పై ఫోటోలో మధ్యనున్న వ్యక్తి నా మిత్రుడు మూల్పూరు తేజానంద్ గౌతం. మిత్రులకి మాత్రం 'గౌతం'. ఐస్ బకెట్ చాలెంజ్ పుణ్యామాని ALS అనే నరాల రోగం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ ALS వైద్యంలో అవార్డ్ పొందినందుకు నా మిత్రునికి అభినందనలు. గౌతం అమెరికాలోని హంట్స్‌విల్లీ (ముద్దుగా 'వేటపాలెం' అని పిల్చుకుంటాం)లో నరాల వైద్యం చేసుకుంటూ స్థిరపడ్డాడు.
మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని వుంటారు. నా మిత్రుడు గౌతం మాత్రం నిస్సందేహంగా మంచివాడే! ఎలా చెప్పగలవ్? గౌతం మా గురవయ్య హైస్కూల్లో చదువుకున్నాడు, హిందూ కాలేజిలో చదువుకున్నాడు, గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు. ఇన్నిచోట్లా చదువుకుంటూ వై.వి.రమణ అనే ఒక పురుషోత్తమునితో స్నేహం కూడా నెరిపాడు! ఒక మనిషి మంచివాడని చెప్పడానికి మీకు ఇంతకన్నా ఋజువులు కావాలా!?
అర్ధరాత్రిళ్ళు ఇళ్ళల్లో కన్నాలేసే జగ్గూదాదా అయినా, నోబెల్ బహుమతి పొందిన జాక్సన్ దొరగారితోనైనా కబుర్లాడగల సమర్ధుడు మావాడు. అందుకే - 'రాముడు మంచిబాలుడు, ఎల్లప్పుడూ హార్లిక్సునే తాగును' వంటి రొటీన్ వర్ణన గౌతంకి నప్పదు. ఇతగాడు గుళ్ళో ధ్వజస్తంభంలాగా, బళ్ళో బెల్లులాగా, పాల ఫ్యాక్టరీలో పాలపొడిలాగా, బ్రాందీ షాపులో బీరు బాటిల్లాగా.. అన్నిరకాల వాతావరణాల్లో ఎడ్జెస్ట్ అయిపోయి హాయిగా బతికెయ్యగలడు.
సింప్లిసిటీ అనగానేమి? సింపుల్ అలవాట్లని కలిగుండటమా? అయితే మావాడు చాలా సింపుల్ మేన్. కాకరకాయ వేపుడు, కెంటకీ చికెన్ - ఏదైనా పర్లేదు - కడుపు నిండా తింటాడు. వీలైతే మహేశ్‌బాబు సినిమా, వీల్లేకపోతే అట్టర్ ఫ్లాపైన శోభన్‌బాబు సినిమా, అదీ వీల్లేకపోతే దాదాసాహెబ్ ఫాల్కే గారు తీసిన అరిగిపోయిన సత్యహరిశ్చంద్ర సినిమా - ఏ సినిమానైనా సరే! నోరు తెరుచుకుని తన్మయత్వంతో వీక్షించగల సత్తా వున్నవాడు. ఎంత చెత్త సినిమాలోనైనా వినోదం వెతుక్కోగల ప్రతిభాశాలి నా మిత్రుడు!
చిన్నప్పుడు కప్ప 'ఉభయచర జీవి' అని చదువుకున్నాను (ఇప్పుడు పుస్తకాలు మారాయి. మారిన పోర్షన్లలో కప్ప ఇంకా ఉభయచర జీవిగానే వుందో లేదో నాకు తెలీదు). ఆ విధంగా ఆలోచిస్తే - మా గౌతం సకలచర జీవి. అనగా - ఆఫ్రికా అడవుల్లోనైనా, అరబ్బు ఎడారిలోనైనా ప్రశాంతంగా, కులాసాగా జీవించగల సుఖజీవి అని అర్ధం. సాధారణంగా ఇటువంటి సుఖజీవులు వాళ్ళూ ఇబ్బంది పడరు, ఎవర్నీ ఇబ్బంది పెట్టరు. వీరు తాజ్‌మహల్ టీపొడి పెట్టె మీద బొమ్మ చూసి తాజ్‌మహల్‌ని దర్శించినంత ఆనందము పొందగల ధన్యజీవులు!
విజయవాడ మారుతీనగరం ఇతగాడి స్థిరవిలాసం. ఇందుకితగాడు మిక్కిలి గర్వంగా ఫీలవుతుంటాడు. అందుకే సందు దొరికినప్పుడల్లా అమెరికా నుండి విజయవాడ వచ్చేసి అచ్చటి సందులు, గొందులూ కనులారా గాంచి తృప్తినొందుతాడు. విజయవాడ మీద ప్రేమతోనే 'విజయ' నామధేయము గల వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకున్నాడనే అనుమానం నాకుంది.
నాకు బెజవాడ వాళ్ళంటే పడదు. కారణం - వాళ్ళకి దుర్గ గుడి వుంది, మాకు లేదు. వాళ్ళకి కృష్ణానది వుంది, మాకు లేదు. వాళ్ళకి పెద్ద రైల్వే స్టేషనుంది, మాకు లేదు. వాళ్ళకి ఊర్వశి సినిమా హాలుంది, మాకు లేదు. బెజవాడ ఇష్టం లేకపోవడానికి నాకిట్లాంటి కుళ్ళుమోతు కారణాలు సవాలక్ష వున్నయ్. అంచేత - దేశసరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులపై భారత సైనికులు నిఘా వేసినట్లు, నేను బెజవాడ వాళ్ళపై అనుమానంగా ఒక కన్నేసి వుంచుతాను.
అయితే - గౌతం వంటి హార్డ్‌కోర్ విజయవాడ వ్యక్తి మా గుంటూరు హార్డ్‌కోర్‌లతో కలిసిపోయ్యాడు! అందువల్ల గౌతముడికి గుంటూరు బ్రాడీపేట గ్యాంగులో జీవిత సభ్యత్వం లభించింది! ఇది మిక్కిలి విశేషం. ఇదోరకంగా ఇజ్రాయిలువాడు గాజా స్ట్రిప్పులో పాలస్తీనా వారితో కలిసిపోయి - వారి మన్నన పొందడంతో సమానం! ఇందుకు గౌతముని తియ్యనైన స్నేహమే కారణం అని నా అభిప్రాయం.
మా గౌతంకి నరాలజబ్బు వైద్యంలో అవార్డ్ వచ్చినందుగ్గానూ, ఒక ఫొటో పెట్టి - నాలుగు మంచి ముక్కలు రాద్దామనుకుని, నలభై ముక్కలు రాశాను (ఇది కూడా ఏదైనా నరాల జబ్బేమో తెలీదు). ఇక చాలు, వుంటాను.
కృతజ్ఞతలు -
మిత్రులు విన్నకోట నరసింహారావుగారికి.
నేనింకా మహేష్‌బాబు కొడుకు గౌతం గురించి అనుకున్నానండి.
ReplyDeleteమీ మంచి స్నేహితుడికి అభినందనలు.
అన్నట్టు నాకూ ఓ మంచి గౌతం (శంకర్ లాల్) స్నేహితుడు ఉన్నాడు.
థాంక్యూ!
Delete(పనుల మధ్య ముక్కలు ముక్కలుగా - ఏవిఁటేవిఁటో రాసుకుంటూ పొయ్యాను. )
Goutham gariki mitrudu ayinamduna meerku anagaa pedda 'Budugu' gaariki abhinandanalu :)
ReplyDeleteantE Budugu pedda ayyAka ilaanE mAtlAdA vachchu . chaAla bAvundi mee mitrudi parichayAbhinandanam.
థాంక్యూ!
Deleteఈమధ్య నా స్నేహితులు భయపడి చస్తున్నారు.. ఎవరి మీద ఎప్పుడేఁవి రాసి చస్తాడోనని! :)
భలేవారే, నాకు థాంక్స్ ఎందుకండి? మీ స్నేహితుడు అమెరికాలో తెలుగు తేజం. Congratulations Dr Gowtham gaaru, good job.
ReplyDeleteవిన్నకోట నరసింహారావుగారూ!
Deleteఈ పోస్టుకి కారకులు మీరేనండి!
"ఒక మనిషి మంచివాడని చెప్పడానికి మీకు ఇంతకన్నా ఋజువులు కావాలా!?"
ReplyDeleteఅక్కర్లేదు డాక్టరుగారూ. ఎంతమంచివాడు కాకపోతే మీతో స్నేహం చేసి ఏమనలేక అమెరికా పారిపోయాడూ అని!
"ఎంత చెత్త సినిమాలోనైనా వినోదం వెతుక్కోగల ప్రతిభాశాలి నా మిత్రుడు!"
ఈ విషయంలో మాత్రంనా స్వానుభవం జోడించి ఒప్పేసుకుంటున్నాను రమణగారూ. ఒకప్పుడు కేవలం వినోదం కోసమే, చెత్తసినిమాలు చూసి అందులో యాక్షనూ, డైలాగుడెలివరీ వగైరా ఏమీ రాని కొందరు పాతకాలం గొప్పనటునలను చూసి భలేగా ఎంజాయ్ చేసాం నేనూ నామిత్రుడొకాయనా. నవ్వుకోలేక చచ్చాం.\\
"మా గౌతం సకలచర జీవి"
సకలచరజీవి అన్న మాట కనిపెట్టినందుకు రెండు వీరతాళ్ళు మీకు. "మా రమణగారికి మరి రెండు తాళ్ళూ, ఆ గౌతమునకునూ అదిగో ఒక తాడూ. మా రమణగారికీ.... " మీ చిత్తం వచ్చినంతసేపు పాడుకోండి. మీ గొంతు మీయిష్టం.
"ఇది కూడా ఏదైనా నరాల జబ్బేమో తెలీదు"
అబ్బే కాదండీ డాట్రారూ. ఇది వరాలజబ్బు. మంచిమాటల వరాల జబ్బు. అబ్బో మీకిది బాగా ముదిరిపోయింది ఏమీ లాభం లేదు!
ఒరే రమణ,
ReplyDeleteనిన్నభినందించడానికి మాటలు వెతుక్కొవలసే విధంగా వ్రాసావు.
వయస్సుతో తారతమ్యం లేకుండా అందరితో కలిసిపోయే గుణం ఉన్న మనిషి మన గౌతం. అంతెందుకు, అడగనోడు పాపాత్ముడే. అడిగినోళ్ళందరికి లేదనకుండ చేయూతనివ్వగల సమర్ధుడు. సహనశీలి+సహృదయం+సోదరత్వం=గౌతం.
మనుష్యులలో 3 రకాలు.
1.మంచి వాతావరణం, మంచి అవకాశములు ఎన్ని వచ్చినా సద్వినియోగం చేసుకోలేని వాడు - మూర్ఖుడు.
2. వచ్చినంతవరకు సద్వినియోగపరుచుకునే వాడు - తెలివైన వాడు.
3. ఎటువటి పరిస్తులలోనైన సర్దుకుపోయి వాటిని సద్వినియోగించుకుని ఆనందించే వాడు వివేకవంతుడు.
నా దృష్టిలో మన గౌతం "వివేకవంతుడు".
//మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని వుంటారు//
ReplyDeleteఎంతమంచి మాట!చాన్నాల్లకు విన్నాను. మీ స్నేహితుడుకి ఉన్న ఈ గుణాలు ఉంటే ' మంచి' వాడు అన్న మాట! ఇలా సకల చరా జీవిగా బతకటమంటే మాటలా? ఇక నావ్యక్తిత్వాన్ని తీరి దిద్దుకోవసిందే! బాను మతి గారు నటించి ఏదో సినిమాలో ఇలాంటి కేరక్టర్ ' ప్రవరాఖ్యుడ' నే పేరుతో చలామని అవుతున్నట్లు విన్నాం. అయితే ఈ గుణాలు ఈకాలానికి కూడా వర్తిస్తాయన్నమాట!
వీరు తాజ్‌మహల్ టీపొడి పెట్టె మీద బొమ్మ చూసి తాజ్‌మహల్‌ని దర్శించినంత ఆనందము పొందగల ధన్యజీవులు!
ReplyDelete>>
నా నుంచి మరో రెండు వీరతాళ్ళు!