Saturday 27 September 2014

కవి


ఆయనో గొప్పకవి. పీడిత ప్రజల పక్షపాతి. శ్రమజీవుల ప్రతినిధి. కవిగారికి కష్టజీవులన్న మిక్కిలి ప్రీతి, రాజ్యమన్న మిక్కిలి రోత. అందుకే వారు రాజ్యహింసని ఎండగడుతూ అనేక కవితలు రచించారు. ఆ కవితలు అనేక భాషల్లోకి డబ్బింగ్.. అదే అనువాదం చేయబడ్డాయి. ఆ పుస్తకాలు వేలాదిగా, లక్షలాదిగా అమ్ముడుపొయ్యాయి - పోతున్నాయి.

ఈ దేశంలో కుర్రాళ్ళదే మెజారిటీ. వీరిలో కొందరు సినిమా నటులకి 'అభిమానం' అనే ఊడిగం చేస్తుంటారు. మరికొందరు చదువు అనే మహాసాగరం ఈదుతూ వుంటారు. ఇంకొందరు పేదవారు, పేదరికం అనే పదాల పట్ల మక్కువ పెంచుకుని 'దేశమును యే విధముగా ఉద్ధరింపవలెను?' అని తీవ్రముగా యోచించుచూ మధన పడెదరు.

ఈ 'ఇంకొందరు' కుర్రాళ్ళకి మన కవిగారి కవితలంటే వెర్రి అభిమానం. కవిగారు గొంతెత్తి కవితలు ఆలపిస్తుంటే - ఆ 'ఇంకొందరు' కుర్రాళ్ళు ఉర్రూతలూగుతారు, పేదప్రజలు మాత్రం విని ఆనందిస్తారు - ఆయన కవిత్వానికున్న పవర్ అట్లాంటిది!

కవిగారి కవితల్లో ఏదైనా తీసుకోండి. అది - నిప్పుల గొడ్డలిలా వుంటుంది, కత్తుల కోరలా వుంటుంది, వజ్రాల కొరడలా వుంటుంది. అహాహా! ఏమి ఈ కవిగారి కవితా మహిమ! అది కవిత్వమా? కాదు కాదు! మాటల తూటాల కూర్పు! నవశకానికి తోలిమార్పు!

భగభగ మండే సూర్యకాంతిని లెక్కెయ్యడానికో మీటరుండొచ్చు, చల్లని పున్నమి వెన్నెలని కొలవడానికో స్కేలుండొచ్చు. కానీ - ఏకకాలంలో వెన్నెలని, సూర్యకాంతినీ దావానలంలా ప్రవహింపజేసే కవిగారి కవిత్వాన్ని కొలవడానికి ప్రయత్నిస్తే - మీటర్లు మాడిపోతాయ్! స్కేళ్ళు విరిగిపోతాయ్!

కవిగారి పీడిత ప్రజా కవితా కుసుమాలు వేయికోరల్తో వాడిగా విచ్చుకత్తులై.. శరవేగంతో అంతఃపురం మందిరంలోకి ప్రవేసించి.. మధువు గ్రోలుచూ లలనామణి సమ్మోహన నృత్యమును మత్తుగా తిలకించుచున్న ప్రభువులవారిని దోమ కాటువలె సుర్రుమని కుట్టి బాధించసాగెను.

'ఎవడయ్యా ఈ కవి? అమాయక గొర్రెల మందల్ని ఎగదోస్తున్నాడు!'

'ప్రభూ! ఈ కవి ఓ దిక్కుతోచని, దిక్కులేని దౌర్భాగ్యుడు. ఇతగాడి దరిద్రం భరించలేక భార్య వదిలేసింది. నస తట్టుకోలేక పిల్లలు పారిపొయ్యారు.'

'మరప్పుడు నోర్మూసుకుని పడుండమని ఎంతోకొంత వీడి మొహాన కొట్టకపొయ్యారా?'

'ప్రభూ! తెలుగు కవులు డబ్బుకి లొంగరు. కీర్తికి లొంగుతారు.'

'అర్ధం కాలేదు.'

'ఇట్లాంటి చిన్నవిషయాలు మీవంటి పెద్దవారు పట్టించుకోకూడదు ప్రభూ? నాకొదిలెయ్యండి!'

'సరే! మాకీ దోమకాటు బాధ లేకుండా తక్షణ చర్యలు తీసుకోండి!'

'చిత్తం ప్రభూ!'


ఆ మర్నాటి నుండి కవిగారికి ఊరూరా సన్మానాలే సన్మానాలు! దండలే దండలు! శాలువాలే శాలువాలు! బిరుదులే బిరుదులు! పురస్కారాలు, పత్రాలు, పలకరింపులకి లెక్కే లేదు. కంకణాలు, కడియాలు, గంఢ భేరుండాలు, కిరీటాలు, గజారోహణాలు! మంత్రులు మోకరిల్లారు, కలెక్టర్లు కాళ్ళకి నమస్కరించారు, పారిశ్రామికవేత్తలు పాలాభిషేకం చేశారు.

కవిగారు మనిషా? కాదుకాదు - మండుతున్న అగ్నిగోళం.

కవిగారు పెన్నులో సిరాగా ఏం వాడ్తారు? పేదప్రజల కన్నీళ్ళని, శ్రామికుల వెచ్చని చిక్కని రక్తాన్ని!

కవిగారు! మీరు మా తెలుగువాడిగా పుట్టడం మా అదృష్టం! మీ దురదృష్టం!

మీ నవ్వు ఉదయభాస్కరుని లేలేత కిరణాలు! మీ జులపాల జుట్టు ప్రళయ భాస్కరుని మండుతున్న అగ్నికీలలు!

కవిగారికీ జై! కవిగారికీ జై! కవిగారికీ జై!

కవిగారికిప్పుడు ప్రభుత్వ ఆస్థానకవి! కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత! 'పద్మ' అవార్డు వారి కిరీటంలో ఓ కలికితురాయి!

అహా కవీ! ఒహో కవీ! నీవు ఈ దేశానికి ముద్దుబిడ్డవయ్యా! నిను గన్న ఈ దేశమాత - మందార మకరందము గ్రోలిన తూనీగ వలె ఒడలెల్లా పులకరించగా - ఆనందంతో పలవరిస్తుంది. ప్రపంచ సాహిత్య పఠంలో తెలుగుజాతి గర్వంగా తెలెత్తుకుంది! ఏమి నీ సుందర మంగళ ముఖారవిందం! ఏమి నీ దివ్య తేజస్సు! ...................................................... 


'చెప్పడం ఆపేశావేం?'

'ఇంక చెప్పడానికేమీ లేదు.'

'ఇప్పుడా కవిగారు ఏం రాస్తున్నారు?'

'ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం పాటలు రాస్తున్నారు. అప్పుడప్పుడూ సినిమాలకి రాస్తున్నారు.'

'ఆయనిప్పుడు ఎక్కడ వున్నారు?'

'ఢిల్లీ గల్లీల్లో తిరుగుతున్నారు.'

'ఎందుకు!?'

'కవిగారికిప్పుడు అర్జంటుగా జ్ఞానపీఠ అవార్డు కావాలి. అందుకోసం పైరవీలు చేసుకుంటున్నారు.'

కవిగారికి శుభం కలుగు గాక!

(picture courtesy : Google)

4 comments:

  1. నారి గాడు గుర్తొచ్చాడు.

    ReplyDelete
  2. /నిప్పుల గొడ్డలిలా వుంటుంది, కత్తుల కోరలా వుంటుంది, వజ్రాల కొరడలా వుంటుంది./
    పేద వారి కవిత్వానికి ఎప్పుడూ ఉపమనాలు నిప్పు, ఇనుము, వజ్రము ఉంటాయా?

    ReplyDelete
  3. నాకు భీ భళారే... గుర్తొచ్చాడు! :)

    ReplyDelete
  4. విప్లవ కవి జీవితంతో మొదలు పెట్టి.....మరో నారాయణుడి ప్రవర్తనతో ముడిపెట్టి....శుద్ధాల శోకతేజుని భవిష్యత్ చూపించారు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.