Monday 22 September 2014

వీరిలో క్లింట్ ఈస్ట్‌వుడ్ ఎవరు?


వాళ్ళు ఎదురెదురుగా నిలబడి వున్నారు, ఒకళ్ళ కళ్ళల్లోకి ఇంకొకళ్ళు తీక్షణంగా చూసుకుంటున్నారు. అక్కడ ఎవరు ముందు తుపాకీ తీస్తారో - ఎవరు మెరుపు వేగంతో గురి తప్పకుండా కాలుస్తారో - వారిదే అంతిమ విజయం. ఇప్పుడిక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు చస్తారు? చాలా ఉత్కంఠగా వుంది కదూ!

ఇట్లాంటి సీన్లు వెస్టర్న్ సినిమాల్లో వుంటాయి. మా గుంటూర్లో లీలామహల్‌లో ఇంగ్లీషు సినిమాలు ఆడేవి. 'ద గుడ్ ద బేడ్ అండ్ ద అగ్లీ' అనే సినిమా ఒక గొప్ప కౌబాయ్ చిత్రరాజం అని ఊరంతా కోడై కూసిన కారణాన ఆ సినిమా చూశాను. మామూలే! సినిమా అర్ధం కాలేదు, కానీ - బాగుంది!

నాకైతే సినిమా చివరి సీన్ బాగా నచ్చింది. క్లింట్ ఈస్ట్‌వుడ్, లీవాన్ క్లిఫ్, ఈలై వాలెక్ - ముగ్గురూ మూడువైపులా నించుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ నిలబడి వుంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డాలర్స్ మ్యూజిక్ వస్తుంటుంది. సినిమా చూసిన చాలా రోజులైనా ఈ సీన్  నాకు బాగా గుర్తుండిపోయింది.  

ఈ సీన్ గూర్చి ఇప్పుడెందుకు చెబుతున్నాను? ఎందుకంటే మన రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు సీట్ల సర్దుబాటు సమయంలో అచ్చు ఇలాగే ప్రవర్తిస్తుంటాయి కనుక. మన రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాని బాగా ఇష్టపడ్డారనీ, అందుకే వారి రాజకీయ ఎత్తుగడలకి స్పూర్తి ఈ సన్నివేశమేనని నా అనుమానం!

సన్నివేశం సేమ్, నటుల మొహాలే మార్పు! ఒకప్పుడు ఈ సన్నివేశంలో చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, లాలూ యాదవ్ వంటి ఉద్దండులు నటించారు. ఇప్పుడు అమిత్ షా, ఉద్దవ్ థాకరేలు నటిస్తున్నారు. సినిమాలో చిన్న పొరబాటు జరిగినా తుపాకీ గుండుకి ప్రాణమే పోతుంది, రాజకీయ పార్టీలక్కూడా ఎన్నికలు జీవన్మరణ సమస్యే! 

ఇంతకీ మహారాష్ట్ర ఎన్నికల్లో క్లింట్ ఈస్ట్‌వుడ్ ఎవరు? అమిత్ షానా? ఉద్దవ్ థాకరేనా? మనకి తెలీదు. ఇంకొంత కాలం ఆగి వెండితెరపై చూడ్డం మినహా మనం చేసేది కూడా ఏమీ లేదు!

(picture courtesy : Google)

7 comments:

  1. అరే..నేను..రెసిడ్యూయల్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రంగార్ని, మరో తెలుగు తల్లి చంద్రన్నని, రజన్న జగనన్న గురించి రాసేసారేమో అనుకున్నాను. చివరికి తెనాలి గాంధి సెంటర్‌లో సోడా సీసాలో గాలి తుస్సుమన్నట్టు బుల్లెట్ తుస్సుమన్నదిగా! :(

    ReplyDelete
    Replies
    1. >>తెనాలి గాంధి సెంటర్‌లో సోడా సీసాలో గాలి తుస్సుమన్నట్టు<<

      అదేంటి! మా గుంటూర్లో సోడాగాలి 'ఖుయ్'మని పోతుందే! :))

      (అసలు విషయం - సమయం కుదరక, ఆసక్తి లేక.)

      Delete

  2. భేష్ ! అంత పెద్ద గా క్లింట్ ఈస్ట్ వుడ్ ఫోటో పెట్టి ఇందులో క్లింట్ ఈస్ట్ వుడ్ ఎవరంటా రేమిటండి బాబూ!! అసలు శీను మొత్తం తనే కని పిస్తుంటే ను !! మీరు చెప్పిన పేర్ల లో క్లింటు ఈస్ట్ వుడ్డు లేడు !! కానీ సమోహం సర్వ భూతేషు అంటూ అంతా తానె కనబడుతున్న వాడు ఒకడు ఉన్నాడు ! వాడే మరి మీ 'ఈస్ట్' ఉడ్' !!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      అవును! ఈ పోస్ట్ క్లింట్ ఈస్ట్‌వుడ్ కోసమే రాశాను. ఇంకొంచెం రాయాల్సింది వుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు - 'సీట్ల సర్దుబాటు' అనే ఒక డ్రామా (అమాయక కార్యకర్తల కోసం) ఆడుతుంటాయి. ఇదంతా ఒక ప్రాక్సీ వార్, మైండ్ గేం, బోల్డంత తమాషా! సమయం కుదరక పోస్ట్ మధ్యలోనే ఆపేశాను.

      రాసింది ఏం చేసుకోవాలో అర్ధం కాక పోస్టితిని! :)

      Delete
    2. అయోమయంబులకు నద్భుతంబగు టపాలనెడి పేరు గల్గుట బహుళంబుగా నగు.

      Delete
    3. శ్యామలీయంగారు,

      మీ కామెంట్ అర్ధం కాలేదు (ఇంగ్లీషు సినిమాలాగా). కానీ - బాగుంది!

      Delete
    4. శ్యామసూరి వ్యాకరణం సంజ్ఞ పరిచ్ఛేదంలో ఓ సూత్రం లేండి

      Delete

comments will be moderated, will take sometime to appear.