'బ్లాగా! అంటే ఏంటి?'
ఈ మధ్యకాలంలో నేను అనేకసార్లు ఎదుర్కొన్న ప్రశ్న ఇది. మొదట్లో బ్లాగంటే ఏంటో చెప్పటానికి ప్రయత్నించేవాణ్ని. తరవాత ఈ ప్రశ్న కొద్దిగా చికాగ్గా ఉండేది. తరవాత్తరవాత మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను.
అయితే ఇప్పుడో కొత్త సమాధానం ఇస్తున్నాను.
"బ్లాగంటే ఏంటో నాకూ సరీగ్గా తెలీదు. అప్పుడెప్పుడో ఒకట్రెండు రాశాను. అంతే! ఇప్పుడు నేను బ్లాగ్ రాయడం మానేశాను."
ఏమిటోయి నీ బ్లాగ్గోల? ఎందుకోయి ఈ అబద్దాలు?
వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు మెడికల్ కాలేజిలో మా బ్యాచ్ చాలా పాపులర్. అందుకు మా బ్యాచిలో ఎక్కువమందిమి గుంటూరు, విజయవాడ, హైదరాబాదుల్లో స్థిరపడటం ఒక కారణం. అంచేత మా క్లాస్మేట్ల పార్టీలు ఎక్కువగా జరుగుతుంటయ్. ఈ పార్టీలకి పెద్ద కారణం ఉండదు. అసలు విషయం.. హాయిగా, సరదాగా, మత్తుగా కబుర్లు చెప్పుకోవడానికి ఈ పార్టీల వంకతో కలుస్తుంటాం.
మనం ఎంత తెలివైన వాళ్ళమైనా జీవితంలో ఒక్కోసారి ఘోర తప్పిదం చేస్తుంటాం. అది మన ప్రారబ్దం. ఒక బలహీన క్షణాన నేనూ అట్లాంటి తప్పే ఒకటి చేశాను. ఒక పార్టీలో నా స్నేహితుడికి సెల్ ఫోన్లో నా బ్లాగ్రాతొకటి (సాంబారు.. ఒక చెరగని ముద్ర) చూపించాను.. చదివి వినిపించాను. అతగాడు శ్రద్ధగా విన్నాడు. బాగుందని మెచ్చుకున్నాడు. మిక్కిలి సంతసించితిని.
నాల్రోజుల తరవాత ఆ స్నేహితుడి ఫోన్.
"బిజీగా ఉన్నావా?"
"లేదులే. ఏంటి సంగతి?"
"ఏంలేదు. నా OP (అనగా out patients అని అర్ధం) ఇప్పుడే అయిపోయింది. నీదగ్గరకొస్తాను. మళ్ళీ వినిపించకూడదూ?"
"ఏంటి వినిపించేది?"
"అదే. మొన్నేదో సాంబారంటూ వినిపించావుగా!"
"ఓ! నువ్వు చెప్పేది నా బ్లాగ్గూర్చా?"
"ఓహో! దాన్ని బ్లాగంటారా?"
"అవును. నీకు నా బ్లాగ్ ఎడ్రెస్ చెబుతాను. నువ్వే చూసుకోరాదూ?"
"అదేంటి! బ్లాగులకి ఎడ్రెస్ కూడా ఉంటుందా! సర్లే. ఆ ఎడ్రెస్సేదో చెప్పు."
నే చెప్పబోతుండగా..
"ఇప్పుడే ఒక ఎమర్జెన్సీ కేసొచ్చింది. మళ్ళీ చేస్తాను." ఫోన్ కట్టయింది.
తరవాత పార్టీలో ఆ మిత్రుడే పార్టీలో నా బ్లాగ్రాత గూర్చి మిగిలినవారికి చెప్పాడు.
కొందరు ఆశ్చర్యపొయ్యారు.
"కంప్యూటర్లో తెలుగ్గూడా రాస్తారా! ఎలా రాస్తారు?"
ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాను. "లేఖిని అని ఒక టూల్ ఉంది. అదొక.. "
ఈలోపు వాళ్ళల్లోవాళ్ళు మాట్లాడుకోడం మొదలెట్టారు.
"మీ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ ఇంకా రాలేదే? మినిస్టర్తో చెప్పించకపోయినావు? నీకు బాగా తెలుసుగా!"
ఆ విధంగా టాపిక్ మారింది. లేఖిని పోయింది.
ఆ తరవాత ఇంకో పార్టీలో ఇంకో మిత్రుడు.
"ఏంటి నువ్వు అదేదో బ్లాగులని రాస్తావుటగా?"
"అవును."
"ఎందుకు రాయటం?"
ఇబ్బందిగా అన్నాను. "పని లేక.. "
"అవున్లే. ప్రాక్టీస్ తగ్గిపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావ్? మొత్తానికి పన్లేక రాస్తున్నావన్నమాట!"
"అదికాదు. 'పని లేక' అనేది.. "
నా సమాధానం వినిపించుకోకుండా "హైదరాబాదులో స్థలాల రేట్లు పడిపోతయ్యంటావా? ఎంతైనా నువ్వు తెలివైనోడివి. బెజవాడంతా కొని పడేశావు." అంటూ పక్కవాడితో మాట్లాట్టం మొదలెట్టాడు.
మరికొన్నాళ్ళకి ఇంకో పార్టీలో ఇంకో స్నేహితుడు.. తీవ్ర స్వరంతో అడిగాడు.
(మా పార్టీల్లో సెకండాఫ్ కొంచెం తీవ్రమైన వాతావరణం ఉంటుంది.)
"ఈమధ్య నువ్వు బ్లాగులంటూ ఏవో రాస్తున్నావంట?"
"అవును."
"అవెట్లా చదవాలి?"
"సింపుల్. గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి.. "
"గూగుల్ సెర్చా! దాంట్లోకి ఎట్లా వెళ్ళాలి?"
"నీకు నెట్ కనెక్షన్ ఉంది కదా?"
"ఉంది. కానీ కంప్యూటర్లోకి చూస్తుంటే నాకు కళ్ళు లాగేస్తాయి."
"మరప్పుడు నీకు చెప్పి ప్రయోజనమేమి?"
"మరదే ఎగస్ట్రాలంటే. అడిగిందానికి ఆన్సర్ చెప్పు. లేదా తెలీదని చెప్పేడువు." మావాడు ఆవేశపడ్డాడు.
తప్పు అతనిది కాదు. అందుకు వేరే కారణముంది!
ఇంకో పార్టీలో ఇంకో స్నేహితుడు.
"ఇప్పుడు చెప్పు. బ్లాగంటే ఏంటి?"
"బ్లాగా!" ఒక క్షణం తీవ్రంగా ఆలోచించాను. ఆపై కొద్దిసేపు బుర్ర గోక్కున్నాను.
"సారీ! గుర్తు రావట్లేదు. బ్లాగంటే ఏంటో మర్చిపోయ్యాను."
"మరి నువ్వు రాస్తున్నావని ఎవడో చెప్పాడు?"
"నాగూర్చి ఎవడో చెప్పేదేంటి? నే చెప్పేదే నిజం. బ్లాగంటే ఏంటో నాకూ సరీగ్గా తెలీదు. అప్పుడెప్పుడో బజ్జీలు, సాంబారంటూ ఒకట్రెండు పోస్టులు రాశాను. అంతే! ఇప్పుడు నేను బ్లాగ్ రాయడం మానేశాను. వదిలేయ్!" అన్నాను.
"ఓ! అలాగా?"
హమ్మయ్య! ఏవిటిది? ఇప్పుడు మనసు ప్రశాంతంగా, హాయిగా అయిపోయింది! నాకిప్పుడు నా స్నేహితులకి ఏం సమాధానం చెప్పాలో బాగా అర్ధమైంది. ఇలాగే కంటిన్యూ అయిపోతే మంచిదని కూడా అర్ధమైంది!
(pictures courtesy : Google)
డాక్టరుగారూ, నిజంగా కాని మానేస్తున్నారేమోనని కంగారు పడ్డానండీ.
ReplyDeleteఇదేమిటీ, నేను చెయ్యాల్సిన పని కాస్తా ఈయన చేసేస్తున్నారూ అని తెగ హాశ్చర్యపోయాను.
సరుకూ సరదా రెండు పంచే మీ బ్లాగురాతలు మాకు చాలా అవసరం అని విన్నవించేసుకుంటున్నాను.
శ్యామలీయం గారు,
Deleteనాకు బ్లాగ్ రాయడం ఒక సరదా. ఆ సరదా తీరినప్పుడు రాయాలనుకున్నా రాయలేనేమో.
(ఆసక్తిగా ఉంటుందని పోస్ట్ టైటిల్ అలా పెట్టాన్లేండి.)
ఏమిటొ 'చదువు కున్న వాళ్ళ కంటే..........'సామెత గుర్తొస్తుంది.డాక్టర్లందరూ ఆరోగ్యశ్రీ,బామ్మర్దుల తో medical shops పెట్టించి full collections తో busy అయిపొయినట్లున్నారు.'మనిసన్నాక కాసింత కళా పొషన.......మరచినట్లున్నారు.
ReplyDeleteశ్రీనివాసరెడ్డి గారు,
Deleteవారికి నచ్చిన 'కళాపోసన' బాగానే చేస్తార్లేండి!
నిజమే డాక్టరు గారు,ఇంటర్నెట్ ఉన్నవాళ్ళు చాలామందికి కూడా బ్లాగులు అంటే అసలు తెలీదు. సరీగ్గా ఇలాంటి అనుభవాలే నాకు ఎదురయ్యాయి . ఈ బ్లాగులు పరిచయం చేసినా ఎవరూ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బ్లాగ్స్ లో కామెంట్స్ కూడా కేవలం తెలుగు బ్లాగర్లే పెడుతూ ఉంటారు . ఫేస్ బుక్ అంటే మాత్రం ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఉండరు .సొ బ్లాగులు పాపులర్ అవ్వాలంటే పేస్ బుక్ లో లింకులు ఇస్తూ వుంటే సరి . ఎవరైనా ఓపిక మంతులు ఈ బ్లాగులు చదివే అవకాశం ఉండొచ్చు ;)
ReplyDeleteబ్లాగుల్లో మన ఆలోచనలు స్వేచ్చగా రాసుకోవచ్చు. వెంటనే తిట్లూ తినొచ్చు. ఈమాత్రందానికి ఎక్కువమంది అవసరమంటారా!?
Deleteఇందుకే ఒక అనుభవజ్ఞుడైన సంస్కృత కవి గారు బ్రహ్మ దేవుడితో నా నుదుటను నీ ఇష్టమొచ్చినట్లు ఏమైనా రాసుకో స్వామీ, కానీ అరసికులైన వారికి నా కవిత్వం వినిపించే దురవస్థను మాత్రం నానుదుటను రాయకు - మాలిఖ,మాలిఖ, మాలిఖ - అంటూ మొర పేట్టుకున్నాడు.చదివి సంతోషించేవాళ్ళం మేమున్నాం చాలదా మీకు?
ReplyDeletePantula gopala krishna rao గారు,
Deleteనా బ్లాగ్రాతలకి ముఖ్యకారకులు నా స్నేహితులే.
ఎలాగనగా.. బుర్రలో ఏదో ఆలోచన తడుతుంది. మాట్లాడ్డానికి ఎవరూ దొరకరు. స్నేహితులకి చెబుదామంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు.
రోజులో ఎక్కువభాగం పేషంట్లతో గడుపుతాను. వాళ్ళకి నా ఆలోచనలు చెబితే (ఈ సైకియాట్రిస్టుకి ఇంకో సైకియాట్రిస్ట్ అవసరం ఉందనుకుంటూ) ఫీజు వాపసు తీసుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.
అంచేత.. నా కబుర్లు వినేవాడు దొరక్క ఈ బ్లాగుల్ని ఆశ్రయించాను.
తోటి డాక్టర్లు మిడిమిడి బ్లాగుజ్ఞానంతో తాగి తెలిసీతెలియక ఏదేదోవాగారని అలిగి ఆ కోపం మీ అభిమాన చదువరులమీద చూపించి బ్లాగడం మానేస్తే మేము చేతులు ముడుచుకొని చూస్తూ అలా ఊరుకుంటామనుకున్నారా మీ ఆసుపత్రి ముందు గుడారం వేసి ఆందోళన చేస్తాం!నిరాహారదీక్షలు చేస్తాం!
ReplyDeletesurya prakash apkari గారు,
Deleteదయచేసి మీరెవ్వరూ నాకోసం ఆందోళనలకి దిగొద్దు. ఇక్కడసలే హడావుడిగా ఉంది.
నా దేశం, నా ప్రాంతం, నా ప్రజల సౌభాగ్యం కోసం.. నా జీవితాన్ని బ్లాగులకి పునరంకితం చేసుకుంటున్నానని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను!
ఇటువంటి సన్నివేశాలు జరుగుతూనే ఉంటాయి! చెప్పడానికేం ఉండదు!! ఎలా చెప్పలో అర్థం కాదు.
ReplyDeleteశర్మ గారు,
Deleteమీరు కూడా నా రూట్లోకి వచ్చేస్తే హాయిగా ఉంటుందేమో ఆలోచించండి!
హహ్హా...
ReplyDeleteమీ పోస్టు శీర్షిక చూసిన తక్షణమే నా మైండులో సెక్లన్ల వ్యవధిలో ఎన్నిరకాల భావాలు ఠకీమని ఫ్లాష్ అయ్యాయో. ,
>> పాపం, లాస్ట్ పోస్టులో విమర్శల డోసును తట్టుకోలేకపోయారేమో!
>> ఈ మధ్య విపరీతంగా కురుస్తున్న విమర్శల జడివానకు, ఎందుకొచ్చిన బ్లాగ్రాతలు అనుకున్నారేమో!
>> మనోభావాలు దెబ్బతిన్న ఏ ప్రాంతం వారైనా ఫోన్ చేసి బెదిరించారేమో...?!
>> అరరే, ఇలాంటి బ్లాగుల స్ఫూర్తితో నేను బ్లాగు తెరచి పట్టుమని పది రోజులవలేదు. ఈయనప్పుడే బ్లాగు మూసేశారే..
దేన్నైనా చూడగానే నాలుగైదు రకాల ప్రాబబుల్ గెస్సెస్ చేయడం మైండుకు అలవాటేనేమో. పోన్లేండి. అవన్నీ కరెక్ట్ కాదని, మొత్తం చదివితే తెలిసింది. అన్నట్టు, "నాగూర్చి ఎవడో చెప్పేదేంటి? నే చెప్పేదే నిజం‘‘ పంచ్ లైన్ పేలింది :)
నాగరాజ్ గారు,
Deleteనేను రెండేళ్ళుగా బ్లాగ్ రాస్తున్నాను. మొదట్లో చాలా స్వేచ్చగా రాసేవాణ్ని.
మీరన్న విమర్శల డోసు నాకు 'శ్రీరామరాజ్యం' పోస్టుతో మొదటిసారిగా అనుభవం. ఆ తరవాత నా స్నేహితుడు బి.చంద్రశేఖర్ ని అభినందిస్తూ రాసిన పోస్టుతో కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను. గమ్మత్తేమంటే.. ఈ రెండుసార్లు బి.చంద్రశేఖరే నన్ను ముందుకు నెట్టాడు.
ఒకప్పుడు నా రాజకీయ అభిప్రాయాలు సూటిగా రాసేవాణ్ని. ఒక రాజకీయ పార్టీ అభిమానులు నా బ్లాగ్ గూర్చి చాలా ఆవేశంగా మాట్లాడారని మా IMA (Indian Medical Association) secretary చెప్పాడు.. హెచ్చరించాడు. అంతేకాదు.. జర్నలిస్టులకి ఉన్న రక్షణ మనకి ఉండదనీ.. మనం వృత్తి రీత్యా vulnerable గా ఉంటామని.. అంతగా రాయదలచుకుంటే profile మార్చుకుని రాయమని సలహా ఇచ్చాడు. ఆయన నా స్నేహితుడు. శ్రేయోభిలాషి. అందుకే జాగ్రత్తని హెచ్చరించాడు.
మళ్ళీ చంద్రశేఖర్ ధైర్యం చెప్పాడు (నాకు అన్ని సమస్యలకి B.చంద్రశేఖర్ ఉచిత సలహాదారుడు). ఇప్పుడు నాకు నా ఎడ్వైజర్ లేడు. అంచేత ఒకప్పటి సూటిదనం నా పోస్టుల్లో ఉండట్లేదు.
మొదట్నుండి ప్రొఫైల్ లేకుండా రాసేట్లయితే బాగానే ఉండేది. అయితే నాకున్న సమస్య.. నా వృత్తి ఏంటో చెప్పకపోతే చదివేప్పుడు కొన్ని పోస్టులు అర్ధం కావు. ఇప్పుడు సీరియస్ చర్చల్లోకి పొయ్యి బుర్ర పాడు చేసుకోకుండా సరదాగా పైపైన రాసేస్తున్నాను.
మీరెంతైనా ఒకవిధంగా ఎంతో గొప్పవారండి. రెండు పక్కలా పదను ఒకవైపు ప్రఖ్యాత వైద్యులు, మరో వైపు చక్కటి చేయ్తిరిగిన రచయిత. అందులోను చంద్రశేఖర్ అంతటి వారికి మిత్రులు కూడానూ.("ఆహాహా శంఖు తీర్థుల వారూ అంటే" అన్న మాయాబజారు డైలాగు గుర్తొస్తే నేరం నాది కాదు, వంగరది అని మనవి)
Deleteఅర్జంటుగా అందరినీ మా బ్లాగు పుస్తకం, సురవర తెలుగు కీబోర్డు కొనుక్కోమని చెప్పండి. :-) suravara.com
ReplyDeleteతెలియనప్పుడు విని ఊరుకోవడం ఉత్తమం అనుకుని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారేమో నండీ ! ఏమైనా సరే మీ బ్లాగ్ రాతలని అచ్చేయించి మీ మిత్రులతో చదివించాల్సిందే !!
ReplyDeleteఏదైనా సందర్భంలో డాక్టర్ పరిచయం అయినప్పుడు.. పదేళ్ళ క్రితం తమకి వచ్చిన కడుపు నొప్పి గూర్చి 'డౌట్లు' అడుగుతారు. అలాగే బ్లాగర్లని కూడా! బ్లాగులు గూర్చి అడిగేవారికి బ్లాగ్ పోస్టుల పట్ల ఆసక్తి ఉందనుకోను.
Deleteమీ బ్లాగ్ చూస్తూ ఉంటా .బాగుంటుంది .మానేస్తున్నా అంటే నిజంగానే అనుకున్నా.
ReplyDeleteఅందుకే మా ఇంట్లో తప్ప నేను ఎవరికీ నా బ్లాగ్ గురించి చెప్పను .
మీరు నాకన్నా తెలివైనవారని అర్ధమౌవుతుంది.
Deleteతప్పకుండా మీ బ్లాగ్ చూస్తాను (ఇది మాత్రం అబద్దం కాదు).
మీకు విలైనప్పుడు నా బ్లాగ్ కాస్త చూస్తారా?http://saisatyapriya.blogspot.in/
ReplyDeleteమొదట్లో మీ బ్లాగ్స్ ని బాగా అభిమానించేవాడిని.మీ అద్భుత మేధాశక్తికి హాస్య చతురతకి ఆనందించి మీ అభిమానిని అయ్యాను. కాని ఈ మధ్య మీకు వెటకారం బాగా ఎక్కువైంది.మీలోని మెధావిని మీ లోని వెటకరి బాగా dominate చెస్తున్నదు. బహుస మీ అభిమన జనం చుసక Confidence పెరగదం వల్ల వచిన మార్పు అనుకుంటా..
ReplyDeleteఅలాగా! నేను reverse లో అనుకుంటున్నానే!!
Deleteమీరు రాసే ఈ ఒక్క లైన్ సమాధానాలు చదివితె అక్కినేని నటించిన పాత సినేమాలు చదువు కొన్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్రి, వెలుగు నీడలు మొదలైన సినేమలు గుర్తుకు వస్తాయి. తెలివి , సమయస్పూర్తి కనిపిస్తాయి. మీ ప్రత్యేకతలో ఇదొకటి. :)
DeleteUG SriRam గారు,
Delete(స్వగతముగా) బయటకి వెళ్ళే హడావుళ్ళో పొట్టి సమాధానం రాస్తే దీనిక్కూడా compliment వచ్చిందే!
(ప్రకాశముగా) అవునవును. నేనెప్పుడూ అంతేనండి! చిన్నప్పట్నుండి తెలివి, సమయస్పూర్తి మెండుగా కలవాణ్ని. మీరు విజ్ఞులు కావున కనిపెట్టేశారు!
(చిన్నప్పుడు నే చదివిన నాటికలు ఇలాగే ఉండేవి.)
This comment has been removed by the author.
Delete"ఏంటీ మాష్టారు ఇంతపని చేశారు.. మరీ విమర్శలు తట్టుకోలేనంత పిరికివారుకాదే" అని అనుకుంటూ ఓపెన్ చేశాను సారు :-)) బ్రతికించారు. నేనూ మొదట్లో అత్యుత్సాహంతో నాకు తెలిసినవారందరితో బ్లాగులు మొదలెట్టించాలని నడుంకట్టుకుని ప్లస్ నా బ్లాగ్ గురించి డప్పుకొట్టుకోబోయి ఒకరిద్దరి దగ్గర అభాసుపాలయ్యాక ఇపుడెవరైనా అడిగినా "ఆ ఏదో రాసేవాడ్నిలే.." అని అనాసక్తిగా చెప్పి టాపిక్ డైవర్ట్ చేసేస్తాను :-))
ReplyDelete@వేణూ శ్రీకాంత్,
Deleteమంచిపని చేస్తున్నారు. దాదాపు మనందరిదీ ఒకటే పరిస్థితి. ఈ 'పరిస్థితి'నే ఓ పోస్టుగా రాశాననుకుంటున్నాను.
నాకూ ఇలానే చాలా అనుభవమవుతుంటాయ్....అబ్బే..కంప్యూటర్ ముందు కుర్చునే టైమ్ ఎక్కడ వుందీ ...అంటూ చాలా బిజీ పీపుల్లా చెప్తూ ఉంటారు...వీళ్ళ మాటలు వింటూ ఉంటే...బిల్ గేట్స్...ఒబామా కన్నా వీళ్ళు బిజీ కాబోలు...అనిపిస్తూ ఉంటుంది...కాకపోతే మనకర్ధమయ్యేదేమంటే....నూతిలో కప్పకి నుయ్యే మహా ప్రపంచం...ఎవరినీ వెక్కిరించడానికి కాదు...ఈ కామెంట్...వాళ్ళ తీరు చూసి చెప్తున్నా...
ReplyDeleteఇంకో కారణం.. నా వయసు (50+) వారికి పుస్తకాలు చదవడమే అలవాటు. అందువల్ల కంప్యూటర్ ముందు కూర్చుని చదవడానికి ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteమీరు టపాలకు పునరంకితం కావడం నన్ను ఆనందపరచింది!మీ హాస్యచతురత, పదునైన వ్యంగ్యం,భావపరిణతి,వైద్య పరిజ్ఞానం మీ రచనలకు నిండుతనం తెచ్చాయి!మనకు భావప్రకటనాస్వేచ్చ్హను భారత రాజ్యాంగం ప్రసాదించింది!అన్ని రాజకీయ పక్షాలు ఎన్నో తప్పులు చేస్తాయి!వాటిని నిర్ద్వంద్వంగా మనం స్వతంత్రంగా ఎండగట్టాలి!అవి కోపగిస్తాయని నిశ్శబ్దం పాటించే మేధావులు దుందుడుకు వీధి దాదాలు తమ అపరిపక్వ వాదనలతో మీడియా ముందు చెలరేగిపోవడానికి దోహదం చేస్తారు!విమర్శలు ప్రతివిమర్శలు టపాకారుని రాటుదేలేటట్లు చేసి గట్టిపరుస్తాయి!
ReplyDeleteGuruvu garu
ReplyDeleteMee blog lo mee college lo friends gurinchi matrame kakunda, groups gurinchi kooda appudappudu rayandi. Chadivi pedatham. Guntur students maximum US lo settle ayyaru ani vinna.
- బ్లాగులు గూర్చి అడిగేవారికి బ్లాగ్ పోస్టుల పట్ల ఆసక్తి ఉందనుకోను-
ReplyDeleteనిజమే, ఇది చాలా సార్లు గమనించాను. సంభాషణలో యాధాలాపంగా అడుగుతారు కానీ, మననుండి వివరణాత్మక సమాధానం ఆశించి కాదు. వృత్తిలో స్నేహితులలో ఒకరిద్దరికి తప్ప నేను బ్లాగు రాస్తానని తెలియదు. ఎవరైనా ఆ విషయం ప్రస్తావించినా, "ఆ... ఏదో తోచక చేసే పని అంతే.." అని దాటేస్తే నాకూ వాళ్ళకూ కూడా రిలీఫ్. మన బ్లాగు చదివేందుకు ఎంతో కొంతమంది ఉంటారు. ఎవరూ చదవకపోతే మనబ్లాగు మనమే చదువుకోవొచ్చు.
@Chandu S,
Deleteఅవును. వృత్తి, ప్రవృత్తి వేరువేరు అయినప్పుడు ఈ సమస్య తప్పదు. అందునా మన వృత్తి full time job కావడం చేత ఈ సమస్య మరీ ఎక్కువ.
నాకెందుకో బ్లాగ్ పోస్ట్ రాస్తుంటే శూన్యంలో అట్లు పోస్తున్న ఫీలింగ్ కలుగుతుంది (ఎవరికోసం, ఎందుకు రాస్తున్నామో తెలీని కారణాన)!
బ్లాగులు వ్రాసే వారికి కూడా జర్నలిస్టులులాగా సిటిజన్ జర్నలిస్టులులాగా ఏదన్నా రక్షణ పొందే అవకాశం ఉందంటారా?
ReplyDelete@chavakiran,
Deleteనాకైతే తెలీదు.
దాడులు చేసే తత్వం కలవారు (ప్రస్తుతానికి) తెలుగు బ్లాగులు చదువుతున్నట్లు లేదు. భవిష్యత్తు మనచేతిలో లేదు.
(ఒకవేళ ఆ సమయమే వస్తే.. మనలాంటి అర్భకుల్ని రోజుకి నాలుగుసార్లు తన్నొచ్చు. గాయాలకి ointment పూసుకోవడం మించి మనం చేయగలిగేదేమీ లేదు!)
మన బ్లాగుల గురించి మన స్నేహితులకి చెప్పటం అవసరం లేదేమో. ఎందుకంటే స్నేహితులకి మన గురించి తెలిసి ఉంటుంది కనుక ముందుగా ఆవహించిన ఆలోచనలతో (pre occupied thoughts!) తో చదువుతారు. బ్లాగుల్లోకి నేచురల్ గా వచ్చే పాఠకులైతేనే మంచిది. అయినా మీకెంటి డాక్టరుగారూ, బ్లాగుల్లో బోలెడు పేరు (మంచిదా చెడ్డదా నాకు తెలియదు ఎందుకంటే నేను మేధావిని కాను) సంపాదించుకున్నారు!!
ReplyDelete@సూర్య,
Deleteఅవున్నిజం. నేనూ అదే అనుకుంటున్నాను.
బ్లాగుల్లో పేరు సంపాదించడం ఎటువంటిదంటే.. ఒక చిన్నవీధిలో క్రికెట్ ఆడి సెంచురీ కొట్టడం లాంటిది.
నాకు చెడ్డపేరంటేనే ఇష్టం. స్వేచ్చగా రాసుకోవచ్చు. లేకపొతే.. ఆ 'మంచిపేరు' రాముడు మంచి బాలుడు టైపు గుదిబండై కూర్చుంటుంది!
ReplyDeleteచ చ చ, బ్లాగ్ రాయటం మానేసా అంటే ఎంత సంతోష పడి పోయా నో ! అంతా ఉత్తుత్తి టపా యే టైటిలు మాత్రమె నన్న మాట!
జిలేబి
@anonymous,
Deleteమీకంత సంతోషం కలిగించన్లేండి.. డ్రాక్యులా రక్తపిశాచిలా వెంటాడుతూనే ఉంటాను.
(మీరు జిలేబి అనే పేరు ఎందుకు వాడుతున్నారు?!)
చాలా ఒక్క లైన్ వ్యాఖ్యలు మీవి చదివి, మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ అది. మీరు బ్లాగులలో రాయటం చిన్న వీధిలో క్రికెట్ ఆటలో సెంచరి చేయటం లాంటిదంట్టున్నారు. అది సరైన అభిప్రాయం కాదు. ప్రైవేట్ టివి చానల్స్ మొదలైన కొత్తల్లో యాంకరింగ్ చేసిన సుమ లాంటి వారు అంత పేరు, సంపాదన వస్తుందనుకోలేదు. అలాగే మీకు, మీరూహించిన దాని కన్నా మంచి గుర్తింపు రావటం మాత్రం ఖాయం.
ReplyDeleteమానేస్తారేమో అని నేనూ అనుకున్నా..UG sriram garu annadnalo మీరు రాసే ఈ ఒక్క లైన్ సమాధానాలు చదివితె అక్కినేని నటించిన పాత సినేమాలు చదువు కొన్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్రి, వెలుగు నీడలు మొదలైన సినేమలు గుర్తుకు వస్తాయి. తెలివి , సమయస్పూర్తి కనిపిస్తాయి. మీ ప్రత్యేకతలో ఇదొకటి. :)...
ReplyDeleteచతురత అంతా సంభాషణలు రాసినవారిది కానీ అక్కినేనిది కాదని మనవి.
సినిమా సంభాషణల గురించి mulupurunrao గారు సరిగ్గా చెప్పారు. పాటలు కూడా అంతేనండి.
ReplyDelete60 ఏళ్ళకి బ్లాగు మొదలు పెట్టిన నాకు ఇంకా చాల అనుభావాలయ్యాయి.చాలా బాగా రాసారు నేను అనుకోవాలి ఇక "ఎందుకు పనిలేక" అనీ .అభినందనలు
ReplyDeleteలక్ష్మి రాఘవ
ఈ టపాకు మాలిక పత్రికవారు బహుమతి ఇస్తున్నందుకు అభినందనలు!
ReplyDelete