Thursday 6 June 2013

అంతా ఇంతే


"మనం మావోయిస్టు సమస్యకి పరిష్కారం వెతకాలంటే సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. మావోయిజం అంతానికి అభివృద్ధే మందు. ప్రభుత్వం ఆదివాసీల హక్కుల్ని పరిరక్షించాలి. వారికి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక షెడ్యూల్స్ అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలి. కార్పోరేట్ శక్తుల్ని కట్టడి చెయ్యాలి. ఆదివాసీలకి విద్య, ఆరోగ్యం, ఉపాథి పథకాలు చేరువ కావాలి. ఇవన్నీ ఆదివాసీల ప్రాధమిక హక్కుగా.... " 

ఒక కళ్ళజోడు గడ్డపాయన ఆవేశంగా చెబుతున్నాడు. అది చత్తీస్ గఢ్ మావోయిస్టుల మీద ఒక తెలుగు టీవీ చానెల్లో చర్చాకార్యక్రమం. నాకాయన మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. అమాయకత్వమూ కనిపిస్తుంది.

ఇట్లాంటి మాటలు ఇంతకు ముందు ఎక్కడో విన్నానే. ఎక్కడ? ఎక్కడబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఇవి ఒకప్పుడు మా ప్రొఫెసర్ మాటలు. ఈ కళ్ళజోడు గడ్డం మాటలకి మా ప్రొఫెసర్ గారికీ లింకేమిటి చెప్మా!

ఎవరికీ ఏదీ అసందర్భంగా గుర్తుకు రాదు. ఇక్కడ కూడా ఈ జ్ఞాపకానికి లింకుంది. నాకు రాజకీయాలు పెద్దగా తెలీదు. వాటి గూర్చి లోతుల్లోకి వెళ్లి అర్ధం చేసుకునే ఓపికా లేదు. అందుకే నా అనుభవాల ఆధారంగా రాజకీయాల్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తుంటాను.

ఇప్పుడు కొద్దిసేపు ఫ్లాష్ బ్యాక్. అవి నా గుంటూరు మెడికల్ కాలేజ్ రోజులు. పరీక్షలు ముంచుకొస్తున్నాయి. స్నేహితులం పడీపడీ చదువుతున్నాం. విపరీతమైన టెన్షన్. ఆ రోజుల్లో మాకో పాలసీ ఉండేది. పరీక్షలు కూతవేటు దూరంలోకి వచ్చేదాకా సినిమాలు, కబుర్లు, షికార్లతో కాలక్షేపం చేసేవాళ్ళం. పరీక్షలప్పుడు నిద్రాహారాలేం ఖర్మ? స్నానం, గడ్డం కూడా మానేసి చదివేవాళ్ళం.

పరీక్షలకి తీవ్రంగా ప్రిపేర్ అవుతూ వడలిపోయి, పాలిపోయి, డస్సిపోయి, నలిగిపోయున్న మమ్మల్నిచూసి మా ప్రొఫెసర్ గారొకాయన బోల్డు జాలి పడ్డాడు. కారణం కనుక్కుని మమ్మల్ని ఓదార్చుటయే తన కర్తవ్యంగా భావించారు.

ఆయన చాలా నిదానస్తుడు. ఉత్తముడు. మంచి టీచర్. గొప్ప సర్జన్. వారు చక్కటి ఆంగ్లంలో మమ్మల్నీ విధంగా ఓదార్చారు (ఆయన ఆంగ్లాన్ని నా తెలుగు అనువాదంలో చదువుకోండి).

"సంవత్సరం పొడుగుతా రోజూ తొమ్మిదింటికల్లా ఆస్పత్రికి వచ్చేయ్యాలి. కేసులు థరోగా ఎక్జామిన్ చేసి డీటైల్డ్ గా ప్రెజెంట్ చెయ్యాలి. క్లాస్రూం లెక్చర్స్ శ్రద్ధగా వినాలి. ఏ రోజు టాపిక్ ఆ రోజు చదివెయ్యాలి. అంటే రోజూ లైబ్రరీలో కనీసం నాలుగ్గంటలు చదవాలి. వెరీ సింపుల్! ఇంక భయం దేనికి?"

"అయినా భయమేస్తుంది సర్!" ఒకడు నసిగాడు.

"అస్సలు భయపడొద్దు. థియరీ వివరంగా, నీట్ గా, పాయింట్లవారిగా రాయండి. లాంగ్ కేస్ బాగా చెయ్యండి. షార్ట్ కేస్ చక్కగా చెయ్యండి. వైవాలో ఎక్జామినర్స్ అడిగిన ప్రశ్నలకి కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పండి. అంతే! వెరీ సింపుల్! ఇంక భయం దేనికి?" అంటూ మా వాడి భుజం ఆప్యాయంగా తట్టారు.

'మా కళ్ళు తెరిపించారు సర్!' అన్నట్లు ఓ వెధవ నవ్వొకటి పడేసి బయటపడ్డాం. ఐదు నిమిషాల తర్వాత క్యాంటీన్లో తేలాం. ఒక మంచి కాఫీ తాగుతుంటే గానీ ప్రొఫెసర్ చెప్పింది అర్ధం కాలేదు. అర్ధమయ్యాక అందరం పెద్దగా నవ్వుకున్నాం.

"పాపం. పెద్దాయన మరీ మంచివాడు. అందుకే మనకి చిన్న పిల్లలకి చెప్పినట్లు చెప్పాడు. సంవత్సరం అంతా చదివితే పాసేం ఖర్మ. గోల్డ్ మెడలే వస్తుంది. ఆ మాత్రం మనకి తెలీదా? ఇక్కడ మనకెన్ని పన్లున్నయ్! సినిమాలెవరు చూస్తారు? అందమైన అమ్మాయిలకి లైనెవరేస్తారు? ఒకటా రెండా? ఎన్నిపన్లు! ఇన్ని పన్ల మధ్యన చదువుకోటానికి టైముండొద్దు! అయినా ఆయన అంత గొప్ప ప్రొఫెసర్ గదా! మరీ ఇంత అమాయకంగా, ఛాదస్తంగా మాట్లాడాడేంటబ్బా!"

ఆయన సుభాషితాలు అప్పుడే కాదు.. తరవాత కూడా గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకునేవాళ్ళం.

ఇన్నాళ్ళకి మళ్ళీ మా ప్రొఫెసర్ వంటి ఉత్తముణ్ని టీవీలో చూస్తున్నాను. మన టీవీ పెద్దమనిషి మాటలు వింటే రాహుల్ గాంధీ, రమణ్ సింగ్ లు ఏమనుకుంటారు? బహుశా మేం ఆ రోజు క్యాంటీన్లో కాఫీ తాగుతూ నవ్వుకున్నట్లు విరగబడి నవ్వుకుంటారు. తర్వాత ఇలాగనుకుంటారు (వారి హిందీని నా తెలుగు అనువాదంలో చదువుకోండి).

"ఎవడీ వెర్రిబాగులవాడు? వీడెవడో ఓ పనికిమాలిన మధ్యతరగతి మేధావి వలే ఉన్నాడు. వాళ్ళు మాత్రమే ఇంత అమాయకత్వంలో బ్రతికేస్తుంటారు.. టీవీ డిబేట్లలో ఆవేశపడుతుంటారు. ఆదివాసీల జీవితాల్ని ఉద్ధరించాలట! ఆ మాత్రం మనకి తెలీదా!" అన్నాడు చికాగ్గా రాహుల్ గాంధీ.

"మనం ఎన్నెన్ని స్కాములు చెయ్యాలి? ఎన్నెన్ని కోట్లు వెనకేసుకోవాలి. మనం ఉద్ధరించాల్సింది మైనింగ్ కార్పోరేట్లని.. ఆదివాసీల్ని కాదు. వీడెంతుకింత గొంతు చించుకుంటున్నాడు? పాపం! ఈ వెర్రిబాగులవాడి వల్ల వీడి భార్యాపిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారోగదా!" జాలిగా అన్నాడు రమణ్ సింగ్.

(photo courtesy : Google)

8 comments:

  1. మీరు రెంటికీ ముడిపెట్టిన విధానం :) One of the best from you :))

    ReplyDelete
  2. Ramana gaaru
    I did not like this post. మీరు రెంటికీ ముడిపెట్టిన విధానం baaga ledu.

    ReplyDelete
  3. కాస్తో కూస్తో సరుకున్న మనల్ని పుట్టుక ఒక్కటే అర్హతని భావిస్తున్న రాహుల్ తో పోల్చావా!!! సరి సరి

    ReplyDelete
  4. రాహుల్ రమణ్ సింగ్ లే కాదండి, భారత రాజకీయ నాయకులంతా అలాగే నవ్వుకుంటున్నారు.

    ReplyDelete
  5. డాక్టరుగారు,
    మీరు రాసే విషయాలు , ఎవరైన జనాకర్షణ కలిగినవాడు ఈ జనాలకి చెబితే బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడు ఈ కొండ జనాల్లొ (నతో సహా ) కొద్దిగ మందైనా అలొచించటం మొదలు పెడతారెమొ. జనాకర్షణ అని ఎండుకంటున్నానంటె, పాపం , జేపీ లంటి వాళ్ళు చెబుతుంటె ఎలాగూ వినటంలేదు. మనకి ఎప్పుడూ తీయ్యటి అబధాలు చెపే వాళ్ళె నచుతారు.

    కృష్ణ

    ReplyDelete
  6. కామెంటిన మిత్రులకి ధన్యవాదాలు.

    చాలా limited point తో ఈ టపా రాశాను. ఇప్పటి రాజకీయ నాయకులు చాలా తెలివైనవారు. చిన్నస్థాయి నాయకుడిక్కూడా చాలా రాజకీయ అవగాహన ఉంటుంది. వారికి సమస్య మూలాలు తెలుసు, పరిష్కారమూ తెలుసు. అయితే వారికున్న ఆర్ధిక, రాజకీయ కారణాల వల్ల అర్ధం కానట్లు నటిస్తుంటారు.. సమస్యని పక్కదోవ పట్టిస్తారు. వారికది చాలా సుఖం!

    బాగా చదువుకుని.. వారివారి రంగాల్లో నిష్టాతులై ఉండికూడా.. రాజకీయంగా అమాయకులైనవార్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. రాజ్యాన్ని నడిపించే రాజ్యాంగ శక్తుల శక్తియుక్తుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ప్రజలకి మంచి చెయ్యడానికన్నా.. మంచి చేస్తున్నట్లు నటించడానికి చాలా తెలివితేటలు కావాలి.

    ReplyDelete
  7. Manganese mine workers near Goberwahi in Maharashtra get only Rs 100 per day. For them, agriculture is more profitable than mining. Private companies want only cheap labour and the farmers don't want to turn as labours. That's the contradiction here.

    ReplyDelete
  8. amayya ramanayya, toti doctors bagulu bagulu sommu dandukontumte, barya biddala, rogula bagogulu chustunnavo ledo kani, ee blagula venta padda ventayya ramanayyaa - mee veerabhimani

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.