'100 రోజుల ఎన్డీయే పాలన ఎలా వుంది?'
చస్తున్నా! పేపర్లలో, చానెళ్ళలో ఒకటే చర్చలు. ప్రజలకి ఈ 100 రోజుల ఆబ్సెషన్ ఏవిటో అర్ధం కాదు.
ఈ 100 గూర్చి నా అభిప్రాయాలు ఇంతకు ముందోసారి గురజాడ మహాశయా! మీకు ప్రమోషనొచ్చింది అనే పోస్టులో రాశాను. ఆ పోస్టు రాసి (దాదాపు) రెండేళ్ళైనా ఈ 100 పవిత్రత గూర్చి నా అజ్ఞానం అధమ స్థాయిలోనే వుండిపోయింది.
సినిమా విజయవంతం అయిన ఉత్సాహమో, బ్రాండ్ వాల్యూ పెంచుకునే ప్రయత్నమో తెలీదు కానీ - సినిమావాళ్ళు 100 రోజుల పండగ చేసుకుంటారు. 'సినిమా' వ్యాపారం కాబట్టి అర్ధం చేసుకోవచ్చు. 'ప్రభుత్వం' వ్యాపారం కాదు గదా!
తుమ్మితే ఊడిపోయ్యే సంకీర్ణ ప్రభుత్వాలు 100 రోజుల పండగ చేసుకోడం కూడా అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే - ప్రభుత్వం అన్ని రోజులు నిలబట్టమే గొప్ప విజయం కాబట్టి!
ఇవ్వాళ మోడీ ప్రభుత్వం అంబుజా సిమెంట్‌తో కట్టిన గోడంత బలంగా వుంది కదా! మరప్పుడు మోడీ ప్రభుత్వానిక్కూడా ఈ వందరోజుల గోలేంటి?
మిత్రులారా! ప్రజాసేవలో ప్రతి రోజూ విలువైనదే. బాధ్యతగా పనిచేసే ప్రభుత్వాలు 100 లాంటి అంకెల 'మైలురాయి'ని పట్టించుకోరాదు. కేంద్రప్రభుత్వ స్థాయిలో తీసుకునే ఆర్ధిక, రాజకీయ నిర్ణయాల (అవి ప్రజానుకూలమైనా, వ్యతిరేకమైనా) ఫలితాలు సామాన్యులకి చేరాలంటే సమయం పడుతుంది. ఆ సమయం 203 రోజులు కావచ్చు, 401 రోజులు కావచ్చు (పెట్రోలు, ఉల్లిపాయల ధరల పెంపు ఇందుకు మినహాయింపు).
తమ 100 రోజుల పాలన గూర్చి కొన్ని ప్రభుత్వాలు రివ్యూ చేసుకుంటాయి. అది ఆయా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల చిత్తం. కాదన్డానికి నువ్వెవరివి?
నేనేవర్నా? నేను భారతీయుణ్ణి, సామాన్య మానవుణ్ణి, బాధ్యత కలిగిన పౌరుణ్ణి. ఇంకా చాలా 'ణ్ణి'ని (రాద్దామంటే జ్ఞాపకం రావట్లేదు).
అంకెల్లో నాకు నచ్చని అంకె 100. 100 డౌన్ డౌన్! 100 నశించాలి! 100 చావాలి!
ముగింపు -
"అయ్యా డాక్టరు బాబూ! ఈ బ్లాగులోణ్ణి మీ ఆస్పత్రిలో నిన్ననగా ఎడ్మిట్ చేశాం. ఇంతకీ - వీడికి 100 అంటే అంత ఆవేశం, ఆయాసం ఎందుకో తెలిసిందా? తొందరగా చెప్పండి సార్!"
"హోల్డాన్! ఆ విషయం తెలుకోడానికే - డయాగ్నోసిస్ కోసం పేషంట్ శరీరంలోంచి రెండు లీటర్ల రక్తం లాగి అన్నిరకాల పరీక్షలూ చేశాం. మెదడుకి CT స్కాన్, MRI, PET స్కాన్, SPECT స్కాన్ తీశాం. EEG, EMG, NCV స్టడీ చేశాం."
"ఓర్నాయనో! 100 గూర్చి తెలుకోడానికి 100 పరీక్షలా!"
"మీరలా మాట్లాడకూడదు. మా ఆస్పత్రిలో ఆ ఫెసిలిటీస్ అన్నీ వున్నాయి. అవి చెయ్యకుండా మాకు రోగం అర్ధం కాదు."
"సారీ సార్! ఇంతకీ ఈ 100 రోగం ఏంటి?"
"ఈ బ్లాగులోడు చిన్నప్పట్నుండి 100 మార్కులకి పరీక్షలు రాశాడు. ప్రతి పరీక్షని కొరివి దెయ్యాన్ని చూస్తున్నట్లు జడుసుకుంటూ, పాత సినిమాల్లో హీరోయిన్లా ఏడ్చుకుంటూ పరీక్షలు రాశాడు. అందువల్ల వీడికి పునర్జన్మ సినిమాలో నాగేస్సర్రావుకి మంటంటే భయం ఏర్పడ్డట్లు - 100 అంటే భయం ఏర్పడిపోయింది. అయితే - ఆ విషయం వీడు వొప్పుకోడు. కానీ - ఏవో చెత్త వాదనలతో 100 కి వ్యతిరేకంగా రాస్తుంటాడు. 100 ని వ్యతిరేకించడం చట్టరీత్యా నేరం కాదు. కనుక మీకే ఇబ్బందీ లేదు."
"మరి ఈ రోగం తగ్గడానికి ట్రీట్‌మెంట్?"
"మా టెస్టుల్లో తేలిందేమనగా - ఈ రోగం చిన్న మెదళ్ళో చిన్నగా మొదలై, పెద్ద మెదళ్ళోకి పెద్దగా వ్యాపించి, వెన్నుపూసలోంచి కిందకి దిగింది. ఈ కేసు మా వైద్యశాస్త్రానికే ఒక చాలెంజ్, ప్రస్తుతానికి దీనికి మందు లేదు. ఆ పక్కనే చిన్న మసీదు దగ్గర తాయెత్తులు కట్టే పెద్ద సాయిబు గారున్నారు. ఆయన్తో తాయెత్తు కట్టించుకునే నా భార్య మూర్చరోగం తగ్గించుకున్నాను. మీరు కూడా వీణ్ణి అక్కడికి తీసుకుపోయి ఒక తాయెత్తు కట్టించండి, 100 రోగం దెబ్బకి తగ్గిపోతుంది!"
"ఆహా! డాక్టరుగారు! మీరెంత గొప్పవారండీ! ఇంత పెద్ద విషయాన్ని చిన్నచిన్న టెస్టుల్తో తేల్చేశారు! మీరెంత దయార్ధ్ర హృదయులండీ! ఇదే ఇంకోళ్ళయినట్లైతే ఒక నెల్రోజులు అబ్జర్వేషన్‌లో పెట్టుకుని ఏకంగా ఎకరం పొలం అమ్మించేవారు. థాంక్సండీ బాబు థాంక్సు!"
(picture courtesy : Google)
"ఇదే ఇంకోళ్ళయినట్లైతే ఒక నెల్రోజులు అబ్జర్వేషన్‌లో పెట్టుకుని ఏకంగా ఎకరం పొలం అమ్మించేవారు"
ReplyDeleteఎకరం 10 కోట్లు పలుకుతుందటగా ఈ మధ్య!
ఎన్ని కోట్లు పలికినా, పాడినా - పాలక వర్గాలకి తప్ప, సామాన్య ప్రజలకి ఒరిగేదేం లేదు.
Deleteభిషగ్వరులవారికి 100నం
ReplyDeleteసినిమావాళ్ళు 100 రోజుల పండగ చేసుకుంటారా? మీరేదో తెలుగుసినిమాస్వర్ణయుగంలోనే పీటవేసుక్కూర్చున్నట్లున్నారే. ఈ మధ్య అంతా వారం రోజుల పండగలే - ఏ సినిమా ఐనా చచ్చీ చెడీ ఆడితే. అన్నట్లు 100కోట్ల కలెక్షన్ మెట్రిక్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది గమనించండి. మన తెలుగుసినిమా దాకా ఇంకా రాలేదు హిందీసీమను దాటి.
ఇకపోతే, బాధ్యతగా పనిచేసే ప్రభుత్వాలు 100 లాంటి అంకెల 'మైలురాయి'ని పట్టించుకోరాదన్నది భేషైన మాట. బాధ్యతగా పనిచేయకపోతే పట్టించుకోవచ్చునోచ్ అనుకుంటాను. పూర్వం జనతాప్రభుత్వం ఓరగ్గానే ఇందిరమ్మ తిరిగొచ్చి ఇలా 100రోజుల పాలన పండగను రేడియోలు మోగిపోయేలా చేసుకుంది గుర్తుందా. అసలు యూపీయేవారు మళ్ళొచ్చి ఇలా పండగ చేసుకుంటుంటే మీరీ వ్యాఖ్యా వ్రాసే పనుండకపోయేది కదా (వాళ్లకూ బాధ్యతలకూ బహుదూరం అని వెప్పాల్సిన పనీ లేదు కదా)
మరో 100నంతో సెలవు తీసుకుంటున్నాను.
వ్యాఖ్యకి 100 ధన్యవాదాలు. :)
Deleteరమణ గారూ, ఇంట మంచి వ్యాఖ్య రాసినందుకు సారుకు 100నాలు (వందనాలు; వంద ఆణాలు కాదు సుమా) కూడా చెబితే బాగుంటుంది!
Delete//తుమ్మితే ఊడిపోయ్యే సంకీర్ణ ప్రభుత్వాలు//
ReplyDeleteఅందుకే మన ప్రజలు నిరంకుశత్వానికి పునాదులు వేస్తున్నారు!
అవును. ప్రజలు ఎప్పుడూ కొత్తదనాన్నే కోరుకుంటారు. :)
Delete