Friday 22 August 2014

'ఐరన్' షర్మిల


ఈ ఫోటోలో మీరు చూస్తున్న యువతి పేరు ఐరమ్ షర్మిల. గత పుష్కర కాలంగా నిరాహారదీక్ష చేస్తున్న ఈ  పౌరహక్కుల కార్యకర్త ఒక 'ఐరన్' లేడీ. 

హోల్డాన్! ఐరమ్.. ఐరన్! అద్దిరింది.. ఈ భాషా ప్రయోగం నీదేనా? 

అయ్యుండకపోవచ్చు. ఎక్కడో చదివుంటాను. ఎందుకంటే మన్దంతా కాపీ వ్యవహారం కదా! 

ఎలా చెప్పగలవ్? 

సింపుల్. అంత తెలివే వుంటే సైకియాట్రీ ప్రాక్టీసులో ఎందుకు మగ్గిపోతాను? హాయిగా ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారమో చేసుకునేవాణ్నిగా!

నిరాహారదీక్ష అనేది అయ్యప్పదీక్ష లాంటిది కాదు. ఒక అనువైన స్థలం చూసుకుని - అన్నం, నీళ్ళు తీసుకోకుండా కూర్చోడాన్నే నిరాహారదీక్ష అంటారు. మన జాతిపిత గాంధీగారు అనేక నిరాహారదీక్షలు చేసి బ్రిటీషువాడి గుండెల్లో నిద్రపొయ్యారు. అందుకే  నిరాహారదీక్షని గాంధేయ వాదం యొక్క ఆయుధం అంటారు. నాకు చిన్నప్పట్నుండి నిరాహార దీక్షలు చేసేవారి పట్ల టన్నుల కొద్దీ గౌరవం వుంది. 

నేను ఒక్కరోజుపాటు - భోజనం సంగతి అటుంచండి, కనీసం కాఫీ టిఫిన్లు మానేసిన జ్ఞాపకం లేదు. నేను చక్కగా తింటాను, ఆ తరవాత మాత్రమే ఏదైనా ఆలోచిస్తాను. బొగ్గు లేకుండా రైలైనా నడుస్తుందేమో గానీ, తిండి లేకుండా నా బుర్ర పన్జెయ్యదు. ఈ విషయం రాయడానికి నాకే మాత్రం సిగ్గుగా లేదు (నా నిరాహార దీక్ష ప్రహసనం గూర్చి గాంధీ.. నేను.. అన్నాహజారే అనే పోస్టులో రాశాను). ఐదు నిమిషాలు కాఫీ లేటైతేనే శోషొచ్చే నాకు.. కొందరు వ్యక్తులు వారివారి రాజకీయ ఎజండా కోసం తిండి మానేయడం పట్ల గౌరవం కాక మరేముంటుంది?

షర్మిల ముక్కులో గొట్టం చూడండి. దాన్ని రైల్స్ (ryles) ట్యూబ్ అంటారు. నేను హౌస్‌సర్జన్సీలో వుండగా కొందరు పేషంట్లకి ఈ రైల్స్ గొట్టం వేసిన అనుభవం వుంది. దీన్ని ముక్కులోంచి పొట్టలోకి దూర్చేప్పుడు పేషంట్లకి చాలా ఇబ్బందిగా వుంటుంది. అట్లాంటి గొట్టం ఈ షర్మిల ముక్కుకి - (మెళ్ళో గొలుసు, చేతికి గాజు వేసుకున్నట్లుగా) ఒక ఆభరణం లాగా మారిపోయింది. నేనైతే మాత్రం ఈ గొట్టాన్ని ఒక్క నిమిషం కూడా భరించలేను. అందుక్కూడా షర్మిల అంటే నాకు గౌరవం! 

షర్మిల సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుందని ఒక కేసు నడిచింది. ఇప్పుడు కొంచెంసేపు నా భాషా పరిజ్ఞాన ప్రదర్శన. సూసైడ్‌ని తెలుగులో ఏమంటారు? మొన్నటిదాకా 'ఆత్మహత్య' అనేవాళ్ళు. నాకా పదం గమ్మత్తుగా అనిపించేది. ఆత్మకి చావు లేదంటారు గదా! మరా ఆత్మని ఎలా హత్య చెయ్యగలం? బరువైన నా ప్రశ్నకి సమాధానం దొరక్కముందే - సూసైడ్‌ని ఇప్పుడు 'బలవన్మరణం' అన్డం మొదలెట్టారు. ఇదింకా గమ్మత్తుగా వుంది. అప్పుడు హత్య కూడా బలవన్మరణమే అవుతుంది కదా! అందువల్ల - ఏ కన్ఫ్యూజన్ లేకుండా - మనందరికీ తెలిసిందీ, రాసుకోడానికి ఎంతో సుఖంగా వుండేదీ అయిన 'సూసైడ్' అన్న పదమే వాడుతున్నాను. అయినా - చావడానికి ఏ భాషైతే ఏముంది?!

సూసైడ్ కొన్ని దేశాల్లో నేరం కాదు, మన దేశంలో మాత్రం నేరం. కాబట్టి ఈ కేసులప్పుడు గవర్నమెంట్ ఆస్పత్రుల్లో పోలీసు వారి హడావుడి వుంటుంది. సూసైడ్ ఎందుకని నేరమో నాకు తెలీదు. సమాజంలో ఇమడలేక నిరాశతో సూసైడ్ చేసుకునేవారి కంటే, ఆ సమాజ పరిస్థితుల్ని చక్కదిద్దలేని ప్రభుత్వాలదే పెద్ద నేరం కదూ? అనేక మానసిక జబ్బుల్లొ పేషంట్లు సూసైడ్ చేసుకోటానికి ప్రయత్నిస్తారు. ఒకపక్క మానసిక జబ్బుల్ని చర్మవ్యాధి, కీళ్ళవ్యాధి లాంటివని చెబుతుంటారు. ఇంకోపక్క ఆ రోగ లక్షణమైన సూసైడ్ ప్రయత్నం మాత్రం శిక్షార్హమైన నేరం అంటారు! ఇదో వైరుధ్యం. 

సరే! షర్మిల గూర్చి రాయడం మొదలెట్టి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నాను. చివరగా - నే చెప్పదల్చుకున్న పాయింటుని మరొక్కసారి నొక్కి వక్కాణిస్తాను. మిత్రులారా! కడుపు నిండినవాడు (వారిలో ఈ బ్లాగరు కూడా ఒకడు) కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ - సంవత్సరాలు తరబడి ఏమీ తినకుండా, ముక్కు ద్వారా ఆహారం తీసుకుంటూ జీవించడం అత్యంత ఇబ్బందికరం. అట్లాంటి ఇబ్బందిని భరిస్తున్న షర్మిలకి నా జేజేలు! 

ఐరమ్ షర్మిలా! యు ఆర్ గ్రేట్!

ముగింపు -

రాయడం ఇక్కడితో ఆపేస్తున్నాను (హడావుడిగా). 

ఎందుకు? 

నాకు ఆకలేస్తుంది, భోంచెయ్యాలి.

ఇవ్వాళ కూరలేంటి? ఏంటీ! తోటకూర పప్పు, బెండకాయ వేపుడా? ఇవి నాకిష్టం లేని కూరలని నీకు తెలీదా? పప్పుచారు, గుత్తొంకాయ చెయ్యమంటినే? 

హే భగవాన్! నేనెంత గొప్ప మేధావిని! ఎంత హెవీ థింకర్ని! నాకీ గతేంటి? ఇట్లాంటి దరిద్రపుగొట్టు భోజనం తినేకన్నా, షర్మిల లాగా ముక్కులో గొట్టం వేయించుకుని పాలు ఎక్కించుకోటం మేలేమో!

(photo courtesy : Google)

3 comments:

  1. //చావడానికి ఏ భాషైతే ఏముంది?!//
    నీరు తెలుగుకు ద్రొహం తలపెట్టారు! :)

    ReplyDelete
  2. "సమాజంలో ఇమడలేక నిరాశతో సూసైడ్ చేసుకునేవారి కంటే, ఆ సమాజ పరిస్థితుల్ని చక్కదిద్దలేని ప్రభుత్వాలదే పెద్ద నేరం కదూ? "

    Well said.

    ReplyDelete
  3. ఒకపక్క మానసిక జబ్బుల్ని చర్మవ్యాధి, కీళ్ళవ్యాధి లాంటివని చెబుతుంటారు. ఇంకోపక్క ఆ రోగ లక్షణమైన సూసైడ్ ప్రయత్నం మాత్రం శిక్షార్హమైన నేరం అంటారు! ఇదో వైరుధ్యం.
    >>
    మన చుట్టూ చాలా వైరుధ్యాలు వున్నాయి సార్!ఈ వైరుధ్యాల గురించి యెక్కువగా పట్టించుకుని తమ సిధ్ధాంతాన్నే వాటి చుట్టూ చక్కర్లు కొట్టించి వైరుధ్యాలని సమయించదమే తమ లక్ష్యంగా పెట్టుకున్న కమ్యునిష్టులే ఆ వైరుధ్యాలకు బలయి పోతున్నారు, అంటే ఈ వైరుధ్యాల బలం యెంత యెక్కువో చూదండి?

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.