Wednesday, 19 June 2013

ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి



"నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకుని మాత్రం పెళ్ళికి ఒప్పించాలి." నా ప్రాణస్నేహితుని విన్నపం. పాపం! మరీమరీ అడుగుతుంటే కాదనలేకపొయ్యాను. అంచేత ఇవ్వాళ ఆఫీసు నుండి డైరక్టుగా స్నేహితుడి కొంపకే తగలడ్డాను.

మావాడి పుత్రరత్నం లాప్ టాప్ లోకి తీవ్రంగా చూస్తూ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. వీణ్ని చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగాను. అంతలోనే ఎంతవాడైపొయ్యాడు!

"ఏవాఁయ్! పెళ్లి ఎందుకొద్దంటున్నావో తెలుసుకోవచ్చా?" అంటూ పలకరించాను.

"పెళ్లి చేసుకోవటం వల్ల లాభమేంటి?" కుర్రాడు క్విజ్ మాస్టర్లాగా ప్రశ్నించాడు.

"భలేవాడివే! అన్నీ లాభాలే. ఎలాగూ లాప్టాప్ ముందే ఉన్నావుగా. ఓసారి యూట్యూబులో నేచెప్పిన పాట పెట్టు." హుషారుగా అన్నాను.

"ఏ పాట?"

"దేవత అనే సినిమాలో 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' అని కొట్టు." అంటూ తొందరపెట్టాను.


"ఇదిగో కొడుతున్నా."




"పాట బాగానే వుంది. కానీ ఈ పన్లన్నీ నాక్కాబోయే భార్య చేస్తుందా?" సందేహంగా అడిగాడు. 

"ఎందుకు చెయ్యదు! మా ఆవిడ ఈ రోజుకీ నాకివన్నీ చెయ్యట్లేదా? అసలావిడ ఈ పాటలో సావిత్రికిలాగ నా తలని రోజూ అదేపనిగా దువ్వడం వల్లనే నాకీ బట్టతలొచ్చింది తెలుసా?" అంటూ నా బట్టతల రహస్యం విప్పాను.

"నిజంగా!" కుర్రాడి మొహంలో వెలుగు.

"మరేంటనుకున్నావ్? రౌతు కొద్దీ గుర్రం. అంతా మనలోనే ఉంది." రహస్యం చెబుతున్నట్లుగా అన్నాను.

"అయితే సరే. నేను పెళ్లి చేసుకుంటాను." సిగ్గుపడుతూ చెప్పాడు.

నా ప్రాణస్నేహితుడు గుమ్మడి స్టైల్లో నా రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

"నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను." డైలాక్కూడా గుమ్మడిదే!

టైం చూసుకుని హడావుడిగా ఇంటికి బయల్దేరాను.

హాల్లో సోఫాకి నిండుగా కూర్చునుంది నా భార్యామణి. రిమోట్ ని పుర్ర చేత్తో పట్టుకుని ఠపాఠపామంటూ చానెల్స్ మారుస్తుంది. నన్ను చూడంగాన్లే ఇంతెత్తున లేచింది.

"ఏవిటయ్యా ఇది? మనిషన్న తరవాత బుద్దీజ్ఞానం ఉండఖ్ఖర్లా? ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రాకుండా మధ్యలో నీ బోడి పెత్తనాలేంటి? ఇంట్లో పన్లన్నీ నీ బాబుగాడు చేస్తాడనుకున్నావా? ఇంత లేటుగా వస్తే అంట్లెప్పుడు తోముతావ్? వంటెప్పుడు చేస్తావ్?" అంటూ సూర్యకాంతంలా గాండ్రించింది.

"ఆఁ.. ఆఁ.. వచ్చె.. వచ్చె.. అయిపోయింది. ఎంతలో పని? చిటికెలో అవగొట్టనూ!" అంటూ వంటింట్లోకి పరిగెత్తాను.

(photo courtesy : Google)

18 comments:

  1. Ante oka vyakthi ni bakara chesi vachharu anna mata . aina e rojula lo kooda alanti matalu namme vallu unnara ?

    ReplyDelete
    Replies
    1. నాకీ పాట చాలా ఇష్టం. అందుకే పాట కోసం ఓ నాలుగు ముక్కలు రాశాను.

      (ఈ పాట నేటిరోజుల్లో మగవారికి ఒక "dream song" అని నా అభిప్రాయం!)

      Delete
    2. అవునండీ. ఇది మగవాళ్ళకో dream song అనే చెప్పాలి, తరాల అంతరం‌ లేకుండా.

      Delete
  2. వంద అబద్ధాలయినా ఆడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు!

    ReplyDelete
    Replies
    1. వంద కాదు, వెయ్యి అనుకుంటాను.

      Delete
  3. పాపం ఎందుకండి ఆ అబ్బాయికి అబద్ధాలు చెప్పి మీలాగే సంసార నరకానికి బలి చేసారు. ఇదన్యాయం కదా... కాస్త మా అబ్బాయిని కూడా ఒప్పించరూ!! :)

    ReplyDelete
    Replies
    1. అదో తుత్తి.

      (మన ఒక్కళ్ళింట్లోనే కరెంట్ పోతే బాధగా ఉంటుంది. అదే ఊరంతా పోతే పెద్ద బాధ ఉండదు.)

      Delete
  4. హహ్హహ్హాహ్హ.. బావుందండీ!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ.

      (సావిత్రి ఫొటో కూడా బాగుంది కదూ!)

      Delete
    2. అదేమిటండీ, సావిత్రిగారి ఫోటొ బాగుండకపోవటం అంటూ కూడా ఉంటుందా, చిత్రంగా మాట్లాడుతున్నారే?
      కావ్యభాషలో చెప్పాలంటే సావిత్రిగారి ఫోటో బాగుంది అనటం పునరుక్తి దోషం క్రిందికి వస్తుంది!

      Delete
  5. hahahaaha haha ...........

    ReplyDelete
  6. "ఇలా ఎన్ని అబధ్ధాలతో ఎందరిని మభ్యపెట్టారో.. అందుకే మీకిలాంటి భార్య వచ్చింది" ఈ పోస్టు చదివిన పాఠకుడు మనసులో అనుకున్నాడు.

    ReplyDelete
    Replies
    1. అబద్దాలు చెబితే ఆడపిల్లలు పుడతారంటారు.

      (ఇప్పుడు మీరు కొత్తగా ఇంకోటి పుట్టిస్తున్నారు!)

      Delete
  7. మీ పాటకి మా కౌంటర్. "భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ.. భర్తగ మారకు బాచిలరు..షాదీ మాటే వద్దుగురూ.. సోలో బతుకే సో బెటరు.."

    ReplyDelete
  8. హమ్మయ్య Back to form... :D మీరు ఇలాంటి టపాలు రాసి ఆబాలగొపాలాన్ని అలరించాలని కొరుకుంటూ
    -మీ విసినకర్ర

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! నాక్కూడా ఇలానే రాయాలని ఉంటుంది.

      (అయితే నాలోని 'సామాజిక స్పృహ', 'రాజకీయ చైతన్యం' నన్ను నిద్ర లేపి, భుజం తట్టి "తెలుగువీర లేవరా! సీరియస్ పోస్ట్ రాయరా!" అంటూ పురిగొల్పుతూ ఉంటాయి.)

      Delete
  9. పాపం అందరు ఇలాగే అనుకోని దిగుతారు. తరువాత కాని తెలియదు చేసిన తప్పు, కాని అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది . అప్పటికే ఒకళ్ళో ఇద్దరో పుదతారు. ఇంకేముంది అంతా compromise !

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.