Monday 29 September 2014

రాజ్‌దీప్ సర్దేశాయ్


నిన్న రాజ్‌దీప్ సర్దేశాయ్‌ని అమెరికాలో లాగారు, పీకారు (తన్నారో లేదో తెలీదు). రాజ్‌దీప్ సర్దేశాయ్ మీద మోడీకి, మోడీ భక్తులకి వున్న కోపం ఈనాటిది కాదు. కాబట్టి అతనిపై మోడీ భక్తుల దాడి పెద్దగా అశ్చర్యం కలిగించ లేదు. అయితే ఈ ఘటన అమెరికాలో జరగడమే విశేషం!

మనం భారతీయులం. ఇందుకు మనమెంతో గర్విస్తుంటాం. మన అభిప్రాయాల్ని కాదన్నవారిని తిడతాం, కుదిర్తే తంతాం. ఈ సహజ గుణం తెలుగువాడిలో మరీ ఎక్కువ. మనం ఇంత ఆవేశంగా ఎందుకుంటాం? మనం తినే ఆహారం తాలూకా ఘాటు మన ఆలోచనల్నీ, ప్రవర్తననీ కూడా ప్రభావితం చేస్తుందా? మా గుంటూరు మిర్చికి ప్రసిద్ధి. అందుకే కాబోలు - మాకు పౌరుషం, రోషం కూడా ఎక్కువే. 

ఉదాహరణకి - అడ్డదిడ్డంగా వుండే ట్రాఫిక్‌లో వాహనాలు స్వల్పంగా రాసుకున్నా - వాహనాలు రోడ్డుకి అడ్డంగా నిలిపేసి గంటసేపు తిట్టుకుంటాం. మీసాలు మెలేస్తాం, తొడగొట్టి సవాళ్ళు విసురుకుంటాం. మా ఊళ్ళో పనీపాటా లేనివాళ్ళు కూడా ఎక్కువే! అందుకే - వందలమంది గుమికూడి జరగబొయ్యే తన్నులాట కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంటాం. ఇలా చూడ్డం - మాకు గ్లాడియేటర్ సినిమాలో రస్సెల్ క్రో కత్తి యుద్ధం చూసినంత వినోదంగా వుంటుంది. 

మా గుంటూరు వాసులు చాలామంది అమెరికా పొయ్యి స్థిరపడ్డారు. బాగా సంపాదించుకుని సుఖంగా జీవిస్తున్నారు. చాలా సంతోషం. అయితే నాకు నచ్చని అంశం - వారిలో సహజసిద్ధంగా వుండాల్సిన 'గుంటూరు ఫైర్' తగ్గిపోవడం. సింహం అడవిలో ఎక్కడున్నా ప్రళయ భీభత్సంగా గాండ్రించి మిగిలిన జంతువుల్ని భయపెట్టాలి కదా! కానీ - మా గుంటూరు అడవి సింహాలు అమెరికా వెళ్లి సర్కస్ సింహాల్లా అయిపోవడం నన్ను మిక్కిలి బాధించేది. 

అయితే - మన సింహాలు ఇన్నాళ్ళూ అవకాశం లేకనే గాండ్రించ లేదనీ, కొద్దిగా అవకాశం దొరికినా అసలు రంగు బయటకొస్తుందని నిన్ననే తెలుసుకున్నాను. అమెరికాలో రాజ్‌దీప్ సర్దేశాయ్ మీద జరిగిన దాడి చూశాకా - నాకు చాలా సంతోషంగా అనిపించింది. బయటకి సూటూ బూటూ వేసుకున్నా - మన భారతీయులు తమ భారతీయతని కోల్పోలేదు. ఇది చాలా అనందదాయకం. ఇందుకు నాకు చాలా గర్వంగా వుంది. 

(photo courtesy : Google)

17 comments:

  1. అయ్యో... వార్తా పత్రికలు చదివేసి పాపం రాజ్దీప్ సర్దేశాయ్ అనేసారండి మీరు! నిజానికి, ముందుగా A** H**e అంటూ బూతులు మాట్లాడింది ఆయనే. ఆ తర్వాత అదే బూతు మాట అక్కడి వ్యక్తి ఆయన్ని అనేటప్పటికి కోపంగా వచ్చి ముందుగా చేయి చేసుకున్నది కూడా రాజ్దీపే. వీలైతే, ఈ లింకులో చూడండి.
    https://www.youtube.com/watch?v=lF-hXNojV1w

    ReplyDelete
  2. అవునూ డాట్రారూ, "సింహం అడవిలో ఎక్కడున్నా ప్రళయ భీభత్సంగా గాండ్రించి" అనేసారు, ఎంత పెజాస్వామ్యమైనా అది మనుషులకే సొంతం కాని వన్యప్రాణులు అందులో క్రూరమృగాలని క్రూరాతిక్రూరమృగమైన మానవుడు లిష్ణ్టులో వేసిన పులులూ సింహాలూ తమతమ చేతలూ కూతలూ మార్చుకుంటాయా చెప్పండి. సింహ గర్జించును. పులి గాండ్రించును. అవంతే, వాటికి మనలా అవకాశం వచ్చినప్పుడల్లా మారిపోవటం వీలు కాదు పాపం.

    ReplyDelete
  3. నిజమే పాపం సర్దేశాయికి కడుపు మంట ఇంకా చల్లారలేనట్టే ఉంది.

    ReplyDelete
  4. tannaru ane maate kaakundaa yendukalaa jarigindi anedi kudaa mukyame

    ReplyDelete
  5. సర్దేశాయి గారి చేష్టలుమాత్రం పెద్దమనిషి తరహాలో ఉన్నాయేం?

    మీదగ్గర డబ్బైతే ఉందిగానీ మీరంతా ఏబ్రాసులు అంటూ సాగింది ఆయన వాక్ప్రవాహం. ఆయనకా శాస్తి జరిగింది మోదీని విమర్శించినందుకుకాదండీ. నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు.

    ReplyDelete
  6. మీడియా వార్తలు వ్రాస్తే ఎవరూ ఏమీ అనుకోరు. కాని రాజ్‌దీప్‌సర్‌దేశాయ్ సంవత్సరాల పాటు తన చేతిలో ఉన్న మీడియం తో మోడీ మీద వార్తల కంటే దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన సాగించిన వార్తా విశ్లేషణా కార్యక్రమాలూ, చర్చా కార్యక్రమాలూ అన్నిట్లోనూ కూడా ఆయన ఒక జర్నలిస్టుగా (!) నిస్పక్షపాత వైఖరి అవలంభించటనికి బదులుగా, ఒక పార్టీ ప్రతినిధిలాగానే ప్రవర్తించాడు. చర్చా పానెల్లో తనకు ఇష్టంలెని విస్లేషణ వస్తుంటే, ఆ చెప్పే వ్యక్తి కి అవకాశం ఇవ్వకుండా చేశేవాడు. జులై 2006 లో ముంబాయిలో లోకల్ రైళ్ళల్లో వరుస బాంబు పేలుళ్ళు సంభవించి అనేకమంది మరణిస్తే, ఆ దురదృష్టకర వార్తను తన చానెల్లో ప్రసారం చేస్తూ ఆయన చేసిన విశ్లేషణ ఏమిటి!? వెస్ట్రన్ లైనులో ఫస్ట్ క్లాసులో గుజరాతీలు ఎక్కువగా ప్రయాణీస్తారుట అందుకని "గుజరాత్ కనెక్షన్" అంటూ విషపూరిత కామెంట్ చేశాడు. అలా చెయ్యటంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటంటారు! చిట్టచివరకు సి ఎన్ ఎన్ ఐ బి ఎన్ నుంచి సాగనంపేవరకూ కూడా వార్తల కంటె, దుష్ప్రచారమే ఎక్కువగా చేయ్యటంవల్ల చాలా చెడ్డపేరు మూటకట్టుకున్నాడు.

    కొండముది సాయికిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు యు ట్యూబ్ లింకు ఇచ్చి మంచి పని చేశారు. ఆయన యు ట్యూబ్ లింకు ఇచ్చి ఉండకపోతే మీరు వ్రాసినదంతా నిజమే అని నమ్మే ప్రమాదం ఉన్నది. ఆ వీడియోలో చూస్తే ఎవరు ముందుగా చెయ్యి చేసుకున్నారో స్పష్టంగా కనిపిస్తున్నది. అయినా కూడా, మీరు "పాపం! రాజ్‌దీప్ సర్దేశాయ్" అనుకోగలిగితే మీ రాజ్‌దీప్ సర్దేశాయ్ భక్తి మీది, మోడీ భక్తుల భక్తి, మోడీ భక్తులది. తేడా ఏమన్నా ఉన్నది అంటారా, విశ్లేషించి చెప్పండి.

    కొండముది సాయికిరణ్ కుమార్ గారికి మరొక సారి ధన్యవాదాలు

    ReplyDelete
  7. రాజ్‌దీప్ సర్దేశాయ్ ని ఎవరూ కొట్టలేదు. అతనే ఒకరిని కొటాడు. మిగతాదంతా తెలిసీ తెలియని ఏంటి మోడి మీడియా దుష్ప్రచారమే.

    ReplyDelete
  8. ఈ పోస్ట్ నిన్న ఉదయం హడావుడిగా రాశాను (పూర్తిగా కూడా రాయలేదు).

    రాసేప్పుడు నేననుకుంది - రాజ్‌దీప్‌ని మోడీ భక్తులు నెట్టారని. ఆ వెంటనే కొండముది సాయికిరణ్‌గారి వ్యాఖ్య పబ్లిష్ చేశాను. ఆ వీడియోలో రాజ్‌దీప్ సర్దేశాయే మోడీ భక్తుల్ని నెట్టినట్లుంది.

    ఈ timeline పోస్ట్ చదివేవాళ్ళకి సులభంగా అర్ధమవుతూనే వుంది కదా!

    అందుకే - హెడింగ్‌లో 'పాపం!'ని డిలీట్ చేసే పని పెట్టుకోలేదు (అసలు సంగతి సమయం లేదు).

    ఈ పోస్ట్ చదివినవారు నన్ను రాజ్‌దీప్ భక్తుడిగా అనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంగ్లీషు వార్తల వ్యాపారం చేసేవాళ్ళని నేను పెద్దగా పట్టించుకోనని మనవి చేసుకుంటున్నాను.

    ReplyDelete
  9. రమణ గారు,

    విషయం పూర్తిగా తెలుసుకోకుండా మీరు పులులు సింహాలు అని ఒక పేజి రాసేసి ఎవరిని ఎమనదలుచుకున్నారో తెలుసుకోవచ్చా.రాజ్దీప్‌సర్దేశాయ్ గారే ముందు దాడి చేసి ఆనక దెబ్బలు తిన్నారని తెలిసి మీరు కాస్త డిసప్పాయింట్ అయినట్లున్నారు

    ReplyDelete
  10. రమణ గారు,
    ఇప్పటికే చాలా మంది చెప్పారు. కాని నా వంతు గా ఇది. పైన అందరు చెప్పినట్లుగానె రాజ్ దీప్ గారే, అక్కడ వున్న వాళ్ళని తిట్టారు, మరియు వాళ్ళ మీదకు వెళ్ళారు !!!
    ఇక్కడ ఇంకో లింకు https://www.facebook.com/video.php?v=477128325760154

    ReplyDelete
  11. ఈ సంఘటనకు సంబంధించి మొదటగా విడుదలైన వీడియోలలో ఎన్నారైలే రాజ్‌దీప్‌సర్దేశాయిని తోస్తున్నట్లుగా ఉంది. అసలు వీడియోని ఎడిట్ చేసి (అంటే రాజ్‌దీప్ ఎన్నారైని తిట్టిన, తోసిన దృశ్యాన్ని మినహాయించి) అన్ని మీడియా సంస్థలకు రాజ్‌దీపే అందించినట్లు ఇప్పుడు తెలుస్తున్నది. ఆ వీడియో ఆధారంగా ప్రతి ఛానలూ ఎన్నారైలనూ భా.జ.పా. దౌర్జన్యకారులుగాను, మోడీ భక్తుల విపరీత చేష్టలుగాను వార్తలు ప్రసారం చేసింది. అసలు సంగతి తెలియకుండానే, చివరికి మోడీ కూడా సంఘటన పట్ల విచారం వెలిబుచ్చాడంటే మన జాతీయ మీడియా తిమ్మిని ఎలా బమ్మి చేస్తున్నదో అర్ధమౌతున్నది! ఎన్నారైలలోని కొందరు అత్యుత్సాహవంతులు అదృష్టం కొద్దీ ఆ సంఘటన వీడియోగా చిత్రీకరించటం, అది సోషల్ మీడియాలో ప్రసారం కావటంతో అసలు దొంగలెవరో అందరికీ అర్ధమౌతున్నది. కాకపోతే, సోషల్ మీడియా అందుబాటులోలేని వాళ్ళు, వార్తా పత్రికలు టీవీ మాధ్యమాలే ఆధారంగా సమాచారాన్ని నమ్ముతున్నవాళ్ళు మాత్రం మొదటగా ప్రసారమైన వీడియోనే నిజమని నమ్మేస్తున్నారు!

    ఇక రాజ్‌దీప్ విషయానికి వస్తే, అతనికి పద్మశ్రీ ఎలా దక్కిందో అందరికీ తెలుసు! పార్లమెంటులో డబ్బుకు ఓట్ల సంఘటన జరిగినప్పుడు, తనకు లభించిన కొన్ని వీడియో ఆధారాలను అప్పట్లో రాజ్‌దీప్ నొక్కిపెట్టేసాడంటే, చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. అసలు దొంగల వీడియోలు ఉన్నాయని, ఫలానా రోజున ప్రసారం చేస్తామని రెండు రోజులు ఊదరగొట్టి, కారణం చెప్పకుండానే ఆ విషయాన్ని దాటేసాడు. ఇక మోడీ పై రాజ్‌దీప్‌కు ఎటువంటి సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్నాయో తెలియదు కానీ, నమో (నరేంద్ర మోడీ) పేరును అనుకరిస్తూ, తన కుక్కపిల్లకు నెమో అని పేరు కూడా పెట్టాడు. తన ట్వీటులోనే ఆ విషయాన్ని కూడా ప్రకటించుకున్నాడు. ఏదేమైనా, జర్నలిజానికి రాజ్‌దీప్ ఓ మాయని మచ్చ! మరిన్ని వివరాలు ఆధారాలతో సహా కావాలంటే, ఈక్రింద లింకులో చదవండి :
    http://www.mediacrooks.com/2014/02/cnn-ibn-history-of-abuse.html#.VCo3WBCMqH2

    ReplyDelete
  12. ఈ పోస్టుకి వచ్చిన వ్యాఖ్యలు చదివాక హెడింగ్‌లో వున్న 'పాపం!' తీసేస్తున్నాను. గమనించగలరు.

    ReplyDelete
  13. రమణ గారు,
    పాపం రాజ్ దీపా? నిన్న ఆయనను చూస్తే పంది బురద మెచ్చు- పన్నీరు మెచ్చునా ? అనే వేమన పద్యం గుర్తొచ్చింది. అమెరికాకు వెళ్లి మోడి వ్యతిరేకుల అభిప్రాయాల కొరకు అంత సమూహం లో కాగడా పెట్టి వెతికాడు. వారు అంతటితో ఆగారా అంటే అమెరికా కు వచ్చి డబ్బులు సంపాదిస్తారే గాని, ఇక్కడ ఉండేవాళ్లకి క్లాస్ లేదు అని చెప్పటం మొదలుపెట్టారు. దానర్ధం ఎమిటి? ఆయన భావాలతో అక్కడి జనాలు అంగికరించకపోతే ప్రవాస భారతీయులకు కల్చర్/ క్లాస్ లేదు అని అంటారా? కొంత మందికి యన్.ఆర్.ఐ. ల కు దేశభక్తి లేదని చాలా నమ్మకం ఉంట్టుంది. దేశం లో ఉండి, మీడీయాలో బ్లాగులో రోజు ప్రభుత్వాలు అది చేయలేదు, ఇది చేయలేదు అని ఆక్షేపిస్తూంటేనే వారి దృష్ట్టిలో దేశభక్తి కాబోలు. దేశం గాని దేశానికి వెళ్లి పగలు రాత్రి కష్ట్టపడి పనిచేసి, స్వదేశానికి లక్షల కోట్ల ధనం పంపుతూ సహాయం చేస్తూంటే, వారికి క్లాస్ లేదనే చెప్పే ఈయనకి ఉన్న కల్చర్ ఎమిటి?
    పాపం రాజ్దీప్ ! టి వి స్టూడియో లలో కూచొని ప్రజల అభిప్రాయాలతో ఏమాత్రం సమబంధం లేకుండా, నలుగురు యన్.జి.ఓ. ల గుంపేసుకొని పదేళ్లు నమో మీద దుమ్మెత్తి పోశాడు. ఆ యన్ జి ఓ లు ఎవరో,వారి వెనుక ఎవరున్నారో దేశవ్యాప్తంగా లక్షల మంది కి సోషల్ మీడీయా ద్వారా తెలుసు. టివి స్టుడియోలో వీరు చెప్పనంత మాత్రాన ప్రజలకు తెలియదా! ఒక్క గుజరాత్ సంఘటనను అడ్డుపెట్టుకొని, దశాబ్ధాలుగా భారతదేశ ప్రతిష్టను నిత్యం దిగజారుస్తూ, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే వారికి, రాజ్దీప్ కు, ఆయన మద్దతు దార్లకు ఉన్న సభ్యత, సంస్కారాలేమిటి?
    పాపం రాజ్దీప్ ! జీవితంలో ఒక్క రోజు, స్టుడియో వదలి, చదువుకొన్న ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్లు ఇచ్చిన జవాబులకు కోపం వచ్చి చేయిచేసుకొన్నాడే, ఇదే పని ఏ ఇతర రాజకీయ నాయకులు చేస్తే మీడీయావారు ఎలా బ్లేం చేసేవారో? సుమారు పదేళ్లు పనిపాటా లేని వారు పేకాట ఆడుకొన్నట్లు, మోడి మీద రాత్రి 9 గంటలైతే చెలరేగిపోయేవారు. ఈ మూక మీడీయాలో చేరి వాగుతున్నా వారి మీద ‘మోడి’ ఒక్కరోజు టెంపర్ కోల్పోలేదు. ఎప్పుడైనా మీడియా వారి మీద చిన్న వ్యగ్యం వేస్తే దానిని కూడా తట్టుకోలేక, అమెరికా పౌరుడైన సిద్దార్థ్ వరదరాజన్ లాంటి వారు వ్యాసాలు రాసుకొనేవారు. వీరా దేశం గురించి, నమో గురించి రోజు ఉపన్యాసాలు ఇచ్చేది.
    ఇక ఫారెన్ పాలసి వ్యవహారం లో అధికార, ప్రతిపక్షాలు కూడా ఒకేతాటి పైన ఉంటాయి. దానికి తెర వెనుక ఎంతో ప్రిపరేషన్ ఉంట్టుంది, పగలు రాత్రి ఎంతో మంది ఉన్నత అధికారులు,మేధావులు కష్టపడతారు. దేశంలో ఉప్పు , నిప్పులా కొట్టుకొనే పరిస్థితి ఉన్నా ప్రతిపక్షం విదేశి పర్యటనలో దేశప్రధాని గురించి అగౌరవంగా మాట్లాడదు. బిబిసి, అమెరికా మీడియాలు ప్రసారంచేసే వార్తలు ఆదేశ ఫారిన్ పాలసికి అనుగుణంగా ఉండాలి. స్వదేశప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఉండకుడదనే నిబంధనలు ఉన్నాయి. కాని మనదేశం లో మీడీయా కి ఇవేమి లేవు. మనదేశంలో అసలికి మీడియా ఉండేది దేశప్రయోజనాల కొరకా? లేక విదేశి పర్యటనలో ఉన్న దేశ ప్రధాని గురించి, విదేశి గడ్డపైనే తక్కువచేసి చూపుతూ స్వదేశాన్ని అగౌరవ పరచేందుకా? స్వదేశ ప్రయోజనాలకు, దేశ ప్రతిష్టకు ఉపయోగపడని మీడీయా వారు, దేశానికి అవసరమా?

    ReplyDelete
  14. రమణ గారు,
    మోడి భక్తులు మూర్ఖులు కాదు. దేశ విదేశాలు తిరిగి,పెద్ద కంపెనీలలో పెద్ద యునివర్సిటిలలో చదువుకొని పని చేసే వారు. రేపు మోడి ప్రభుత్వంలో మంత్రులు లక్షల కోట్ల స్కాములు చేస్తే గుడ్డిగా మోడిని సమర్ధించరు. ఈ సంఘటన ద్వారా స్టుడీయో స్టేషన్లో కూచొని నీతులు చెప్పే వారికి, బయట ప్రజలతో ఇంటరాక్ట్ అయితే ఏపాటి శాంత స్వభావం మైంటైన్ చేయగలరో అందరికి తెలిసింది.

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.