Monday, 8 September 2014

ముద్దాయిలూ మనుషులే!


అభివృద్ధి అనగా ఏమి? కొందరి దృష్టిలో విశాలమైన రోడ్లు, ఆకాశాన్ని తాకే భవనాలు అవ్వచ్చు. మరికొందరి దృష్టిలో ఫార్ములా వన్ రేసులు, ఫ్యాషన్ మోడళ్ళ పిల్లి నడకలు అవ్వచ్చు. ప్రజలందరికీ కడుపు నిండా తిండానికి ఆహారం, విద్యావైద్య సదుపాయాలు వినియోగించుకోగల అవకాశాన్ని కలిగి వుండటాన్ని అభివృద్ధి అంటారని ఇంకొందరు అంటారు. ఎవరి వాదన వారిది. 

అయితే - 'పేదప్రజల' అభివృద్ధి నమూనా ప్రభుత్వాలకి నచ్చదు. ఎందుకంటే చాలా దేశాల్లో పేదవారుంటారు. వారిని కూడా అభివృద్ధి నమూనాలో జత చెయ్యాలంటే - ప్రభుత్వాలకి ఎంతో చిత్తశుద్ధి, నిజాయితీ కావాలి. అందువల్ల - రెండు వెడల్పాటి రోడ్లనీ, నాలుగు పొడుగుపాటి భవంతుల్ని నిర్మించి - వాటిని షోకేస్ చేసే 'సులభమైన' అభివృద్ధికే ప్రభుత్వాలు మొగ్గు చూపిస్తాయి. ఐదేళ్ళలో ఎన్నికలు ఎదుర్కోవాలసిన సగటు రాజకీయ పార్టీలకి అంతకన్నా వేరే మార్గం తోచదు మరి!

ఈ నేపధ్యంలో మొన్న ఐదో తారీఖున సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఎంతో ఆశాజనకమైనవి, ఆహ్వానించదగ్గవి. నిందితుడిపై నేరారోపణ ఋజువైతే విధించే గరిష్ట శిక్షలో సగం కన్నా ఎక్కువకాలం, బెయిల్లేకుండా జైల్లోనే వుండిపోతే - నిందితుణ్ని వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చెయ్యాలి. ఇందుకు న్యాయవాదులు సహాయం కూడా అవసరం లేదు.

నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని 'ముద్దాయి' అంటారు. కోర్టు ఆ ముద్దాయికి నేరాన్ని ధృవీకరించినప్పుడే ఆ వ్యక్తి 'నేరస్తుడు' అవుతాడు. ఈ దేశంలో లక్షలమంది ముద్దాయిలుగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. నేరం నిర్ధారణ అయితే - జైల్లో వున్న కాలాన్ని తగ్గించి శిక్ష అమలు చేస్తారు, కాబట్టి వారికి ఇబ్బంది లేదు. అదే - కోర్టు ఫలానా ముద్దాయి నేరం చెయ్యలేదని కేసు కొట్టేస్తే? అప్పటిదాకా ఆ వ్యక్తి జైల్లో గడిపిన కాలం - ఆ వ్యక్తి స్వేచ్చగా జీవించే న్యాయమైన, సహజమైన హక్కుని హరించివేసినట్లు కాదా? దీనికి ఎవరు జవాబుదారి?

ఈ సమస్యకి సత్వర న్యాయం (నేరాన్ని త్వరితంగా విచారించి వేగంగా తీర్పులు వెలువరించడం) ఒక పరిష్కారం. న్యాయవ్యవస్థలో సంస్కరణల గూర్చి అనేకసార్లు చర్చలు జరిగాయి, అనేక కమిటీలు రిపోర్టులూ ఇచ్చాయి. అమలు కోసం ప్రభుత్వాలు చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలి. కానీ - ప్రభుత్వాలు పట్టించుకోవు (వాటికి తరవాత ఎన్నికల్లో వోట్లు రాలే పథకాల పట్లే శ్రద్ధ).

అదేమంటే - నిధుల కొరత అంటారు. ముద్దాయిలుగా కొన్ని లక్షలమందిని జైళ్ళల్లో (అనవసరంగా) వుంటే వారి వసతి, పోషణ, నిఘాకి నిధులు కావాలి. మరప్పుడది ప్రజల సొమ్ము వృధా చేసినట్లు కాదా? ఇట్లాంటి విషయాల పట్ల దృష్టి వుంచాలంటే కావలసింది సమస్యల పట్ల సున్నితత్వం, శాస్త్రీయమైన అవగాహన.

సాధారణ నేరాలక్కూడా ముద్దాయిలుగా విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఏళ్ళూ, పూళ్ళూ గడిపెయ్యడంలో ఇంకో కోణం - ఆర్ధిక సామాజిక కోణం. ముద్దాయి బెయిల్ మంజూరు అవ్వాలంటే ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుగా వుండాలి. ఆ పూచీదారులకి హామీగా స్థిరాస్తో, బ్యాంకులో డబ్బో వుండాలి. పేదవాడికి ఇవన్నీ వున్న ఇద్దర్ని తెచ్చుకోలేడు. అంటే - బెయిలివ్వడానికి కోర్టు సిద్ధంగా వున్నా, హామీ ఇచ్చేవారు దొరక్క జైల్లోనే వుండిపోవాల్సిన పరిస్థితి!

పేదవారిలో ఎక్కువమంది రోజువారి కూలీపనులు చేసేవారే. అటువంటి సమాజంలో కుటుంబపెద్ద నేరారోపణని ఎదుర్కొంటూ ఎక్కువ కాలం జైల్లోనే వుండిపోతే ఆ కుటుంబానికి చాలా నష్టం. ఆ పిల్లలు దిక్కులేనివారై భవిష్యత్తుని కోల్పోతారు. ఇది పిల్లల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది.

అందువల్ల - ఇటువంటి నిస్సహాయుల పట్ల ప్రగతిశీలమైన ఆలోచన చేసి, ఈ సమాజానికి మేలు చేకూర్చే ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టుని మనస్పూర్తిగా అభినందిస్తూ - భవిష్యత్తులో కూడా సుప్రీం కోర్టు ఇదేవిధంగా పేదల పక్షపాతిగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను.

(picture courtesy : Google)

8 comments:

  1. Well said. That means justice is still far away for the poor.

    ReplyDelete
  2. రమణగారూ, ఈ సమస్య అంతటికీ మూల చీకటికోణం దొఱతనాల చిత్తశుధ్ధిలేమి అని చక్కగా విశ్లేషించారు. మరి చిత్తశుధ్ధి లేని మనుష్యులను మనం చట్తసభల్లో ఎందుకు చూడవలసి వస్తోంది? ఎన్నుకునే ప్రజలకు ఎన్నికలూ, పరిపాలనా అన్న విషయాలమీద అవగాహనా లేమి అన్నదే కదా. అంటే, మనం చివరికి మన ప్రజలనే తమ తప్పులకు తాము నష్టపోతున్నవారిగా గుర్తించవలసి వస్తుంది ప్రజల్లో అత్యదికశాతం మంది విద్యావంతులైన నాడు వారు సరియైన వ్యక్తులనే ఎన్నుకుంటారని ఆశిద్దాం. ఇప్ప్టిలాగా ఏదో సాకుతో చట్తసభల్లో స్థానం సంపాదించుకుంటున్న కళంకిత చరిత్రులు వంటివారు చట్తసభల్లోకి అప్పుడు రారనే అనుకుందాం.

    ప్రస్తుతం అన్నివ్యవస్థలనూ అవినీతి రాజకీయాలు చెదలాగా తింటున్నాయి. అందుకే ప్రజలకు న్యాయం అందటం లేదు. కొనుక్కోగలవాళ్ళకే కొన్ని సదుపాయాలు దొరుకుతున్నాయి. వ్యవస్థను ప్రజలు సమూలంగా మార్చుకునే రోజు వచ్చేదాకా ఇలాంటి బాధలు అనేక రూపాల్లో ప్రజలకు తప్పవు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      >>చిత్తశుధ్ధి లేని మనుష్యులను మనం చట్తసభల్లో ఎందుకు చూడవలసి వస్తోంది?

      సింపుల్. చిత్తశుద్ధి గలవాడు ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలిగే అన్నిరకాల మార్గాల్ని - చాలా సిస్టమేటిక్‌గా, సైంటిఫిక్‌గా మూసేశారు.

      'గెలిస్తే నువ్వూ, లేకపోతే నేను' అన్న చందానా - ఒక 'పటిష్టమైన' రాజకీయ వ్యవస్థ నిర్మితమై వుంది. బయట నుండి చూస్తే పార్టీల పేర్లు రకరకాలు. లోపల అందరూ ఒకటే!

      Delete
  3. బాగా చెప్పారు సార్. డబ్బు, పలుకుబడి వుండి, నేరస్తులుగా దృవీకరించబడ్డ సంజయ్ దత్ లాంటి వాళ్ళు భార్య కు అనారోగ్యం ఆంటూ పెరొల్ మీద సగం శిక్ష కాలాన్ని బయటే ఎంజాయ్ చేస్తూ కొత్త సినిమాలకు డేట్లు ఇస్తూ వ్యాపారాలు, అగ్రిమెంట్లు చేసూకుంటూ బయటే తిరుగుతారు.... అవి ఏవి లేని పేదవాళ్ళు అండర్ ట్రైల్స్ గా చెరసాల లోనె మగ్గుతారు... చట్టం దృష్టి లో అందరూ సమానులే.... కానీ, ధనవంతులు... కొద్దిగ ఎక్కువ సమానం.... ( బాపు గారి డైలాగ్ మార్చినందుకు సారీ.... )

    ReplyDelete
  4. దేశంలో ప్రస్తుతం సుమారు 3 లక్షల మంది అండర్‌ ట్రయల్స్‌ ఉన్నారని అంచనా. వారిలో ఐదేళ్ళకు పైగా జైళ్ళలో మగ్గుతున్న వారు సుమారు 2వేల మంది. మూడేళ్ళకు పైగా కటకటాల వెనక ఉన్నవారు 8వేల మంది అని గణాంకాలు చెబుతున్నాయి. వారిలో నిజమైన దోషులెందరో దోషులు కానివారెందరో తేలడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలీదు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు నిజంగా అమల్లోకి వస్తే లక్షలాది కుటుంబాలకు కొంత ఊరట.

    ReplyDelete
  5. Development =freedom
    to speed up judicial process decentralize as much as possible, and also allow private courts.

    ReplyDelete
  6. @I,me,myself
    మీరు మూడు లైన్ల లో అభివృద్ది గురించి,ఫ్రీడం గురించి ముగించారు. మీకు తెలుసోలేదో ఇటువంటి చెత్త వాదనను బలంగా వినిపించినవారు ఉన్నారు. వాళ్ల వాదన ట్రాప్ లో పడితే బయటకు రావటం కష్టం. అయాన్ రాండ్ అనే ఒకావిడ ప్రజల జీవితాలలో జ్యోక్యం చేసుకోవటానికి ప్రభుత్వం ఎవరు? అని ప్రశ్నిస్తూ కేపిటలిజాన్ని నూటికి రెండోందల శాతం సమర్ధిస్తూ తలకింద దిండ్లు గా ఉపయోగపడే సైజులో పుస్తకాలు రాసింది. కేన్సర్ వస్తుందన్నా వినకుండా సిగరెట్లు కాల్చి కాల్చి , జబ్బును నయం చేసుకోవటానికి, రాండ్ గారు చివరి దశలో డబ్బులు లేక ప్రభుత్వ ఆర్ధిక సహాయం తీసుకొంది.
    Ayn Rand Railed Against Government Benefits, But Grabbed Social Security and Medicare When She Needed Them

    http://www.alternet.org/story/149721/ayn_rand_railed_against_government_benefits,_but_grabbed_social_security_and_medicare_when_she_needed_them

    ReplyDelete
  7. Ayn rand supported taking government support as long as we are forced to pay taxes.

    Most of us get electricity at subsidized rates..as anarcho capitalists are against subsidies it doesn't make any sense in arguing that they shouldn't get subsidized power. Don't tax don't subsidize.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.