Wednesday, 26 June 2013

ఇచట ఆటోగ్రాఫులు ఇవ్వబడును



"జీవితంలో ఆటోగ్రాఫులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదగాలి." ఈ గొప్ప డైలాగ్ చాల్రోజులుగా వింటూనే ఉన్నాను. ఇట్లాంటి సుభాషితాలు 'గంటకి ఇంత' అంటూ వసూలు చేసుకునే professional వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతుంటారు.

ఈ ఆటోగ్రాఫుల డైలాగ్ విన్నప్పుడల్లా ఇట్లాంటివే ఇంకొన్ని డైలాగులు గుర్తొచ్చి నవ్వుకుంటాను. అప్పు తీసుకునేవాడు ఆప్పిచ్చే స్థాయికి ఎదగాలి. ఇంజక్షన్ చేయించుకునేవాడు ఇంజెక్షన్ చేసే స్థాయికి ఎదగాలి. ఆత్మహత్య చేసుకునేవాడు హత్య చేసే స్థాయికి ఎదగాలి.

ఈ మధ్య గుంటూర్లో భగవద్గీతకి సంబంధించిన కార్యక్రమం ఒకటి జరిగింది. ముఖ్య అతిథి CBI మాజీ అధికారి లక్ష్మీనారాయణ. ఆయన కూడా పిల్లలకి ఈ అరిగిపోయిన ఆటోగ్రాఫ్ డైలాగ్ వినిపించాడు. ఆశ్చర్యపొయ్యాను. అంత పెద్ద పోలీసాయన చెప్పాడంటే.. ఇదేదో యోచించవలసిన సంగతే!

ముందుగా.. ఆ CBI మాజీ అధికారి ఆటోగ్రాఫులు ఇచ్చే స్థాయికి ఎదిగాడని మనం అర్ధం చేసుకోవాలి. మంచిది. ఆయన్ని ఆటోగ్రాఫ్ అడిగేవాడున్నాడు. చేతిలో పెన్నుంది. పెన్నులో ఇంకుంది. సంతకాలు పెట్టే ఉత్సాహం ఆయనలో ఉంది. కాదనడానికి మనమెవరం? నిజాయితీపరులైన అధికారుల్ని మనం తప్పకుండా గౌరవించుకోవాల్సిందే.

ఈ దేశంలో నిజాయితీపరులైన ఉద్యోగులు ఇంకా చాలామంది ఉన్నారు. రాబర్ట్ వద్రా అనే ఒక పెద్దమనిషి చేసిన భూకుంభకోణాన్ని బయట పెట్టిన అశోక్ కెమ్కా అనే IAS అధికారి ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. ములాయం, మాయావతిల అవినీతిపై దర్యాప్తు చేసిన అధికారులు.. వారిపై టన్నుల కొద్దీ చార్జ్ షీట్లు తయారుచేసి.. సబ్మిట్ చేసేందుకు అనుమతి కోసం నిరంతరంగా పడిగాపులు కాస్తున్నారు.

వారెవ్వరికీ దొరకని అవకాశం మన లక్ష్మీనారాయణకి దక్కింది. కారణాలు ఏవైనప్పటికీ.. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకి పూర్తి స్వేచ్చనిచ్చింది. ఇందుకు మనం కాంగ్రెస్ హైకమాండుని అభినందించవలసి ఉంది. క్షమించాలి. ఆటోగ్రాఫుల గూర్చి మొదలెట్టి ఒక పోలీసు అధికారి గూర్చి రాసేస్తున్నాను.

అసలు ముందుగా నాకీ ఆటోగ్రాఫుల గూర్చి రాసే అర్హత ఉన్నదా? అని నన్ను నేను ప్రశ్నించుకోవలసి ఉంది. సినిమా తియ్యడం చేతకానివాడు సినిమాని విమర్శించరాదు. విస్కీ మజా తెలీనివాడు విస్కీని వ్యతిరేకించరాదు. ఇట్లాంటి పాత చింతకాయ పచ్చడి వాదనలు (చింతకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. అయినా ఈ సందర్భంలో వాడక తప్పట్లేదు) ఎప్పట్నుండో ఉన్నాయి.

ఈ వాదనల ప్రకారమైతే నాకు ఆటోగ్రాఫుల గూర్చి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నేనెప్పుడూ ఎవరిదగ్గరా ఆటోగ్రాఫ్ తీసుకోలేదు.. (ఆటోగ్రాఫ్ ఇవ్వమని నన్నెవరూ అడగని కారణాన) ఇచ్చిందీ లేదు. (నన్ను ఎవరూ ఆటోగ్రాఫ్ అడగనందున కుళ్ళుకుంటూ ఈ టపా రాస్తున్నానని మీరనుకుంటే నాకభ్యంతరం లేదు).

సరే! అందరూ ఆటోగ్రాఫులు ఇచ్చే స్థాయికి ఎదిగినట్లైతే.. మరి వాటిని తీసుకునేదెవరు? ఫేస్బుక్కుల్లో అయితే స్నేహితులే చచ్చినట్లు (మొహమాటానికి) లైకులు పెడతారు. ఆటోగ్రాఫులకి ఆ సౌకర్యం ఉన్నట్లు లేదు. అసలు ఎవరైనా, ఎవరికైనా ఈ ఆటోగ్రాఫులు ఇవ్వడం ఎందుకు? తీసుకోవడం ఎందుకు?


మనిషి ఒక జంతువు. ('జంతువు' అంటున్నానని కోపగించుకోకండి. మనం నిజంగా జంతువులమే). అడవిలో జంతువులు ఏం చేస్తాయి? ఆకలేస్తే కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని పొట్ట నింపుకుంటాయి. ఆపై నీడపట్టున కునుకు తీస్తాయి. ఆ తరవాత హాయిగా ఆడుకుంటాయి. ఒకేరకం జంతువుల IQ ల్లో పెద్ద తేడా ఉన్నట్లు గోచరించదు. అందుకే వాటన్నింటికీ సమానంగా కష్టపడితేగానీ పొట్ట గడవదు.

కానీ మనిషి తెలివితేటల్లో తేడాలున్నాయి. కొందరు తెలివి తక్కువ వెధవలకి ఎంత కష్టపడ్డా పూట గడవదు. ఇంకొందరికి అసలు కష్టపడకుండానే పంచభక్ష్య పరమాన్నాలు రెడీగా ఉంటాయి. అంచేత ఈ కడుపు నిండినవారు ఏం చెయ్యాలో తోచక తెగ ఇబ్బంది పడుతుంటారు. కావున వీరు తమ మానసికోల్లాసం కోసం ఏదొక వ్యాపకం పెట్టుకుంటారు.

'పొద్దస్తమానం తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఎటుంటాది?' అని ముళ్ళపూడి వెంకట్రవణ ముత్యాలముగ్గులో చెప్పనే చెప్పాడు. అంచేత ఈ కడుపు నిండిన మనిషి 'హాబీ' అని ముద్దుగా పిలుచుకునే (పన్లేని) పన్లు కొన్ని కల్పించుకున్నాడు. ఈ హాబీల్లొ 'కలెక్షన్' అనేది ఒక ప్రముఖ వ్యాపకం. కాయిన్లు, స్టాంపులు, సీసాలు, సినిమా పాటల రికార్డులు, సిగరెట్టు పెట్టెలు, ఆటోగ్రాఫులు.. ఇలా ఒక చాంతాడంత లిస్టుంది.

ఇప్పుడు నేన్రాస్తున్న బ్లాగ్ కూడా ఆ లిస్టులో ఒకటి. ఇవన్నీ దురదలు. గోక్కుంటుంటే హాయిగా ఉంటుంది. (ఒక టపాకి వచ్చే కామెంట్లు చదువుతుంటే వేణ్నీళ్ళు తొడైనట్లు మరింత హాయిగా ఉంటుంది). స్కిజోఫ్రీనియా అనే జబ్బుతో బాధపడే మానసిక రోగులు కూడా రోడ్లమ్మట చెత్తకాయితాలు ఏరుకుని దాచుకుంటారు. అయితే స్కిజోఫ్రీనియా రోగ లక్షణానికీ, 'కలెక్షన్ హాబీ'కీ ఎటువంటి సంబంధమూ లేదని మనవి చేసుకుంటున్నాను.

ఓయీ మూర్ఖ వైద్యాధమా! ఒక మహోన్నతవ్యక్తి ఆటోగ్రాఫుని సేకరించి జనులు స్పూర్తి నొందెదరోయీ! ఆటోగ్రాఫ్ ఇచ్చుట, తీసుకొనుట అనునది ఆనాదిగా ఆధునిక సంస్కృతికి చిహ్నం. ఆటోగ్రాఫు అంటే నువ్వు రాసే కోడి కెలుకుడు కాదు. ఒక అద్భుతవ్యక్తి ప్రతిభాపాటవాలు విద్యుత్తరంగాల వలె ఆటోగ్రాఫ్ ద్వారా ప్రసరించబడి.. స్వీకరించినవాడి జన్మ ధన్యమగును. నీవంటి గుంటూరు కుగ్రామవాసికి దాని విలువ ఏమి తెలియును?

ఈ ఆటోగ్రాఫుల స్పూర్తితో విజయానికి వెయ్యి మెట్లు అవలీలగా ఎక్కెయ్యొచ్చు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ గారి ఆటొగ్రాఫులు తీసుకున్న బ్రాందీబాబులనేకులు గాంధీ వాదానికి మళ్ళారు. ఆమధ్య చిరంజీవి ఆటోగ్రాఫు తీసుకున్న యువకులనేకులు ప్రస్తుతం సామాజిక న్యాయంలో తలమున్కలైయున్నారు.

ఓ! అలాగా! అయామ్ వెరీ సారీ. నాకీ ఆటోగ్రాఫులకింత పవరుందని తెలీదు. విషయం తెలీక ఏదేదో వాగాను. అలాగైతే నేనూ ఓ ఆటోగ్రాఫ్ ఇస్తాను. తీస్కోవా ప్లీజ్!

పిచ్చివైద్యుని ఆటోగ్రాఫ్ తీసుకున్నచో నాకేమి వచ్చును? నువ్వేమన్నా స్టార్ ఏంకర్ ఉదయభానువా? లేక బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబువా? నీ ఆటోగ్రాఫ్ నాకొద్దు పో!

(photo courtesy : Google)

39 comments:

  1. Meeru current affairs meeda rastharu kada posts a rakam ga nenu me daggira nunchi Uttarakhand varadala meeda post expect chesanu but meru Guntur lo jarigina JD trip meeda post rasaru . Meru vellara a meeting ki ? rendu veru veru meetings jariginatlu unnnayi meetings .

    ReplyDelete
    Replies
    1. నాకు చిన్నప్పట్నించి పోలీసులంటే భయం. అదీగాక నీతిబోధనలంటే ఎలెర్జీ. కాబట్టి వెళ్ళే అవకాశం అస్సల్లేదు.

      (నేను current affairs మీద అప్పుడప్పుడూ.. కోళ్ళూ, కుక్కలు, పందులపై తరచుగానూ రాస్తుంటానని అనుకుంటున్నాను.)

      Delete
  2. డియర్ రమణా,
    ఈ పోస్ట్ నాకు బాగా నచ్చింది. అమెరికా లో పిల్లలికి అమ్మా, నాన్నలు తప్ప అందరు హీరోలే! ఈ సెలబ్రిటీ కల్చర్ ప్రజల్ని పాడు చేస్తోంది. ఫాదర్స్ డే అంటూ ఒక టయ్యో, టూల్ కిట్టో తండ్రి మొఖాన కొడతారు (నాన్న సొమ్ము తోనే) గానీ అసలు రోల్ మోడల్స్ కి వస్తే మైకల్ జొర్డనో, టైగర్ వుడ్సో, ఒబామావో కావాలి. ఇక మోటివేషనల్ స్పీకర్స్ కంటే కపటనాటకులు ఇంకెవరు లేరు. ఇంప్రాక్టికల్ సుత్తి సలహాలు చెప్పే ఈ వెధవలంటే నాకు చాలా చిరాకు. వీళ్ళందిరికి జనరల్ గా ఒకే మోటివేషన్ - డబ్బు (స్పీచిలు, సెమినార్లు, స్కూళ్ళు, కోర్సులు, పుస్తకాలు, టెలివిజన్, ఇత్యాది).
    అసలు ఎవరూ ఆటోగ్రాఫులు ఇవ్వగూడదు, తీసుకోనే కూడదు.
    థాంక్యూ ఫర్ ది సోషల్ కామెంటరీ ఎగైన్! లవ్డిట్
    బి ఎస్ ఆర్

    ReplyDelete
    Replies
    1. Dear BSR,

      ఈ motivational speech అనే వృత్తి మీవైపు నుండే దిగుమతైన దరిద్రం. ఇది మంచి లాభసాటి వ్యాపారం కూడా. ఈ రోజుల్లో చౌకబారు మిమిక్రీ కళాకారుల ఆటొగ్రాఫుల కోసం కూడా జనాలు క్యూ కడుతున్నారు. ఈ దరిద్రం రోగస్థాయికి చేరుకుందని నా అనుమానం.

      Delete
    2. మోటివేషనల్ స్పీచులని అంత చవకగా తీసిపారేయకండి. శ్రీకృష్ణుడి స్పీచ్ లేకుంటే అర్జునుడు ధైర్యంగా యుద్ధం చేయగలిగేవాడా? ధర్మరాజు వనవాసం లో ఎన్ని స్పీచులు వినలేదు? అలాగే వ్యక్తిత్వ వికాసపు కోర్సులు కూడా అన్నీ మంచివో చెడ్డవో కావు. వాటిలో రాళ్ళూ ఉంటాయి రత్నాలూ ఉంటాయి. వాటి మంచి చేడ్డలు విశ్లేషించాలి, ఏవైనా లోటుపాట్లు అనిపిస్తే నలుగురితో అభిప్రాయాలు పంచుకోవాలిగాని, ప్రతి దాన్ని "అందులో ఏముందిలే బొంగు" అన్నట్లు బ్లాగితే ఆ పోస్టుకు అర్థం ఉండదు. మీకు ఒక పోలీసాఫీసర్ గొప్ప కాకపోవచ్చు, కాని అపుడపుడే కాలేజీల్లో చదువులు పూర్తిచేసుకుంటున్న యువతకు సమాజం లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, విజయాలు సాధించినవారు స్ఫూర్తి. ఆ స్ఫూర్తి లేకపోతే తాము ఎదగాలనే కోరిక ఉండదు. అందుచేత తమ దృష్టిలో గొప్పవాడైన ఒక వ్యక్తి ఆటొగ్రాఫు తీసుకోటాన్ని నేను తప్పు పట్టను. అయితే ఎవరైనా "ఆ మహోన్నత వ్యక్తి వాడే పేస్టే నేనూ వాడుతాను. అతను తాగే జ్యూసే నేనూ తాగుతాను, అతను కూర్చున్నట్లే టాయిలెట్ లో కూర్చుంటాను!" అని అతి కి పోతే మీ దగ్గరకు వెళ్ళమంటాను.

      Delete
    3. Well said..

      Delete
    4. @ సూర్య గారు చక్కగా చెప్పారండి !

      @ డాక్టర్ గారు మీ బ్లాగు మీ ఇష్టం, ఎవరి మీదైనా మీకున్న అభిప్రాయం మీరు రాసుకుంటారు అనుకోండి. కాకపొతే లక్ష్మినారాయణ గారిని ఉదయభాను , ఏదో స్టార్ వావ్ ... ఇది చదివాక ఒక రెండు ముక్కలు రాయాలనిపించింది అండి . మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి .
      బహుసా సోనియా గాంధికి హెల్ప్ చేసారు కాబట్టి లక్షినారాయణ గారికి పేరు ఇప్పుడు వచ్చింది ఏమో లెండి కానీ, స్కూల్ పిల్లలు, కాలేజ్ యువత అయన గురించి తెలుసుకోవటానికి సోనియా గాంధికి ఈ అధికారం రాకముందే ఆయన చేసిన కొన్ని పనులు ఉన్నాయండి .
      ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి REC లో, IIT లాంటి ప్రిమియర్ ఇన్స్టిట్యూట్ లో చదవటం మరీ గొప్ప విషయం కాకపోయినా మరీ సామాన్యమైన విషయం కూడా కాదను కుంటానండి . అలాగే సివిల్స్ టాపర్ గా నిలవటం కూడా . అది కాక ఇప్పటి వరకు ఆయన మీద అవినీతి ఆరోపణలు నేను వినలేదు . ఇక పొతే మీరు చెప్పిన అశోక్ కెమ్కా అనే IAS అధికారి ఎక్కడున్నారో తెలియదు నిజమే అలాంటి వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. మరి ఇలా వాళ్ళు చేసింది ఏముంది అని ఎక్కడకక్క్డడ ఊరుకుంటే వాళ్ళ గురించి ఎవరికీ తెలుస్తుంది?

      అలాగే సిబిఐ మాజీ డైరెక్టర్కి ఉన్న ప్రత్యేకత చార్జీషీట్ పక్కగా ఫైల్ చేయటం. కేస్ విచారణ ఎన్ని రోజులు జరిగినా అలసత్వం చూపించకపోవటం. అసలు అంతదాకా పోనీ సోనియాగాంది ఈయన్నే ఈ పనికి ఎన్నుకున్నదంటారు, ఓ బొచ్చెడు మంది IPS లు ఉండగా ? దీనితో అన్నా కొద్దో గొప్పో ఆయన efficiency ని నమ్మోచ్చేమో . అలాగే గుజరాత్ ఎన్కౌంటర్ కేసులో స్వంత డిపార్టుమెంటు లోని మనుషులని కూడా చూడకుండా దర్యాప్తు చేసినందుకన్నా కొంచెం గౌరవం చూపించొచ్చు ఏమో? పోనీ ఇవన్నీ కాదు పోలీస్ డిపార్టుమెంటు లో ఒక మామూలు కానిస్టేబుల్ ని ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగి ఎలా ట్రీట్ చేస్తారో అందరికీ తెలిసిందే. మరి ఈయన గురించి ఆయన సబార్దినేట్స్ చెప్పేది చూసాన్నా కొంచెం గౌరవం ఇవ్వొచ్చు . తన ఉద్యోగం తను చేస్తుంటే ఏవో ఏవో పర్సనల్ కాల్స్ లిస్టు చూపించి క్యారెక్టర్ అసాసినేషన్ కి తెగబడ్డా తన పని తను ఎలా చేసుకుపోయారో దాని కన్నా కొంచెం గౌరవరం ఇవ్వచ్చు. పోనీయండి ఇదంతా కూడా కాదు తను పుట్టిన ఊరు, చదివిన స్కూల్ మర్చిపోకుండా ఏదో ఒకటి చేయాలి అని he is trying to giving back something to society దానికన్నా కొంచెం గౌరవం ఇవ్వొచ్చు అంటారా ?

      అసలు ఇదంతా కూడా కాదు అప్పుడే స్కూల్ , కాలేజ్ లో ఉన్న యువతకి తన ఉద్యోగం తను సరిగా చేస్తున్న వ్యక్తి మంచి మాటలు చెబితే తప్పేంటో అర్ధం కాలెదు నాకు,ఏ సినిమా స్టార్ నో పిలవకుండా ఇలాంటి వ్యక్తులని పిలవటం నాకు నచ్చింది. ఇలా అన్నా అని సినిమా వాళ్ళని తక్కువ చేయటం కాదండి అది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే!

      Delete
    5. @సూర్య,

      >>ప్రతి దాన్ని "అందులో ఏముందిలే బొంగు" అన్నట్లు బ్లాగితే ఆ పోస్టుకు అర్థం ఉండదు.<<

      మీరు నా అభిప్రాయాలతో విబేధిస్తూనే ఉన్నారు. కామెంట్లు రాస్తూనే ఉన్నారు. మంచిది.

      నా అభిప్రాయాల్ని మీరు ఎంత తీవ్రంగా విమర్శించినా నాకు ఓకే. కాకపొతే మీరు వాడుతున్న భాష నాకు అభ్యంతరకరం. దయచేసి ఇకముందు రిపీట్ చెయ్యకండి.

      Delete
    6. "బొంగు" అనే మాటకి నాకు తెలిసిన అర్థం వెదురు బొంగు లేదా ఎందుకూ పనికిరాని ఒక కర్ర ముక్క అనే. అంతకుమించి అందులో విపరీతార్థం ఏముందో నాకైతే తెలీదు. అందులోనూ రావిశాస్త్రి తెలుగుని అలగాజనం లోకి తీసుకెల్తే తప్పుపట్టని మీరు నేను వాడిన ఒక వాడుక పదం గురించి ఫీలయిపోవటం మీలో ఒక కొత్త కోణాన్ని (ఎన్ని డిగ్రీలో చెప్పడానికి నాదగ్గర కోణమానిని లేదు!) చూపెడుతోంది. మీ అభిప్రాయాలని నేను (అలాగే ఇంకొంతమంది కూడా) ఎప్పుడు వ్యతిరేకిస్తున్నారో కూడా గమనించండి. మీకు నచ్చినవారిని పొగిడితే మాకు పట్టింపులేదు. కాని మీరు ఇష్టపడని వాటిని చిన్నచూపు తో తక్కువగా చూపిస్తూ రాయటం మాకు అభ్యంతరకరం. మీకు నచ్చనివాటిగురించి రాసుకునే స్వేచ్చ మీకున్నట్లే మాకు నచ్చని అభిప్రాయాన్ని తిరస్కరించే హక్కు మాకూ ఉంది. ఇది మీ బ్లాగు. మీకు నచ్చని వ్యాఖ్యలని నిరభ్యంతరంగా తొలగించుకోవచ్చు. దయచేసి ఉచితంగా భావించండి(I mean please feel free!!)

      Delete
    7. @Sravya V,

      నేనీ పోస్ట్ ఆటోగ్రాఫుల గూర్చి రాశాను (అవంటే నాకు చికాకు). అంచేత నా అభిప్రాయాలతో ఒక పోస్ట్ రాశాను. ఒక ప్రముఖ పోలీసు అధికారి ఆటోగ్రాఫుల గూర్చి చెప్పాడు కాబట్టి ఆయన reference టపాలో వచ్చింది. అంతకుమించి నాకాయన గూర్చి ఆసక్తి లేదు. గమనించగలరు.

      (క్షమించాలి. లక్ష్మీనారాయణ గూర్చి మీరిచ్చిన సమాచారం నాకు తెలీదు.)

      Delete
    8. అయ్యో భలే వారు , క్షమించటం అంత పెద్ద మాటలు ఎందుకండీ , ఆయన గురించి ఆసక్తి లేకపోవటం తెలియకపోవటం పెద్ద విషయం కాదు కాదా !

      btw ఈయన లీడ్ ఇండియా అని అందులో ఆక్టివ్ participant , ఆ సంస్థ టార్గెట్ స్కూల్, కాలేజీ యువత. దాంతో స్కూల్ ఓ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి పిలవటానికి యాజన్యానికి బాగా అందుబాటులో ఉన్నట్లుగా ఉన్నరు. అందుకే ఈ మధ్యన స్కూల్స్ ప్రోగ్రామ్స్ లో కనపడుతునట్లు ఉన్నారు, ఆయన అగైన్ మీకు ఆసక్తి లేదూ అన్నా ఏదో రాసినట్లు గా ఉన్నా సారీ సారీ ఆపేస్తున్నాలెండి :-)

      Delete
    9. సూర్య గారు,
      బొంగు అన్న మాటని male reproductive organ కి పర్యాయ పదంగా వాడటం జరుగుతుంది. అందువల్ల 'బొంగు ' వాడకం అభ్యంతరమే.

      Delete
    10. మహేష్ గారూ.. నేను తెలుగు ని తెలుగులాగే వాడుతాను. దయచేసి నాకు బూతులు నేర్పవద్దు. థాంకులు!

      Delete
    11. చాలా బాగా చెప్పారు డాక్టరు గారు. చాలా బాగుంది టపా.
      బి ఎస్ అర్ గారు, ఈ మోటివెషనల్ స్పీకర్స్ గురుంచి కూడ బాగా చెప్పారు.
      కృష్ణ

      Delete
  3. అప్పుతచ్చు...
    రైజింగ్ స్టార్ కాదు.. బర్నింగ్ స్టార్!!

    ReplyDelete
    Replies
    1. అవునా? అప్పుతచ్చుని సరిచేశాను. థాంక్యూ!

      Delete
  4. రమణా
    టపా బాగుంది. మళ్లి ఓ గంటలో రాస్తాను
    గోపరాజు రవి

    ReplyDelete
  5. ఆ పెద్దాయన ఆటో గ్రాపుల సందేశం తో పాటు వందమంది వివేకనండులను తాయారు చేస్తాను అనే మాట కుడా చెబుతున్నారు ..
    ఎన్నికల తరువాత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టోకొనిసిబి ఐ వాళ్ళే జగన్ ఇంటికి వెళ్లి క్లిన్ చిట్ ఇచ్చి వస్తారని అనిపిస్తోంది
    మీ పోస్ట్ పై ఇది నా కామెంట్
    .....
    ----------------------------
    ప్రకాష్ గారు పొరపాటున మీ పోస్ట్ పై
    కామెంట్ నా బ్లాగ్ లో పోస్ట్ చేశారు .. మీ కామెంట్ మీరు తిసుకోగలరు
    నేను y.V.రమణగారికి నా ఆటోగ్రాఫ్ ను మహదానందంగా ఇద్దామనుకున్నాను కాని వారి ఈ టపా చదవగానే అది వెంటనే విరమించుకున్నానని తెలియజేయడానికి కడుంగడు విచారిస్తున్నాను!!!
    surya prakash apkari

    ReplyDelete
  6. మహేష్ గారు,

    క్షమించాలి. పొరబాటున మీ కామెంట్ delete అయిపోయింది. వెరీవెరీ సారీ. మీదగ్గర ఆ కామెంట్ ఉన్నట్లైతే దయచేసి మళ్ళీ పోస్ట్ చెయ్యగలరు. పొరబాటుకి మన్నించగలరు.

    ReplyDelete
  7. CBI మాజీ అధికారి లక్ష్మీనారాయణ ఆటోగ్రాఫులకి డిమాండ్ ఉండడానికి కారణం ఆయన ఇటీవల సోనియా కి పనికొచ్చే పని చెయ్యడం అన్నది ముఖ్యమైన కారణం అన్నది మీ టపా చూసే వరకు తట్టనే లేదు .

    జనం ప్రస్తుతం ఈయనొక్కడే నీతిమంతుడు దేశం లో అని గంటలు గంటలు చర్చిస్తుంటే నాకు పెద్దగా నచ్చలెదు. మీ టపా చూసాక జనం నీతిమంతులుగా పట్టం కట్టే కొద్ది మంది పరిమితులేమిటో తెలిసిపోయాయి కదా . సోనియా పేరు చెప్పి ఆయన గాలి తీసిపారేసారు.

    ReplyDelete
    Replies
    1. @Mauli,

      మీకు సుస్వాగతం.

      లక్ష్మీనారాయణ ఒక పోలీసు అధికారి. ఆయన ఈ రాష్ట్రంలో CBI తరఫున పని చేశాడు. జగన్ పట్ల కేసుల నమోదు తీవ్రస్థాయిలో ఉండాలని పైనుండి ఆయనకి ఇచ్చిన బ్రీఫ్. ఆయన అదే పని చేశాడు. ఇష్టం ఉన్నా, లేకపోయినా అది ఆయన ఉద్యోగ ధర్మం. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న CBI అనే దర్యాప్తు సంస్థలో లక్ష్మీనారాయణ ఒక ఉద్యోగి మాత్రమే . నాకున్న అవగాహన ఇది.

      అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో మీడియా వార్ జరుగుతుంది. ఎవరికి అనుకూలమైన వారిని వారు (ఆయా మీడియా సంస్థలు) హీరోలుగానూ, జీరోలుగానూ చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నమ్ముతున్నారు. ఇంకొందరు వినోదం చూస్తున్నారు. అదీ సంగతి!

      Delete
  8. తీసుకోదగిన వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆటోగ్రాఫ్‌లు మేలే చేస్తాయని నా అభిప్రాయం.

    ఇక లక్ష్మీనారాయణ గారు మాజీ CBI అధికారి కాదండి. ఆయన బదిలీ అయ్యారు అంతే. బహుశా మన రాష్ట్రం వరకు మాజీ అనుకోవచ్చు. ఆయన ప్రసంగాల వీడియో చూసాను. అందులో వ్యాపారం ఏమీ నాకు కనపడలేదు. కాకపోతే ఆయనకు ఇలాంటివి కొత్త కాబట్టి కొంత అతిశయోక్తిగా ఉంది.

    ఆయన మాటలకి వచ్చిన మంచి రెస్పాన్స్ చూస్తే మన దేశంలో యువతకి స్ఫూర్తినిచ్చే నాయకుల కొరత ఎంత ఉందో అర్థమవుతోంది.


    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,

      అరిగిపోయిన ఆటోగ్రాఫ్ డైలాగుల్ని యండమూరి, పట్టాభిరాముళ్ళు చెబుతూనే ఉంటారు. మనం వాళ్ళని సీరియస్ గా పట్టించుకోవలసిన అవసరం లేదు. కాకపొతే ఒక ప్రముఖ పోలీసు అధికారి కూడా అదే డైలాగ్ వినిపించడం అనేది నా పోస్ట్ కి ప్రేరణ. నేనీ సంగతి టపా మొదట్లో చాలా స్పష్టంగానే రాశాను.

      వెల్, ఆటోగ్రాఫుల పట్ల నా అభిప్రాయాలు నేను రాశాను. మీ అభిప్రాయాలు కూడా నా బ్లాగులో కామెంట్ల రూపేణా రాసుకోవచ్చు. ఆటోగ్రాఫ్ ప్రేమికుల పట్ల నేనేమీ యుద్ధం ప్రకటించట్లేదు. కొందరికి ఈ ఆటోగ్రాఫులు గొప్ప స్పూర్తి నివ్వవచ్చు. మంచిదే కదా! కాదనటానికి నేనెవర్ని?

      Delete
  9. రమణ గారు,

    మీరు మానసిక వైద్యులు. మీకు చెప్పే అంత వాడిని కాదు. కానీ నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. recollection of memories and experiences by association.
    మనం ఎప్పుడైనా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలసినప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంది. మనం ఒక రకమైన ఉత్తెజాన్ని పొందుతాము. కాని కాలం గడిచేకొద్ది కొత్త అనుభవాలు కొత్త అనుభూతులు మన memory లోకి వచ్చి చేరుతాయి. పాత అనుభూతుల తాజాదనాన్ని కోల్పోతాము.
    కానీ మనం ఒక 'ఆటొగ్రాఫ్' తీస్కొన్నప్పుడు, కొంత కాలం తర్వాత ఆ ఆటొగ్రాఫ్స్ చుస్తె by association of that memory with the autograph మనం ఆ పాత అనుభవాన్ని మరల తాజాగా పొందె అవకాశం ఉంది.
    కాశీ కి వెళ్ళి అక్కడ గంగ లో గులక రాళ్ళు తెచ్చి పూజ గదిలొ పెట్టుకొవటం, ప్రెయసి తో మొదటి సినిమా టిక్కట్టు జాగ్రత్తగా దాచుకొవటం వంటివి అలాంటివే.
    కాని ఇప్పుడు ఈ ఆటొగ్రాఫ్ వ్యవహారం అంతా ఒక సర్కస్ అయిపొయి కాస్త చిరాకు కలిగించె మాట వాస్తవమే.
    నేను మీ టపా చదివి enjoy చెసాను. ఎదొ ఒక రోజు నేను మీ ఆటొగ్రఫ్ తీసుకొంటాను. (మీతొ పాటు మీ గుంటూరు బ్రాడి పేట మైసూరు కేఫ్ లొ ఉప్మ పెసరట్టు తింటూ.)

    ReplyDelete
    Replies
    1. @Mahesh,

      మీ కామెంట్ మళ్ళీ పోస్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. మానసిక వైద్యం నా వృత్తి. అలాగే మీరు కూడా ఇంకేదో వృత్తిలో ఉండి ఉంటారు (కోటి విద్యలూ కూటి కొరకే). బ్లాగ్రాతల విషయంలో మనందరం సమానమే.

      ఆటోగ్రాఫ్ గూర్చి మీ అభిప్రాయాలు share చేసుకున్నందుకు ధన్యవాదాలు.

      నేను ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి పెన్ను చేతపుచ్చుకుని రెడీగానే ఉన్నాను. మీదే ఆలస్యం!

      మా గుంటూర్లో మైసూర్ కేఫ్ మూతబడి దశాబ్దం దాటింది. ఆనందభవన్ పడుతూ లేస్తూ ఉంది. కావున మన ఉప్మాపెసరట్టు డౌటే!

      Delete
    2. రమణ గారు,
      ఉప్మా పెసరట్టు విషయం చెప్పి మనసు విరిచేసారండి. మీ బ్లాగ్ లలో చాలా సార్లు చదివి మైసూరు కేఫ్ ఉప్మా పెసరట్టు మీద చాలా expectations పెట్టుకున్నాను అండి.

      Delete
  10. ఒక అప్పుడు ఫోటోగ్రాఫ్స్ లేక ఆటోగ్రాఫ్స్ తీసుకొనే వాళ్ళు ఇప్పుడు ఫోటో గ్రాఫ్స్ వచ్చిన తరువాత కూడా ఆటోగ్రాఫ్స్ కి క్రేజ్ ఉంది అంటే గొప్పదనమె .

    ReplyDelete
    Replies
    1. ఆటోగ్రాఫో, ఫోటోగ్రాఫో.. ఏదోక గ్రాఫ్ లేకపోతే కొందరికి బోర్ కొట్టేస్తుంది.

      Delete
  11. పొతే పొనీ పోరా..ఈ పాపపు జగతిలొ శాశ్వతమేదిరా!
    ఇంకు ఇంకనంత కాలం ఆటొగ్రాఫ్లు వర్దిల్లాలి.

    ReplyDelete
  12. meeru prathi post lone personality development ni ammukune vallani ekayyedam naaku chaala anandamgaa undhi . naku vallante asahyam

    ReplyDelete
  13. Doctor gariki subconcious ga JD Laxminarayana meeda kopam undi, ila bayata padinattu anipisthundi. Freudian slip. JD meeda doctor gariki kopam endukabba? Kasta jeevi Jagan meeda abhimanama?

    ReplyDelete
    Replies
    1. జగన్ మీద నాకు అభిమానం!

      అదేమో తెలీదు కానీ, నీతిబోధకులపై చచ్చేంత చిరాకు మాత్రం ఉంది. ఆ పోలీసాయన ఆ రోజంతా అదే చేశాడు. ఆరోజు ఆంధ్రజ్యోతి నిండా ఆయన సుభాషితాలే. ఒక పోలీసు అధికారిని కారణజన్ముడిగా హైప్ చేసిన ఆంధ్రజ్యోతి రిపోర్టింగ్ కలిగించిన చిరాకు కూడా పోస్టులో రిఫ్లెక్ట్ అయ్యుంటుంది.

      (ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి తన శత్రువుకి శత్రువుని గ్లోరిఫై చేసే చౌకబారు ఆలోచన తప్ప.. నిజాయితీగా పనిచేస్తున్న ఒక మంచి పోలీస్ అధికారిని మెచ్చుకునే ప్రయత్నంగా పాజిటివ్ రిపోర్టింగ్ చేస్తుందనే నమ్మకం నాకు లేదు.)

      Delete
  14. డాక్టర్ గారు,

    మీ పొస్టులన్నీ చదువుతున్నాను అయితే నా సిస్టంలో వచ్చిన చిన్న ప్రాబ్లంవల్ల మీపోస్టులకు కామెంట్లు రాయలేక పోయాను. కాని ఈ పొస్ట్ చదివాక తప్పనిసరిగా కామెంట్ రాయలనిపించి రాస్తున్నాను. బహుశా ఈమధ్య మీరు రాసిన పొస్టులలో "హ్యుమరసం" తగ్గడం వల్లనో లేక నా టేస్టు, నవ్వు తెప్పించే మరియు సామాజిక రాజకీయ విషయాలకు పరిమితమవటమం వల్లనెమో.

    ఇక పోస్టు విషయానికి వస్తే చాల బాగుంది సార్. మరిముఖ్యంగా ఈ క్రింది విషయాలు చాలా బాగున్నాయి.

    "ఈ దేశంలో నిజాయితీపరులైన ఉద్యోగులు ఇంకా చాలామంది ఉన్నారు. రాబర్ట్ వద్రా అనే ఒక పెద్దమనిషి చేసిన భూకుంభకోణాన్ని బయట పెట్టిన అశోక్ కెమ్కా అనే ఈఆశ్ అధికారి ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. ములాయం, మాయావతిల అవినీతిపై దర్యాప్తు చేసిన అధికారులు.. వారిపై టన్నుల కొద్దీ చార్జ్ షీట్లు తయారుచేసి.. సబ్మిట్ చేసేందుకు అనుమతి కోసం నిరంతరంగా పడిగాపులు కాస్తున్నారు."
    "ఫేస్బుక్కుల్లో అయితే స్నేహితులే చచ్చినట్లు (మొహమాటానికి) లైకులు పెడతారు."

    "ఇప్పుడు నేన్రాస్తున్న బ్లాగ్ కూడా ఆ లిస్టులో ఒకటి. ఇవన్నీ దురదలు. గోక్కుంటుంటే హాయిగా ఉంటుంది. (ఒక టపాకి వచ్చే కామెంట్లు చదువుతుంటే వేణ్నీళ్ళు తొడైనట్లు మరింత హాయిగా ఉంటుంది)"

    "ఆమధ్య చిరంజీవి ఆటోగ్రాఫు తీసుకున్న యువకులనేకులు ప్రస్తుతం సామాజిక న్యాయంలో తలమున్కలైయున్నారు."

    పైన విషయాలు చదివాక ఠఫా బాగుందన్నవిషయం చెప్పలేకుండా వుండలేక పొయాను.

    సార్ ప్రస్తుత పరిస్తితి చూస్తుంటే టి కాంగ్రేస్ వారి సౌజన్యంతో,అధిస్టానం ఆశిసులతో, తెలంగానా సాదనతో, మన అంద్రా అభివ్రుధితో మన కల నెరెవెరేటట్టుంది.


    జి రమేష్ బాబు
    గుంటూరు

    ReplyDelete
  15. డాక్టర్ గారు,


    కామెంట్లు చదివాక ఇంకోటి రాయాలనిపించింది.

    ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఆ "ఆంధ్రజ్యోతి" పేపర్ చదవద్దని.
    చక్కగా మన సాక్షి చదువుకోవచ్చుగా, ఇంతకుముందు మీటఫాలో రాసినట్టు జాతిపిత అంటే మన వై యస్ అని, భారతరత్న అంటే జగనని అర్ధమవుతుంది.
    పైన జాతిపిత,భారతరత్న జస్ట్ సరదాకోసమే రాసాను. దయచేసి ఎవరూ వాల్లని చులకనగా భావించ్చొద్దు.

    ఎందుకంటే నేను జగన్ కి వీరభిమానిని.

    జి రమేష్ బాబు
    గుంటూరు

    ReplyDelete
    Replies
    1. డియర్ రమేష్,

      చాలా రోజులకి కామెంట్ రాశారు. ధన్యవాదాలు.

      (నేను ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజి మాత్రమే 'చూస్తాను'. చదవను. ఇకపై సాక్షి చదవడానికి ప్రయత్నిస్తాను.. మీరు రికమెండ్ చేస్తున్నారు కాబట్టి.)

      Delete
    2. ఏమిటీ సాక్షి పేపర్ చదువుతారా? జాగ్రత్తండోయ్. మీ ప్రాపంచిక ఞ్ఙానం కుంచించుకుపోతుంది. "దేవుడి కుటుంబం అనగా అన్న కుటుంబము, దేవుడి పాలన అనగా పెద్దాయన పాలన" అని కొత్త కొత్త నిర్వచనాలు మాట్లాడేస్తారు మీరు కూడా. నేనైతే ఈనాడులో బాబో అన్నో ఫోటోలో కనిపిస్తే మొదటి రెండు మూడు లైన్లు, మిగతా వార్తలైతే పూర్తిగాను చదువుతాను.

      Delete
  16. "'ఆనాదిగా ఆధునిక' సంస్కృతికి"

    Oxymoron? :)

    ReplyDelete
  17. Sort of.
    But, "ఆటోగ్రాఫ్ ఇచ్చుట, తీసుకొనుట అనునది ఆనాదిగా ఆధునిక సంస్కృతికి చిహ్నం". can be read as "autograph giving as well as taking is a long established (or well established) sign of modern or sophisticated culture".
    BSR

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.