"ఏవిఁటాలోచిస్తున్నావు?"
"ఈ ప్రపంచాన్నెలా బాగుచెయ్యాలా అని!"
"అందుకు ఒబామా వున్నాడు. ఒబామా వెనకాల లెక్కలేనన్ని అణ్వాయుధాలున్నాయి. ఇంక నీకేం పని?"
"అవును కదా! అయితే ఈ దేశాన్నెలా బాగుచెయ్యాలా అని ఆలోచిస్తాను!"
"దేశాన్ని బాగు చెయ్యడానికి మోడీ వున్నాడు. మోడీ వెనుక 'లవ్ జిహాద్' అంటూ సంఘపరివారం వుంది. ఇంక నీకేం పని?"
"పోనీ రాష్ట్రాన్నెలా బాగుచెయ్యాలా అని ఆలోచించొచ్చా?"
"రాష్ట్రాన్ని బాగుచెయ్యడానికి చంద్రబాబు నాయుడున్నాడు. చంద్రబాబు వెనక తీవ్రంగా శ్రమించే నిస్పక్షపాత మీడియా వుంది. ఇంక నీకేం పని?"
"పోనీ మా ఊరినెలా.. "
"అందుకోసం ప్రజలెన్నుకున్న మునిసిపల్ కార్పొరేషన్ వుందిగా? ఇంక నీకేం పని?"
"నిజవేఁ! అయినా అవన్నీ నాకెందుకు? నా ఇంటినెలా చక్కబెట్టాలా అనేది ఆలోచించాలి గాని!"
"నీ ఇంటిని చెడగొట్టాలంటే నీ ఆలోచన కావాలి గానీ - చక్కబెట్టడానికైతే నీ భార్యుందిగా? ఇంక నీకేం పని?"
"సర్లే! కొద్దిసేపు ట్రెడ్‌మిల్ చేసుకుంటాను. ఆరోగ్యాన్నైనా కాపాడుకోవాలిగా!"
"పిచ్చివాడా! జననమరణములు దైవాధీనం. నీ బోడి ట్రెడ్‌మిల్‌తో దేవుడి చిత్తాన్ని మార్చగలవా?"
"కానీ 'ఆరోగ్యమే మహాభాగ్యము' అన్నారు పెద్దలు."
"ఆ పెద్దలే 'పాపి చిరాయువు' అని కూడా అన్నారు."
"మరిప్పుడు నేనేం చెయ్యాలి?"
"అలా జూ దాకా వెళ్ళి పెద్దపులితో ఒక సెల్ఫీ తీసుకోరాదా?"
"వామ్మో! పెద్దపులితో సెల్ఫీనా?"
"అవును. నాకు నిన్ను పెద్దపులితో చూడాలని ముచ్చటగా వుంది."
"ఇంతగా ముచ్చట పడుతున్నావు! ఇంతకీ ఎవర్నువ్వు?"
"హ్మ్.. నేన్నీ బ్లాగ్ రీడర్ని. నీ వెర్రిమొర్రి ఆలోచనల్ని చదివి బుర్ర తిరిగిపోయిన అభాగ్యుడను. నీనుండి తెలుగు బ్లాగుల్ని రక్షించాలనే సదాశయంతో ఇలా వచ్చాను."
"నా బ్లాగ్రాతలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలిగానీ - నన్ను చంపేందుకు కుట్ర పన్నడం అమానుషం."
"అవున్నిజవేఁ! ఒప్పుకుంటున్నాను. కానీ - నాకింతకన్నా వేరే మార్గం కనపడట్లేదు!"
(picture courtesy : Google)
*జననమరణములు దైవాధీనం. నీ బోడి ట్రెడ్‌మిల్‌తో దేవుడి చిత్తాన్ని మార్చగలవా!*
ReplyDeleteమనిషికి అయుషు ఉన్నని రోజులు బ్రతుకుతాడు. ఒక్కొక్కడి శారీర తత్వం ఒక్కొక్కవిధంగా ఉంట్టుంది. అయితే ఈ హెల్త్ కాన్షియస్ నెస్ అనేది మొదట డాక్టర్లు పిదప కార్పోరేట్ ఆసుపత్రులు వ్యాపారభివృద్దికి చేపట్టిన ప్రచారం. ఈ ప్రచార హోరును తట్టుకోవటానికి సామాన్యులకు సాధ్యంకాదు. యోగా లాంటివి మనిషి ఆరోగ్యానికి తప్పక సహాయపడతాయి, అయితే చావును తప్పించలేవు, ఆయుషును పెంచలేవు. బ్రతికిన్నని రోజులు యాక్టివ్ గా ఉంచగలవు. రోజు మందు కొట్టే కుష్వంత్ సింగ్, యోగా గురు అయ్యంగారు కన్నా ఎక్కువ రోజులు బ్రతికాడు. ఇక రమణ మహర్షి,రామకృష్ణ పరమహంస కేన్సర్ తో చనిపోయారు. ఆదిశంకరాచార్యకి పైల్స్ బాధ ఉండేది. ఆయన 32సంవత్సరాలే బ్రతికారు.
ప్రపంచాన్ని బాగు చేయడానికి ఒబామా ఉన్నాడు. దేశాన్ని బాగుచెయ్యడాని మోడి ఉన్నాడు. రాష్టాన్ని బాగు చెయ్యాడనికి చంద్రబాబు ఉన్నాడు. ఇల్లు బాగుచేయడానికి ఇల్లాళ్ళూ ఉన్నారు. బ్లాగు బాగు చెయ్యడానికి మీరున్నారు మరి మేమెందుకా అని ఆలోచన తో కొత్త రోగం ఒకటి వచ్చి నట్లుంది. ఇది ఏం మ రోగమో చెప్పి పుణ్యం కట్టు కుంటారాయ డాట్రు గారు!
ReplyDeleteడాక్టరుగారూ!
ReplyDeleteభయపడకండి!! మీ బ్లాగ్ రాతలు నచ్చిన మేము మీ వెంట ఉన్నాము. మీ పనిలేని రాతలు కంటిన్యూ చేసి మమ్మల్ని ఆనందింపచెయ్యండి.