జంతువులు ఆలోచిస్తాయా? జంతువులకి ఆకలేస్తే ఆహారాన్ని వెతుక్కుంటాయి, కడుపు నిండిన తరవాత హాయిగా నిద్రపోతాయి. అంతేగానీ - అనవసరమైన ఆలోచనల్తో బుర్ర పాడుచేసుకోవని నా అభిప్రాయం. కానీ - మనిషికి జంతువులకున్నంత తెలివి ఉన్నట్లుగా అనిపించట్లేదు. ఎందుకంటే - మనిషి ఆలోచనాపరుడు!
మనిషి ఆలోచనల్ని బాహ్యప్రపంచం ప్రభావితం చేస్తుంటుంది. ఆకలితో ఉన్నవాడికి విప్లవ గీతం గుర్తొస్తుంది. కడుపు నిండినవాడికి కవి సార్వభౌముల కవిత్వం కమనీయంగా తోస్తుంది, మనసు మరింత వినోదాన్ని కోరుకుంటుంది. వినోదం నానా విధములు. కొందరికి వినోదం పేకాట క్లబ్బులో దొరికితే, మరికొందరు క్రికెట్ బెట్టింగుల్లో దొరుకుతుంది.
ఇట్లాంటి చౌకబారు వినోదానికి మేధావుల గుర్తింపు వుండదు. మరప్పుడు మేధావులు ఏ విధంగా వినోదం పొందుతారు? అసలు మేధావి అంటే ఎవరు? సరళమైన విషయాన్ని సంక్లిష్టంగా ఆలోచించేవాడే మేధావి అని నా నమ్మకం. అందువల్ల మేధావుల వినోదం కూడా సంక్లిష్టంగానే వుంటుంది!
కాఫ్కా శామ్సాని పురుగ్గానే ఎందుకు మార్చాడు? కుక్కగా ఎందుకు మార్చలేదు? శ్రీశ్రీ 'నేనొక యజ్ఞోపవితాన్ని' అని ఎందుకు రాశాడు? ఆయన కమ్యూనిస్టు బ్రాహ్మడా? లేక బ్రాహ్మణ కమ్యూనిస్టా? మేధావులు ఇట్లాంటి విషయాల్ని తీవ్రంగా ఆలోచించడమే కాక పుస్తకాలు కూడా రాస్తుంటారు!
ఇదే కోవకి చెందిన ఇంకో వినోదం ఆత్మకథలు. ఈ ఆత్మకథలు రాసేవారు అనేక రకాలు. హిట్లర్ కుక్కకి స్నానం చేయించినవాడు, ఇందిరాగాంధీ జుట్టుకి రంగేసినవాడు, మైఖేల్ జాక్సన్ చెఫ్.. ఇలా చాలామంది తమ బాసుల అలవాట్లు, ప్రవర్తనల గూర్చి పేజీల కొద్దీ రాశారు. ప్రజల జీవితాలకి ఏ మాత్రం సంబంధం లేని ఇట్లాంటి గాసిప్స్ చాలామంది ఇష్టపడతారు. తెలివైన పబ్లిషర్లు ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఇట్లాంటి పుస్తకాలు వండి వారుస్తూనే వున్నారు.
బాబ్రీ మసీదు కూల్చినప్పుడు పీవీ పూజామందిరంలో వున్నాడా? బెడ్రూములో వున్నాడా? బాత్రూములో వున్నాడా? అంటూ కొందరు పుస్తకాలు రాసి బాగానే అమ్ముకున్నారు. పీవీ ఏ రూములో వుంటే మాత్రమేంటి? మసీదు కూల్చివేతని అడ్డుకోలేకపోవటం పీవీ అసమర్ధతకి చిహ్నం. ప్రజలకి సంబంధించినంత మేరకు ఇదే ముఖ్యమైన పొలిటికల్ పాయింట్.
ఆత్మకథల్లో ఇంకోరకం (మాజీ) ప్రముఖులు రాసేవి. ఈ మాజీల ఆత్మకథలు చదివేవారు వుండరు. అంచేత వాళ్ళే మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. అంచేత వాళ్ళా పుస్తకంలో (బహుశా పబ్లిషర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం) కొన్ని వివాదాస్పద అంశాలు ఉండేట్లు రాసుకుంటారు. ఇంక బోల్డంత ఫ్రీ పబ్లిసిటీ. మొన్న సంజయ్ బారు అనే ఒక మాజీ మీడియా ఎడ్వైజర్ ఇట్లాంటి సూత్రాన్నే పాటించి పుస్తకాలు అమ్ముకున్నాడు. ఇప్పుడు నట్వర్ సింగ్ వంతొచ్చింది! ఈ వరసలో రేపెవరో! అసలివన్నీ ఆత్మకథలు కావనీ, ఆత్మకతలు మాత్రమేనని మా సుబ్బు అంటాడు.
నట్వర్ సింగ్ అనే ఒక మాజీ తన అనుభవాల్ని పుస్తకంగా రాసుకున్నాడు. సోనియా గాంధీ ప్రధాని కాకపోవటానికి రాహుల్ గాంధీ వత్తిడే కారణమట. అయితే ఏంటిట? ఇదేమంత వార్తని! అసలీ నట్వర్ సింగ్ ఎవరు? ఏదో ఉద్యోగం వెలగబెడుతూ, అవకాశం దొరగ్గానే కాంగ్రెస్ పార్టీలోకి దూకి, గాంధీ కుటుంబానికి సేవ చేసుకుంటూ ఏవో పదవులు అనుభవించాడు. అటు తరవాత సొనియమ్మ దయకి దూరమయ్యాడు. అప్పట్నుండి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, ఖాళీగా ఉండటం దేనికని ఒక పుస్తకం రాసుకున్నాడు.
మొన్న మధ్యాహ్నం భోజనంలో నేను దోసకాయ పప్పు, కాకరకాయ వేపుడుకీ బదులుగా పప్పుచారు, గుత్తొంకాయతో తినుంటే ఎలా వుండేది? నిన్న నేను తెల్లచొక్కా కాకుండా చారల చొక్కా వేసుకున్నట్లైతే ఎలా వుండేది? ఈ విషయాలకి ఎంతటి ప్రాధాన్యం వుందో - 'మన దేశానికి ప్రధానిగా మన్‌మోహన్ సింగు కాకుండా సోనియా గాంధీ అయినట్లైతే ఎలా వుండేది?' అన్న విషయానికీ అంతే ప్రాధాన్యం వుంది. చదవడానికి కాస్త కఠినంగా వున్నా ఇది వాస్తవం.
అసలంటూ మన్‌మోహన్ సింగు తనంతతానుగా ప్రజలకి ఏదైనా కీడో మేలో చేస్తే, ఆ పని సోనియా గాంధీ అయితే చేసేదా లేదా అని ఆలోచించేవాళ్ళం. కానీ మన్‌మోహన్ సింగు ఎప్పుడూ చేసిందేమీ లేదు. అణుఒప్పందం లాంటి ముఖ్యమైన నిర్ణయాలు సోనియా గాంధీ అనుమతి లేకుండా జరిగినవీ కావు. పోనీ 2 జి, బొగ్గు కుంభకోణాలు సోనియా గాంధీ అయినట్లేతే ఆపేదా? ఖచ్చితంగా ఆపేది కాదు. అందుకే - ఇంతోటి పాలనకి ఎవరైతేనేం (పళ్ళూడగొట్టుకోడానికి ఏ రాయైతే నేం)? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
చెప్పినట్లు చెయ్యకపొతే ఇంటి ఇల్లాలు ఎక్కడ గృహహింస కేసు పెడుతుందేమోననే భయంతో ఇంట్లో అంట్లు తోముతాం, బట్టలుతుకుతాం! అంతమాత్రానికే ఆ విషయాన్ని బయటకి చెప్పుకోలేం గదా? మరప్పుడు బయటకి ఏమని చెబుతాం? ఆలుమగలు సంసారం అనే బండికి రెండు చక్రాల్లాంటివారని నమ్మబలుకుతాం. అట్లాగే - పాపం సోనియమ్మ తన ముద్దుల కొడుకు వత్తిడి వల్ల ప్రధానమంత్రి పదవిని తప్పించుకుని, దానికి 'త్యాగం' అనే పేరు పెట్టుకుంది. అలా చేయబట్టే ఆమె వందిమాగధులు తమ నాయకురాల్ని మదర్ థెరీసా అని కీర్తించగలిగారు!
'ఆత్మకథలని అధమంగా చూడకు. ప్రముఖులు ఎదిగిన వైనము కడు స్పూర్తిదాయకము.' అని కొందరు అమాయకులు నమ్మవచ్చుగాక! నేను మాత్రం నమ్మను. నా స్నేహితుడోకడు గైళ్ళు చదివి మంచి మార్కులు సంపాదించేవాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అతను మాత్రం అందరికీ తను చాలా కష్టపడి దిండ్లు లాంటి స్టాండర్డ్ టెక్స్టు బుక్కులు మాత్రమే చదువుతానని చెప్పుకునేవాడు. అంతేకాదు - గైళ్ళు చదవొద్దని జూనియర్లకి సలహా కూడా చెప్పేవాడు! ఎందుకు? అలా చెబితేకానీ తన ఇమేజ్ పెరగదని అతని అభిప్రాయం.
పోనీ ప్రతిభావంతుల అలవాట్లని స్పూర్తిదాయకంగా తీసుకుని, వాటిని అనుకరించి బాగుపడ్డవారున్నారా? మిగతావాళ్ళ సంగతేమో గానే - నేను మాత్రం లాభ పళ్ళేదు. మా గుంటూరు మెడికల్ కాలేజిలో చరిత్ర సృష్టించిన భీభత్సమైన గోల్డ్ మెడల్ స్టూడెంట్ ఒకాయనున్నాడు. ఆయన మాకు మూడేళ్ళు సీనియర్. ఎట్టకేలకి మా సూర్యం ఆ గోల్డ్ మెడల్స్ రహస్యం చేధించాడు.
ఆ గోల్డ్ మెడల్స్ పెద్దమనిషి ప్రతిరోజూ సరీగ్గా అర్ధరాత్రి పన్నెండింటికి బలరాం హోటల్లో ప్లేటు పూరీ (అనగా రెండు పూరీలు అని అర్ధం) పూరీకూరతో కాకుండా చపాతికి ఇచ్చే కుర్మాతో నంజుకుని తింటాడు. ఆపై నిదానంగా ఒక టీ తాగి స్టైలుగా ఒక రెడ్ విల్స్ సిగరెట్ ముట్టిస్తాడు. మా సూర్యం డిటెక్టివ్ యుగంధర్ వలె ఆయనపై అనేక రాత్రులు నిశిత పరిశీలన జరిపి సేకరించిన భోగట్టా ఇది.
ఆ గోల్డ్ మెడలిస్ట్ విజయ రహస్యాన్ని గ్రహించిన మా మిత్రబృందం కూడా పూరీ కుర్మా విత్ రెడ్ విల్స్ సిగరెట్ ఫార్ములాని అమలు చెయ్యడం ప్రారంభించింది. మొక్కవోని దీక్షతో ఎన్ని పూరీకుర్మాలు తిన్నా, ఎన్ని సిగరెట్లు కాల్చినా మాకెవరికీ గోల్డ్ మెడల్ దక్కలేదని ప్రత్యేకించి రాయనక్కర్లేదని అనుకుంటాను.
ముగింపు -
నా జీవిత చరిత్ర (రాస్తే గీస్తే) ఈ విధంగా రాయబోతున్నాను.
నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చాను (ఒట్టు! నన్ను నమ్మండి). అనేక కష్టాలు పడుతూ వీధి దీపాల కింద చదువుకుంటూ డాక్టర్నయ్యాను (ఇప్పుడు కొద్దిగా చెమట తుడుచుకోనివ్వండి). స్త్రీలందరినీ నా సోదరీమణులుగా భావించాను (అందుకే నాకు భార్య దొరకడం కష్టమైంది). ఏనాడూ అసత్యం పలక లేదు (మళ్ళీ ఇంకో ఒట్టు). పేదరోగుల కష్టాలకి చలించిపోతుంటాను, కన్నీరు కారుస్తుంటాను (బిల్లు మాత్రం ఠంచనుగా వసూలు చేస్తాను). అనుక్షణమూ ఈ దేశానికి నేనేమిచ్చాను అని తపన పడుతుంటాను (కొద్దిగా గంభీరంగా ఉంటుందని రాశానే గానీ ఈ వాక్యానికి అర్ధం నాకు తెలీదు).
అన్నట్లు పదో చాప్టర్లో బాలగోపాల్ గూర్చి రాయబోతున్నాను.
కొన్ని సందర్భాల్లో విషయం అర్ధం కాక తల పట్టుక్కూర్చున్న బాలగోపాల్‌కి సలహాలు చెప్పి చైతన్యవంతుణ్ణి చేశాను. ఒక్కోసారి ఆయన నిరాశ చెందేవాడు. అప్పుడు నేను 'తెలుగువీర లేవరా! దీక్ష బూని సాగరా!' అంటూ ఆయన్ని కర్తవ్యోన్ముఖుణ్ని చేసేవాణ్ణి. అందుకే బాలగోపాల్ ఎప్పుడూ అంటుండేవాడు 'రమణా! నువ్వు లేకపోతే నేను లేను' అని. అది వాస్తవమే అనుకోండి, కానీ - నాకు పొగడ్తలు గిట్టవు!
ప్రస్తుతానికి నా జీవిత చరిత్రలో ఈ విశేషాల శాంపిల్ చాలుననుకుంటున్నాను!
చివరి తోక -
'ట్రింగ్ ట్రింగ్' ఫోన్ అందుకున్నాను.
"ఎందుకు? ఎందుకు నన్నంత మాట అన్నావ్? నా మనసు ఎంతలా గాయపడిందో తెలుసా?" మబ్బు లేని వర్షంలా నా స్నేహితుని వ్యధ.
"నేనేమన్నాను?" అయోమయంగా అడిగాను.
"అది తెలుసుకోవాలంటే త్వరలో రాబోయే నా ఆత్మకథ చదువుకో. నీకైతే ట్వెంటీ పర్సంట్ డిస్కౌంట్ కూడా!" అన్నాడు నా స్నేహితుడు.
"ఈ మాత్రం దానికి ఆత్మకథ ఎందుకు!" చికాగ్గా అన్నాను.
"ఏ? అదే సోనియా గాంధీ రాస్తానంటే ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తావు. నాకో నీతీ సోనియాకో నీతా?" ఫెడీల్మంటు ఫోన్ పెట్టేశాడు నా స్నేహితుడు.
(picture courtesy : Google)