'దెయ్యాలు తెల్లచీరే ఎందుక్కట్టుకుంటయ్!?'
ప్రశ్న చదువుతుంటే సరదాగా వుంది కదూ? అవును! ఇప్పుడు నాక్కూడా సరదాగానే వుంది! కానీ - ఒకానొకప్పుడు ఈ సందేహం నన్ను వెంటాడింది, వేధించింది. కరక్టుగా చెప్పాలంటే భయపెట్టింది! అమావాస్య అర్ధరాత్రి సమయాన స్మశానంలో నక్కలు ఊళ వేస్తుంటే, కొరివి దెయ్యాలతో కోకాకోలా తాగుతూ కథాకళి ఆడే ధైర్యవంతులు ఉండవచ్చు గాక! వారికో నమస్కారం. నాకంత ధైర్యం లేదు.
పోలీసుకి యూనిఫాం వుంటుంది - ఎందుకంటే పోలీసంటే మనక్కనిపించని నాలుగో సింహం కాబట్టి, ఆ సింహాన్ని చూసి మనం ఝడుసుకోవాలి కాబట్టి! భయపెట్టడంలో దెయ్యాలక్కూడా ఖాకీలే స్పూర్తా? కానప్పుడు - మరి దెయ్యాలకి యూనిఫామ్ ఎందుకు? అసలీ అప్రకటిత తెల్లచీర అనే డ్రెస్ కోడ్‌కి కారకులెవరు? మనుషుల్లోలాగా - ఆడ దెయ్యాలు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాల్సిందని వొత్తిడి చేసే సంస్కృతి పరిరక్షక దళాలు దెయ్యాల్లో కూడా వున్నాయా?
వురే పిరికి సన్నాసి! దెయ్యాలూ ఒకప్పుడు మనుషులేరా నాయనా! వాటికి మాత్రం మనసుండదా? హక్కులుండవా? ఫ్యాషన్లుండవా? అయినా మనిషివైన నీకు - దెయ్యాల వ్యక్తిగత విషయాలు అవసరమా? స్త్రీల గూర్చి స్త్రీలే రాసుకోవాలి, దళితుల గూర్చి దళితులే రాసుకోవాలి, దెయ్యాల గూర్చి దెయ్యాలే రాసుకోవాలి! అస్తిత్వ వాదాలు నీకు తెలీదా? ఒప్పుకుంటున్నాను. దెయ్యాల డెమాక్రటిక్ రైట్‌ని కాదనను - ఇక్కడ నేను నా భయాన్ని మాత్రమే రాసుకుంటున్నాను.
ఇప్పుడు విషయంలోకి వద్దాం. అప్పుడు నా వయసు ఆరేళ్ళు వుంటాయేమో. ఒకసారి నా చిన్న మేనమామ మా ఇంటికి వచ్చాడు. ఆయన, అన్నయ్య ఆ సాయంకాలం సినిమా ప్రోగ్రాము పెట్టుకున్నారు. వాళ్ళ కదలికలికలపై నిఘా వేసి - చివరి క్షణంలో ఆ సినిమా ప్రోగ్రాములో నేనూ దూరాను. 'జీవితంలో సినిమా చూసే ఏ చిన్న అవకాశమూ వదలరాదు.' అనేది నా చిన్నప్పటి భీషణ ప్రతిజ్ఞ.
సినిమా పేరు 'అంతస్తులు' (ఏదైతే నాకేం?). హాలు శేషమహల్ (ఏదైతే నాకేం?). సినిమా హాల్లో నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ అనే వివిధ తరగతులు వుంటాయి. నాకైతే తెరకి దగ్గర్లోంచి సినిమా చూట్టం ఇష్టం. మావయ్య కుర్చీ టిక్కెట్లు తీసుకోబొయ్యాడు. తెర మరీ దూరమైపోతుందని కుర్చీ క్లాసు వద్దన్నాను. అంచేత ఆయన బెంచీ క్లాసుకి టిక్కెట్లు తీసుకున్నాడు.
ఇప్పుడు మీకు కుంచెంసేపు నా తెలివితేటల గూర్చి సెల్ఫ్ డబ్బా. ఒక్కోసారి లోకంలో చాలా అన్యాయం పబ్లిగ్గానే జరుగుతుంటుంది. అందుకు ప్రజలు కూడా గొర్రెల మందల్లా సహకరిస్తుంటారు. అందుకు మంచి ఉదాహరణ మన సినిమా హాలువాళ్ళ చేస్తున్న మోసం - వాళ్ళు మనం ఎంత ఖరీదైన టిక్కెట్టు కొంటే హాల్లో అంత వెనగ్గా కూర్చోబెడతారు! ఇదెక్కడి న్యాయం?!
నేను అందర్లా అమాయకుణ్ని కాదు, చాలా ఆలోచనాపరుణ్ని. అందుకే సినిమా హాలు వాళ్ళ మోసం కనిపెట్టేశాను. కావున - నేల క్లాసంటేనే నాకు చాలా ఇష్టం. డబ్బు తక్కువ, గిట్టుబాటు ఎక్కువ. తెరకి దగ్గరగా సినిమా చూస్తే కళ్ళు మండుతాయనీ, లాగుతాయనీ కొందరంటారు. నాకైతే వాళ్ళకేదో కళ్ళరోగం వుందనిపిస్తుంది.
సరే! హాల్లో తిండానికి కొనిమ్మంటే అమ్మైతే 'అవెందుకు? ఇవెందుకు?' అని విసుక్కుంటుంది కానీ, మావయ్య అలా అన్లేడుగా! ఈ మొహమాటాన్ని క్యాష్ చేసుకున్నాను. హాల్లో కుర్రాళ్ళు బుట్టల్తో అమ్మే చక్రాలు, వేరుశనక్కాయలు, నిమ్మతొనలు.. ఎవణ్నీ వదల్లేదు. సినిమా హీరోయిన్ నిర్మాతల్తో ఖర్చు చేయించినట్లు మామయ్యతో అన్నీ కొనిపించాను.
జేబుల్లో నిండుగా వున్న ఆహారాన్ని తృప్తిగా తడుముకుంటూ, ప్రశాంతంగా మేస్తూ సినిమా చూడసాగాను. అప్పటికి తెర మీద బొమ్మల్ని ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూడ్డం మించి - కథ అర్ధం చేసుకునేంత వయసు లేదు. అయితే - అంతస్తులు సినిమా మొదలైన కొంతసేపటికి - నాకు అసలు సినిమా మొదలైంది.
ఒక పెద్ద భవంతి. తెల్లచీర కట్టుకుని, జుట్టు విరబోసుకున్న ఒక నడివయసు స్త్రీ తెరపై ప్రత్యక్షమైంది. ఆవిడ దెయ్యంట! 'నిను వీడని నీడను నేనే' అంటూ పాడ్డం మొదలెట్టింది. దెయ్యాన్ని వీడకుండా కెమెరా దెయ్యం వెనకే పరిగెడుతుంది. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. పాటతోపాటు - పిచ్చి పిశాచాలు కీళ్ళ నొప్పుల్తో ఆక్రందన చేస్తున్నట్లు - భీభత్సమైన వాయిద్యాల హోరు. కళ్ళు గట్టిగా మూసుకున్నా ఆ మ్యూజిక్ భయపెడుతుంది.
'మావయ్యా! బయ్యంగా వుంది.' బిక్కమొహంతో అన్నాను.
'భయమెందుకు? మేమున్నాంగా. ఒక పన్జెయ్యి. మా ఇద్దరి మధ్యలో కూర్చో.' అంటూ నన్ను మధ్య సీట్లో కూర్చోబెట్టాడు మావయ్య.
అటువైపు తిరిగి చూద్దును కదా - మా అన్నయ్య ఆల్రెడీ భయంతో బిగుసుకుపోయున్నాడు!
తెలివైనవాడెవడైనా దెయ్యం కనిపిస్తే పరిగెత్తుకుంటూ పారిపోతాడు. మరా సినిమాలో ఆ ముసలాయన (ఆయన పేరు గుమ్మడి అట! గుమ్మడికాయలా అదేం పేరు?) అంత తెలివితక్కువగా దెయ్యాన్ని ఎందుకు వెంబడించాడో నాకర్ధం కాలేదు! చివరికి ఆ దెయ్యం వల్లనే ఆ ముసలాయన చనిపోతాడు. నాకా సినిమాలో దెయ్యం తప్పించి ఇంకేమీ గుర్తు లేదు (అర్ధం కాలేదు).
ఆ రోజు నుండి నా తిప్పలు కుక్కలు కూడా పడవు. దెయ్యం ఆలోచనతో బుర్రంతా అట్టు పెనంలా వేడిగా అయిపొయ్యేది. అప్పటిదాకా చీకటి పడ్డాక్కూడా ఆటలు ఆడేవాణ్ని. ఆకలైతే గానీ ఇల్లు గుర్తొచ్చేది కాదు. ఈలోపు అక్క నన్ను వెతుక్కుంటూ వచ్చి రెండు తగిలిస్తే కానీ ఇంటికొచ్చేవాణ్ని కాదు. అట్లాంటి నేను - చీకటిగా కాకముందే - బుద్ధిగా ఇంటికి చేరుకోసాగాను.
దెయ్యాలే తెల్లచీరలు కడతాయా? తెల్లచీరలు కట్టుకున్న వాళ్ళంతా దెయ్యాలేనా? ఆ ముసలాయన్ని చంపేసిన తెల్లచీర దెయ్యం మా ఇంటిక్కూడా వస్తుందా? ఏమో! ఎవరికి తెలుసు? శేషమహల్ నుండి మా ఇల్లు ఏమంత దూరమని! గట్టిగా నడిస్తే ఐదు నిమిషాలు, అందునా దెయ్యాలకి నడిచే ఖర్మేం పట్టింది. గాల్లో ఎగురుకుంటూ వస్తే ఒక్క నిమిషం కూడా పట్టదు. లేదు లేదు! దెయ్యం మా ఇంటికి వద్దామనుకున్నా రాలేదు. మా ఇంటికి ఒకవైపు శివాలయం, ఇంకోవైపు ఓంకార క్షేత్రం వున్నాయిగా! దెయ్యాలకి దేవుడంటే బయ్యం కదా!
అయినా ఆ దెయ్యం మా ఇంటికొస్తే మాత్రం నన్నేం చేస్తుంది? నేను చిన్న పిల్లాణ్ణి కదా! అవును, నన్నేం చెయ్యదు. ఒకవేళ నా మీదకి వస్తే దెయ్యానికి దణ్ణం పెడతాను. 'దెయ్యంగారు! దెయ్యంగారు! నాకు ఎక్కాలన్నీ వచ్చండి. నన్ను మా ఒకటి బి టీచరు గారు 'గుడ్' అంటూ మెచ్చుకుంటారండి. నాకు మొన్న రోడ్డు మీద మూడు పైసలు బిళ్ళ దొరికితే సాయిబు కొట్లో నిమ్మతోనలు కొనుక్కోకుండా - శివాలయం హుండీలోనే వేశానండీ. ఒట్టు, తల్లితోడు.' అని బ్రతిమాలుకుంటాను. అప్పుడు దెయ్యానికి నామీద జాలి కలిగి వదిలేస్తుంది.
పక్కింటి కాఫీ పొడి కొట్టాయాన్ని పట్టుకుంటుందా? ఆయన వాళ్ళావిణ్ని పొద్దస్తమానం తిడుతూ వుంటాడు. పిల్లల్ని ఊరికే కొడుతుంటాడు. ఆయన చెడ్డవాడు. దెయ్యాలక్కూడా చెడ్డవాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళనే పట్టుకుని పీడిస్తాయి. అంతలోనే ఒక సందేహం - కాఫీ కొట్టాయన కూడా నాకులాగే ఏదోటి చెప్పుకుని బయట పడితే! ఎలా కుదుర్తుంది? దెయ్యం అంత అమాయకంగా ఏమీ వుండదు, దానికన్నీ తెలుసు!
పక్కింట్లో నా స్నేహితురాలుంది. పేరు బుజ్జి. వయసులో నాకన్నా ఆర్నెల్లు పెద్ద.
'అంతస్తులు సినిమా చూశావా? నేన్నిన్న చూశాను. అమ్మో! నాకెంత బయమేసిందో!' అంది బుజ్జి.
హమ్మయ్యా! నా భయం పంచుకోడానికి ఓ మనిషి దొరికింది. 'అవును, నాక్కూడా బయ్యం వేసింది.' అందామనుకున్నాను గానీ - మాట పెదాల దగ్గరే ఆగిపోయింది.
నేనెవర్ని? మగాణ్ణి! మగాళ్ళు తమ భయాన్ని సాటి మగాళ్ళ ముందు వొప్పుకుంటే పర్లేదు గానీ - ఆడపిల్లల ముందు వొప్పుకుంటే ఎంత తలవొంపులు!
'చూశాను. ఓస్! నాకస్సలు బయమెయ్యలేదు. అసలా సినిమాలో బయపడ్డానికేముంది?' నిర్లక్ష్యంగా తల ఎగరేస్తూ అన్నాను.
'ఏమో బాబూ! నేను మాత్రం దెయ్యం దెబ్బకి బయపడి చచ్చాను.' కళ్ళు పెద్దవిగా చేసి అంది బుజ్జి.
'ఆ సినిమా పిరికివాళ్ళు చూడకూడదు, ముఖ్యంగా ఆడపిల్లలు.' బుజ్జిని జాలిగా చూశాను.
'అవును కదూ! నువ్వెంత ధైర్యవంతుడివి!' నన్ను ఎడ్మైరింగ్ గా చూస్తూ అంది బుజ్జి.
నేనెప్పుడూ అంతే! అన్నట్లుగా గర్వంగా మొహం పెట్టాను.
మిత్రులారా! ఇంక రాయడానికి పెద్దగా ఏమీ లేదు. కొన్నాళ్ళపాటు చీకట్లో ఎటు చూసినా జుట్టు విరబోసుకున్న తెల్లచీర స్త్రీ నాకు కనిపించేది. బాత్రూములో ఒక మూలగా నించొని రమ్మని పిలుస్తున్నట్లుగా అనిపించేది. అప్పుడప్పుడు రాత్రిళ్ళు కిటికీ లోంచి లోపలకి చూస్తున్నట్లుగా కూడా అనిపించేది. ఆ దెయ్యం దెబ్బకి నా పక్కతడుపుడు రాత్రుళ్ళు కూడా ఎక్కువైపొయ్యాయి!
దెయ్యాలకి ఆంజనేయస్వామంటే భయంట! పెనుభూతాలైనా, కొరివి దెయ్యాలైనా ఆంజనేయస్వామిని చూస్తే పారిపోతాయిట! ఈ సంగతి తెలుసుకున్న నేను - జేబులో ఆంజనేయుడి బొమ్మ పెట్టుకున్నాను, ఆంజనేయుడి బొట్టు పెట్టుకున్నాను. హనుమాన్ చాలీసా చదివసాగాను. ఇలా అనేక ప్రయత్నాలు చేస్తూ చేస్తూ - కొన్నాళ్ళకి తెల్లచీర దెయ్యాన్ని మర్చిపోయ్యాను. అదీ కథ!
నీతి -
కక్కుర్తిగా ఎన్ని సినిమాలైనా చూడు. దెయ్యం సినిమాలు మాత్రం చూడకు!
(photo courtesy : Google)