Thursday 14 August 2014

జ్ఞాని


మొన్నొక డాక్టర్‌తో కబుర్లు చెబుతున్నాను. ఆయనో కార్డియాలజిస్ట్.

నేను సాధారణంగా డాక్టర్లతో స్నేహానికి పెద్దగా ఆసక్తి చూపను. ఇందుకు కార్డియాలజిస్టులు మాత్రం మినహాయింపు. ఎందుకైనా మంచిదనే (భవిష్యత్తులో ఈ గుండెజబ్బులాళ్ళతో అవసరం పడొచ్చుననే స్వార్ధం) ముందుచూపే ఇందుకు కారణం!

ఆ డాక్టర్‌తో మాట్లాడేప్పుడు నా చేతిలో ఒక పుస్తకం వుంది.

"ఆ పుస్తకం ఏమిటి?" ఆ డాక్టర్ కుతూహలంగా అడిగాడు.

"ఇది పుస్తకం ఫలానా నవల. సగం చదివాను. మీక్కావాలంటే వుంచేసుకోండి." అన్నాను.

"అబ్బే! చదివే టైం నాకెక్కడిది? ఊరికే తెలుసుకుందామని అడిగాను." అన్నాడాయన.

"మీరేమీ మొహమాట పడనక్కర్లేదు. చదువుతానంటే పుస్తకం వదిలేసి పోతాను." అన్నాను.

"నాకు మీదగ్గర అస్సలు మొహమాటం లేదు. నాకు పుస్తకాలు చదివే టైమూ లేదు, ఇంటరెస్టూ లేదు." స్థిరంగా, ఖచ్చితత్వంతో చెప్పాడాయన. 

నాకీ డాక్టర్ నచ్చాడు. బాగా పధ్ధతి గల మనిషిలాగున్నాడు. తన గూర్చి తనకి చక్కని అంచనా ఉన్నట్లుంది. నేనా డాక్టర్ వైపు ఈర్ష్యగా చూశాను!

నాకీ బుద్ధిలో సగమైనా ఉంటే బాగుణ్ణు! చాలా పుస్తకాలు చదవాలనే ప్రణాళిక వేసుకుంటాను. కానీ - భారతదేశ దారిద్ర్య నిర్మూలనా ప్రణాళికలా నా పుస్తక పఠనం ఒక్కంగుళం కూడా ముందుకు నడవదు. పోనీ - 'చదవలేను' అని ఒప్పుకోవచ్చుగా? లేదు - రాజకీయ నాయకులకి మల్లే నాకు అహం అడ్డొస్తుంది.

దేవుడి సృష్టిలో రకరకాల జీవులు. ఈ జీవుల్లో కొందరికి ఆత్రం ఎక్కువ. ఎన్నో పన్లు చేద్దామని ఆయాస పడుతుంటారు, ఏదీ చెయ్యలేక నీరసపడుతుంటారు. పోనీ - ఆ తర్వాతైనా రియలైజ్ అయ్యి వాస్తవిక దృక్పధం అలవరచుకుంటారా అంటే - అదీ వుండదు!

కావున - తన పరిమితులు గుర్తించిన వాడే అసలైనా జ్ఞాని అని అనుకుంటున్నాను. ఈ నిర్వచనం ప్రకారం నేను అజ్ఞానిని అయిపోతాను. కానీ - నా అజ్ఞానాన్ని ఒప్పుకోకపోతే పరమ అజ్ఞానిని మిగిలిపోతాననే శంకతో ఈ నిజాన్ని అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను!

(picture courtesy : Google)

6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సార్‌, మీతో పోలిక కాదు గానీ, నాకూ ఈ లాంటి చెడ్డ అలవాటు ఉంది సార్‌, ఇలాంటి వారి నే చేత గాని వారంటారట? నిజమాండీ? సారీ, మిమ్మల్ని కాదండి. నన్ను మాత్రమే. :)

    ReplyDelete
  3. Nijam oppukunnanduku congrats!

    ReplyDelete
  4. ఈ నిజాన్ని అర్జంటుగా ఒప్పేసుకుంటున్నానని చెప్పి గడుసుగా జ్ఞాని ఐపోయారన్నమాట :)

    ReplyDelete
  5. సగం చదివిన పుస్తకాన్నొదిలించుకోవడానికి మీరు పన్నిన కుట్రను గమనించి
    అ గుండెలు తీసే బంటు (సారీ గుండెల డాట్రు గారు) తెలివిగా మీ వలలో పడకుండా
    తప్పించుకున్న తీరు (స్థిరంగా, ఖచ్చితత్వంతో చెప్పడం) మెచ్చుకోదగింది
    లేకపోతె, హన్నన్నా ... అప్పనంగా బుక్కును ఒదిలించుకుందామనే !!! ...

    ReplyDelete
  6. Namaste Ramana Garu, after reading this i remember one great quotation from Sri Ramana Maharshi, who told all books and scriptures were for non self only, ever present and ever shining self never speaks anything. thanks for using your space and your simple articles.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.