అభిమానం రకరకాలుగా వుంటుంది. అనేకానేక ప్రాంతాల్లో, అనేకానేక వ్యక్తులు, అనేకానేక కారణాలతో కొన్నివిషయాల పట్ల, వ్యక్తుల పట్ల అభిమానం పెంచుకుంటారు. ఆ అభిమానానికి అనేక కారణాలు వుండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒక కవినో, కళాకారుణ్నో అభిమానించేవాళ్ళు వుండొచ్చు. కానీ - మన తెలుగునాట మాత్రం ఆ ఆనవాయితీ వున్నట్లుగా లేదు.
తెలుగు ప్రాంతం గొప్పది, తెలుగు భాష గొప్పది, తెలుగువాడు గొప్పవాడు! ఇట్లా మనవాళ్ళు తమకుతామే ఉదారంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేసుకుంటారు (ఇంకో భాషవాడైవడైనా వచ్చి కాదండానికి వాడికి మన భాష రాదు కాబట్టి). ఎంతో గొప్పవాడైన ఈ తెలుగువాడు ఎవర్నైనా అభిమానించాలంటే ఆ వ్యక్తి - ఒక సినిమా నటుడో, రాజకీయ నాయకుడో అయ్యుండాలి. కొందరైతే - క్రికెట్ ఆటగాడైనా, అమెరికా ప్రెసిడెంటైనా - తమ కులంవాడైతేనే అభిమానిస్తారు! అవును మరి - వారిది రాజీ లేని, కల్తీ లేని కులాభిమానం! వారికి నా అభినందనలు.
ఇప్పుడు కొంచెంసేపు తెలుగు సినిమా హీరోల వీరాభిమానుల గూర్చి -
నా కాలేజి రోజుల్లో ఎన్టీఆర్‌కి వీరాభిమానులుండేవారు. వారు మాటలో, నడకలో ఎన్టీఆర్‌ని అనుకరించేవాళ్ళు. ఎవరైనా ఎన్టీఆర్‌ని చిన్నమాటన్నా సహించేవాళ్ళు కాదు, తన్నులాటకి దిగేవాళ్ళు, తన్నులూ తినేవాళ్ళు (ఇంతకన్నా గొప్ప అభిమానం వుంటుందనుకోను)! ఆనాడు సమాజంలో డబ్బు చాలా తక్కువ. కాబట్టి తమ కల్తీలేని నిఖార్సైన అభిమానాన్ని గుండెల్లో నింపుకుని తృప్తినొందేవారు (అంతకన్నా చేయగలిగిందేమీ లేక).
రోజులు మారాయి. తెలుగు సమాజంలో డబ్బుతో పాటు అభిమానాన్ని చాటుకునే మార్గాలూ పెరిగాయి. మొదటిరోజు మొదటి ఆటకి సినిమా హాల్లో నలిగిన పూలు, నిరోధ్ బూరలు ఎగరేసి ఆనందం పొందిన అభిమానులు - ఆ తరవాత రోజుల్లో హాలు ముందు తమ అభిమాన నటుడితో కలిపి దిగిన ఫొటోల్ని పెద్దపెద్ద ఫ్లెక్సీ బేనర్లుగా ప్రదర్శించే స్థాయికి ఎదిగారు.
సమాజంలో డబ్బు మరింత పెరిగింది, విలువా తరిగింది! అంచేత - అభిమానులకి "ఫ్లెక్సీ అభిమానం" చీప్‌గా అనిపించసాగింది! ఫ్లెక్సీ కిక్కు తగ్గి ఇంకా మరేదో కావాలనుకునే స్థితికి చేరుకున్నారు. ఆ 'ఇంకా మరేదో కిక్కు' ఇచ్చునది ఏమిటి? అని తీవ్రంగా మథనపడసాగారు.
ఈ సినిమా హీరోల అభిమానులు ఇలా వుండగా -
ఒకపక్క - రాజకీయ నాయకుల అభిమానులు చాలా ముందుకు వెళ్లిపొయ్యారు. వారి అభిమానులు తమ నాయకుల విగ్రహాల్ని ఊరూర ప్రతిష్టించుకుని తృప్తినొందసాగారు. ఈ విగ్రహాల ట్రెండ్ సినిమా హీరోల అభిమానుల్ని తాకడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ - ఎప్పుడోకప్పుడు తప్పదు.
ఈ లోకంలో డబ్బున్నవాళ్ళకి మల్లే - చదువుకున్నవాళ్ళకీ అహంకారం వుంటుంది. అందువల్ల సామాన్యుల ఇష్టాయిష్టాల్ని అర్ధం చేసుకోవడంలో వాళ్ళెప్పుడూ వెనకే వుంటారు. ఆ రోగం నాకూ వుండటం వల్ల - ఒకప్పుడు ఈ విగ్రహాల సంస్కృతిని విసుక్కుంటూ (నాకిప్పటికీ ఈ విగ్రహాలకున్న పవిత్రతేంటో అర్ధమయ్యి చావదు) - విగ్రహామా! భవిష్యత్తు నీదే!! అంటూ ఒక పోస్టు రాశాను. ఈమధ్య నా మేధావిత్వాన్ని కొంత తగ్గించుకుని - ఈ విగ్రహాల వెనకనున్న సామాజిక అర్ధిక కోణాల్ని వెతికే పన్లో పడ్డాను!
చరిత్రకారులు చరిత్రని (దిండ్లని మరిపించే) పుస్తకాల్లో రాస్తారు. ఆ దిండ్ల వంటి పుస్తకాలు లైబ్రరీలో నిలువుగా పేర్చి వుంటాయి. ఆ లైబ్రరీలో (నిశ్శబ్దం పాటిస్తూ) ఆ దిండ్ల మధ్య రోజుల తరబడి కూర్చుని చదివి చరిత్రని అర్ధం చేసుకోవడం ఒక పద్ధతి. దీనికి చాలా ఓపిక కావాలి, అందరివల్లా అయ్యే పని కాదు.
అసలు - చరిత్రని అంత శాస్త్రీయంగా పడీపడీ చదవడం అవసరమా? ఈ సందేహం నాక్కలగడానికి ఒక కారణం వుంది. మా గుంటూరు గూర్చి రోజుల తరబడి పుస్తకాలు చదవండి - మీరు గుంటూరు నైసర్గిక స్వరూపం, చరిత్ర వంటి సమాచార "పాండిత్యం" పొందగలరు.
చదివే ఓపిక లేదా? రోడ్డు పక్క టీ స్టాల్లో టీ తాగి, క్రేన్ వక్కపలుకులు చప్పరిస్తూ - ఒక పూట అలా రోడ్లంట పడి తిరగండి. చక్కటి కల్తీలేని దుమ్ము, నిండైన మురుక్కాలవలు, గుంపుల కొద్దీ దోమలు, దారీతెన్నూ లేని ఆటోలు - మీరు మర్చిపోలేని "అనుభవం" పొందుతారు.
అంచేత - 'అనుభవం అనేది పాండిత్యం కన్నా మిన్న' అని నేననుకుంటూ వుంటాను (ఎన్నో దశాబ్దాల క్రితం రాహుల్ సాంకృత్యయేన్ కూడా నాలాగే అనుకున్నాడు).
మీకు నా పాండిత్యం, అనుభవం థియరీ నచ్చిందా? అయితే మీకు విగ్రహాల సంస్కృతి కూడా ఈజీగా అర్ధమవుతుంది. పండితుడికి విగ్రహాలు చికాకు కలిగిస్తాయి, అనుభవజ్ఞుడికి విగ్రహాలు చరిత్రకి ఆనవాళ్ళుగా అగుపిస్తాయి.
ఫలానా వూళ్ళో ఫలానా విగ్రహం వుందంటే - అనుభవజ్ఞుడైతే ఆ ఊరివాళ్ళు ఫలానా కులం వాళ్ళని తెలుసుకుంటాడు, ఫలానా పార్టీ అభిమానులనీ అర్ధం చేసుకుంటాడు. ఈ చరిత్ర లైబ్రరీల్లో దొరకదు కదా! ఒకప్పడు అభిమానుల అభిమానం గుళ్ళో పెళ్ళీలాంటిదైతే - ఇవ్వాల్టి అభిమానం పెద్ద కన్వెన్షన్ హాల్లో భారీ పెళ్ళి లాంటిది!
నేను విగ్రహాల పట్ల ఇంత నిగ్రహంగా ఆలోచించడానికి ఇంకో కారణం కూడా వుంది. మా గుంటూరుకి దగ్గర్లో తెనాలి పట్టణం వుంది. చాలామంది పేషంట్లు తెనాలి నుండి వస్తుంటారు. అనాదిగా తెనాలి కళలకి నిలయం. 'అనాదిగా' అని రాయడానికి నాకున్న కారణం - కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు మొదలైన లబ్దప్రతిష్టులైన సినిమా నటులు కాదు. అందుక్కారణం - బి.వీరాచారి!
నలభయ్యేళ్ళ క్రితం సినిమాలు చూసినవాళ్ళకి - 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు', 'హాలులో పొగ త్రాగరాదు', 'ఏ కారణము చేతనైనా ఆట ఆగినచో డబ్బు వాపసు ఇవ్వబడదు' మొదలైన స్లైడ్స్ గుర్తుండే వుంటాయి. ప్రతి స్లైడ్‌కి కింద ఓ మూలగా చిన్న అక్షరాలతో - 'బి.వీరాచారి, తెనాలి' అని వుంటుంది.
ఆవిధంగా - రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్ళల్లో తన స్లైడ్స్ ద్వారా తెనాలికి ఖ్యాతి తెచ్చిన బి.వీరాచారిని అభినందిస్తున్నాను. బి.వీరాచారిని కన్న పుణ్యభూమియైన తెనాలి పట్టణంలో అనేకమంది శిల్ప తయారీ నిపుణులు, శిల్ప వ్యాపారులు వున్నారు. వారిలో కొందరు నాకు తెలుసు.
కొన్నేళ్ళ క్రితం ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. అటుతరవాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన విగ్రహాలకి విపరీతమైన గిరాకీ వచ్చింది. ఆ సీజన్లో తెనాలి శిల్పులకి రాంత్రింబగళ్ళు ఒకటే పని. వాళ్ళు తమ పాత అప్పులు తీర్చేసుకున్నారు, భార్యలకి కొత్తగా నగలు చేయించుకున్నారు. తామంతా రాజశేఖరరెడ్డికి ఎంతో ఋణపడి వున్నామని ఆ కుటుంబాలవాళ్ళు నాకు చెప్పారు.
'ఆ విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టిస్తారు? ట్రాఫిక్‌కి అడ్డం కాదా?' వంటి చెత్తప్రశ్నలు మధ్యతరగతి మేధావులకి రావొచ్చు - మనం పట్టించుకోనవసరం లేదు. విగ్రహం చేయించినవాడే ఏవో తిప్పలు పడి - ఎక్కడోక చోట నిలబెడతాడు. ఆ తరవాత అధికారంలోకి వచ్చిన పార్టీలవాళ్ళు ఎలాగూ ఆ విగ్రహాల్ని తొలగిస్తారు. కానీ - తొలగించిన విగ్రహం స్థానంలో వాళ్ళు తమ పార్టీ నాయకుని విగ్రహం పెట్టుకుంటారుగా? అంటే పాతచొక్కా బదులు కొత్తచొక్కా కొనుక్కున్నట్లన్నమాట! అప్పుడు - తెనాలి శిల్పులకి మళ్ళీ గిరాకీయే కదా?
నాయకులు - ఖద్దరు కట్టి నేతకార్మికుల్ని ఆదుకోమంటున్నారు. మరి - విగ్రహాలు తయారుచేయించి శిల్పకళా కార్మికుల్ని ఆదుకొమ్మని ఎందుకు చెప్పరు? ఎందుకో నాకు తెలీదు. కానీ - భవిష్యత్తులోనైనా వాళ్ళీ మాట చెప్పాలి, చెప్పి తీరాలి అనేది నా అభిప్రాయం.
ఇదంతా ఎందుకు రాశానంటే - ఈమధ్య పవన్ కళ్యాణ్ అనే ఒక తెలుగు సినిమా నటుడి విగ్రహం తయారైందిట. అది త్వరలో ఎక్కడో నిలబడబోతుంది. ఈ వార్త చదవంగాన్లే - నేనూహించింది జరుగుతున్నందుకు చాలా ఆనందం కలిగింది. త్వరలోనే మనం మరిన్ని సినీనటుల విగ్రహాలు చూడబోతున్నాం (ఆ నటుడి ఎగస్పార్టీవాళ్ళు దద్దమ్మలు కాదు). అంటే - శిల్ప కళాకారులకి మరింత ఉపాధి.
సినీ హీరో అభిమానులు కాలుష్య కారణమైన ఫ్లెక్సీ పరిశ్రమ వదిలి - ఎంతో క్రియేటివిటీ వున్న శిల్పకళని పోషించే దిశగా వెళ్తున్నదుకు ఆనందిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను కూడా! ఈ స్పూర్తితో తెలుగునాట శిల్పకళ గొప్పగా అభివృద్ధి చెందుతుందని కూడా నేను భావిస్తున్నాను.
ముగింపు -
ఈ పోస్ట్ చదివారుగా! ఇకనుండి మీకు ఏ విగ్రహం కనిపించినా - ఆ విగ్రహం మొహం పట్టించుకోకండి. అది ఎవరిదైనా కావచ్చు - మనకనవసరం. మీకా విగ్రహంలో - విగ్రహానికి అచ్చులు పోసి మెరుగులు దిద్దిన కార్మికులు కనిపిస్తే సంతోషిస్తాను.
(ఈ పోస్ట్ టైటిల్‌కి ప్రేరణ శ్రీశ్రీ 'దేశచరిత్రలు' పంక్తులు.)
(photo courtesy : Google)