Tuesday, 2 September 2014

సమాజం - నేరం


ఇవ్వాళ దక్కన్ క్రానికల్ ఐదో పేజిలో ఒక వార్త. రేప్‌లు చేసేవాళ్ళ కాళ్ళూ, చేతులూ నరికేసే శిక్ష విధించాలని ఒక మహిళా నాయకురాలు అన్నారు. ఒక మహిళగా ఆవిడ తన కోపాన్ని, ఆవేదనని వెళ్ళగక్కడం మనం అర్ధం చేసుకోవచ్చు. రేప్ అనేది అత్యంత దుర్మార్గమైన నేరం. అందువల్ల రేప్ నేరస్తుల పట్ల నాకేవిధమైన సానుభూతీ లేదు.

నేను పీజీ చేసేప్పుడు సమిత్ రాయ్ నాకు సీనియర్ (ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిలయ్యాడు). నేను మొదటి సంవత్సరంలో వుండగా - 'సొసైటీ అండ్ క్రైమ్' అనే అంశంపై సెమినార్ లెక్చర్ ఇచ్చాడు. వివిధ సమాజాల్లో నేరాన్నీ, నేరస్వభావాన్నీ ఎవరు ఎలా అర్ధం చేసుకున్నారో - ఆ అవగాహనలోని లోపాల్నీ వివరంగా, ప్రతిభావంతంగా చెప్పాడు. అటు తరవాత జరిగిన చర్చలో ఎన్నో రిఫరెన్సుల్ని ఉటంకిస్తూ చాలా ఆసక్తికర విషయాల్ని ప్రస్తావించాడు సమిత్ రాయ్.

సెకండ్ యూనిట్ ప్రొఫెసర్ అననే అన్నాడు - "సమిత్! నువ్వు నేరస్తుల తరఫున వాదిస్తున్నట్లుగా వుంది!"

సమిత్ రాయ్ ఒక క్షణం ఆలోచించి అన్నాడు - "ఏమో! అయ్యుండొచ్చు. అందరూ నేరస్తుల్ని అసహ్యించుకుంటారు. ఇదో స్టీరియోటైప్ ఆలోచన. కానీ - మనం నేరాన్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నించాలి. ఒక సమాజమే నేరమయంగా అయిపోతున్నప్పుడు, నేరస్తులు దాని బై ప్రొడక్ట్స్ మాత్రమే. ఫ్యాక్టరీలో వేస్ట్‌ని తగ్గించుకోటానికి ప్రయత్నిస్తామే కానీ - అసహ్యించుకోం కదా!" సమిత్ వాదన ఇలా సాగింది.

ఆరోజు సమిత్ రాయ్ వాదన పూర్తిగా ఎకడెమిక్‌గా సాగింది. నాకు ఇవ్వాళ కాళ్ళూ చేతులూ నరకే శిక్ష చదవంగాన్లే సమిత్ గుర్తొచ్చాడు. మిత్రమా! సీనియర్ గా నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీ గైడెన్స్ వల్ల నేను చాలా లాభ పడ్డాను. అందుకు నీకు కృతజ్ఞతలు.

ఇంక రాయడానికి పెద్దగా ఏం లేదు. మీరు చాలాచోట్ల చాలాసార్లు చదివిన విషయాలే.

నేరాలు జరగడానికి అనేక కారణాలున్నాయి. ఆర్ధిక పరమైన కారణాలు (కరువు జిల్లాల్లో నేరాలు ఎక్కువ), సామాజిక పరమైన కారణాలు (బీహార్‌లో నేరాలు ఎక్కువ), మత్తు పదార్ధాల వాడకం (ఆల్కహాల్ వాడకానికీ నేరాలకి సంబంధం వుంది. కానీ మన ప్రభుత్వాలు ఈ పాయింట్ పట్టించుకోవు).. ఇట్లాంటివి చాలానే వున్నాయి. 

తీవ్రమైన నేరాలకి తీవ్రమైన శిక్ష డిటరెంట్ గా ఉంటుందని కొందరూ, అందుకు సరైన ఋజువు లేదని మరికొందరూ వాదిస్తారు. అంతకన్నా ముఖ్యంగా - మన దేశంలో సత్వర న్యాయం జరగట్లేదని నా అభిప్రాయం. ఇందుకు ఒక ఉదాహరణ చుండూరు హత్యల కేసు.

ఒక సమాజంలో నిషి - కనీసమైన డీసెన్సీతో మనిషిగా బ్రతికే అవకాశం లేక - దరిద్రం, ఆకలి, నిరుద్యోగం, వివక్షత వల్ల నేరస్తుడుగా ఎలా మారతాడో రాజ్ కపూర్ ఆవారా సినిమాలో చాలా ఎఫెక్టివ్‌గా చెప్పాడు. 'ఆవారా' గూర్చి ఒక పోస్టు రాశాను, ఓపికున్నవాళ్ళు చదువుకోవచ్చు.

(picture courtesy : Google)

9 comments:

  1. గుప్తులకాలం స్వర్ణయుగం అన్నపాఠాన్ని పిల్లలు జోగుతూ బట్టీపడుతూ ఉంటారు కాని అది అలా ఎందుకు అయ్యిందీ అన్న ప్రశ్న వేసుకోరు, అయ్యవార్లూ ఆ ప్రశ్న వేసుకోరు. ఒక వేళ వేసుకున్నా అది పాఠ్యపుస్తకాలను ఎంత తిరగేసిన సమాధానం దొరికే ప్రశ్న కాదు. నిజానికి గుప్తులకాలంలో శిక్షలు కంటికి కన్ను పంటికి పన్ను బాపతు. దొంగకు ఐతే చేతులు పోయేవి లేద తలే పోయేది. అందుకే దొంగల బెడద స్వల్పాతిస్వల్పం అనుకోవచ్చును.

    రేప్‌లు చేసేవాళ్ళ కాళ్ళూ, చేతులూ నరికేసే శిక్ష విధించాలని ఒక మహిళా నాయకురాలు అన్నారు సరే. శిక్షల్లో గుప్తుల కలానికి పోదామనా ? ఈ రోజుల్లో అది సాధ్యమేనా? వాంఛనీయమేనా?

    ఆవేశాలు సమస్యలకు సమాధానాలు చెప్పలేవు. ఆలోచించాలి కాని.

    ReplyDelete
    Replies
    1. >>ఆవేశాలు సమస్యలకు సమాధానాలు చెప్పలేవు. ఆలోచించాలి కాని.<<

      సమస్యేమంటే - ఆలోచించేవాళ్ళు తక్కువైపోతున్నారు.

      వరంగల్ యాసిడ్ దాడి కేసులో ముద్దాయిల్ని పోలీసులు 'ఎన్‌కౌంటర్' చేసినప్పుడు - కొందరు పౌరులు పోలీసువారికి పూలు, పళ్ళు సమర్పించుకుని కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు!

      Delete
  2. నేరమంటే ఏమిటి సార్‌! సమాజం ఒప్పని పని చేస్తే అది నేరం. సమాజం అంటే ఎవరు సార్‌, అందులో ఉన్న మనుషులు. ఆ మనుషులు డబుల్‌ గేం ఆడడమే ఇక్కడ నేరం. వారు చేస్తే నేరం కానిది తనకు కాని వాడు చేస్తె, అదీ ఇంకోడు చేస్తే , అదీ ఇంకో వర్గం వాడు చేస్తే నేర మౌతుంది. సమజం నీతి మంతురాలు అవటానికి ఇంకోడి మీద నేరం మోపివాన్ని చావ గొట్టి తృపితి పొందుతుంది. సార్‌, నేను నేరస్త్ల వైపు మాట్లాడటం లేదు గదా!

    ReplyDelete
    Replies
    1. ఆహా! మీరు మా సమిత్ రాయ్‌కి మల్లే నేరస్తుల తరఫునే మాట్లాడుతున్నారు. :)

      Delete

  3. నేరం నేరమే.మానభంగం తీవ్రమైన నేరమే.ఐతే సమాజ పరిస్థితి గురించి శిక్ష మారుతుంది.నిర్భయ చట్టప్రకారం శిక్ష ప్రస్తుతం తీవ్రమైనదే.కాని దానికి కాళ్ళు,చేతులు నరకడాన్ని న్యాయ నిబంధనలు అంగీకరించవు.దీర్ఘకాల జైలు శిక్ష మాత్రం తప్పనిసరి చేయాల్సిందే.ఐతే రేప్ తో బాటు హత్యకూడా చేస్తే మరణ శిక్ష తప్పనిసరి చెయ్యాలి.ఐతే fast track courts ద్వారా శిక్షలు వేగంగా అమలు పరహాలి.

    ReplyDelete
    Replies
    1. కౄరమైన శిక్షలు కావాలని డిమాండ్ చెయ్యడం ఒకరకమైన ఆలోచనా ధోరణిని. కానీ - ఈ రకమైన డిమాండ్‌లో (శ్యామలీయంగారు చెప్పినట్లు) వివేచన కన్నా ఆవేశమే ఎక్కువ కనిపిస్తుంది.

      Delete
  4. గతం లో ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన మాజీ అయ్యాక ..... రేప్ చేసిన వారిని అప్పటికప్పుడే బహిరంగంగా ఉరి తీయాలని .. విచారణ పేరుతో ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
    నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని లోతుగా విచారించి అవి జరగ కుండా చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వానికి కష్టం అదే తక్షణ శిక్ష పెద్ద సమస్య కాదు

    ReplyDelete
    Replies
    1. అవును. లోతుగా విచారిస్తే తమ వైఫల్యాలు బయటకొస్తాయని ప్రభుత్వాలకి భయం. అందుకే on popular demand అంటూ విధించే తక్షణ శిక్షలే ప్రభుత్వాలకి శ్రీరామరక్ష. :)

      Delete

  5. నేరానికి కారణాలు అన్వేషించి సాధ్యమైనంతవరకు నివారించడానికి ప్రయత్నం చెయ్యవలసిందే.నేనూఅవేశంతో రాయడంలేదు. సమాజంలో స్వతహాగా స్వభావరీత్యా పరమదుర్మార్గులూ,క్రూరులూ ఉంటారు .వారికి శిక్షలు పడవలసిందే.అదీగాక బాధితుల బాధని, ఆవేదననీ ,వారికుటుంబాలు పడే ఆక్రోశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.