Thursday, 29 August 2013

'వేతనశర్మ' ఉద్యమం

ఒక సమాజాన్ని అర్ధం చేసుకోవాలంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అదే ఒక సమాజాన్ని అడవిగా భావించుకుని, మనుషుల్ని అడవిలో నివసించే జంతువులుగా మార్చి ఊహించుకుంటే.. సమాజాన్ని అర్ధం చేసుకోవడం కొంచెం సులువుగా ఉంటుంది. అందుకే 'పంచతంత్రం' కథలు ఈనాటికీ నిత్యనూతనంగా ఉంటాయి. బహుశా అందుకేనేమో జార్జ్ ఆర్వెల్ జంతువుల్ని పాత్రలుగా చేసుకుని 'ఏనిమల్ ఫామ్' రాశాడు.

ఒక అడవిలో రక్షణ కోసం (జీవించే హక్కు కోసం) జంతువులు ఉద్యమం చేస్తుంటాయి. అందులో జింకలు ఉంటాయి. వాటి పక్కనే అవే స్లోగన్లిస్తూ పులులు కూడా ఉంటాయి. దూరం నుండి చూసేవారికి ఆ రెండు జంతువుల ఐకమత్యం చూడ ముచ్చటేస్తుంది. కానీ వాటి ఉద్యమ లక్ష్యం ఒకటి కాదు.

పులులకి కావలసింది వేటగాడి నుండి రక్షణ. జింకలకి రక్షణ కావలసింది వేటగాళ్ళ నుండే కాదు.. పులుల నుండి కూడా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ సంగతి తెలీని అమాయక జింకలు.. తమలో పులుల్ని కూడా కలిపేసుకుని ఉద్యమం చేస్తాయి. ఉద్యమం విజయవంతమైన తరవాత పులులు జింకల్ని ప్రశాంతంగా భోంచేస్తాయి.

'వేతనశర్మ కథ'. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాల మీద రావిశాస్త్రి రచించిన ఈ కథ ఎంతో ప్రసిద్ధి గాంచింది. ప్రస్తుతం ఉద్యమాల సీజన్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో 'వేతనశర్మ కథ' గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుందని భావిస్తున్నాను. అందువల్ల ఇంతకుముందు నేన్రాసిన రావిశాస్త్రి 'వేతనశర్మ కథ'  మరొక్కసారి చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను.  

(photo courtesy : Google)

3 comments:

  1. మీరు ఆలోచించదగిన విషయాలే రాస్తున్నారు.
    కానీ మీ బ్లాగు పేరు 'పని లేక...' అని ఎందుకుపెట్టారో నాకు అర్థం కావడం లేదు.
    మీరు చేస్తున్నది కూడా రచనే. రచన అనేది పని లేనివాళ్ళు చేసే కాలక్షేపం పని కాదు. రచన అనేది పనిగట్టుకుని చేసే పని. చేయవలసిన పని. నాకు తెలిసినంతవరకూ ఏ రచయితా పని లేక రాస్తున్నానని అనలేదు. అలా అనడం తన రచనను, తనలోని రచయితను చిన్నబుచ్చడమే.
    రచన అనేది పవిత్రమైన పని. అలా అనడం నచ్చకపోతే ప్రకృతి దత్తమైన మేధస్సును ఉపయోగించుకుంటూ, ప్రకృతి పట్ల కృతజ్ఞతతో చేసే పని. బాధ్యతాయుతమైన పని కూడా.
    మనం అన్నం తినడం ఎంత అవసరమో, అన్నాన్ని సంపాదించుకోవడం కోసం పని చేయడం ఎంత అవసరమో, సాటి వారితో మన ఊహలను, ఆలోచనలను, అనుభూతులను పంచుకోవడం కూడా అంతే అవసరం. అది కూడా పనే.
    మీ శీర్షికా స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకోవడంగా ఈ స్పందనను భావించవద్దని కోరుతూ...

    ReplyDelete
    Replies
    1. భాస్కరం గారు,

      నాకర్ధమైతేగా మీకు చెప్పడానికి!

      నేను బ్లాగ్ రాస్తే ఎలా ఉంటుందని నా స్నేహితులతో అన్నప్పుడు 'పని లేదా?' అన్నారు. ఇదేదో బాగుందని 'పని లేక' అని పెట్టేసుకున్నాను. (అసలు విషయం నాకు పని ఎక్కువగా ఉంటుంది).

      ఒక్కోసారి పేరు మారిస్తే ఎలా ఉంటుంది? అనిపిస్తుంది. ఆ సంగతి http://yaramana.blogspot.in/2013/06/blog-post_3.html అనే పోస్టులో రాశాను.

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete

  2. కల్లూరి భాస్కరం గారు,

    ఆడు వారి మాటలకు అర్థాలే వేరులే అన్నది 'నా' నుడి ! పనిలేక అంటే యదార్థం గా డాటేరు బాబు అదే అర్థం లో రాసేరని అనుకోకూడదు ఎందు కంటే వారు 'మాటల టపా ' లాడు వారు !!

    జిలేబి

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.