Thursday 28 August 2014

శివరామక్రిష్ణన్ కమిటీ! థాంక్యూ!


గత కొన్ని నెలలుగా నాకు ఆందోళనగా వుంది. రాష్ట్రవిభజన అంశం తెరపైకి వచ్చినప్పట్నుండి నాకీ ఆందోళన మొదలైంది. అందుకు కారణం రాష్ట్రం విడిపోతుందని కాదు, ఎక్కడ మా గుంటూరు రాజధాని అవుతుందేమోనని!

నాకు మా ఊరంటే చాలా ఇష్టం. ప్రతి ఊరికీ ఒక విశిష్టత వుంటుందిట. నాకిక్కడి ఇరుకు సందులు, గతుకు రోడ్లూ, దుమ్మూధూళీ.. అన్నీ కూడా హాయిగా వుంటాయి. రోడ్డు పక్క బజ్జీబళ్ళూ, కిళ్ళీబడ్డీలు బహుసుందరంగా కనిపిస్తాయి. 

కొన్నేళ్లుగా మా ఊరు 'అభివృద్ధి' చెందుతుందిట. అభివృద్ధి కాముకులు మా ఊరి రూపాన్నే మార్చేస్తున్నారు. పాతకొంపల్ని 'డెవలప్‌మెంట్' అంటూ కూల్చేసి ఎపార్ట్‌మెంట్లు కట్టేస్తున్నారు. ఇప్పటికే బాగా తెలిసిన వీధుల్ని కూడా పోల్చుకోలేకపోతున్నాను. మరి - రాజధాని అయితే ఇంకెలా తయారవుతుందో!

ఇలా రాజధాని ఆందోళనతో దిగులుగా, దుఃఖంగా కాలం గడుపుతున్న నాకు - ఇవ్వాళో శుభవార్త! కేంద్రప్రభుత్వం రాజధాని కోసం శివరామక్రిష్ణన్ కమిటీ వేసింది. ఆ కమిటీ గుంటూరు రాష్ట్రరాజధానిగా పనికిరాదని తేల్చి చెప్పింది. నాకీ వార్త చాలా ఆనందాన్ని కలిగించింది. 

నా ఆనందానికి కారకులైన శివరామక్రిష్ణన్ కమిటీ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శివరామక్రిష్ణన్ మరియూ ఆయన కమిటీ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 

(photo courtesy : Google)

13 comments:

  1. Congratulations. మీ ఊరి జనం చేసుకున్న పుణ్యం.

    రాజధానిగా ఒంగోలు పేరు బాగా వినిపిస్తున్న రోజుల్లో నేను ఒక రైలు ప్రయాణం చేస్తుండగా ఒంగోలులో దిగేవాళ్ళు లేచి డోర్ వైపు వెడుతుంటే నేను వారితో అన్నాను - కాబోయే రాజధాని వస్తోందన్నమాట అని. వాళ్ళు ముక్తకంఠంతో "అంత అదృష్టం మాకొద్దులెండి" అన్నారు. అంత వెగటు / భయం పుట్టించారన్నమాట రాజధాని విషయంలో.

    తప్పించుకున్నందుకు మరోసారి అభినందనలు. గుంటూరు ప్రజలు హాపీగా వినాయక చవితి చేసుకోవచ్చు

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      ఇక మా గుంటూరుకి రాజధాని పీడ వదిలినట్లే. ఆ దరిద్రం అల్పపీడనం మాదిరిగా వేరే దిక్కుకి పోయింది. :)

      Delete
  2. వైద్యశిఖామణిగారూ, మీ లాంటి వారినే (మొహమాటమొకటీ! మిమ్మల్నే లెండి ఇప్పుడు)

    - యథాతధవాదులూ (అంటే ఏ మార్పునూ ఎంతమాత్రమూ అంగీకరించని వారు)
    - అభివృధ్ధినిరోధక శక్తులూ (ఊరు బాగుపడితే చూడలేనివారు)
    - తిరోగమనవాదులూ (అంతా పదండి ముందుకు అంటుంటే, గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అనే బాపతు)
    - కూపస్థమండూకాలూ (ప్రపంచం మారుతోందీ, మనమూ మారాలీ అన్న స్పృహ బొత్తిగా లేని అజ్ఞానులు)
    - ఇలాంటివే ఇంకా చాలా (మిమ్మల్ని ఫలానా ఫలానా రాజకీయపార్టీ సానుభూతిపరులుగా నుండి, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేస్తే నా ప్రాక్టీసు పడిపోదా అని కుళ్ళు అలోచనచేసే దుర్మార్గులుగా దాకా ఎన్నో ఎన్నెన్నో.....)

    అలాగే నానా భీభత్సమైన మాటలూ అంటారు మరి జనంలో‌ కొందరు.

    ఎందుకైనా మంచిదని టీకాటిప్పణులతో సహా మీకు హెచ్చరిక జారీ చేయటమైనది అని సవినయంగా విన్నవించటమైనది. (ఇదేం‌ భాషరా అనకండి. ఎంతచెడ్డా ఇది తెలుగుటీవీ భాషకన్నా లక్షరెట్లు నయం‌ అని మీకూ తెలుసు.)
    ఈ దూషణభూషణతిరస్కారములు అశీస్సులుగా తలచే వారేనా మరి మీరు? అలోచించుకోండి మరొకసారి!

    శుభంభూయాత్ (తప్పనిసరి టీక: మీ కున్నూ, మీ‌ గుంటూరుకున్నూ శుభం కలగాలని ఆశించటం అన్నమాట.)

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ,

      చాలా హాస్యభరితంగా హెచ్చరించారు. మీ హెచ్చరికని నేను బాగా ఎంజాయ్ చేశాను. థాంక్యూ!

      బ్లాగుల్లో నన్ను అంటానికి ఏమీ మిగల్లేదులేండి. 'హెచ్చరిక' అంటూనే (పన్లో పనిగా) మీరు కూడా ఓ నాలుగు అనేసినట్లుగా అనిపిస్తుంది. :)

      Delete
    2. అయ్యోరామా, మీ ఎంజాయ్‌మెంట్ కోసమే నండీ బాబూ అ నాలుగుమాటలూ చెప్పిందీ.

      Delete
  3. అందని ద్రాక్ష పండుపుల్లన :) :)

    ReplyDelete
  4. మీ ఆనందం ఎక్కువ రోజులు నిలువదు .. చుడండి అక్కడే రాజధాని వస్తుంది ( రాజు తలుచుకుంటే రాజధానికి కొదవా )

    ReplyDelete
    Replies
    1. నాకూ అదే అనిపిస్తుంది.

      పైపైన చూస్తే ఇదేదో జిల్లాల మధ్య అభివృద్ధిలో పోటీలా అనిపిస్తుంది. కానీ లోలోన చాలా మతలబులున్నాయి.

      Delete
  5. చూశారా మీ సంతోషం మూడు నాళ్ళ ముచ్చటే అయింది .. రాజధాని మీ దగ్గరకే వచ్చింది

    ReplyDelete
    Replies
    1. అవును. నిజంగా మూణ్ణాళ్ళ ముచ్చటే!

      సాధారణంగా చంద్రబాబు ఏ నిర్ణయాన్నైనా బాగా నాన్చిగానీ తీసుకోడు. రాజధాని విషయమలో మాత్రం సూపర్ ఫాస్ట్‌గా వున్నాడు!

      Delete
    2. ఆయన ఈ పని అయిదేళ్లుగా ప్లాన్ వేసినా అది బయట పడకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడని నాకు అనిపిస్తుంది.

      Delete
  6. మీ సంబరం, మాలాంటి వాళ్ళ అభినందనలు తొందరపడి premature celebration అయినట్లుందే ఓ సినిమాపాటలో చెప్పినట్లు. బాడ్ లక్.

    ReplyDelete
    Replies
    1. అవును, అలాగే అయింది. మీరన్నట్లు - నిజంగానే బాడ్ లక్.

      Delete

comments will be moderated, will take sometime to appear.