జీవితాంతం కలిసి బ్రతికేమనిషి. ఇప్పుడు హాయిగా, ప్రశాంతంగా ఉన్నాను." స్థిరంగా, ధృఢంగా, గుళ్ళో గంట కొట్టినంత ఖచ్చితత్వంతో చెప్పాడు. నేనతన్ని ఎప్రీషియేటివ్ గా చూసాను .
           
ముప్పైయ్యేళ్ళ క్రితం ఎక్కడో చదివాను.. జీవితంలో మనకి మనం ఓ రెండు ప్రశ్నలకి సమాధానం వెతుక్కోవాలి. అవి కష్టమైన ప్రశ్నలు. కానీ ముఖ్యమైనవి.

1.'నేనెవర్ని?'

2.'నాకేం కావాలి?'

ఈ రెండు ప్రశ్నలకి మనమిచ్చుకునే సమాధానం స్పష్టతకి ఎంత దగ్గరగా ఉంటే అంత సుఖంగా ఉంటాం. స్పష్టతకి ఎంత దూరంగా ఉంటే అంత అశాంతిగా ఉంటామని మళ్ళీ ప్రత్యేకించి రాయనవసరం లేదనుకుంటా.

మన గూర్చి మనం ఫలానా అని అనుకుంటాను. కానీ కాదు. మనకి లేని తెలివితేటల్ని, సుగుణాల్ని ఆపాదించుకుని.. థియరీకి ప్రాక్టీస్ కి దూరం పెరిగిపోయ్యి సతమవుతుంటాం. గందరగోళ పడిపోతుంటాం. మనకేం కావాలో సరైన అవగాహన కూడా ఉండదు. ఫలానాది బాగుంటుందనిపిస్తుంది. కానీ ఎందులోనూ సుఖం అనిపించదు. ఎత్తు, బరువులాగా మానసిక అపరిపక్వతని, అజ్ఞానాన్ని కొలిచే మీటర్లుంటే బాగుండు.

'నువ్వు అనవసరపు చెత్త చాలా చదువుతున్నావ్. తెలుసుకుంటున్నావ్. ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తున్నవారు బాగుపడ్డట్లు చరిత్రలో లేదు.' అంటాడు మా సుబ్బు.

'అసలు రచయితల్లోనే కన్ఫ్యూజన్ ఎక్కువ. ఏదీ తిన్నగా చెప్పి చావరు. ప్రతిదీ తీవ్రంగా ఆలోచిస్తారు.. విషయాన్ని జటిలం చేసుకుంటారు. జాక్ లండన్, హెమింగ్వేలు అందుకే ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు జాగ్రత్త.' అంటూ భయపెడతాడు కూడా.

నన్ను గొప్పరచయితలతో పోల్చినందుకు ఆనందించాలో, వాళ్ళ చావుతో ముడిపెట్టినందుకు ఏడవాలో అర్ధం కాదు!

ఈ ఎర్రటి పోడుగాయన తన భార్య సమస్య గూర్చి ఇంకా చెబుతూనే ఉన్నాడు. నేను ఆయన్ని ఈర్ష్యగా, ఎడ్మైరింగ్ గా చూస్తూనే ఉన్నాను. జీవితంలో తనకి ఏం కావాలో ఇతనికి తెలుసు. కష్టమైన రెండు ప్రశ్నలకి సులభమైన సమాధానాలు చెప్పుకున్నాడు. అందుకనే హాయిగా ఉన్నాడు.

అయితే ఈయన ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడో ఈయనకే తెలిసినట్టుగా లేదు. ఈ ప్రపంచంలో సాధారణ మానవులే అసాధారణ నిర్ణయాలు తీసుకోగలరని కొడవటిగంటి కుటుంబరావు అంటాడు. ఇది నిజంగా నిజం.

(picture courtesy : Google)

14 comments:

  1. Well, I am not terribly impressed with this Adonis fellow. He is a scared and selfish man playing safe. If he married the woman for love that is a different matter altogether. Besides the women, he is terrible at picking his friends too.

    BSR

    ReplyDelete
    Replies
    1. dear BSR,

      >>He is a scared and selfish man playing safe.<<

      ఈ విషయం అతనికీ తెలుసు. అందుకే అతనంటే నాకు జెలసీ!

      Delete
  2. నేను GlDocగారి అభిప్రాయంతో యేకీభవిస్తున్నాను రమణగారూ.

    > జీవితంలో మనకి మనం ఓ రెండు ప్రశ్నలకి సమాధానం వెతుక్కోవాలి. అవి కష్టమైన ప్రశ్నలు. కానీ ముఖ్యమైనవి. 1.'నేనెవర్ని?' 2.'నాకేం కావాలి?'
    ఉన్నది ఒకటే ప్రశ్న అండీ. నేనెవర్ని అన్నది స్పష్టంగా తెలిస్తే, నాకేం కావాలో కూడా దానితో బాటుగానే సులభంగా అర్థమైపోతుంది. అందుచేత 'నే నెవర్నీ' అన్న ప్రశ్నకు తప్పక జవాబు వెదకాల్సిందే. అదే‌ భగవాన్ రమణమహర్షి చెప్పింది కూడా అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      చాలారోజుల క్రితం Richard Bach అనే పెద్దమనిషి రాసిన Illusions పుస్తకంలో ఈ ప్రశ్నలు చదివినట్లు గుర్తు. తక్కువ ఆలోచించేవాడు ఎక్కువ సుఖపడతాడని నా అభిప్రాయం.

      Delete
    2. తక్కువ ఆలోచించేవాడు ఎక్కువ సుఖపడతాడని నా అభిప్రాయం.


      kanee ikkada manam thakkuvga alochistunnamanna vishayam manaki teliyakodadhu.adhe samasya

      Delete
  3. యెప్పటికైనా తెలుస్తుందా ? అసలు తెలియాలా అని ?

    పాతాళ భైరవి లో రేలంగోడు అన్నట్టు మనం చావాలా అని ? .

    ReplyDelete
  4. నేనెవర్ని అని అడిగే అన్వేషణ లో మనమే తెరమరుగై పొతాం.

    ReplyDelete
    Replies
    1. అదేగా కావలసినది మరి.

      కం. నే ననునది లేకుండగ
      పోనడచుట కన్న భాగ్యమొక్కటి గలదే
      తానప్పుడు బ్రహ్మంబు చి
      దానందమయస్వరూప మన నొప్పారున్.

      స్వస్తి.

      Delete
  5. నన్ను గొప్పరచయితలతో పోల్చినందుకు ఆనందించాలో, వాళ్ళ చావుతో ముడిపెట్టినందుకు ఏడవాలో అర్ధం కాదు!
    LOL :-)

    ReplyDelete
  6. అంటే కాకి ముక్కుకి దొండ పండు వెక్కిరింత కాదు , మెచ్చు కోలు అన్నమాట

    ReplyDelete

  7. Superb post! One of your best posts so far !

    cheers doctor!

    cheers
    zilebi

    ReplyDelete
  8. నేనెవర్ని అంటే శ్యామలీయం గారు కందం తో దెబ్బ కొట్టారు.

    ReplyDelete
  9. Antha happy gane unte, vallu, psych doctor daggaraku, endukochcharu?

    ReplyDelete
    Replies
    1. అతను చాలా హేపీగానే ఉన్నాడు. అనుమానం లేదు.

      (అయితే ఆవిడ హేపీగా ఉందని నేను రాయలేదు!)

      Delete

comments will be moderated, will take sometime to appear.