Monday, 11 August 2014

ఆరోగ్యమే మహాభాగ్యము


'ఆరోగ్యమే మహాభాగ్యము' - ఈ విషయం సుబ్బారావు మనసులో లోతుగా పాతుకుపోయింది. అందుకే అతను ఆ మహాభాగ్యానికి శాశ్వత చిరునామాగా ఉందామని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ వుంటాడు. అందుకతను చాలా గర్వపడతాడు కూడా.

సుబ్బారావుకి ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ. ఉదయాన్నే కోడికూత కన్నా ముందే లేస్తాడు. ఒక లీటరు గోరువెచ్చని నీరు తాగి - జాగింగ్ షూస్, ట్రాక్ సూట్ వేసుకుని నాలుగు మైళ్ళు పరిగెడతాడు. ఆపై గచ్చు మీద ఒక గుడ్డ పరుచుకుని కనీసం గంటపాటు యోగాసనాలు వేస్తాడు. ఆ తరవాత కొంతసేపు ధ్యానం చేసుకుంటాడు.

పిమ్మట మెలకెత్తిన గింజలు, కేరట్, కీరా దోసకాయ ముక్కలు బాగా నమిలి తింటాడు (వాటినలా నమలకపొతే సరీగ్గా జీర్ణం కావు). అతగాడి బ్రేక్‌ఫాస్ట్ రెండిడ్లీ, ఆపై ఒక కప్పు గోరువెచ్చని పాలు. అంతే! అంతకుమించి ఇంకేదీ తినడు. ఒకసారి అతని భార్య ప్రేమగా ప్లేట్లో మూడో ఇడ్లీ పెట్టిందని కోపం తెచ్చుకుని నెల్రోజుల పాటు ఆమెతో మాట్లాడ్డం మానేశాడు! అవును మరి - ఆహార నియమాల్లో అతనిది ఉక్కు క్రమశిక్షణ!

మధ్యాహ్నం భోజనంగా ఉప్పులేని కూరతో ఒక కప్పు అన్నం, కొంచెం పెరుగు. అంతకుమించి అతనెప్పుడూ తిన్లేదు. అతనికి కాఫీ, టీల్లాంటివి అలవాట్లు లేవు. వక్కపొడి రుచి తెలీదు. మరీ ఆకలనిపిస్తే అప్పుడప్పుడు ఒక యాపిల్లో నాలుగో భాగం తింటాడు. రాత్రి ఉప్పు లేని పప్పుతో ఒక పుల్కా, గ్లాసుడు పల్చని మజ్జిగ (ఉప్పు లేకుండా). గత కొన్నేళ్లుగా అతని ఆహారపు అలవాట్లు ఇవే.

ఉప్పు అనేది సమస్త రోగాలకి మూలం అని ఎవరో ఒకయాన పొద్దస్తమానం టీవీల్లో చెబుతుంటాట్ట. అందుకే సుబ్బారావు ఉప్పుని నిప్పులా చూస్తాడు. అతను అప్పుడప్పుడూ మెంతులు నముల్తుంటాడు! మెంతులు తింటే షుగర్రోగం దరిదాపులక్కూడా రాదుట! ఇలా ఆరోగ్యం గూర్చి అనేక పత్రికలు చదువుతూ, టీవీలో చూస్తూ తన జ్ఞానాన్ని మెరుగు పరుచుకుంటూ వుంటాడు.

అలా సంపాదించిన జ్ఞానంతో తన ఆరోగ్యం గూర్చి తీవ్రంగా వ్యాకులత చెందుతూ వుంటాడు సుబ్బారావు.

'ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నానా? ఇకనుండి ఒకడ్లీ మాత్రమే తింటే బెటరేమో!'

'రోజూ నాలుగు మైళ్ళ పరుగు సరిపోదేమో? ఇంకో నాలుగు మైళ్ళు పరిగెత్తితే ఎలా వుంటుంది?'

'టమోటా తింటే కిడ్నీలో రాళ్ళొస్తాయా? అరెరే! ఈ సంగత్తెలీక నిన్ననే టమోటా పప్పు తిన్నానే! కొంపదీసి నాగ్గాని కిడ్నీలో రాళ్ళేర్పడవు కదా?'

'ఇవ్వాళ నాకు నాలుగు ఫర్లాంగుల దూరంలో ఒక దరిద్రుడు సిగరెట్టు కాల్చాడు. వాడి సిగరెట్టు పొగ గాలివాటున నా ముక్కుకి తగిలిందా? అది నా ఊపిరితిత్తుల్లోకి పోలేదు కదా?'

'మొన్న పెళ్ళిలో టెమ్టయ్యి చిటికెడు మైసూరు పాకం తిన్నాను. షుగరు బొగరు రాదు కదా?'


సుబ్బారావుకి ఒక చిన్ననాటి స్నేహితుడు వున్నాడు, పేరు రమణారావు. మనిషి మంచివాడు. అతనికి సుబ్బారావంటే చాలా అభిమానం. కానీ - రమణారావు సిగరెట్లు హెవీగా కాలుస్తాడు, మందు ఫుల్లుగా కొడతాడు, విపరీతంగా తింటాడు, వ్యాయామం అంటే ఏంటో అతనికి తెలీదు.

సుబ్బారావు తన మిత్రునికి ఆరోగ్య సూత్రాల గూర్చి అనేక విధాలుగా చెప్పి చూశాడు. రమణారావు నవ్వి ఊరుకునేవాడుకానీ స్నేహితుని సలహాలు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. సుబ్బారావు రమణారావు దగ్గర ఎక్కువసేపు వుండేవాడు కాదు. వున్న ఆ కొంచెంసేపు కూడా అతనెక్కడ సిగరెట్టు ముట్టిస్తాడోననే భయంతో వణికిపొయ్యేవాడు!

కాలచక్రం గిర్రుమంటూ తిరుగుతూనే వుంది. అలా - ఆరోగ్య నియమాల్తో సుబ్బారావు.. తన అలవాట్లతో రమణారావు సంతోషముగా జీవించుచుండగా -

విధి బలీయమైనది, క్రూరమైనది, విచక్షణ లేనిది. 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?' అంటూ 'లవకుశ'లో ఘంటసాల పాడనే పాడాడు గదా! ఒకరోజు హఠాత్తుగా సుబ్బారావు దుర్మరణం చెందాడు! అతను పొద్దున్నే జాగింగ్ చేయుచుండగా వెనకనుండి స్పీడుగా వస్తున్న పాల వ్యాన్ గుద్దేసింది, స్పాట్ డెడ్.

రమణారావు మిత్రుని మృతి తట్టుకోలేకపొయ్యాడు, భోరున విలపించాడు. అతనిన్నాళ్ళూ - సుబ్బారావు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వందేళ్ళు బ్రతుకుతాడని, తనకేదైనా అయినా - తన కుటుంబానికి తన మిత్రుని అండ ఉంటుందని భరోసాగా వున్నాడు.

"అయ్యో మిత్రమా! తెల్లారుగట్ట రోడ్లెంట పడి పిచ్చికుక్కలా పరుగులెత్తావు. కాళ్ళూ చేతులు మెలికలు తిప్పేస్తూ ఆసనాలు వేశావు. ఆరోగ్య పరిరక్షణ అంటూ నాకు కర్ణకఠోరమైన క్లాసులు పీకావు. ఇన్ని చేసినవాడివి - వెనకనే వస్తున్న ఆ మాయదారి పాలవాన్‌ని మాత్రం ఎందుకు చూసుకోలేపొయ్యావు?

అయ్యో నా బాల్య మిత్రమా! జీవితంలో ఏదీ అనుభవించకుండానే పొయ్యావెందుకు? నీకు విస్కీ వాసన తెలీదు, గోల్డ్‌ఫ్లేక్ మజా తెలీదు, చికెన్ రుచి తెలీదు. ఎక్కువ రోజులు బ్రతకాలని పిల్లిలాగా, గోడ మీద బల్లిలాగా - రుచీపచీ లేని చప్పని జీవితాన్ని గడిపావు. ఇలా అయిపోతావని ముందే తెలిస్తే బలవంతంగానైనా నీ నోట్లో బకార్డి రమ్ము పోసేవాణ్నే, తందూరీ చికెన్ కుక్కేవాణ్నే!"

రమణారావుని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. పాపం రమణారావు!

ముగింపు -

జనన మరణములు దైవాధీనములు, లలాట లిఖితము. దేవుణ్ణి కాదండానికి నువ్వెవరు? నేనెవరు? భూమ్మీద నూకలున్నవాడు ఏది ఎంత తాగిననూ, అసలేది తాగకున్ననూ జీవించే యుండును. నూకల్లేనివాడు ఎంత పరిగెత్తిననూ, ఎంత ఒళ్ళు విరుచుకున్ననూ పరలోకప్రాప్తి తధ్యము! అంతా ఆ పైవాడి లీల!

నీతి -

ఆరోగ్యం మహాభాగ్యమే! అయితే - యాక్సిడెంట్లు తప్పించుకొనుట అంతకన్నా మహాభాగ్యము!

(picture courtesy : Google)

6 comments:

  1. :) బాగు౦ది బాగు౦ది.

    ReplyDelete
  2. నిజమేనండీ 70+ వయస్సుండి గుప్పుగుప్పున పొగతాగుతూ గుండ్రాళ్ళలాగున్న వాళ్ళు ఉన్నారు.

    ReplyDelete
  3. 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?' అన్నట్టుగానే చిత్రం తిరగేస్తే, రమణా రావు గాను, సుబ్బారావు రమణా రావు గా అయివుండే వారు కాదా? నేను శ్రీ శ్రీ ఆశా వాదిని. :)

    ReplyDelete
  4. కామెంటిన మిత్రులకి ధన్యవాదాలు.

    ఈ మధ్య విసుగనిపించి ట్రెడ్‌మిల్ మానేశాను. అందువల్ల - ఎక్సర్సైజులు చేసేవాళ్ళ పట్ల కుళ్ళుతో ఈ పోస్ట్ రాశాను (అందుకే సుబ్బారావుని పాలవాన్‌తో గుద్దించేశాను).

    సుబ్బారావులా అనుక్షణం ఆరోగ్యం గూర్చి ఆలోచించేవాళ్ళు నాకు తెలుసు. ఉప్పు మానేసి ఆస్పత్రుల పాలైనవాళ్ళూ తెలుసు. సుబ్బారావు గూర్చి రాసేప్పుడు వాళ్ళని గుర్తు తెచ్చుకుని రాశాను. ఆ ఆరోగ్య పరిరక్షణ వీరులకి కృతజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. డా. రమణా (రావు) గారూ, పాపం మీ మిత్రుడు సుబ్బారావు!

      Delete
  5. అరరె ...
    సుబ్బారావు గారి దుర్మరణపు విషాదం
    మనందరికీ కలిగించిందింత వినోదం ...

    ఒకరికి ఖేదం
    ఒకరికి మోదం ...

    peace be to mr subbarao's soul ...
    amen ...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.