Saturday 23 August 2014

సైకో


గత కొన్ని నెలలుగా తెలుగు వార్తా చానెళ్ళు, పత్రికలు, బ్లాగు ఎగ్రిగేటర్లని చూడ్డం మానేశాను. హాయిగా వుంది. ఈ సంగతి తెలిస్తే ఇంకా ముందే మానేసి వుందును. 

ఇవ్వాళ పొద్దున్న ఒక మిత్రుణ్నించి ఫోన్.

"నువ్వు 'సైకో' కేసులు చూస్తావా?" అడిగాడు. 

"ఎందుకు చూడను? మాకు సగం కేసులు అవే కదా?" నవ్వుతూ అన్నాను. 

"సైకో అంటే ఏవిటి?" కుతూహలంగా అడిగాడు నా మిత్రుడు. 

"అద్సర్లే గానీ - సైకో పేరుతొ హిచ్‌కాక్ సినిమా తీశాడు. చూశావా?" అడిగాను. 

"చూళ్ళేదు. ఇంతకీ 'సైకో' అంటే ఏవిటి?" మళ్ళీ అడిగాడతను. 

"సైకో అనేది 'సైకోసిస్' అనే మానసిక రోగానికి పొట్టి పేరు. డాక్టర్లెవరూ ఈ పదం వాడరు. సామాన్య జనంలో కొందరు - 'సైకో' అంటే తీవ్రంగా డిస్టర్బ్ అయ్యి ఎగ్రెసివ్‌గా ప్రవర్తించేవాళ్ళ పట్ల negative connotation తో వాడతారు. ఇది చాలా తప్పు. ఒక రోగాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడ్డం సంస్కారవంతుల లక్షణం కాదు. నువ్వీ పదం ఎప్పుడూ వాడకు." ఓపిగ్గా చెప్పాను.  

"పత్రికల్లో వాడుతున్నారు కదా?" అన్నాడతను. 

"తెలుగు పత్రికలకి సంస్కారం వుండదు, బాధ్యతా వుండదు. అందుకే - 'సైకో' అనే పదాన్ని చాలా అన్‌పాపులర్ చేశాయి. తెలుగు పత్రికలు సృష్టించిన 'సైకో' భయోత్పాదన వల్ల జనాలు మానసిక రోగుల్ని కొట్టి చంపుతున్నారు." అన్నాను.   

"మానసిక రోగులు తాము ఫలానా రోగులమని జనాలకి చెబితే ఎందుకు కొడతారు?" అడిగాడు. 

"చెప్పొచ్చు. కానీ - వాళ్ళకి తాము మానసిక రోగులమని తెలీదు! పేరనాయిడ్ స్కిజోఫ్రీనియా అనే జబ్బులో రోగులు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అడిగిన ప్రశ్నలకి సమాధానం సరీగ్గా చెప్పలేరు. గొణుగుతూ, భయంగా, అనుమానంగా ఏవో పొంతన లేని సమాధానాలు చెబుతారు. సామాన్య ప్రజలకి అతనే 'సైకో' అనుకోడానికి అంతకన్నా ఇంకేం ఋజువు కావాలి? అందుకే కొట్టి చంపేస్తున్నారు." అన్నాను. 

అంతలో నాకో సందేహం. 

"పొద్దున్నే ఫోన్ చేసి ఈ ధర్మసందేహాలేంటి?" అడిగాను. 

"ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 'సైకో' అనే పదం వినిపిస్తుంటే అడిగాన్లే." అన్నాడు నా మిత్రుడు. 

"ఓ అలాగా!" నిరాసక్తంగా అన్నాను. 

"ఓసారి మానసిక రోగులూ మనుషులే  అంటూ ఆంధ్రజ్యోతిలో రాశావు కదా! ఇప్పుడేమన్నా రాయరాదా?" అడిగాడు నా స్నేహితుడు. 

"అప్పుడు నాకు బుద్ధి లేక అలా రాశాన్లే! అయినా - కొన్ని లక్షల మందిచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకి లేని సున్నితత్వం, రెండొందల మంది చదివే బ్లాగ్ పోస్టులు రాసుకునేవాణ్ని నాకెందుకు?" అంటూ ఫోన్ కట్ చేశాను. 

(picture courtesy : Google)

2 comments:

  1. "రెండొందల మంది చదివే బ్లాగ్ పోస్టులు"

    వ్యాపార రహస్యాలు బయట పెడితే ఎలాగండీ!

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా?

      నా అభిప్రాయం - ఒక పోస్టుని రెండొందల మంది చదివితే - బాగా చదివినట్లు లెక్క.

      Delete

comments will be moderated, will take sometime to appear.