Tuesday, 19 August 2014

ద్వివేదుల విశాలాక్షి 'మారిన విలువలు'


సుబ్బారావు, రంగారావు బాల్యస్నేహితులు. సుబ్బారావు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు (మంచి చదువుకి మంచి ఉద్యోగం కన్నా పరమార్ధం వుండదు). డిగ్రీ పరీక్ష పాసవ్వడమే కనాకష్టంగా వుండి, అష్టకష్టాలు పడుతున్న రంగారావు ఆరోజు మిత్రుని వద్ద బావురుమని ఏడ్చాడు. సుబ్బారావు రంగారావుని ఓదార్చాడు.

అటుతరవాత రంగారావు ఏదో చిన్నపాటి వ్యాపారం మొదలెట్టాడు. వ్యాపారంలో కలిసొచ్చి అంచెలంచెలుగా ఎదిగాడు. తెలుగు నేలపై ఒక స్థాయిని మించి ఆర్ధికంగా ఎదగాలంటే కులం అవసరం వుంటుంది. రంగారావు కోస్తాంధ్రలో రాజకీయంగా, సామాజికంగా బలం వున్న కులానికి చెందినవాడు. అంచేత - సాటి కులస్తుల సాయంతో అనేక వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసి ఆనతి కాలంలోనే అనేక కోట్లకి పడగెత్తాడు.

ఒక పెళ్ళి సందర్భంగా సొంతూరుకొచ్చిన సుబ్బారావు రంగారావు సిరిసంపదలు, స్టేటస్ చూసి దిగులు చెందాడు. పిమ్మట మిత్రుని వాటేసుకుని బావురుమన్నాడు. ఇప్పుడు రంగారావు సుబ్బారావుని ఓదార్చాడు. అలా ఓదార్చడంలో రంగారావు గర్వించాడు కూడా! పరీక్షల్లో ఓడిపోయినా, జీవితంలో గెలిచినవాడు అలాగే గర్విస్తాడు కాబోలు!

కొంచెంసేపు క్రితం ఈ పాయింట్‌ ఆధారంగా ఒక బుల్లికథ రాద్దామని కూర్చున్నాను. కానీ - ఈ ఐడియా నా సొంతం కాదని, ఇది చిన్నప్పట్నుండి నా బుర్రలో నిక్షిప్తమై వుందని రాయడం మొదలెట్టినప్పుడు స్పురించింది. తవ్వకాల్లో బయటపడే పంచలోహ విగ్రహంలా, నా బుర్రలోంచి బయటపడ్డ ఈ స్టోరీలైన్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు సంక్షిప్తంగా రాస్తాను.

ఇప్పుడు కొంచెంసేపు ఫ్లాష్‌బ్యాక్. నా చిన్నతనంలో మా ఇంటికి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వచ్చేవి. రెండూ సచిత్ర వారపత్రికలే! నాకు ఆ పత్రికల్లో ఏం రాశారో తెలుసుకోవాలని కుతూహలంగా వుండేది.. కానీ అప్పటికింకా నాకు తెలుగు చదవడం రాదు. అంచేత వాటిని చదవమని అమ్మని విసిగించేవాణ్ని. అప్పటికి 'అఆ'లు నేర్చుకుంటున్న నాకు, ఆల్రెడీ 'అఆ'లు నేర్చేసుకున్నా - వాక్యాల్ని సరీగ్గా చదవడం రాని అక్క సపోర్ట్ లభించేది. అంచేత - అమ్మ ఆ పత్రికల్లో కథలు, కబుర్లు మాకు చదివి వినిపించేది.

సాయంకాలాలు నవ్వారు మంచం మీద మధ్యలో అమ్మ. అమ్మకి నేను, అక్క చెరోవైపూ పడుకునే వాళ్ళం. అమ్మ డ్యూటీ - మాకు అర్ధమయ్యేట్లు నిదానంగా చదవాలి, చదివేప్పుడు మాకొచ్చే బోల్డన్ని డౌట్లకి సమాధానం చెప్పాలి. అమ్మ ఓపిక్కి ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా వుంది. ఆవిడ తన పని చాలా ప్రతిభావంతంగా నిర్వర్తించిందని చెప్పగలను. ఎందుకంటే - నాకావిడ చదివిన కథలు బాగా గుర్తుండిపొయ్యాయి.

గాడేపల్లి కుక్కుటేశ్వరరావు రాసిన 'రాలీ రాలని పువ్వు' ఆంధ్రప్రభలో వచ్చింది. ఇది నేను 'విన్న' మొట్టమొదటి నవల. ఆంధ్రప్రభలోనే వచ్చిన ద్వివేదుల విశాలాక్షి రాసిన 'వైకుంఠపాళి' నేను విన్న రెండో నవల. నేనప్పుడు ఆ కథలు నిజంగా జరిగినవేనని నమ్మేవాణ్ని. రచయితలు ఊహించి కథ రాస్తారని అక్క చెప్పినా నమ్మలేదు. అందుకే - 'వైకుంఠపాళి'లో సావిత్రమ్మ అనే ఒక పాత్ర చనిపోయినప్పుడు నాకు భలే ఏడుపొచ్చింది.

అటుతరవాత నాకు చదవడం వచ్చినా, అమ్మ చేతే చదివించుకునేవాణ్ని. ఎందుకంటే - అమ్మ కథ నాటకీయంగా చదివేది. కథలో ఒక పాత్ర ఇంకో పాత్రని 'నోర్ముయ్' అంటే - అమ్మ కూడా గద్దిస్తున్నట్లు పలికేది. ఒక పాత్ర కష్టాల్లో వున్నప్పుడు అమ్మ గొంతు రుద్దమయ్యేది. కాబట్టి - నా అంతట నేను చదివే కన్నా అమ్మ చదివితేనే నాకు బాగుండేది. నాకు చదవడం వచ్చినా కూడా అమ్మ చేతనే చదివించుకునే సమయంలో వచ్చిన నవలే - ద్వివేదుల విశాలాక్షి 'మారిన విలువలు'. ఈ నవల నాకు చాలా నచ్చింది. ఆ ఇతివృత్తం నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం.

ఒక మధ్యతరగతి కుటుంబం. పెద్దవాడు బుద్ధిమంతుడు, చక్కగా చదువుతుంటాడు. రెండోవాడు మొరటు, అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. పెద్దవాడి మీద తలిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, రెండోవాణ్ని అసహ్యించుకుంటారు. ఇంటి వాతావరణంలో ఇమడలేక రెండోవాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. పెద్దవాడు పరీక్షలు సరీగ్గా రాయక నిరాశతో ఆత్మహత్య చేసుకుంటాడు (ఆత్మహత్య చేసుకునే వ్యక్తి మానసిక సంఘర్షణ విశాలాక్షి చాలా ప్రతిభావంతంగా రాశారు). రెండోవాడు ఒక కిళ్ళకొట్టు వ్యక్తితో వున్న సాన్నిహిత్యంతో అతని వ్యాపారంలో భాగస్వామి అవుతాడు. అతని కూతుర్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆర్ధికంగా నిలదొక్కుకుని పైకొస్తాడు. అతనే నిలబడి అక్క పెళ్ళి చేస్తాడు, తలితండ్రులకి ఆధారంగా నిలుస్తాడు. టూకీగా ఇదీ కథ (నాకు గుర్తున్నంత వరకు).

సో - ఇదీ నా సుబ్బారావు, రంగారావుల కథకి మూలకథ. 'మారిన విలువలు' ఇప్పుడు చదివినా నాకు మళ్ళీ నచ్చుతుందని నమ్ముతున్నాను. నేను తెలుగు పత్రికల్ని చదవడం మానేసి పాతికేళ్ళు దాటింది. కావున - ఇప్పటి పత్రికల కంటెంట్ గూర్చి నాకు అవగాహన లేదు. అయితే - నా బాగా చిన్నప్పుడు చందమామ, కొద్దిగా చిన్నప్పుడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలు చదవడం వల్లనే నాకు 'చదివే అలవాటు' వచ్చిందని అనుకుంటుంటాను.

ముగింపు -

మొన్నామధ్య నా కూతురు ఫేస్బుక్కు లైకుల్తో, వాట్సప్పు మెసేజిల్తో కుస్తీ పడుతూ బిజీగా వుంది.

"ఏదైనా ఒక మంచి నవల చదువుకోరాదా?" ఆ పిల్ల బాధ చూళ్లేక తండ్రి హృదయం ఉప్పొంగి గుమ్మడిలా ఒక ఉచిత సలహా పడేశాను.

"ఎందుకు?" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి అంది.

"పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది." మొహమాటంగా గొణిగాను.

నా కూతురు చికాగ్గా మొహం తిప్పుకుంది. పక్కనే వున్న నా భార్య కిసుక్కున నవ్వింది. ఎందుకో తెలీదు!

(picture courtesy : Google)

10 comments:

  1. // నా కూతురు చికాగ్గా మొహం తిప్పుకుంది. పక్కనే వున్న నా భార్య కిసుక్కున నవ్వింది. ఎందుకో తెలీదు!//
    పేసుబుక్‌ గురించి తెలియని మీ అమాయకత్వానికి నావ్వుకొని ఉంటారు. నవల్లు చదివితే ఏమి విజ్నానం పెరుగుద్ది. అది మీకాలం. :)

    ReplyDelete
    Replies
    1. >>"పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది."<<

      నేనో అజ్ఞానినని నా భార్యకి గట్టి నమ్మకం. అందుకే నవ్వింది! :)

      Delete
    2. నమ్మకం అంటారేమిటండీ ఇంకే పదం దొరకలేదా?

      Delete
    3. ఇలాంటి వేవీ తెలీక నేను చాలా పుస్తకాలు చదివానే,నా గతేంటి ఇప్పుడు?

      Delete
  2. కొందరు మిత్రులు 'do not publish' అంటూ కామెంట్లు పంపుతున్నారు.. ధన్యవాదాలు. అయితే - వారి కామెంట్లు పొడుగ్గా వుంటున్న కారణాన - అవి నాలుగు లైన్లు మించి కనిపించడం లేదు. (పబ్లిష్ చెయ్యకుండా) కామెంట్ పూర్తిగా చదవాలంటే ఏం చెయ్యాలి?

    ReplyDelete
  3. మిత్రులకి ఒక విజ్ఞప్తి :

    నాకు సమయం దొరికినప్పుడల్లా ఏవో నాలుగు ముక్కలు కెలుకుతుంటాను.

    నా ఆలోచనల్ని అక్షరరూపంలో చూసుకునే సరదా కోసమే బ్లాగ్ పోస్టుల్ని రాస్తుంటాను.

    దయచేసి నా రాతల్ని సీరియస్‌గా తీసుకోకండి.

    ReplyDelete
  4. "చిన్నప్పుడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలు చదవడం వల్లనే నాకు 'చదివే అలవాటు' వచ్చిందని అనుకుంటుంటాను....."
    ఇది నిజం అని నేనూ అనుకుంటున్నాను. ఎందుకంటే, మా ఇంటికి కూడా అంధ్రప్రభ వచ్చేది. అందులో ఆదివారం వచే అన్ని శీర్షికలు వదలకుండా చదివే వాడిని. ఆరకంగా పుస్తకాలు చదవటం అబ్బిందని నేను అనుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. అవును. ఆ రోజుల్లో వారపత్రికలు చాలా పాపులర్. కొంతమంది వారపత్రికల్ని జాగ్రత్త చేసుకుని, సీరియల్స్ వారిగా (పుస్తకం లాగా) బైండ్ చేయించేవారు.

      Delete
  5. ///ఆత్మహత్య చేసుకునే వ్యక్తి మానసిక సంఘర్షణ విశాలాక్షి చాలా ప్రతిభావంతంగా రాశారు///

    రచయిత ఆత్మహత్య వెనుక వున్నా సంఘర్షణ ను సరిగా చెప్పకుండా వదిలేస్తే అది ఒక చెత్త రచన. పాత్రల ప్రవర్తన తో రచయిత సంబంధం లేదనడం రచయిత పలాయన వాదానికి నిదర్శనం . ఆశ్చర్యంగా ఒకే సబ్జెక్ట్ తో వ్రాసిన ఇద్దరు రచయితలు ఇలాంటి సమర్ధనలతో కధల ముగింపు అడ్డదిడ్డంగా వ్రాసి వదిలేసారు. రచయిత ప్రతి పాత్రను అర్ధం చేసికొని మంచి చెడులను తాను అనుకొన్న విధంగా మలచడం ని రచన లో ముఖ్యం. మంచి చెడులను కధలోని పాత్రలకే వదిలేస్తే ఆ కధలు గాలికి వదిలేసినట్టే అని నా అభిప్రాయమ్.తన్హాయి అనే కధలో జరిగింది (అంటే అక్కడ ఆత్మహత్య జరిగిందని కాదు) , మళ్ళీ ఇప్పుడు మూలింటామె కధలో కూడా ఇదే చర్చకు వచ్చినట్లు ఉంది.

    ReplyDelete
    Replies
    1. గోపీచంద్ 'అసమర్ధుని జీవయాత్ర' చదివే వుంటారు. చివర్లో సీతారామారావు ఆత్మహత్య పరమ భీభత్సం.

      Delete

comments will be moderated, will take sometime to appear.