Tuesday, 30 September 2014

తెరేశ్‌బాబు


కవి పైడి తెరేశ్‌బాబు ఇక లేరు. నాకాయనతో పరిచయం లేదు. ఆయన 'విభజన గీత'తో మాత్రం చాలానే పరిచయం వుంది. ఆ పరిచయం కల్పించిన విశేఖర్‌గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 'తెరేశ్‌బాబు' - పేరులాగానే ఆయన కవిత్వం కూడా విశిష్టమైనది.

నాకు కవిత్వం గూర్చి కొంత తెలుసు, చాలా తెలీదు. శ్రీశ్రీ, శివసాగర్‌ల కవిత్వాన్ని ఇష్టంగా చదువుతాను. గోరేటి వెంకన్న పాటల్ని ఇష్టంగా వింటాను. కడుపు నిండా అన్నం తిని, ఏసీ చల్లదనంలో రాసుకుందామంటే ప్రేమగీతాలొస్తాయి కానీ, ప్రజల జీవితాలు రావు. అందుకు నిజాయితీ కావాలి, కమిట్‌మెంట్ కావాలి, లోతైన అవగాహన కావాలి. ముఖ్యంగా తళుకుబెళుకులకి లొంగని మొండిఘటం అయ్యుండాలి. ఇవన్నీ తెరేశ్‌బాబులో పుష్కలంగా వున్నాయి.

కొన్నాళ్ళుగా తెరేశ్‌బాబు ఆరోగ్యం బాగులేదని తెలుసు. చుండూరు కేసుని హైకోర్టు కొట్టేసిన సందర్భాన తెరేశ్‌బాబు రాసిన కవిత చదివాను - ఎంతో ఉద్వేగానికి గురయ్యాను. ఒక్కోసారి దిండంత పుస్తకం కూడా చెయ్యలేని పని ఒక చిన్న కవిత చెయ్యగలదు. ఆ పని తెరేశ్‌బాబు అవలీలగా చెయ్యగలడు. తెరేశ్‌బాబు మళ్ళీ తన ఎకె 47 తో కాల్చడం మొదలెట్టాడు, ఇక ఆరోగ్యం కుదుటపడ్డట్లే అనుకున్నాను. 

తెరేశ్‌బాబుది పెద్ద వయసు కూడా కాదు. మనం ముక్కుపిండి మరీ వసూలు చేసుకోవాల్సిన కవితలు బోల్డన్ని బాకీ వున్నాడు. అయినా బాకీ ఎగ్గొట్టి వెళ్ళిపొయ్యాడు - నిర్లక్ష్యంగా! ఈ కవులింతే - దేన్నీ లెక్కజెయ్యరు! ఆఖరికి తమ జీవితాన్ని కూడా!

(picture courtesy : Google)

10 comments:

  1. /ఈ కవులింతే - దేన్నీ లెక్కజెయ్యరు! ఆఖరికి తమ జీవితాన్ని కూడా!/
    అవును సార్‌, ఈ కవులింతే, మరీ తెరీషుబాబు లాంటివాళ్లు, సమాజం మీద యుద్దం ప్రకటించి చేసి చేసి అలసి పోయినట్లు వెళ్లి పోతారు.

    ReplyDelete
  2. అవును ఈ లెక్కలేని తనం మీదీ ఇవాళ సాక్షిలో ఖదీర్ బాబు కూడా కన్నెర్ర చేశారు....ఒక కవి లేకపోవడం అంటే...ఆయన అనుభవం, ఆలోచనలు, భావాలు ఇంకా చాలా కోల్పోవడమే కదా....కనుక కవులు తమ కోసం కాకపోయినా సమాజం కోసమైనా కొంచెం ఆలోచించాలి. ఐతే నా అనుమానమేమిటంటే....సమాజం తమను పట్టించుకోకపోవడం వల్లే కవులు అలా లెక్కలేకుండా తయారవుతారేమో అనిపిస్తోంది... ఇదేదో చెట్టు ముందా లాగా కనిపిస్తోంది.

    ఏదేమైనా తెరేశ్.....గారి మరణం తెలుగు సాహిత్యానికి కచ్చితంగా లోటే

    ReplyDelete
    Replies
    1. చందు తులసి గారు,

      నాకు తెలిసి కవులు రెండు రకాలు.

      ఒకరకం కవులు - ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన కవిత్వాన్ని రాసుకుంటారు. వారి గోల్ సన్మానాలు, బిరుదులు, ప్రభుత్వ ప్రోత్సాహాలు మాత్రమే. వీరికి ప్రజలతో గానీ, ప్రజలకి వీరితో గానీ పెద్దగా అవసరం వుండదు.

      ఇంకోరకం కవులు - ప్రజల తరఫునే ఆలోచిస్తారు, స్పందిస్తారు. ప్రజలే వీరికి ఊపిరి. పండిత సభలు, సన్మానాల పట్ల వీరికి ఆసక్తి వుండదు. ఈ కేటగిరీ కవులు చాలా విలక్షణంగా ఆలోచిస్తారు. వ్యక్తిగత జీవితం పట్ల నిర్లక్ష్యంగా వుంటారు. బహుశా వారి ఆలోచనల్లో దేహానికి పెద్ద ప్రాముఖ్యత వుండదేమో!

      Delete
    2. మొదటి తరహా కవులు (మరియు ఇతర "కళాకారులు") పోయినప్పుడు మీడియా బ్లాగ్లోకం దద్దరిల్లింది. ఉ. ఇటీవల ఒకాయన ఏడూ భాగాలలో (ఇంకా పూర్తి అయ్యిందా లేదో) భాష్పాంజలి రాసాడు.

      తమకు తెలుగు భాష ఉద్దరణ అతి ముఖ్యమని, తాము తెలుగు "జాతి" మేలు కోసం కంకణం కట్టుకున్నామని అనునిత్యం చెప్పే బ్లాగ్లోక సంచారులు ఏమయ్యారు? ఏరీ ఈ తెలుగు "తల్లి" ముద్దు బిడ్డలు? దళిత గొంతు వినిపించిన పాపానికి తెరేష్ బాబు తెలుగు వాడు కాకుండా పోయాడా?

      Delete
  3. తెరేష్ బాబు కవిత్వం మీద దెంచనాల శ్రీనివాస్ రాసిన వ్యాసం ఈ లింక్ లో చూడండి.
    http://demo.clippings.co.in/columns/agni-ashruvula-anchemi-by-denchanala-srinivas/5120.html

    ReplyDelete
  4. గ్లోబలైజేషన్ మీద తెరేష్ బాబు ఒక్క రోజులో తీసిన షార్ట్ ఫిల్మ్ లింక్ :

    http://vimeo.com/9692541

    ReplyDelete
    Replies
    1. Brahmam గారు,

      ఇప్పుడే శ్రీనివాస్ దెంచనాల వ్యాసం చదివాను. నాకు నచ్చింది.

      షార్టు ఫిల్మూ చూశాను. సింప్లీ సూపర్బ్.

      ఎంతో విలువైన సమాచారం నా బ్లాగులో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు.

      Delete
  5. *కడుపు నిండా అన్నం తిని, ఏసీ ....అందుకు నిజాయితీ కావాలి, కమిట్‌మెంట్ కావాలి. ముఖ్యంగా తళుకుబెళుకులకి లొంగని మొండిఘటం అయ్యుండాలి.*

    సాధారణం గా ఇటువంటి భావాలు రాసే వారి దగ్గర డబ్బులు పెద్దగా ఉండవు. నీతి,నిజాయితి పేరుతో వారి ముందు కాళ్లకు బంధం వేస్తూ, వారి జీవితాన్ని దుర్భరం చేసుకొంటేనే లోతైన అవగాహన ఉన్నట్లు, ప్రజలకోసం వారు కన్నీరు కార్చటానికి ఇటువంటి గుణాలుంటేనే నిజాయితి ఉన్నట్లు ఎర్ర బాబులు ప్రచారం చేస్తూంటారు. ప్రోత్సహిస్తూంటారు. వారి కుటుంబ సభ్యులను కష్టాలకు గురిచేయటం మించి ఏమి ప్రయోజనం ఉండదు. ఇదొక విధమైన శాడిజం. ఏసు క్రీస్తు మనకోసం రక్తం ధారపోశాడు అని మతవాదులు చేసే ప్రచారానికి, అభ్యుదయం అంట్టు ప్రచారం చేసే వారికి భేదమేమి? ఒకసారి చరబండ రాజు గారి గురించి చదివాను. ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బులు లేక ఎంతో కష్టపడాడు. ఆమత్రం డబ్బు సహాయం చేసేవారు లేరా అనిపించింది. ప్రపంచం ఎంతో మారింది. ఈ రోజు మనుహులదగ్గర డబ్బులు మునుపటి వారితో పోలిస్తే బాగానే ఉన్నాయి. మీలాంటి వారు ఇంకా కవులు కష్టపడి కవిత్వాలు రాస్తేనే గొప్ప, ఆహా ఓహో అని రాస్తే, అది చదివిన వారు, వారి చుట్టు ఉండేవారు, జేబులో డబ్బులు ఉన్నా చేసే సహాయం కూడా చేయరు. ఇంకొంచెం కష్టపడితే మరింత అద్బుతమైన కవిత్వం వస్తుందనుకొంటారు. మీరు కూడా ఇటువంటి అభిప్రాయం కలిగి ఉండటం ఎమీ బాగాలేదు.

    ReplyDelete
  6. రమణ గారు,
    శాడిజం అనే పదం వాడటం సరి అయినదో కాదో నాకు తెలియదు. నేను చెప్పలనుకొన్నది ఎమిటంటే,
    నీతీ నీజాయితీలు ఉండవలసింది అధికారం, సంపదలున్నవారికి. వారేమో వేల,లక్షల కోట్లను అప్పడాలు తిన్నట్లు తింట్టున్నారు. వారిని వదలి రచయితలనుంచి ఆశించటం సరికాదు. సాంప్రదాయ వాద రచయితలు పేదరికం అనుభస్తున్నా, సమాజం తో శత్రుత్వం ఎమి ఉండదు, వారికి ఎదైనా అవసరమైతే దేవుడు రక్షిస్తాడు అనే ఒక నమ్మకం annaa ఉంట్టుంది. అటువంటి వారికి శంకరాభరణం శంకర శాస్త్రికి మంజుభార్గవి సహాయం చేసినట్లు నూటికో కోటికో ఒకడు సహాయమన్నా చేయవచ్చు. గుడి దగ్గరికి వేళితే ప్రసాదం అన్నా దొరుకుతుంది. సమాజం గురించి రాసేవారికి చాలా మంది శత్రువులు తయారౌతారు. పది లక్షలుకూడా బాంక్ బాలెన్స్ లేని రచయితలు, కవులకు నీతి నిజాయితీలు ఉండాలని, వారి నుంచి అవి ఎక్కువగా ఆశించి తీవ్రంగా విమర్శలు చెస్తే ,వారి కుటుంబ సభ్యులను పీడీంచినవారౌతారు. ఇప్పటికి పాత తరం వృద్ద రచయితలు విలువలు కాంప్రమైస్ అయ్యావంటు, పtrikaల లో కాకిగోల చేస్తూ, ఇతర రచయితలను తీవ్రంగా విమర్శించే వారు ఇంకా కనపడుతున్నారు. అక్కడికి వారొక్కరే నిజాయితిగా ఉండటం వలన సమాజం మారిపోయినట్లు. ఈ రోజుల్లో కుటుంబం లో సంఖ్య ఎక్కువంటే నలుగురికి మించటంలేదు. 1900-1990 కాలంలో వలే మధ్య తరగతి మనుషులకు డబ్బుకొరకు కటకట లాడే పరిస్థితి లేదు. కవులకు నీతి నిజాయితీలు భూతద్దం లో చూడకుండా, కొద్దో గొప్పో డబ్బులున్న వారు ఒకరిద్దరు ఔత్షాహిక కవులను,ఎంతో కొంత కళకారులకు సహాయం చేయవచ్చు. రచయితలు జీవితంలో డక్కామొక్కిలు తింట్టూ,బతుకు బండిని కష్టపడి లాగుతు, రిక్షా తొక్కుతూ రాస్తేనే కవిత్వం అనుకోవటం సరికాదనుకొంటాను.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.