Monday 20 October 2014

పవిత్ర భారతనారి


"ఇది హిందూదేశం, పవిత్ర భారత దేశం. స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం. స్త్రీ శక్తిస్వరూపిణి. ఆదిపరాశక్తి. ప్రపంచంలో స్త్రీని దేవతగా పూజించే దేశం ఏదన్నా వుందీ అంటే - అది మన భారత దేశమే. ఇట్టి సర్వోన్నతమైన దేశంలో జన్మించినందుకు నాకు గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. హృదయం ఆనందంతో ఆవిరైపోతుంది. ఒక్కోసారి సంతోషం ఎక్కువై కళ్ళు తిరుగుతుంటాయి, నరాలు పీకుతుంటాయి కూడా!"

"అవునా? మరి ఈ దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కదా!"

"అవును. ఇది మిక్కిలి ఖండనీయము, శోచనీయము. కొందరు దుర్మార్గుల వల్ల మన పవిత్ర భారద్దేశానికి చెడ్డ పేరొస్తుంది. ఈ దుస్థితి తల్చుకుని రోజూ కనీసం ఒక గంటయినా గుక్కపెట్టి ఏడుస్తుంటాను."

"అయితే మీ భార్య చాలా అదృష్టవంతురాలు. ఇంతటి ఉన్నతమైన భావాలు కలిగిన మిమ్మల్ని భర్తగా పొందిన ఆమె స్వేచ్ఛగా హేపీగా వుండి వుంటారు! యామై రైట్?"

"అవును! నా భార్య ఎంతో స్వేచ్ఛగా, హేపీగా నాకు సేవ చేస్తుంటుంది."

"నే చెప్పే స్వేచ్ఛ అది కాదు. మీ భార్య తనకిష్టమైన పన్లు తనకిష్టమొచ్చిన రీతిలో చేసుకోవచ్చని!"

"కొంచెం విడమర్చి అడిగితే సమాధానం చెబుతాను."

"అలాగే! ఉదాహరణకి - మీ భార్య చీర కొనుక్కోవాలనిపించిందనుకోండి, హాయిగా షాపుకెళ్ళి తనకిష్టమైన చీర కొనేసుకోవచ్చు."

"నోనో! నా భార్యో పిచ్చి మొద్దు. దానికి ఒళ్ళు కనపడే పల్చటి చీరలు కట్టుకోకూడదని తెలీదు, తనకే రంగు చీర నప్పుతుందో కూడా తెలీదు, ఎంత రేటులో కొనుక్కోవాలో అస్సలు తెలీదు. అందుకే దాన్ని వెంటబెట్టుకుని మరీ షాపుకి తీసుకెళ్ళి - నేనే దగ్గరుండి చీరలు సెలెక్ట్ చేస్తాను. అయినా భారత నారికి పతియే ప్రత్యక్ష దైవం. అంచేత ఆ దైవం సెలెక్ట్ చేసిన బట్టలే కట్టుకోవాలి. అది రూలు!"

"మరి - మీ భార్యకి స్నేహితుల్తో సరదాగా కబుర్లు చెప్పుకునే స్వేచ్ఛ... "

"నా భార్య పరాయి మగాణ్ని కన్నెత్తి చూడదు. ఇక ఆడ స్నేహితులంటారా? ఈ వీధిలో ఆడవాళ్ళ నడత మంచిది కాదు. అందరూ లూజ్ కేరక్టర్లే! నా భార్య నిప్పే! కానీ మనం జాగర్తగా లేకపోతే ఆ నిప్పుక్కూడా చెదలు పడతాయి! అందుకే నా భార్యని వాళ్ళతో కలవనివ్వను!"

"..................................."

"అడగడం ఆపేశారేం? ఇంకా అడగండి!"

"అడగడానికింకేం లేదు."

"సర్లేండి! నా హృదయంలోంచి ఉప్పొంగుతున్న భావాల్ని మరొక్కసారి చెప్పనివ్వండి. ఇది హిందూదేశం, పవిత్ర భారత దేశం. స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం. స్త్రీ శక్తిస్వరూపిణి. ఆదిపరాశక్తి. ప్రపంచంలో స్త్రీని దేవతగా పూజించే దేశం ఏదన్నా వుందీ అంటే - అది మన భారత దేశమే. ఇట్టి సర్వోన్నతమైన దేశంలో జన్మించినందుకు నాకు గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. హృదయం ఆనందంతో ఆవిరైపోతుంది. ఒక్కోసారి సంతోషం ఎక్కువై కళ్ళు తిరుగుతుంటాయి, నరాలు పీకుతుంటాయి కూడా!"

(picture courtesy : Google)

9 comments:

  1. చెప్పేవన్నీ శ్రీరంగనీతులు.... దూరేవన్నీ .... అని,
    ఇంకా ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ అనిన్నూ
    మన వాళ్ళు అచ్చుపై ఎప్పుడో చెక్కినారూఊ ఊ (ఇందాకే శిలలపై శిల్పాలు పాట విన్నా!) అదీ సంగతి!
    గౌతం

    ReplyDelete
    Replies
    1. రాత్రి కొద్దిసేపు చలం గుర్తొచ్చాళ్ళే!

      Delete
  2. ఎవరూ ఆట్టే బెంగపడకండి మహిళామణులారా. మరొక నూఱేళ్ళ తరువాత జరగబోయేది మగవాళ్ళ హక్కులకోసం పోరాటం. కొద్ది మంది విప్లవవనితలే దానికి నాయకత్వం వహిస్తారు.

    ReplyDelete
    Replies
    1. అవునా , ఈ నూరేళ్ళు ఏం చెయ్యాలి శ్యామలీయమ్ గారూ

      Delete
    2. త్వరలో రాబోయే పరిస్తితి గురించి లొట్టలేస్తూ ఆడోళ్ళు ఏడుస్తూ మగాళ్ళు ఎదురు చూడాలి!

      Delete
    3. ఆ మాత్రం తెల్వద్? గోళ్ళు కొరుక్కుంటూ తొంగోడమే. ఇందులో ఏంది మీ పరేషాన్?

      Delete
  3. అవునవును , వాళ్ళు ఎంతసేపైనా రాజకీయాలు , క్రికెట్ట్ గురించి చర్చలు చెయ్యొచ్చు . వీళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకొంటే కొంప కొల్లేరయినట్లే :)

    ReplyDelete
  4. //దాన్ని వెంటబెట్టుకుని మరీ షాపుకి తీసుకెళ్ళి - నేనే దగ్గరుండి చీరలు సెలెక్ట్ చేస్తాను//
    మనమే సెలెక్ట్‌ చెయ్యటానికి మళ్ళీ అదెందుకులెమ్మని మా ఆవిణ్ణి చీరల షాప్‌ చుట్టు పక్కలకు రానివ్వను. వస్తే మాత్రం దానిమొహం దానికేమీ తెలుసు చీరలు సెలెక్ట్‌ చెయ్యడానికి, తెలిస్తే మాత్రం అక్కడ ఎన్ని కళ్ళుచూస్తూంటాయి ఆడ వాళ్లను. అయినా నాకు తెలియిక అడుగుతాను. సార్‌, మనపవిత్ర భారత దేశంలో అధికారం అన్నది ఒకే స్వభావం కలిగి ఉంటుంది అది కింది స్థాయి మనుషుల్ని( అందులో భార్యలు భాగమే కధా!) ఎలా చూడాలో అలానే చూడాలి, లేకపోతే మరీ కళ్ళు నెత్తిమీదకు రావు. మన పవిత్ర భారతదేశ అడ్మినిస్ట్రషన్‌ అలా ఉండాలని మన పూర్వికులు చెప్పారుకధా!

    ReplyDelete
  5. కామెంటిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    కొడవటిగంటి కుటుంబరావు (మొదట్లో) చలం ప్రభావంతో కొన్ని కథలు రాశాడు. పొట్టిగా, వ్యంగ్యంగా, పదునుగా వుంటాయా కథలు. ఇవ్వాళ నేనూ ఒక ప్రయత్నం చేశాను.

    (తెలుగు సాహిత్యంలో ఇట్లాంటి దొంగవెధవలకి ఆద్యుడు గురజాడవారి గిరీశం.)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.