Friday 17 October 2014

అందం అందరికీ ఆనందమే! నాకు మాత్రం ఏడుపు!!


నాకు సమయం దొరికినప్పుడు పాత తెలుగు సినిమా పాటల్ని యూట్యూబ్‌లో చూస్తూ ఆనందించడం అలవాటు. ఇవ్వాళ కూడా ఓ పాత పాట చూడ్డం మొదలెట్టాను.

అది నాగేశ్వర్రావు, సావిత్రిల 'అందమే అనందం, ఆనందమె జీవిత మకరందం'  పాట. ఆడియో బాగుంది గానీ - వీడియో స్పష్టంగా లేదు.

అహాహా! ఘంటసాల స్టోనే స్టోనే గదా! సావిత్రి అందమే అందం కదా! నాగేశ్వర్రావు స్టైలే స్టైలు కదా!

తన్మయత్వం చెందుతూ (అలవాటు చొప్పున) మైమరచిపోదామనుకుంటుండగా -

గుండె కలుక్కుమంది, హృదయం భళుక్కుమంది. మనసులో ముల్లు గుచ్చుకుంది, కంట్లో నలక పడింది. బాధ, దుఃఖం, దిగులు, ఏడుపు జమిలిగా మనసుని ఆవహించాయి.

ప్రేమానుభూతిని ఇట్లాంటి పాటల్లో చూసి ఆనందించడమే గానీ, నేనెప్పుడూ అనుభవించి ఎరుగను. వలపు అనునది మైసూరు పాకము వలే తీయగానూ, విరహం అనునది మైసూరు బోండా వలే వేడిగానూ వుండునని కృష్ణశాస్త్రి, ఆత్రేయలు రాస్తే - సైన్సు పాఠంలాగా చదువుకున్నానే గానీ.. అనుభవిస్తే ఎలా వుంటుందో తెలీదు. ఆఖరికి మిస్సమ్మలో మిస్ మేరీ కూడా రామారావు పుణ్యమాని సినిమా చివర్లో వెన్నెల మహిమని అనుభవించింది, మంచి పాట కూడా పాడింది. నాకాపాటి అదృష్టం కూడా లేదు!

ఈ లోకంలో కొందరు వెధవలుగా పుడతారు, వెధవలుగానే బ్రతుకుతారు, వెధవలుగానే ఛస్తారు. అట్టి వెధవాయిల్లో నేను ముందు వరసలో వుంటాననే (వున్నాననే) అనుమానం (ఒక్కోసారి నమ్మకం) నన్ను హచ్ కుక్కలా వెంటాడుతుంది.

నేనేం పాపం చేశాను?

బరువుగా, భారంగా నిట్టూర్చాను. దీనంగా, దీర్ఘంగా ఆలోచించసాగాను.

ఓయీ దురదృష్ట మానవా! ఒక్కసారి వెనక్కి తిరిగి నీ జీవితాన్ని రివ్యూ చేసుకో. ఇప్పుడు నీకో క్లిష్టమైన ప్రశ్న! నీదసలు జీవితమేనా?

ముక్కుతో గాలి పీల్చుకోడం, కళ్ళతో ప్రపంచాన్ని చూడ్డమే జీవితం అయితే నీది జీవితమే! నోటితో అడ్డమైన గడ్డీ తిండం, చేతుల్తో వీపు గోక్కడం జీవితమైతే నీది జీవితమే!

మహాకవి శ్రీశ్రీ 'మనదీ ఒక బ్రతుకేనా? కుక్కలవలె నక్కలవలె!' అంటూ ఒక చేదుపాట రాశాడు. అది నీలాంటి వాళ్ళ గూర్చే! చదువుకోలేదా?

నీ జీవితం అడవి గాచిన వెన్నెల! బూజు పట్టిన నిమ్మకాయ పచ్చడి! అమ్ముడుపోని సినిమా టిక్కెట్టు! ముక్కు తుడుచుకుని అవతల పడేసిన టిష్యూ పేపర్!

జీవితంలో నువ్వు సాధించిందేమిటి? నీకు మిగిలిందేమిటి?

శంకర విలాస్ సెంటర్లో మిరపకాయ బజ్జీలు, ఆనంద భవన్లో మసాల దోసెలు, బాబాయ్ హోటల్లో నేతి ఇడ్లీలు.. ఛీఛీ వెధవా! నీ జీవితానికి అర్ధం లేదు.

జ్యోతీలక్ష్మి డ్యాన్సుల కోసం, రామారావు కత్తియుద్ధం కోసం సినిమాలు చూడ్డం.. మునిసిపాలిటీ వర్క్ ఇన్‌స్పెక్టర్లాగా రోడ్లన్నీ బలాదూరుగా తిరగడం.. ఛీఛీ దరిద్రుడా! నీ బ్రతుకు వృధా!

ఓయీ కుళ్ళికుళ్ళి ఏడ్చు కుళ్ళు మానవా! కాలము గుంటూరు రియల్ ఎస్టేట్ భూమివలె విలువైనది! భానుమతి పాటవలె అపురూపమైనది! ఇక నీవెంత విలపించిననూ, దుఃఖించిననూ ఊడిన నీ జుట్టు రాదు, వచ్చిన నీ కీళ్ళరోగం పోదు. రాహుల్ గాంధీ వలె స్వప్నములో విహరింపకుము! యధార్ధము గ్రహింపుము. కర్తవ్యోన్ముఖుడవు కమ్ము.

(కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకుని.. దీర్ఘముగా గుండెల నిండా నాలుగుసార్లు గాలి తీసుకుని)

ప్రార్ధన -

భగవాన్! వచ్చే జన్మలోనైనా నన్ను పియానో వున్న కొంపలో పుట్టించు. నాకా పియానో పలికించగలిగే సంగీతానివ్వు. నాగేశ్వర్రావుకున్న రొమేంటిక్ ఫేసునివ్వు. జూనియర్ సముద్రాలకున్న కవిత్వాన్నివ్వు. ఘంటసాలకున్న మధుర గంభీర తేనెలూరు స్టోన్‌ని ఇవ్వు.

ఇక చివరి కోరిక -

నా పాట వింటూ - మత్తెక్కించే ఓరచూపుతో అలవోకగా చూస్తూ పిచ్చెక్కించే బూరెబుగ్గల సావిత్రిని నాకు గాళ్ ఫ్రెండుగా ఇవ్వు (నా అసలు కోరిక ఇదే).

ఇంకో ముఖ్యమైన కోరిక - 

ఆ నాగేశ్వర్రావు నా చుట్టుపక్కల లేకుండా చూడు (నాకు కాంపిటీషన్ లేకుండా చెయ్యి)!

ముగింపు -

నీ ఏడుపు ఓపిగ్గా చదివాం. ఒక డౌటు. వచ్చే జన్మ కోరికల్ని ఇప్పుడే రాసుకోడం దేనికి?

దేనికంటే - 

వచ్చే జన్మలో ఈ బ్లాగు మళ్ళీ నేనే చదువుకున్నట్లైతే - అప్పుడీ సంగతులన్నీ జ్ఞాపకం వస్తాయని! మూగమనసులు సిన్మా చూళ్ళేదా?

(picture courtesy : Google)

15 comments:

  1. end punch adurs

    ReplyDelete
  2. రమణగారూ, మీ పూర్వజన్మసృతుల సిధ్ధాంతాన్ని నేను ముందే పసిగట్టి మీకో సమర్థనగా ఉండటానికి గాను పగబట్టిన మేక అనే తేటగీతాల కథను వ్రాసేసాను రెండు రోజుల ముందుగానే. అందులో మేకని పులిని చేసి పారేసాను కాబట్టి రావిశాస్త్రులుగారికి నచ్చుతుందో లేదో కాని మీ కైతే కొంచెం నచ్చవచ్చును.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      ఇప్పుడే చదివాను. బాగుంది. మరీ ముఖ్యంగా ఈ పంక్తులు -

      పులిని క్రూరజంతు వటంచు పలుకుదురటె
      క్రూరజంతువు మనిషియే కువలయమున

      Delete
  3. /ఓయీ కుళ్ళికుళ్ళి ఏడ్చు కుళ్ళు మానవా! /
    అయినా మీకు ఈ మధ్య ఇంఫీరీయారిటి కాంప్లెక్సు వచ్చి నట్టుంది. మొన్నేమో జయలలిత మీద, ఈ రోజేమో సావిత్రిగారి మీద, ఆ మధ్య హేమా మాలిని మీద అందరూ మీకు గార్ల్‌ ప్రెండ్స్‌ కావాలా? మీరు మాంచి సైకీయాట్రిస్టును కన్సల్ట్‌ చేస్తే మంచిదేమో! :):)

    ReplyDelete
    Replies
    1. ఈ మాత్రం దానికి సైకియాట్రిస్టు ఎందుకులేండి - అదో దండగ!

      నిద్రమాత్రల డోసు పెంచితే సరి!

      Delete
  4. నా పాట వింటూ - మత్తెక్కించే ఓరచూపుతో అలవోకగా చూస్తూ పిచ్చెక్కించే బూరెబుగ్గల సావిత్రిని నాకు గాళ్ ఫ్రెండుగా ఇవ్వు (నా అసలు కోరిక ఇదే).

    You are frank enough to express this. This line is dominating the entire post.

    ReplyDelete
    Replies
    1. తెలివైనవారు, కనిపెట్టేశారు!

      Delete

  5. >>>
    శంకర విలాస్ సెంటర్లో మిరపకాయ బజ్జీలు, ఆనంద భవన్లో మసాల దోసెలు, బాబాయ్ హోటల్లో నేతి ఇడ్లీలు..

    ఇవన్నీ తిన్నాక కూడ మీకు జీవితం చేదు గా అనిపించింది అంటే , మీరు వెంటనే సైకియాట్రిస్ట్ ఎవరి నైనా గాని వెంటనే కలవాల్సిందే నండీ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      నాకీ సైకియాట్రిస్టుల మీద నమ్మకం లేదండి. దగ్గర్లోనే తాయెత్తులు కట్టే సాయిబుగారున్నారు. ఆయన్ని సంప్రదిస్తాను. :)

      Delete

    2. సైకియాట్రిస్టు గారికో చిక్కు ప్రశ్న ! - అదెందు కండీ , తాయెత్తుల కి సాయెబు తాయెత్తులకే విలువ ఎక్కువ ?

      (మీరు ఈ కామెంటు కి మరో టపా రాస్తారని ఆశిస్తో !!

      జిలేబి

      Delete
    3. జిలేబి జీ,

      అవును. ఉడిపి హోటళ్ళకి మల్లె! కారణం నాకూ తెలీదు.

      అయితే - తాయెత్తులు కట్టేవాళ్ళు సమాజానికి మేలు చేస్తున్నారనే నా అభిప్రాయం.

      Delete
  6. సావిత్రిని చూస్తే అటువంటి ఫీలింగ్స్ కలుగుతాయా? నేను ఎవరి దగ్గరా ఈ మాట వినలేదు.
    నాకైతే ఆమెని చూస్తే గౌరవం, భక్తి లాంటి ఫీలింగ్స్ కలుగుతాయి.

    ReplyDelete
    Replies
    1. బోనగిరిరి గారు,

      ఈ పాటలో వున్న సావిత్రి టీనేజ్ అమ్మాయి, అందువల్ల - ఫీలింగ్స్ కూడా అలాగే వుంటాయి.

      (కోమాలో వున్న సావిత్రి బొమ్మని చూసి ఏడుస్తూ ఒక పోస్ట్ రాశాను.)

      Delete

comments will be moderated, will take sometime to appear.