Wednesday, 21 January 2015

రచయితలకి రక్షణ లేదా?


పెరుమాళ్ మురుగన్ అనేది స్వచ్ఛమైన తమిళ పేరు, ఇంకే భాషలోనూ వుండదు. పేరుకి తగ్గట్టుగానే పెరుమాళ్ మురుగన్ కూడా తమిళంలోనే రచనలు చేశాడు, ఇంకే భాషలోనూ రాయలేదు. నాలుగేళ్ళ క్రితం పెరుమాళ్ మురుగన్ రాసిన తమిళ రచనని ఈమధ్యే ఇంగ్లీషులోకి అనువదించారు - అదే ఆయన కొంప ముంచింది.

ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం రాసిన ఈ పుస్తకానికి ఇప్పుడెందుకు నిరసన? వారి అభ్యంతరం అనువాదం పట్లనేనా? కారణం ఏదైనా - పెరుమాళ్ మురుగన్ ఇంకెప్పుడూ రచనలు చెయ్యనని ఒక ప్రకటన ఇచ్చాడు. ఆల్రెడీ మార్కెట్లో వున్న పుస్తకాల్ని కూడా ఉపసంహరించుకున్నాడు. ఇదంతా జిల్లాస్థాయి అధికారుల అధ్వర్యంలో బలవంతంగా జరిగిందని పత్రికలు రాశాయి .

రచయితలు నానావిధాలు. ఆవకాయ దగ్గరనుండి అమెరికా దాకా అన్ని సబ్జక్టులపైనా సరదాగా కాలక్షేపం కోసం రాసేవాళ్ళు కొందరైతే - మరికొందరు మన ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాల గూర్చి మురిసిపోతూ పులకించిపోతూ రాస్తుంటారు. తద్వారా కొంతమంది అభిమానుల్ని సంపాదించుకుని - వాడవాడలా తమవారితో పొగిడించుకుంటూ, శాలువాల సన్మానాలు చేయించుకుంటూ సత్కాలక్షేపం చేస్తుంటారు. ప్రభుత్వాల దృష్టిలో ఈ శాలువా రచయితలే జాతి పరిరక్షకులు!

కొందరు రచయితలకి సమాజంలోని స్టేటస్ కో నచ్చదు,  అసమానతల్ని అసహ్యించుకుంటారు. ఈ సమాజం ఇలా ఎందుకుందని మధనపడతారు. అందుగ్గల కారణాల్ని విశ్లేషిస్తూ సీరియస్ సాహిత్యాన్ని సృష్టిస్తారు. సాహిత్యం ప్రజల బాగు కోసమేనని వారి నమ్మకం. వీరు అవార్డుల్ని పట్టించుకోరు, పైగా వాటికి దూరంగా వుంటారు. ప్రభుత్వాలకి ఈ బాపతు రచయితలంటే భలే అనుమానం.

డబ్బు కోసం రాసుకునే రచయితల సంగతేమో గానీ - తాము నమ్మిన విషయాల్ని నిక్కచ్చిగా రాసే రచయితలు - తమ రచనల పట్ల చాలా పేషనేట్‌గా వుంటారు. చాలా సీనియర్ రచయితలు కూడా ఫలానా మీ రచనలో ఫలానా లైన్లు బాగున్నయ్యంటే చిన్నపిల్లాళ్ళా ఆనందిస్తారు. కొందరు రచయితలయితే తమ పుస్తకాల్ని కన్నపిల్లల్లా సాకుతుంటారు. ఈ నేపధ్యంలో - ఒక రచయిత తనకు తానుగా మరణ శాసనం రాసుకున్నాడంటే - అతనెంత ఆవేదన చెందాడో అర్ధం చేసుకోగలను.

రచయితలెప్పుడూ సాఫ్ట్ టార్గెట్లే. అందుకే మతం ముఠాలు, కులం గ్రూపులు వీరినే లక్ష్యంగా ఎంచుకుంటాయి. ఉదాహరణకి - సల్మన్ రష్దీ రాసిన పుస్తకం తమ మతవిశ్వాసాలకి విరుద్ధంగా వుందనీ, నిషేధించాలని కొన్ని ముస్లిం సంస్థలు ఆందోళన చేశాయి. మైనారిటీ వోట్లకి ఎక్కడ గండి పడుతుందోనన్న భయంతో కేంద్రప్రభుత్వం హడావుడిగా పుస్తకాన్ని నిషేధించింది (ప్రపంచంలో 'సటనిక్ వెర్సెస్‌'ని నిషేధించిన మొట్టమొదటి దేశం మనదే)! ప్రభుత్వం సల్మాన్ రష్దీ పుస్తకాన్ని నిషేధించకపోయినట్లైతే? అయినా నష్టం లేదు - ఆయా మతసంస్థల వారికి కావలసింది పబ్లిసిటీ, అదెలాగూ వచ్చేసింది! అంటే ఇది - ఏ రకంగా చూసినా ఇది ఒక 'విన్ విన్ సిట్యువేషన్' అన్నమాట!

సల్మన్ రష్దీ అంతర్జాతీయ రచయిత కాబట్టి ఆయన ఏదోక దేశంలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఒక చిన్న ఊళ్ళో నివసించే రచయితకి ఆ అవకాశం వుండదు, ఇంకా చెప్పాలంటే ఆ రచయితకి దిక్కూదివాణం వుండదు. అందుకు మంచి ఉదాహరణ - ఈ పెరుమాళ్ మురుగన్‌. ఆయనేదో రాశాడు. ఆయన్రాసింది ఒక మతంవాళ్ళకి నచ్చలేదు. ఓ పదిమందిని కూడేసి ఆయన పుస్తకాల్ని తగలబెట్టించారు, ఊళ్ళో బంద్ జరిపించారు. ఆయన భయపడి పారిపొయ్యాడు. జిల్లాధికారులకి ఇదంతా ఒక లా అండ్ ఆర్డర్ న్యూసెన్స్‌గా అనిపించి చిరాకేసింది. అధికార దర్పానికి - జీవిక కోసం ఏ స్కూలు మేస్టర్లుగానో, పోస్టు మేస్టర్లుగానో పన్జేస్తున్న రచయితలు నంగిరిపింగిరిగాళ్ళలాగా కనిపిస్తారు. అంచేత వాళ్ళాయన్ని చర్చలకంటూ పిలిపించి - బెదిరించి ల్యాండ్ సెటిల్‌మెంట్ చేసినట్లు ఏవో కాయితాల మీద సంతకం పెట్టించుకున్నారు. ఇదంతా చాలా సింపుల్‌గా జరిగిపోయింది.

కొందరికి 'ఒక రచయిత రాసింది కొందరికి నచ్చలేదు, ఆయన్ని బ్రతిమాలో బెదిరించో రచనల్ని ఆపించేశారు, ఇదసలే విషయమేనా?' అనిపించొచ్చు. ఇంకొందరికి 'రచయిత వ్యతిరేక గ్రూప్ విజయం సాధించింది, పెరుమాళ్ ఓడిపోయాడు' అనిపిస్తుంది. కానీ రచయిత పెరుమాళ్ నిజంగా ఓడిపోయ్యాడా? నేనైతే - తమిళ సమాజం ఓడిపోయిందనుకుంటున్నాను.

'రచయితలు ఎవరి మనసునీ నొప్పించకుండా రాయొచ్చు కదా?' నిజమే! రచయితలకైనా, ఇంకెవరికైనా - ఏ వర్గాన్నీ, వ్యక్తినీ కించపరిచే హక్కు లేదు. కానీ - ఒక రచన వల్ల ఫలానావారి మనోభావాలు దెబ్బతిన్నాయని నిర్ణయించేదెవరు? రాజకీయ పార్టీలా? మత సంస్థలా? కులం గ్రూపులా? మరి రాజ్యంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ మాటేమిటి? ఆ స్వేచ్ఛని పరిరక్షించాల్సింది ఎవరు? పరిధి దాటితే శిక్షించాల్సింది ఎవరు? రాజ్యాంగబద్ధ స్వేచ్చ పరిరక్షిస్తూనే ఆ స్వేచ్చ దుర్వినియోగం కాకుండా చూడ్డానికి రాజ్యాంగబద్ధమైన సంస్థలు (న్యాయస్థానాలు గట్రా) వున్నాయి కదా! మరప్పుడు ప్రభుత్వాలు - రచయితల్ని కొన్ని గ్రూపులకి ఆహారంగా వేసి చోద్యం చూస్తున్నట్లుగా ఎందుకంత ఉదాసీనంగా వ్యహరిస్తున్నాయి?

ఇక్కడ ప్రేమకథలు రాసుకోవచ్చు, క్షుద్రరచనలు చేసుకోవచ్చు, సరసంగా సరదాగా మనసుని గిలిగింతలు పెట్టే అందమైన మాటల పొందికతో కవిత్వం రాసుకోవచ్చు. వాళ్లకోసం 'పద్మ' అవార్డు కూడా ఎదురు చూస్తుంటుంది కూడా! కానీ - సమాజాన్ని సీరియస్‌గా కామెంట్ చేస్తూ ఒక రచన చేస్తే మాత్రం రిస్కే! 

ఇవ్వాళ గురజాడ 'కన్యాశుల్కం' రాసే పరిస్థితి వుందా? 'కన్యాశుల్కం' తమ మనోభావాలు దెబ్బతీసిందని ఒక కులం వాళ్ళు గురజాడ ఇంటి ముందు ధర్నా చెయ్యొచ్చు, విజయనగరం పట్టణం ఒకరోజు బంద్‌కి పిలుపునివ్వచ్చు. గురజాడక్కూడా పెరుమాళ్‌కి పట్టిన గతే పట్టొచ్చు! మాలపల్లి రాసిన ఉన్నవ కూడా మర్యాదగా బయటపడే రోజుల్లేవు!

ఒక వాదన వుంది - 'ఇతర దేశాలతో పోలిస్తే మన్దేశం చాలా నయం, ఈ మాత్రం స్వేచ్చాస్వాతంత్రాలు లేని దేశాలు ఎన్ని లేవు?' నిజమే! నాకీ వాదన విన్నప్పుడు మా అన్న కొడుకు గుర్తొస్తాడు. వాడు సరీగ్గా చదివేవాడు కాదు. మార్కులు ఐదూ పది కన్నా ఎక్కువొచ్చేవి కావు. 'ఏవిఁటోయ్ ఇంత తక్కువొచ్చాయ్?' అనడిగితే - 'మా బెంచీలో అందరికన్నా నాకే ఎక్కువొచ్చాయి!' అని గర్వంగా చెప్పేవాడు. ప్రభుత్వం నడిపే సాంఘిక సంక్షెమ హాస్టళ్ళల్లో ఆహారం పరమ అధ్వాన్నంగా వుంటుంది. 'వాళ్లకి ఇళ్ళల్లో తినడానికి తిండే వుండదు, వాళ్ళ మొహాలకి ఇదే ఎక్కువ.' అని ఈసడించుకునే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు నాకు తెలుసు.

అచ్చు ఇదే వాదన్ని హిందూమతానికి ప్రతినిధులమని చెప్పుకునేవారు కూడా చేస్తుంటారు. వాళ్ళు ముస్లిం మతాన్ని చూపిస్తూ - 'నువ్వెళ్ళి ఇవే మాటలు ముస్లిం దేశాల్లో చెప్పు. నీ తల తీసేస్తారు' అంటారు. నిజమే! ఒప్పుకుంటున్నాను. సౌదీలో రాజ్యానికి వ్యతిరేకంగా బ్లాగుల్రాసిన కుర్రాణ్ని ఎంత కౄరంగా హింసిస్తున్నారో చదువుతుంటే ఒళ్ళు గగుర్బొడుస్తుంది! మనం చేసే దరిద్రప్పన్లని సమర్ధించుకోడానికి మనకన్నా దరిద్రులు ఈ ప్రపంచంలో ఎప్పుడూ వుండనే వుంటారు!

రాజకీయ నాయకులు, ఉద్యమకారులు సంఘటితంగా ఒక గ్రూపుగా వుంటారు గానీ - రచయితలెప్పుడూ ఒంటరిగాళ్ళే! అందుకే వాళ్ళు ఈజీ టార్గెట్లవుతారు. వాళ్ళు మందబలానికి, భౌతిక దాడులకి భయపడతారు. అప్పుడు - 'అసలెందుకు రాయడం? హాయిగా తిని పడుకోవచ్చుగా' అనిపిస్తుంది. అవును - ఇప్పుడు జరగబోతుందదే!

సమాజం - మతపరంగా, కులపరంగా స్పష్టమైన డివిజన్‌తో విడిపోవడం పాలకులకి ఎప్పుడూ లాభదాయకమే. అప్పుడే వారు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల్ని నిరాటంకంగా చక్కబెట్టుకోగలరు. రాజ్యానికి ఇబ్బంది కలిగించే రచయితలు - చైనాలోలాగా మాయమైపోడానికో, పాకిస్తాన్లోలాగా కాల్చబడ్డానికో మరికొంత సమయం పట్టొచ్చేమో గానీ - రచయితలకి చెడ్డరోజులు తరుముకుంటూ వచ్చేస్తున్నాయనేది నా అనుమానం. నా అనుమానం నిజమవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను.

(picture courtesy : Google)

17 comments:

  1. 'రచయితలు ఎవరి మనసునీ నొప్పించకుండా రాయొచ్చు కదా?


    అసలు ఎవరినీ చురుక్కు మనిపించని రచనలు శుధ్ధ దండగ. వాటివల్ల మనలోని/సమాజంలోని లోపాలు బయటడవు. వాటిని చదివి మనం మనల్ని మార్చుకొనేదీ ఏమీ ఉండదు. తెలుగు టీవీ ప్రోగ్రాముల్లాగా, సినిమాల్లాగా కేవలం ఎంటర్‌టైన్‌మెంటుకు మాత్రమే అలాంటి రచనలు పనికొస్తాయి. స్వాతంత్ర్యకాలంలో మనవాళ్లు రాసిన రాతలు, మనవాళ్ళు స్థాపించిన పత్రికలు వ్యవస్థను నొప్పించకుండానే ఉన్నాయేం?


    మీరు ఇంత శక్తివంతంగా రాశారా... ఐనాకూడా మనవాళ్ళు "అదే ఫలానా దేశంలో ఐతే ఇలా రాసుండేవారా" అన్న వాదన చెయ్యడం మానరు.

    మీ కలం మాంఛిగా పదునెక్కుతోంది. please continue the same and thanks for those articles you have shared with us.

    ReplyDelete
  2. ఇవ్వాళ గురజాడ 'కన్యాశుల్కం' రాసే పరిస్థితి వుందా? 'కన్యాశుల్కం' తమ మనోభావాలు దెబ్బతీసిందని ఒక కులం వాళ్ళు గురజాడ ఇంటి ముందు ధర్నా చెయ్యొచ్చు, విజయనగరం పట్టణం ఒకరోజు బంద్‌కి పిలుపునివ్వచ్చు. గురజాడక్కూడా పెరుమాళ్‌కి పట్టిన గతే పట్టొచ్చు! మాలపల్లి రాసిన ఉన్నవ కూడా మర్యాదగా బయటపడే రోజుల్లేవు!

    నిజమే, చాలా బాగా చెప్పారు !

    ReplyDelete
  3. రచయితలకి రక్షణ లేదా? అంటున్నారే, ఎవరికి అంటే ఏ రంగం వాళ్ళకు రక్షణ ఉంది చెప్పండి?

    ReplyDelete
  4. /రచయితలకి చెడ్డరోజులు తరుముకుంటూ వచ్చేస్తున్నాయనేది నా అనుమానం. నా అనుమానం నిజమవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను./
    రచయితలెప్పుడు ఫినిక్ పక్షుల్లా బ్రతుకుతూ ఉంటారు. చరిత్ర లోకి తొంగి చూస్తే మనకు ఈ విషయం అర్ధం అవుతునే ఉంటుంది. సత్యాన్ని వెలికి తెచ్చే సాస్త్రవేత్తలు రచయితలు ఎప్పుడు భయపడలేదు. కనుకనే సమాజం ఇంతదూరం పయనించింది. ఏ సమాజాళ్ళొ కూడా మతానికి గెలుపు లేదు.

    ReplyDelete
  5. >> ఇక్కడ ప్రేమకథలు రాసుకోవచ్చు, క్షుద్రరచనలు చేసుకోవచ్చు, సరసంగా సరదాగా మనసుని గిలిగింతలు పెట్టే అందమైన మాటల పొందికతో కవిత్వం రాసుకోవచ్చు. వాళ్లకోసం 'పద్మ' అవార్డు కూడా ఎదురు చూస్తుంటుంది కూడా! కానీ - సమాజాన్ని సీరియస్‌గా కామెంట్ చేస్తూ ఒక రచన చేస్తే మాత్రం రిస్కే! >>

    చాలా బాగా రాశారు!

    ఒక రచయిత భావాలకు మరణ శాసనం రాసిన ఈ తమిళనాడే ఒకనాడు స్వేచ్ఛాలోచనలకూ, హేతువాద ఉద్యమాలకూ నిలయం. ఇంతలోనే ఎంత మార్పు!

    ReplyDelete
  6. Doctorji

    I am planning to translate your post into tamil and publish it ::))

    ReplyDelete
    Replies
    1. Bravo. But, then, Jilebi, you also could be subjected to the same humiliation which పెరుమాళ్ మురుగన్ faced. So, you may think again as well.

      Delete
    2. Zilebi ji,

      Go ahead! I wish you all the best! :)

      Delete
    3. శ్యామలీయం గారు,

      ఈ టపా లో రమణగారి సమాధానాలు మీరు వ్రాసిన బీజేపి ముసుగు టపా ఇత్యాది చోట్ల వ్రాసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చాయి . మొత్తంగా మీరు ఇక్కడ కూడా మీరు అదే పద్దతిలో వ్యాఖ్యానించడం సరి పక్కన పెడితే , ఈ అనువాదం చేస్తే జిలేబిని ఎందుకు చేస్తారో ? మీ కళ్ళకి పట్టిన జిలేబి పొరల్ని తొలగించుకొని చదవాలండీ :)

      లేదంటే జిలేబిది ఎలాగా కాపి, పేస్టూ ..తత్తర బిత్తర వ్యవహారం కాబట్టి ఇలా వదిలిచ్చుకొంటాం అని అంటారా .. అంతా బీజేపీ దేవుడు దయ .

      Delete

  7. ஷ்யாமலீயம் அவர்களே ,

    என்னை முன்னாலே தள்ளி பின்னாலே வேடிக்கை பாக்காலாம் என்று நினைக்கிறீர் களே ! படு மோசம் !!

    ஜிலேபி

    ReplyDelete
    Replies
    1. ఓ అలాగా? ఓహో అలాగే! దాన్దేముంది జిలేబి జీ! మీరంతగా చెప్పాలా! తప్పకుండా చేద్దాం!

      (ఇదేదో తమిళభాషలా వుంది. నాకు తమిళం రాదనుకుంటారని సమాధానం రాశాను.) :)

      Delete
    2. జిలేబి గారు మీరు వ్రాసింది గూగుల్ ట్రాన్స్‌లేటర్ లో అనువదిస్తే ఇలా వచ్చింది. కరక్టేనా?

      తాము Syamaliyam,

      నాకు ముందు ముందుకు మరియు pakkalam వెనుక మీరు సరదాగా నేను అనుకుంటున్నాను లేదు! స్థూల !!

      Jilepi

      Delete
    3. శ్యామలీయం గారు,
      మీరు నన్ను ముందుకు తోసి వెనుక వేదుక చూడటం న్యాయమేనా (ట్రాన్ష్లేషన్ సరిగా ఉందందీ జీలేబి గారు)

      Delete
  8. The right wing has problems with Perumal Muragan, left has problem with MSG the film but strangely both condemn attack on Charlie Hebdo.

    ReplyDelete
  9. The Bourne Ascendancy అనే నవలలో క్రింద లైన్లు ఉన్నాయి ...
    quote

    "Imagine what this world would be like if there were no religion." He laughed. "You and I, Yusuf, would be out of work. Whatever, then, would we do?"

    unquote

    Religion is a fat pipe into the minds of the people. It can be used by the people who knows the power of it as they would like. We can't do much about it :(

    ReplyDelete
  10. తమిళ సమాజం ఓడిపోయిందనే బాధే వెంటాడుతున్నది. నాస్తిక సమాజపు చివరి కోట కూడా కూలిపోతున్నదా!

    ReplyDelete
  11. In these days of socalled Hindu revivalism, real writers have to resisit and fight against these trends by organising protest meetings and protest messages in the literary pages of all newspapers, monthlies, weeklies, etc. otherwise our silence will take our country to thousands of years back.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.