ఏవిటో! దేశంలో రోజురోజుకీ పనికిమాలిన దొంగగాడ్దె కొడుకులు ఎక్కువైపోతున్నారు. బ్రహ్మంగారు ఈ వెధవల గూర్చి ఎప్పుడో చెప్పారు. లేకపోతే ఏవిటి? మన భారత రత్నం సచిన్ టెండూల్కర్‌పైనే విమర్శలా! అసలు వీళ్ళకి బుద్ధుందాని?
సచిన్బాబు మన దేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం. ఈ దేశం గాంధీగారు లేకపోతే ఏమయ్యేదో తెలీదు, నెహ్రూగారు లేకపోతే ఏమయ్యేదో తెలీదు. కానీ - సచిన్బాబు లేకపోతే మాత్రం బావురుమనేదని నేను అనుకుంటుంటాను.
సచిన్! నువ్వు క్రికెట్ బ్యాటుతో గ్రౌండులోకి వస్తుంటే సాక్షాత్తు కరవాలం దూసిన ఆ ఛత్రపతి శివాజీనే దర్శించాం. నువ్వు బంతిని డ్రైవ్ చేసినప్పుడు లక్ష మరఫిరంగులు శత్రువు గుండెల్లో పేల్చినంత ఉద్వేగానికి గురయ్యాం. నువ్వు సెంచరీ సాధించినప్పుడల్లా - మనసు పడ్డ చిన్నదాని మెత్తని మత్తైన మకరందపు నవ్వు గాంచినట్లు - మా హృదయం ఆనందంతో పులకించిపోయింది.
నీకు 'భారతరత్న' కన్నా ఎక్కువ గౌరవం ఇవ్వలేకపోయినందుకు మమ్మల్ని క్షమించు. మాకు తెలుసు, నువ్వు భారతరత్నకే రత్నానివని! నీ స్నేహితుడు రాహుల్ గాంధీ మాట తీసెయ్యలేక రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించావే గానీ, నీకా బోడి రాజ్యసభో లెక్కా! నీ పవిత్ర పాదధూళితో రాజ్యసభ ధన్యమైంది సచిన్!
నీకెన్ని పన్లు! ఒక్క క్షణం కూడా ఊపిరి సలపదాయె! లెక్కలేనన్ని కమర్షియల్స్‌లో నటించాలి, అనేక బ్రాండ్లకి అంబాసిడర్‌వి కూడా. ఇంకా అనేక సోషల్ ఈవెంట్లలో ముఖ్య అతిధివి. ఆపై నీకిష్టమైన వింబుల్డన్ మ్యాచ్‌లు చూసుకోవాలి. నీ కష్టం ఆ పగ వాడిక్కూడా వద్దు సచిన్!
ఈ లోకం దొంగముండ కొడుకుల నిలయం, ఇక్కడ మంచితనానికి తావు లేదు. అందుకే - నీ ఘోర కష్టం గుర్తించని దొంగ రాస్కెల్స్ - నువ్వు రాజ్యసభకి ఈ సంవత్సరంలో అసలు హాజరే అవ్వలేదనీ, నీ ఎంపీ నిధుల్నుండి ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదని వాగుతున్నారు. ఈ విమర్శలకి నువ్వు నొచ్చుకుంటావని ఆందోళన చెందుతున్నాను. సచిన్బాబూ! నువ్వు ఈ పిచ్చి ప్రేలాపలని పట్టించుకోకు.
ఈ సృష్టి భగవంతుని నిర్మితము. కనులకి ఇంపుగా పురులు విప్పి నాట్యం చేసే నెమలిని దేవుడు సృష్టించాడు. బద్దకంగా బురదగుంటలో పడుకునే అసహ్యకరమైన పందిని కూడా అదే దేవుడు సృష్టించాడు. ఆ దేవుని లీలలు సామాన్యులకి అర్ధం కావు (నేను సామాన్యుణ్ని కావున ఈ విషయం ఇంతటితో వదిలేస్తాను). ఈ సృష్టిలో బురద పందులున్నట్లే బురద మనస్తత్వపు మనుషులుంటారు. వాళ్ళు నీ మీద నాలుగు రాళ్ళేసి తృప్తినొందుతారు.
సచిన్! నువ్వు అమూల్యమైన వజ్రానివి. వజ్రాన్ని భద్రంగా లాకర్లో పెట్టుకోవాలే గానీ - నెత్తిన ధరించి తిరగరాదు (అప్పుడు ఎవడోకడు కొట్టేస్తాడు). అంచేత నువ్వు రాజ్యసభకి రానవసరం లేదు, ఈ దుష్టప్రచారాన్ని పట్టించుకోనవసరం లేదు. అర్ధం చేసుకోగలం - నువ్వు రాజ్యసభ సభ్యుడవైంది ఆ సభని ఉద్ధరించడానికే గానీ, అక్కడ జరిపే పనికిమాలిన చర్చల్లో పాల్గొండానికి కాదు.
మరొక్కసారి నిన్ను మనసారా పొగడనీ సచిన్! నువ్వు మా దేశంలో జన్మించడం మాకెంతో గర్వకారణం. ఈ దేశంలో ఏముంది సచిన్? దరిద్రం, ఆకలి చావులు, అవినీతి, మత ఘర్షణలు, మానభంగాలు తప్ప ఇంకేవీ లేవనుకుని విరక్తి చెందే మాలాంటి ఎందరికో నువ్వు ఆశాజ్యోతివి.
ఈ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులు పెంచడానికి రాజకీయ మార్గాన్నెంచుకుని ఎందరో అశువులు బాశారు. వాళ్ళు అల్పులు. నువ్వు ఒక్క క్రికెట్ బ్యాటుతోనే ఈ దేశానికి వన్నె తెచ్చావు.
నువ్వు మా దేవుడివి, మా పెన్నిధివి, మా ఇలవేల్పువి, మా మనసుల్ని దోచుకున్న దొంగవి. అందుకే అంటాను -
"మా సచిన్బాబు బంగారుకొండ"
(photo courtesy : Google)
మరే,,ఆ స్టీవ్ వా నో ఎవడో పనీపాట లేకుండా కలకత్తా అనాధ పిల్లలను చూడ్డానికి వస్తుంటాడు.ఎంచక్కా నీలా మంచిమంచి ఓటేల్లు పెట్టడం తెలీని సన్నాసి.
ReplyDeleteNinda stuti ki reverse gear vesaru. Daatraaru ee madhya vyangya rachanallo pandipotunnaru.
ReplyDelete//నువ్వు మా దేవుడివి, మా పెన్నిధివి, మా ఇలవేల్పువి, మా మనసుల్ని దోచుకున్న దొంగవి. అందుకే అంటాను -
ReplyDelete"మా సచిన్బాబు బంగారుకొండ"//
సార్, నిజం చెప్పారు, సచిన్ లాంటి దేవుడు మన దేశం లో పుట్టడం భారతీయులు చేసుకున్న పుణ్యం! ఈలాంటి వేనోళ్ల పొగిడినా ఆయంకు సాటి రావు. మన వాళ్లు ఒక్క భారత రత్న ఇచ్చారు కానీ అలాంటివి వెయ్యి ఇచ్చినా ఆయన్ అరుణం మనం తీరుకోలేము. జై సచిన్! వై సచిన్?
క్రికెట్ ఆటగాళ్ళని, సినిమా హీరోలని తీసుకుపోయి ఎక్కడో ఎత్తున కూర్చోపెట్టినది / పెడుతున్నది మనమే. ఆటలో ప్రతిభ కనపరిచినంత మాత్రాన, అప్పుడప్పుడు దేశం గెలుపుకి దోహద పడ్డంత మాత్రాన వాళ్ళు నిజ జీవితంలో కూడా సుగుణాల ప్రోవులనుకోనక్కరలేదు. ఈ సోకాల్డ్ సెలెబ్రిటీలంతా వారి వృత్తుల్లో చెప్పినవి చూపించినవి బయట కూడా చేస్తారని అనుకోవడం / ఊహించుకోవడం, వాళ్ళకి బయట కూడా గొప్పతనాన్ని ఆపాదించడం - మన తప్పు. అలాగే సినిమా వాళ్ళూనూ. కొంతమంది ప్రముఖ "యాంకరిణులు" రోజూ సినిమా వాళ్ళ నామస్మరణే చేస్తూ చూపిస్తున్న టీవీ ప్రోగ్రాముల్ని గుడ్లప్పగించి చూడటం, ఈ "సెలెబ్రిటీ" వెర్రి వల్ల ఒక తరం మొత్తం ప్రభావితం అవడం - మన తప్పు. ఆ sense of proportion మనకుండాలి. అది కొరవడిన ప్రజలు వీళ్ళని ఆరాధనగా చూడటం - ఆ తప్పు సెలెబ్రిటీలది కాదు. జనం వేలంవెర్రి, ఆరాధన సెలెబ్రిటీలకి కమ్మగానే ఉంటుంది, వాళ్ళకి కావలసింది కూడా ఆ ఆరాధన, చప్పట్లే.
ReplyDeleteవ్యాపార సంస్కృతి బాగా వంటపట్టించుకున్న ఈ ఆటగాళ్ళకు ఈరోజుల్లో ప్రజలంటేనూ, డబ్బు పోసి టికెట్లు కొని స్టేడియంకి వచ్చిన జనాలంటేనూ పెద్ద ఖాతరు లేదనిపిస్తుంది (ఉదాహరణ :- టీవీ మీద గమనించే ఉంటారు - స్టేడియం లో కూర్చున్న ప్రేక్షకులు సెంచరీకి చప్పట్లు కొడితే చాలామంది బాట్స్మెన్ ప్రేక్షకులకి అభివాదం చెయ్యటం కూడా మానేసారు - ప్రముఖ ఆటగాళ్ళతో సహా - లోకంలో ఇంకెవరితోనూ సంబంధం లేదన్నట్లు. పెవిలియన్ వైపు తిరిగి తమ టీం మేట్స్ కోసం మాత్రం బాట్ పొడుస్తున్నట్లుగా ఊపటం చేస్తున్నారు. బహుశా అది వాళ్ళ అభిప్రాయంలో "టీం స్పిరిట్" అనుకోవాలేమో? మరి క్రికెట్ ఒకప్పడు జెంటల్మెన్ పద్ధతులకి పేరుమోసిన క్రీడ. ఇప్పుడు ఆ మర్యాదలు కనుమరుగవుతున్నట్లుంది).
వీళ్ళని బయట అందలం ఎక్కించటం తగ్గించి మామూలు మనుష్యులు లాగానే చూడగలిగితే వ్యక్తి పూజ, "సెలెబ్రిటీల" పిచ్చి, వాళ్ళ పుట్టినరోజులకి వాళ్ళమీద పద్యాలు మనమే వ్రాసుకుని మురిసిపోయేంత మైమరపు లాంటి మోజులోంచి బయటకు రాగలుగుతాము.
ఒలె ఒలె ఒలె ...
ReplyDeleteదొంగ సచ్చినోల్లంతా ... దొంగ సచ్చినోల్లు ...
పనీపాటా లేని పోరంబోకులు ...
ఆల్లన్నకి బాగులేక ఇంటో పడుంటే, చూస్కుంట
పాపం బిడ్డ గడప దాటకుండ ఇంట్లో పడుంటే ...
సచ్చినోల్లు, ఈల్ల జిమ్మడ బిడ్డ్నోకటే ఆడిపోసుడు ...
సన్నాసి 'సచ్చి'నోల్లు ... మంచీ చెడూ ఇవరం లేనోల్లు ...